తెలంగాణకు కాబోయే సీఎం షర్మిల.. డీఎస్ ఆశీర్వాదానికి కారణమేమిటి?
posted on Jul 26, 2022 7:50AM
ధర్మపురి శ్రీనవాస్ కాంగ్రెస్ అగ్ర నేతలలో ఒకరిగా వెలుగొందారు. సీఎం పదవి ఆయనదే అని ఒక సమయంలో అంతా భావించారు. 1989లో మంత్రిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులలో ఒకరిగా ఎదిగారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ ఆయన కాంగ్రెస్ నేతే. ఆ తరువాతే ఆ పార్టీకి దూరమయ్యారు. ముఖ్యంగా వైఎస్ లో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. పీసీసీ చీఫ్ గా ఆయన, ముఖ్యమంత్రిగా వైఎస్ ఇద్దరూ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపారు. అయితే విభజన తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అయితే ఆ తరువాత పార్టీతో విభేదించారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత ఆయనకు తెరాస మరో అవకాశం ఇవ్వలేదు. అసలు ఆయనకు పార్టీకీ సంబంధమే లేదన్నట్లుగా తెరాస వ్యవహరిస్తున్నది. డీఎస్ కూడా అంతే పార్టీతో అంటీముట్టనట్లే ఉన్నారు. దూరం జరిగారు. అయితే తెరాసకు మాత్రం రాజీనామా చేయలేదు. ఈ రోజుకూ ఆయన టీఆర్ఎస్ సభ్యుడే. అయితే టీఆర్ఎస్ లో ఉన్నారంటే ఉన్నారు అంతే. డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీ.. దాంతో కొద్ది కాలం కిందట డీఎస్ కమలం గూటికి చేరతారన్న వార్తలు వినవచ్చినా ఆయన చూపంతా సొంత గూటిపైనే అంటే కాంగ్రెస్ పైనే. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు కారణాలేమైనా ఫలించలేదు. అందుకు వయోభారం కూడా ఒక కారణమని చెప్పాలి.
అయితే ఇప్పుడు ఆయన చూపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రగతి మార్గంలో ముందుకు సాగాలంటే వైఎస్సార్ కుమార్తె షర్మిల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు ఆమె ముఖ్యమంత్రి అవుతారనీ, రాజకీయాలలో తన అంచనాలు ఇప్పటి వరకూ తప్పలేదని ప్రకటించారు. 2004 లో వైఎస్సార్ సీఎం అవుతారని ముందుగా చెప్పింది తానేననీ డీఎస్ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయనకు హఠాత్తుగా షర్మిలపైనా, ఆమె పార్టీపైనా ఇంత అభిమానం ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు కూడా పరిశీలకులు సమాధానం చెబుతున్నారు. వయో భారం కారణంగా ఇంటికే పరిమితమైన డీఎస్ ను పలకరించే వారే కరవైన పరిస్థితి. అన్నేళ్ల పాటు సేవ చేసిన కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు.. తాను ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న టీఆర్ ఎస్ వదిలేసింది. ఆ సమయంలో షర్మిల తన డీఎస్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రికి మిత్రుడు కనుక తనకూ పితృ సమానేడే అని స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పలకరించి క్షేమ సమాచారాలు అడిగారు. అంతే పొంగిపోయిన డీఎస్ ను తెలంగాణకు కాబోయే సీఎం నువ్వేనమ్మా అని ఆశీర్వదించేశారు. ఇటు షర్మిలకు తన పార్టీలో చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడెవరూ లేరు.. అటు డీఎస్ కు పలకరించి క్షేమ సమాచారాలు ఆరా తీసే వారు కరవైయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో షర్మిల భేటీ కావడంతో డీఎస్ వైఎస్సీటీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
దాంతో ఆమె తన తండ్రి సహచరులను వరసగా కలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో డీఎస్ ని కూడా కలసి ఆయనతో మంతనాలు సాగించారు అని అంటున్నారు. ఇక టీయారెస్ లో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్న డీఎస్ షర్మిలమ్మ పార్టీలో చేరుతారా అన్నది ఒక చర్చ. ఆయన కనుక చేరితే కచ్చితంగా వైఎస్సార్టీపీకి ఎంతో కొంత బలం చేకూరినట్లే. డీఎస్ పెద్ద నాయకుడు. పైగా బీసీ నేతగా బలమైన గొంతుక కలిగిన వారు మరి ఆయన షర్మిల పార్టీలో చేరడానికేనా ఆమె ఫ్యూచర్ సీఎం అని జోస్యం చెప్పినది అన్న మాట కూడా ఉంది.
ఏది ఏమైనా షర్మిల పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక అంచనాకు అందని అతి పెద్ద సందేహం. అయితే బడా నాయకులు కొందరు చేరితే మాత్రం కచ్చితంగా తాను గెలవకపోయినా కాంగ్రెస్ ని చీల్చే స్థాయిలో మాత్రం ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ పరిణామాలు అన్నీ షర్మిల సీఎం పదవి కోసం కాకుండా కేసీయార్ ని మూడవసారి గెలిపించడానికే పనికివచ్చినా వస్తాయని అనే వారూ ఉన్నారు. మొత్తానికి డీఎస్ తాపీగా ఒక రాజకీయ జోస్యం వదిలారు. ఫ్యూచర్ లో చూసుకోండి షర్మిల సీఎం అంటున్నారు. మరి ఇది చెప్పిన ఆయన తాను ఏ పార్టీయో మాత్రం చెప్పలేదు. అదే కదా రాజకీయ గడుసుదనం అంటే.