రాజధాని రైతుల పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు!
posted on Sep 12, 2022 @ 3:15PM
రాజధాని అమరావతి మహా పాదయాత్ర 2.0కు.. ఆ ప్రాంత రైతులు సోమవారం(సెప్టెంబర్ 12) శ్రీకారం చుట్టారు. వెంకటాయపాలెంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపల ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపారు. ఆ క్రమంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రైతులు ఈ పాదయాత్రను ప్రారంభించారు.
అయితే ఈ పాదయాత్రలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో వైపు కొంతమంది అధికార వైసీపీ కార్యకర్తలు సైతం అమరావతి మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించారు. ఆ క్రమంలో రథం నడిపే బాధ్యతను వైసీపీ కార్యకర్తలకు రైతులు స్వయంగా అప్పగించారు. వెంకటాయపాలెం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర .. కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదగా 15 కిలోమీటర్లు సాగి మంగళగిరి చేరుకుంటుంది. ఈ రోజు రాత్రికి రైతులు అక్కడే బస చేస్తారు. రైతుల మహాపాదయాత్రలో శ్రీవెంకటేశ్వరుడి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారు.
అయితే రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు.. జగన్ ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకించారు. ఆ క్రమంలో రైతులు ప్రారంభించిన ఉద్యమం 2022 సెప్టెంబర్ 12(సోమవారం)తో వెయ్యి రోజూలు పూర్తి చేకుంది. ఈ నేపథ్యంలో అమరావతి టు అరసెవెల్లి పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు.
అయితే ఈ పాదయాత్రలో అమరావతి అభివృద్ధి చెందితేనే ఆ ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని.. రైతులు ప్రజలకు వివరించనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలుతోపాటు అన్ని వర్గాల వారు విడతలవారీగా ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. నేడు వెంకటాయపాలెంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర... వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబర్ 11వ తేదీన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో కొలువైన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భాగవానుడి చెంతకు చేరనుంది. ఇక ఈ పాదయాత్రకు అధికార వైసీపీ వినా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.