గడ్కరీ రాజకీయ వైరాగ్యం.. టార్గెట్ ఎవరు?
posted on Jul 26, 2022 @ 10:32AM
గడ్కరీ ఉరుములేని పిడుగులా ఇవేం రాజకీయాలు నా కొద్దు బాబోయ్ అనేశారు. ఆయనేమీ మామూలు నాయకుడు కాదు. బీజేపీలో కీలక నేత. నంబర్ గేమ్ లో ఉండరు కానీ, ఆయనను కాదనే వారు కానీ అనగలిగే వారు కానీ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కు అత్యంత ఆప్తుడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయనకు బోలెడంత పలుకుబడి కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు గడ్కరీ పేరే చెప్పింది.
ఈ రోజుకూ మోడీకి రీప్లేస్ మెంట్ ఎవరంటే ఎవరైనా గడ్కరీ పేరే చెబుతారు. అటువంటి గడ్కరీ రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించారు. ఎందుకొచ్చిన రాజకీయాలు? ఎవరి కోసం అంటూ వేదాంతం వల్లించారు. అదేదో స్వగతంలోనో.. సన్నిహితుల దగ్గర పిచ్చాపాటీ మాట్లాడుతూనో కాదు. ఒక సభలో. అదీ మాజీ పొలిటికల్ లీడర్ గిరీష్ గాంధీ సన్మాన సభలో. గడ్కరీ అంతటి వారు రాజకీయాలపై అంతటి వైరాగ్యం ప్రదర్శించడంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అధికార బీజేపీలో బలమైన నాయకుడు ఒక్క సారిగా రాజకీయం అంటేకేవలం అధికార దాహం, పదవీ వ్యామోహం అంటూ వ్యాఖ్యానించే సరికి ఒక్క సారిగా బీజేపీలో కలకలం రేగింది.
ఎందుకంటే రాజకీయం అంటే అధికార దాహం, పదవీ వ్యామోహం అన్న మాటలు ఆయన ఎవరిని టార్గెట్ చేసి అని ఉంటారా అన్న అనుమానాలు ఒక్క సారిగా బీజేపీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీలలోనూ కలిగిందంటే ఆశ్వర్యం లేదు. సామాన్య జనం కూడా గడ్కరీ వ్యాఖ్యలు మర్మమేమిటన్న చర్చల్లో మునిగిపోయారు.
అంతే అవి ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. కేంద్రంలో బ్రహ్మాండమైన మెజారిటెతో అధికారంలో ఉన్న బీజేపీలో అత్యంత కీలక నాయకుడు ఏమిటీ రాజకీయం కేవలం అధికార వ్యామోహం అంటే ఉలిక్కిపడేవారు అందులోనే ఎక్కువగా ఉంటారు. సమాజి హితం, అభివృద్ధి దిశగా మార్పు, పురోగతి ఇవీ రాజకీయాల లక్ష్యంగా ఉండాలని, గతంలో అలాగే ఉండేవని చెప్పిన గడ్కరి ఇప్పుడు రాజకీయాల అర్ధం పూర్తిగా మారిపోయిందన్నారు. రాజకీయాలంటే అధికారాన్ని అనుభవించడమే అన్నట్లు ప్రస్తుత పరిస్థితి తయారైందనీ, అందుకే తాను రాజకీయాలలో కొనసాగుతూ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ గడిపేయాలా సమాజం కోసం పని చేయాలా అన్న ఆలోచనలో ఉన్నానని చెప్పారు.
అయితే గడ్కరీ రాజకీయ వైరాగ్యం వెనుక మహరాష్ట్ర పరిణామాలు ఉన్నాయనీ, రాత్రికి రాత్రి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడం, నిన్నటి దాకా బీజేపీపై విమర్శలతో నిప్పులు చెరిగిన శివసేనలోని ఒక వర్గం బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రాలలో అధికారం కోసం మోడీ సర్కార్ వేస్తున్న ఎత్తులు, పన్నుతున్నవ్యూహాలపై గడ్కరీ అసంతృప్తితో ఉన్నారనీ అంటున్నారు. గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యల టార్గెట్ నిస్సందేహంగా మోడీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక సారి గడ్కరీ.. నాయకుడనే వాడు విజయాలకే కాదు పరాజయాలకు కూడా బాధ్యత వహించాలని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.