టీఆర్ఎస్ సమస్యేమిటి?..మునుగోడు అభ్యర్థిపై ఎందుకీ సస్పెన్స్?
posted on Sep 12, 2022 @ 9:41AM
మునుగోడు టీఆర్ఎస్ కోరుకోని ఉప ఎన్నిక నిజమే. అంత మాత్రాన గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఇంత మల్లగుల్లాలు పడటమేమిటి? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోనికి దిగినా అసమ్మతి చల్లారకపోవడమేమిటి? దేశ రాజకీయాలలోనే చక్రం తిప్పడానికి సిద్ధపడిన నాయకుడు.. సొంత రాష్ట్రంలో, సొంత పార్టీ అభ్యర్థిని అదీ ఒక ఉప ఎన్నికలో పార్టీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇంత సమయం తీసుకోవడమేమిటి?
పార్టీలో పరిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా లేదనడానికి మునుగోడు అభ్యర్థి ఎన్నికలో తెరాస పడుతున్న ఇబ్బందులు, బుజ్జగింపులకు లొంగని అసమ్మతులే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి అందులో సందేహం లేదు. అంతర్గత కుమ్ములాటలతో నిత్యం సతమతమయ్యే కాంగ్రెస్ కూడా ఏమంత కష్టపడకుండానే, అసమ్మతి భగ్గుమనకుండానే తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేసింది. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతోంది.
మునుగోడులో గెలిచి తీరుతామంటున్న టీఆర్ఎస్‌కు అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోతుండటమే ఆ పార్టీ దయనీయ స్థితికి నిలువెత్తు నిదర్శనమని చెబుతున్నారు. . కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ గతంలో నిర్ణయించింది. మునుగోడులో జరిగిన బహిరంగసభలో ఈ విషయాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించాలని కూడా భావించారు. కానీ పార్టీలో అసమ్మతి భగ్గుమనడంతో వెనుకంజ వేశారు.
అసలు అభ్యర్థి ప్రస్తావనే లేకుండా ప్రసంగం ముగించేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడంతో కేసీఆర్ అభ్యర్థి ప్రకటన విషయంలో వెనుకడుగు వేశారని పరిశీలకులు చెబుతున్నారు. మునుగోడులో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నుంచి కర్నె ప్రభాకర్ తో పాటు మాజీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మొత్తం మీద మునుగోడులో బీసీ అభ్యర్థినే నిలబెట్టాలన్న డిమాండ్ టీఆర్ఎస్ లో రోజు రోజుకూ బలపడుతోంది. అయితే కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంవైపే మొగ్గు చూపుతున్నారనీ, కూసుకుంట్ల అభ్యర్థిత్వం విషయంలో పార్టీ నేతలను బుజ్జగించేందుకు ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.