మినిస్టర్ రోజా కొత్త వ్యాపారం!?
posted on Jul 25, 2022 @ 3:36PM
ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా కొత్త బెంజ్ కారు కొన్నారు. ప్రత్యేకించి చెప్పుకోడానికి ఇందులో కొత్తేమి ఉందని అనుకుంటున్నారా? మంత్రులు ఖరీదైన, విలాసవంతమైన కొత్త కార్లు కొనుక్కోవడంలో వింతేమి ఉంటుంది? అంటే ఉందనే సమాధానం చెబుతోంది ప్రతిపక్ష సోషల్ మీడియా. ఎందుకంటే మంత్రి అయిన మూడు నెలలకే కొత్త బెంజ్ కారును రోజా కోటిన్నర రూపాయలు పెట్టి కొనడం. తన కొడుకు కౌశిక్ కు గిఫ్ట్ గా ఇచ్చేందుకే దాన్ని కొన్నట్లు స్వయంగా ఆమె చెప్పుకున్నారు. ఆ కారును రోజా తన కొడుకుతో కలిసి ఓ రేంజ్ లో ఆర్భాటంగా ఆవిష్కరించి, భర్త, కొడుకు, కుమార్తెను ఎక్కించుకుని ఫస్ట్ రైడ్ కు వెళ్లిన వీడియోని తన సోషల్ మీడియా పేజిలో పోస్టు పెట్టారు.
సినీ నటిగా గతంలో బాగానే సంపాదించిన రోజా అనంతరం టీవీ షోల్లో కూడా పెద్ద మొత్తంలో పారితోషికాలు తీసుకున్నట్లు చెబుతారు. మంత్రి కాక ముందు ఆమె ఏపీఐఐసీ చైర్మన్ గా పనిచేశారు. అక్కడా ఆమెకు లక్షల రూపాయలు ముట్టేదంటారు. ఇప్పుడు మంత్రి అయ్యాక జీతం, ఇతర అలవెన్సులు కలిపి భారీగానే వస్తున్నాయి. దాంతో పాటు రోజా ఓ కొత్త వ్యాపారం కూడా మొదలెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికైనా అపాయింట్ ఇవ్వాలంటే వారి నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు లాగేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైతేనేం రోజా బెంజ్ కారు కొని కొడుకుకు గిఫ్ట్ గా ఇవ్వడం వెనుక ఆమె ఆదాయం మీద ప్రముఖంగా చర్చ జరుగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా నిరంతరం విమర్శలతో విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ రోజాపై టీడీపీ సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. ‘ఇదిగో.. ఇది వింటున్నారా?.. మంత్రి రోజా కొత్త వ్యాపారం మొదలెట్టారు’. ‘మంత్రి గారికి అపాయింట్ మెంట్ లో బాగానే వస్తున్నట్లున్నాయి. బాగానే వెనకేశారు’ అంటూ రోజా వీడియోపై సోషల్ మీడియా వేదికగా నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
జగన్ కేబినెట్లో ‘కరప్షన్ క్వీన్లు రోజా, విడదల రజని’ అన్న ఆరోపణలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి. అపాయింట్ మెంట్ కోసం వచ్చే వారి నుంచి రోజా, రజని 50 వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియోను తెలుగు తమ్ముళ్లు కూడా పెద్ద ఎత్తున షేర్లు చేస్తుండడం గమనార్హం.
తమ అభిమాన నటుడు, నేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే రోజాను ఆయన అభిమానులు, జనసైనికులు మాత్రం ఎందుకు వదిలిపెడతారు? ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే పవర్ స్టార్ కోటిన్నర రూపాయలు పెట్టి 8 వాహనాలు కొంటే ప్యాకేజీ అని మొరిగిన కుక్కలు రోజా బెంజ్ కారుపై సమాధానం చెప్పాలంటున్నారు. పర్యాటక మంత్రిగా నెలకు లక్షా 25 వేలు జీతం తీసుకునే రోజా ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుని కోటిన్నరతో బెంజ్ కారు కొన్నారో చెప్పాలని నిలదీస్తున్నారు.
అయితే.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ పై ఫైర్ బ్రాండ్ రోజా ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. కానీ రోజా అనుచరులు మాత్రం టీడీపీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. సినిమాలు, టీవీ షోల్లో రాణించిన రోజా బెంజ్ కారు కొనలేనంత దారుణమైన స్థితిలో లేరంటున్నారు. అడ్డదారిలో సంపాదించాల్సిన అగత్యం రోజాకు లేదంటున్నారు. కానీ ‘తాను ఆర్థికంగా అంత ధనికురాలిని కాద’ని రోజాయే స్వయంగా చెప్పిన మాటల వీడియో క్లిప్పింగ్ ను పట్టుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. మొత్తానికి మంత్రి రోజా కొత్త కారు వ్యవహారం సంచలనంగా మారింది. మరి ఫైర్ బ్రాండ్ రోజా దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.