మా నాన్నా కమీషన్లు తీసుకున్నారు.. నోరు జారిన షర్మిల
posted on Jul 26, 2022 @ 11:02AM
మాట్లాడే టప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తొందరపడి మాట జారకూడదు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.నోరు జారితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయనడానికి మనకు బోలెడు ఉదాహరణలూ సమెతలూ ఉన్నాయి. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ అభిమానులనూ రగిల్చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన షర్మిల తన తండ్రి విషయంలోనే పొరపాటు చేశారు. ఆయన కమీషన్లు తీసుకున్నారన్న అర్దం వచ్చేలా మాట్లాడారు.
తరువాత షర్మిల పీఎస్ ఆమె పొరపాటున మాట్లాడారంటూ ఓ ప్రకటన విడుదల చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వైస్ మహా నేత అంటూ కాంగ్రెస్ వర్గాలు కీర్తిస్తుంటే, విపక్ష తెలుగుదేశం ఆయన చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులలోని అవినీతిని ఎత్తి చూపుతూ మహా మేత అని విమర్శించారు. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన తండ్రిపై విపక్షాలు నాడు చేసిన విమర్శలు నిజమేనని అంగీకరించినట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాలలోకి వచ్చానంటూ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి యాత్రలతో, దీక్షలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శల బాణాలను సంధిస్తోన్న సంగతి విదితమే. ఘాటు విమర్శలు, పదునైన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ గా ఇప్పుడిప్పుడే షర్మిలకు గుర్తింపు వస్తోంది.
డీఎస్ వంటి నేతలు ఆమెను ఆశీర్వదిస్తున్నారు కూడా. అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ఆమె కేసీఆర్ అవినీతిపై విమర్శల బాణాలను సంధించారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులలో అవినీతి వరద పారిందని దుమ్మెత్తి పోశారు. పోలవరం విషయంలో తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, కేసీఆర్ కలిసే రాజకీయ లబ్ధి కోసం డ్రామాలాడుతున్నారంటూ చెరిగేశారు. ఆవేశంతో రగిలిపోయారు. ఆ ఆవేశంలోనే ఆమె మాట జారారు. కేసీఆర్ కంటే తన తండ్రే ఎక్కువ అవినీతికి పాల్పడ్డారని అర్ధం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె పొరపాటున ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆ తరువాత ఆమె పీఎస్ ఓ ప్రకటన విడుదల చేసినా.. అప్పటికే ఆమె వ్యాఖ్యలు వైరల్ అయిపోయాయి.
సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులన్నీ మేఘా ఇంజినీరింగ్ సంస్థకు అప్పజెప్పడాన్నితప్పు పడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఒకే కంపెనీకి ఎందుకు ప్రాజెక్టులన్నీ కట్టబెడుతున్నారని నిలదీశారు. కమీషన్ల కోసమే మేఘాకు కాంట్రాక్టులన్నీ అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు.
తన తండ్రి హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. తన తండ్రి ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదని అన్నారు. ఇది కేసీఆర్ ను విమర్శిస్తూ.. తన తండ్రి గొప్పదనాన్ని చెప్పడానికి ఆమె చేసిన ప్రయత్నంలో మాట జారింది. తన తండ్రి వైఎస్ కేసీఆర్ లా ఒక్కరి వద్ద కాకుండా చాలా మంది వద్ద కమిషన్లు తీసుకున్నారన్న అర్ధం వచ్చేలా ఆమె మాట్లాడారు. ఇదే సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. వైఎస్ వ్యతిరేకులంతా ఇప్పటి దాకా మేం చెబుతున్నదంతా వాస్తవమని ఆమె కుమార్తే చెప్పారంటూ సంబరపడుతున్నారు. ఆమె వర్గీయులు మాత్రం అదో టైపో ( స్పెల్లింగ్ మిస్టేక్)లా తీసుకోవాలంటున్నారు.