తండ్రీ కొడుకుల సవాల్.. తెలంగాణలో కొత్త చిత్రం
తెలంగాణ రాజకీయాలు ఎటు పోతున్నాయి, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? ముఖ్యంగా, అధికార తెరాస పార్టీలో ఏమి జరుగుతోంది? ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, కుటుంబంలో ఏమి జరుగుతోంది? అంతర్గతంగా అంతా బాగుందా? అంటే లేదు అనే సమాధానమే వస్తోంది. ఇటు ప్రభుత్వం అటు పార్టీ పైకి మేడి పండులా నిగనిగ లాడుతూ కనిపిస్తున్నా, లోపలి లుకలుకలు రోజు రోజుకూ మరింతగా వికటిస్తున్నాయని అంటున్నారు.
ఒక విధంగా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా అంతర్గత లుకలుకలు భగ్గుమంటున్నాయని అంతర్గత వేగులు అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంతే కాదు, ఇంతవరకు ప్రగతి భవన్ నాలుగు గోడల మధ్య ఎంతో కొంత గుట్టుగా, గుంభనంగా సాగుతున్న, కల్వకుట్ల ఫ్యామిలీ డ్రామా, ఇప్పడు తెలంగాణ భవన్ కు చేరిందని, ‘ప్రగతి భవన్’ సన్నిహిత వర్గాలు ఆధారాలతో సహా విపులంగా వివరిస్తున్నాయి.
నిజమే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కాదు, చాలా కాలంగా జాతీయ రాజకీయాల గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. ఉపన్యాసాలలో వినిపిస్తున్నారు. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే, కేసేఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం అప్పుడూ ఇప్పుడూ కూడా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతోంది.
అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ సందర్భం ఏదైనా జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. తాజగా, నిజామాబాద్ సభలోనూ కేసీఆర్, మీరు ఊ.. అంటే చాలు జాతీయ రాజకీయాల్లోకి దూకేస్తా అంటూ తెలంగాణ ప్రజల ఆనతి కోరారు. అంతే కాదు, 2024 ఎన్నికల తర్వాత,కేంద్రంలో వచ్చేది మన ప్రభుత్వమే అని భరోసా ఇచ్చారు. జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా.నిజామాబాద్ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా,వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది మన ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం అని ప్రకటించారు.
జనం చప్పట్లు కొట్టారు. బై ,బై గణపతి స్టైల్లో వీడ్కోలు పలికారు. అదలా ఉంటే, ముఖ్యమత్రి అర్జెంటుగా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పోవాలని, తెరాస జిల్లా అధ్యక్షుల సాముహికంగా చేసిన డిమాండ్ ఇప్పుడు, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయ వ్యూహంలో కొత్త కోణాన్ని అవిష్కరించిందని అంటున్నారు. నిజానికి, తెలంగాణ భవన్ లో జరిగిన తెరాస జిల్లా అధ్యక్షుల సాముహిక డిమాండ్ వైనక చాలా పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు. ముఖ్యమత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ వెంటనే కల్వకుట్ల తారక రామారావు .. అను నేను ... అంటూ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకేసారి, ఒక దాని కొకటి సమాంతరంగా సాగుతాయని అందరూ అనుకుంటున్నదే. అందులో రహస్యం ఏమీ లేదు.
నిజానికి, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందే అందుకని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, అది జరగలేదు. ఆ కారణంగానే, సుమారు రెండు నెలలకు పైగా, మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి ముహ్మదాలీ ఇద్దరే, పరిపాలన సాగించారు. ఇక అక్కడి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకానికి ఎన్ని సార్లు సనాహాలు జరిగాయో, ఎన్ని ముహూర్తాలు మురిగి పోయాయో, లెక్కలేదు. నిజానికి ఒక దశలో, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేటీఆర్ పట్టాభిషేకం గురించి బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఎప్పటి కప్పుడు విఘ్నాలు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగానే తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో శుక్రవారం (ఆగస్టు9) జరిగిన తెరాస జిల్లా అధ్యక్షులు సామూహికంగా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ వినిపించారని అంటున్నారు. ఒక విధంగా పరోక్షంగానే అయినా కీటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయమని జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారని అనుకోవచ్చని అంటున్నారు. నిజానికి, ఈ డిమాండ్ చేసింది జిల్లా అధ్యక్షులే అయినా చేయించింది మాత్రం, కేటీఆర్ అని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
జాతీయ పార్టీ ఏర్పాటు చేసి కేసీఆర్ మకాం ఢిల్లీకి మారిస్తే, ఆ విధంగా అయినా కేటీఆర్ కల నిజమవుతుందని, పార్టీలో, ఫ్యామిలీలో కేటీఆర్ వర్గం భావిస్తోంది. అయితే, జాతీయ పార్టీ పెట్టినా, కేసీఆరే, ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే జిల్లాల అధ్యక్షుల సామూహిక మీడియా సమావేశంలో డిమాండ్ చేయడం కొసమెరుపు. ఈ కొస మెరుపుతో, కేటీఆర్, చివరి ఆశ కూడా నీరుగారిపోయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో కేసీఆర్ కు సీఎం కావాలన్న అశ.. ఇప్పటికైతే అడియాశగానే మిగిలిపోయింది. సో కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేదని, కనీసం ఈ సారికి అయితే, ఆ అవకాశం లేనట్లే అంటున్నారు. అయితే, దేశ, రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్న నేపధ్యంలో రేపు ఏమైనా జరగవచ్చని, అంటున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు 60 ఏళ్ళు దాటినా ఓపిగ్గా ఎదురు చూశారు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను పక్కకు నెట్టి 40లలోనే ముఖ్యమంత్రి అయ్యారు... ఎవరి ఆలోచనలు వారివి ... ఎవరి పంథా వారిది .. రేపు ఏమి జరుగుతుందో ... ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో .. ఎవరికి తెలుసు..అంటున్నారు.