రాజధాని లేని రాష్ట్రం..జగన్ రెడ్డి నిర్వాకం
posted on Sep 12, 2022 @ 2:08PM
మొండివాడు రాజుకంటే బలవంతుడు, ఇక రాజే మొండివాడయితే, ఆ రాజ్యం, నేటి ఏపీ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ముక్కలై, నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్టం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలైంది, అయినా ఇంతవరకు,రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ మిగిలిపోయింది. నిజానికి, రాష్ట్ర విభజన జరిగిన వెంటనే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా దివ్యభవ్య రాజధాని నిర్మాణానికి, శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
అయితే బాలారిష్టాలను దాటుకుని, రాజధానికి ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో, ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపే అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన,మాట తప్పారు, మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి, అదే సభలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే,అధికార వికేద్రీకరణ వంకన మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడి మూడు రాజధానుల ప్రకటన చేశారు.ముఖ్యమంత్రి ప్రకటనతో రాజధాని రైతులలో ఆందోళన మొదలైంది. ముఖ్యమంత్రి మొండి నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఆ ఉద్యమం సోమవారం (సెప్టెంబర్ 12) నాటికి వెయ్యి రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరు ఒకటి నుంచి డిసెంబరు 15 వరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించిన రైతులు, సోమవారం (సెప్టెంబర్ 12) రెండో విడత పాదయాత్ర ప్రారంభించారు. రాజధానిలోని వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి ఈ పాదయాత్ర సాగుతుంది. సుదీర్ఘంగా సాగుతున్నఈ పోరాటంలో అమరావతి ప్రాంతంలో వందల మంది అన్నదాతలు అశువులు బాశారు.
అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 214 మంది మరణించారు. ఈ మూడేళ్లలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 82 మంది చనిపోగా, 42 మంది రైతు కూలీలు కన్ను మూశారు వీరితో పాటు కౌలుదారులు, అనుబంధ వృత్తులవారూ అనేక మంది బలైపోయారు. రాజధాని కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమన్న ప్రభుత్వ వాదన సరికాదని రైతుల మరణాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటున్నారు. ఇందుకు సంబంధించి రైతుల పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు ఈ ఏడాది మార్చి 3న సిఆర్‌డిఎ చట్టం రద్దు చేయాలనే నిర్ణయం చెల్లదని తీర్పు చెప్పింది.
ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. మరో వంక గత ఏడాది నవంబరు 22న సిఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అడ్వకేట్ జనరల్ ఈ అంశాన్ని హైకోర్టుకు తెలిపారు. అయితే, మళ్లీ న్యాయనిపుణుల సలహాతో మెరుగైన పద్ధతిలో మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని ప్రభుత్వం ఆ తర్వాత చేసిన ప్రకటన రైతుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించింది. రైతులు రెండవ విడత పాదయాత్రతో ఆందోళన ఉదృతం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నవిధంగా, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులదే నేరం, రైతులదే పాపం అన్నట్లుగా విమర్శలకు, దాడులకు దిగుతున్నారు. రైతులు చేస్తోంది ఉన్మాద యాత్ర అని వైసీపీ నేతలు అంటున్నారు.
రైతులు పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే, రైతులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అంతే కాదు, ఒక్క వైసేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజాసంఘాలు అమరావతి రైతులు చేస్తున్న ధర్మ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయి. మరో వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత, తొందరపాటు నిర్ణయాల వల్లనే నవ్యాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా మిగిలి పోయిందని ప్రజలు ఆవేదన, ఆగ్రహం వ్యకపరుస్తున్నారని, ఈ ఆవేదన, ఆగ్రహం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.