ఒకే రోజు తల్లులయిన ఒకే పేరున్న స్నేహితులు
posted on Jul 25, 2022 @ 4:28PM
బాల్యస్నేహాలు చాలా కాలం కొనసాగవచ్చు. ఒక్కరిద్దరే మరీ ఆత్మీయంగా చివరంటా ఉండవచ్చు. కానీ కొందరు చాలా చిత్రంగా కలుస్తుంటారు. ఉదాహరణకు ఒకే పేరున్నవారు. ఉదాహరణకు ఈ ఆష్లేలు! ఈ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరికి ఒకే రోజు పిల్లలు పుట్టారు. ఇంతకంటే ఆనందం మరోటి ఉంటుందా? వారి స్నేహం మరంత వికసించింది. ఇద్దరూ మన పాత సినిమాల్లోలా అక్కా, చెల్లీ అంటూ కాస్తంత భారీ అతి కరుణాత్మక ఆత్మీయతను ప్రదర్శించడం లేదుగానీ ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు దాదాపు ఒకటేనట!
ఏ దేశం, ఏ నగరం అనేది తెలియలేదు కానీ, ఆష్లే రే, ఆష్లే హెన్సన్.. ఇద్దరు మంచి స్నేహితులు. అనేక రకాలుగా ఇద్దరికీ సారూప్యత ఉంది. ఇద్దరూ తమ కాలేజీ స్నేహితులనే పెళ్లాడారు. ఇద్దరి తీరు తెన్ను లూ ఒకేరకం. ఇద్దరి కుటుంబాలు పక్కపక్కనే. పెళ్లయిన తర్వాత వీరి స్నేహం ఒకింత బాగా చిక్కన యింది. చిన్న చిన్న విషయాలు పంచుకునేవారు. అనేకానేక సంగతులు, అల్లర్లు చెప్పుకుంటూ కాలం గడుపు తున్నారు.
ఇద్దరూ గర్భందాల్చారు. కానీ ఎవరూ తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేదు. అక్కడే ఉన్నారు. డాక్టర్లను సంప్రదించారు. మధ్యమధ్యలో ఆస్పత్రికీ కలిసే వెళ్లారు. చిత్రమేమంటే ఇద్దరు సంప్రదించిందీ ఒకే డాక్టర్‌ని. అందువల్ల వారి మధ్య ఆస్పత్రి, మందులు విషయాల్లో ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. అందు వల్ల భయాందోళనకూ గురికాలేదు. ఈ ఏడాది జనవరి 22న ఇద్దరికీ ఆడబిడ్డలు కలిగారు. ఆ ఇద్దరికీ ఒకే లాంటి డ్రస్‌లు వేసి ఇద్దరూ ఎత్తుకుని ఫోటోలు తీయించుకున్నారు.
ఈ చిన్నారి ఆష్లేలూ మరి వారి తల్లుల్లా కలిసి ఉంటారనే అనుకుంటున్నారంతా. ఒకే పట్టణం, ఒకే ప్రాంతం, పక్కపక్కనే నివాసాలు, ఒకే స్కూలు. సరే బాల్య మిత్రులయితే మరి గిచ్చుకోడాలు, గిల్లడాలు, ఏడవడం తల్లులకు ముద్దుగా ఫిర్యాదులు చేయడం మామూలే. అప్పుడు పెద్ద ఆష్లేలు మరింత ఆనంది స్తారు. అదే జీవన మాధుర్యం.