కాంగ్రెస్ పంచన చేరడమే కేసీఆర్ కు మిగిలిన ఆప్షన్?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఒకటే మాట మాట్లాడుతున్నారు. ‘బీజేపీ ముక్త్ భారత్’ ఒక్కటే ఆయన నినాదంగా ఉంటోంది. ఇందు కోసమే ఆయన ప్రత్యేక విమానంలో దేశమంతా చక్కర్లు కొడుతున్నారు. అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారు. రాష్ట్రంలో అయినా, పరాయి రాష్ట్రంలో అయినా సందర్భం ఏదైనా, ఇంకో ముచ్చట లేకుండా,అందరం కలిసి కొట్లాడి మోడీ ని ఓడిద్దామనే పిలుపు నిస్తున్నారు. నిజానికి, అందరూ ఓకటై మోడీని ఓడించాలని ఒక్క కేసేఆర్ మాత్రమే కాదు, బీజేపీ ప్రత్యర్ధి పార్టీలు, పవార్ వంటి ‘పెద్ద’ నాయకులు అందరూ కోరు కుంటున్నారు. 2024లో ఏదో ఒక విధంగా మోడీని గద్దెదించాలనే విషయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సంపూర్ణ ఏకాభిప్రాయం వుంది . అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.
అయితే కొత్తగా యాంటీ మోడీ బ్రిగేడ్లో చేరిన నితీష్ కుమార్ సహా మెజారిటీ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ ను అంటరాని పార్టీగా చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీని ఓడించాలనే ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. నిజానికి, బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత వివిధ పార్టీల జాతీయ నాయకులని కలిసేందుకు ఢిల్లీ వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినేత నితీష్ కుమార్, వస్తూ వస్తూనే ముందుగా కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అంతే కాదు, ప్రధాని పదవి పై తనకు పెద్దగా అశలు లేవని చెప్పడం ద్వారా, పరోక్షంగానే అయినా రాహుల్ గాంధీ నాయకత్వానికి జై కొట్టారు. ఆయన వెంట నడిచేందుకు సంసిద్దతను వ్యక్త పరిచారు.నిజానికి, ఇప్పటికే బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీగా వుంది. అంతే కాదు, జేడీ(యు),ఆర్జేడీలను రాహుల్ గాంధీనే పీటల మీదకు చేర్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదెలా ఉన్నా, ఇంతవరకు కేసీఆర్, మోడీని ఓడించే లక్ష్యంతో కలసిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాతీయ పార్టీల నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ లేకుండా, బీజేపీని ఓడించడం కాదు, ఓడించగలమనే ఆలోచన కూడా చేయడం లేదు. అప్పుడు స్టాలిన్ అదే చెప్పారు, ఇప్పడు నితీష్ కుమార్ కుడా అదే స్పష్టం చేశారు. ఈ రోజు సిపిఎం నేత సీతారామ్ ఏచూరిని కలసిన తర్వాత నితీష్ కుమార్, వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు, వామ పక్ష పార్టీలు, కాంగ్రెస్ తో కలిసి వస్తేనే, 2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలమని, అదొక విశేషంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
నిజానికి ఒక స్టాలిన్, ఒక నితీష్ కుమార్ మాత్రమే కాదు, ఎన్సీపీ, శివసేన, జేడీఎస్,జేఎంఎం సహా మెజారిటీ ప్రాతీయ పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఝార్ఖండ్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలలో, (నిన్న మొన్నటి వరకు మహారాష్ట్రలో ) అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కూటములలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీగా వుంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రత్యేక పంధాలో ముందుకు సాగుతున్నారు. అలాగే వామ పక్ష పార్టీల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు ... బెంగాల్ లో కాంగ్రెస్ తో దోస్తీ, కేరళలో కుస్తీ అన్నట్లు ఎక్కడికక్కడ ‘త్రికాల’ పంధాలో ముందుకు పోతున్నారు. తెలంగాణలో మునుగోడు వరకు తెరాసతో కాపురం ఆ తర్వాత ఇంకొకరితో ... ఇలా ఎక్కడిక్కడ గిట్టు బాటు బేరం చూసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో, జాతీయ రాజకీయాల్లో దూకేందుకు రెడీ అవుతున్న కేసేఆర్ ... ఏ పంథా అనుసరిస్తారు? ఎవరితో పోతారు?జాతీయ రాజకీయాల విషయం ఏమో కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇదే హాట్ టాపిక్ గా పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.నిజానికి, జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే కేసీఆర్ ముందు, కాంగ్రెస్ పంచన చేరడం మినహా మరో ‘ఆప్షన్స్’ ఏదీ లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి. తెరాస నాయకులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా బీజేపీ ఎత్తుగడలను ఎదిరించి నిలిచేందుకు, కాంగ్రెస్ తో జట్టు కట్టడం తప్ప మరోమార్గం లేదని, అదే ఉభయ తారకంగా ఉంటుందని అంటున్నారని తెలుస్తోంది. నిజానికి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అదే జరిగింది. ఛీ..ఛీ ..కాంగ్రెస్ ఉన్న కూటమికి మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించిన తెరాస, చివరకు కాంగ్రెస్ బలపరిచిన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. అంతే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్ మందీ మార్బలంతో ఢిల్లీ వెళ్లి, సిన్హా నామినేషన్’ దాఖలు చేసే కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారు. పనిలో పనిగా రాహుల్ గాంధీ పక్కన చేరి ‘దోస్తానా’ కు శ్రీకారం చుట్టారు. సిగ్నల్స్ పంపారు.
నిజమే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెరాసతో చేతులు కలిపేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించరు. అందులో సందేహం లేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేందుకు వీలు లేదని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానాన్ని మేనేజ్ చేయడం, కేసీఆర్ కు పెద్ద విషయం కాదని అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీలోనే తెరాస కోవర్టులు ఉన్నరనేది బహిరంగ రహస్యం. నిజానికి, సోమవారం(సెప్టెంబర్ 5) నిజామాబాద్’లో జరిగిన బహిరంగ సభలో కానీ, అంతకు ముందు నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభల్లో కానీ, కేసీఆర్ కాంగ్రెస్ ప్రస్తావనే తీసుకురాలేదు.
సున్నితంగానే అయినా ఓ చిన్న చురకైనా వేయలేదు. మరో వంక మునుగోడులో ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డిని , బీజేపీ, మోడీని టార్గెట్ చేసినంతగా కేసీఆర్ ను టార్గెట్ చేయడం లేదు. సో.. రేపటి పొత్తుల ముఖచిత్రం ఎంతో కొంత ఇప్పటికే స్పష్టం అవుతోందని అంటున్నారు. అయితే,ఇప్పటి కిప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరాణాలు, పొత్తులు మారి పోతాయని కాదు కానీ, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఏదైనా జరగవచ్చని. పరిశీలకులు భావిస్తున్నారు.