కోమటి రెడ్డి బ్రదర్స్ ప్రతిష్టకు సవాల్ మునుగోడు?
posted on Jul 26, 2022 8:19AM
కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలను అడ్గుకునేందుకే కమలం గూటికి చేరుతున్నారా? కాంగ్రెస్ లో ఇమడ లేకపోవడం అన్న అంశం కంటే తన అన్న వెంకటరెడ్డితో విభేదాలే ఆయనకు కాంగ్రెస్ వీడేలా చేస్తున్నాయా? ఇరువురి మధ్యా విభేదాల కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలకు అడుగడుగునా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారా? కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి తీరు వల్లే వెంకటరెడ్డికి పీసీసీ పదవి దూరమైందా?
గత కొన్నేళ్లుగా ఇరువురి మధ్యా సఖ్యత లేదా అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. ఇరువురి మధ్యా విభేదాలను ఆసరాగా తీసుకునే కమలం రాజగోపాల రెడ్డిని రాజీనామా దిశగా ప్రోత్సహించిందని అంటున్నారు. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాలరెడ్డి రాజీనామా చేస్తే.. జరిగే ఉప ఎన్నికలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టను, ఆటు టీఆర్ఎస్ దర్పాన్నీ కూడా దెబ్బతీసేలా కమలం పావులు కదుపుతోందంటున్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైతే..అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాలరెడ్డి రంగంలోకి దిగుతారు.
ఇప్పటికే అది ఖాయమని భావిస్తున్న తెరాస ఉప పోరుకు సన్నాహాలు చేస్తోంది. వరాల మూటలు విప్పుతోంది. ఇక బీజేపీ రాజగోపాలరెడ్డిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటుందని ఇప్పటికే అమిత్ షా చెప్పేశారు. ఇక మిగిలింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఉప పోరుకు సిద్ధంగా లేదు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు ఉప పోరును ఎదుర్కోవడం ఇష్టం లేదు. కానీ అనివార్యమైతే మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత రాజగోపాలరెడ్డి అన్న అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అప్పగించాలని భావిస్తోంది. అంటే సోదరుల మధ్య ఇంత కాలం ఉన్న విభేదాలకు తోడు రాజకీయ వైరం కూడా తోడవుతుంది. ఒక వేళ మునుగోడు ఉప పోరు జరిగితే.. టీఆర్ఎస్ కంటే ఎక్కువగా గాభరా పడేది కాంగ్రెస్సే. అందుకే వ్యూహాత్మకంగా ఆ పోరును అన్నదమ్ముల మధ్య పోరులా మారిస్తే ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వచ్చినా.. రాజకీయంగా కాంగ్రెస్ కు కలిగే నష్టం కంటే వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఎక్కువ నష్టం జరుగుతుంది.
పార్టీలో ఆయన హవాకు బ్రేక్ పడుతుంది. చీటికీ మాటికీ టీపీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పించే వెంకటరెడ్డి ఇక స్వరం మార్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదీ కాంగ్రెస్ వ్యూహం. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే మునుగోడు ఉప పోరులో విజయానికి సర్వశక్తులూ ఒడ్డేందుకు రెడీ అయిపోయింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులో గులాబీ జెండా ఎగిరితే.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పార్టీలో నూతనోత్తేజం వస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసంతో సమాయత్తం అయ్యే అవకాశం వస్తుంది. ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వస్తే.. మునుగోడులో జరిగింది పార్టీల మధ్య పోరు కాదనీ, అది అన్నదమ్ముల సవాల్ కు సంబంధించిన విషయమంటూ లైట్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక బీజేపీ విషయానికి వస్తే మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం సాధిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్ల కాంగ్రెస్, తెరాసాల గాలి తీసేసినట్లౌతుంది. ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వస్తే కూడా ఆ పార్టీకి పోయేదేముండదు. కోమటిరెడ్డి కమలం గూటికి చేరాలంటే ఆయనకు ప్రజలలో ఉన్న ప్రతిష్ట ఏమిటో తెలుసుకోవడానికే రాజీనామా షరతు విధించామనీ, ఆయనకు ప్రజలలో బలం లేకపోవడం వల్లే పరాజయం పాలయ్యారనీ చెప్పుకుంటుంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో ఫలితం ఎలా వచ్చినా టీఆర్ఎస్, బీజేపీలకు పోయేదేమీ ఉండదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కనుక పరాజయం పాలైతే కోమటిరెడ్డి సోదరుల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడుతుంది. వారి జోరుకు కళ్లెం పడుతుంది. ఏ విధంగా చూసినా మునుగోడు ఉప ఎన్నిక కోమటి రెడ్డి సోదరుల పర్సనల్ ఫైట్ గానే మిగిలిపోతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఉప ఎన్నిక ప్రభావం ఉంటుందని భావించలేమని పరిశీలకులు అంటున్నారు.