ఆలస్యం అయితే అడ్రస్ గల్లంతే.. ఇద్దరు సిఎంలకు పీకే హెచ్చరిక
posted on Jul 25, 2022 @ 4:54PM
ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. ఇది అందరికీ తెలిసిన సామెత. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ సామెత వర్తిస్తుందా, అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుందని అంటున్నారు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్. నిజానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.
ఈ ప్రచారానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా, ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో పనిచేస్తున్న ప్యాక్ సంస్థ, ఆ సంస్థ తరపునే తెలంగాణలో తెరాసకు ప్రశాంత్ కిశోర్, ఏపీలో వైసీపీకి ఆయన సహచరుడు రుషిరాజ్‌సింగ్ వ్యుహకర్తలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రలో ఐ ప్యాక్ నిర్వహించిన సర్వే ఆధారంగానే, ముందస్తు ఎన్నికల ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే,గత కొంత కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముందస్తు ఎన్నికల విషయంలో పునరాలోచనలో ఉన్నారని, ఒకడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా, అటూ ఇటూ ఊగుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముందుగా అసెంబ్లీని రద్దు చేసి కూర్చుంటే, ఆతర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించక పోయినా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనా విధించినా, వ్యూహం బెడిసి కొడుతుందని తతపటాయిస్తున్నారు. అందుకే ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా ఎన్నికల తేదీలు ప్రకటిస్తే, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అది జరిగే పని కాదు అనుకోండి అది వేరే విషయం.
అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు అయితే కనిపించడం లేదు. కానీ, ఆ ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఏపెలో ప్రభుత్వ వ్యతిరేకత దినదినాభివృద్ధి కాదు, క్షనక్షణాభివృద్ది చెందుతోందని ఐ ప్యాక్’ సర్వేలు సూచిస్తున్నాయి. అలాగని ముందస్తుకు వెళ్ళినా గెలుపు అవకాశాలు 30 శాతం దిగువకు పడిపోయాయని, అదే సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఎటూ ఓడిపోవడం ఖాయమని తెలిసినప్పుడు మునస్తుకు వెళ్ళడం ఎందుకని, వైసీపీలో చర్చ జరుగుతోంది.
ఈ నేపధ్యంలో, ప్రశాంత్ కిశోర్’ ఎన్నికలు దూరం అయ్యేకొద్దీ సర్కార్ వారి బొక్కలు మరింతగా బయటపడి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభంజనంగా మారుతుందని,, ఆ ప్రభంజనాన్ని తట్టుకోవం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అయ్యే పని కాదని ప్రశాంత్ కిశోర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.ఎన్నికలు వెనక్కి వెళ్ళీ కొద్దీ, అక్కడ ఇక్కడ కూడా, అధికార తెరాస, వైసీపీలు రెండూ ఓటమికి దగ్గరవుతాయని కూడా ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారని అంటున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అయినా పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మలచుకునే స్థితిలో ప్రతిపక్షాలు లేవని, దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ శూన్యతను మరోసారి భర్తీచేసుకోవాలని పీకే ప్పినట్లు తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అధికార టీఆర్ఎస్‌ను ఢీకొడుతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జోరుమీద ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంవల్ల ప్రతిపక్షాలు ఇప్పటికప్పుడు అధికార పక్షాన్ని ఢీకొట్టలేవని, అలాకాకుండా సాచివేత ధోరణితో ఆలస్యం చేసుకుంటూ వెళితే మీకే ప్రమాదంటూ పీకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికి రెండు రాష్ట్రాల ముందస్తు ఎన్నికలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.