ఢిల్లీ లిక్కర్ స్కాం.. బీజేపీ ఆరోపణలను వైసీపీ ఖండించదేం?
posted on Sep 12, 2022 6:27AM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్ సతీమణి భారతిపై ఆరోపణలు చేసిన తెలుగుదేశం నేతలపై నోరెట్టుకు పడిపోతున్న వైసీపీ నాయకులు.. అవే విమర్శలు చేస్తున్న బీజేపీ విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు. జగన్ కూడా తెలుగుదేశం నాయకుల విమర్శలపై స్పందించలేదెందుకని మంత్రులపై ఫైర్ అయ్యారు. కౌంటర్ ఇవ్వకపోతే మంత్రి పదవులు ఊడబీకేస్తానని హెచ్చరికలు చేశారు. కానీ బీజేపీ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదెందుకని మంత్రులను ప్రశ్నించడం లేదు.
ఒక విషయంపై ఒక పార్టీ చేసిన విమర్శలపై ఒకలా, మరో పార్టీ చేసిన విమర్శలపై మరోలా వైసీపీ స్పందిస్తున్న తీరులో ఎందుకీ ద్వంద్వ వైఖరి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారని ఏకంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవలి తన ఏపీ పర్యటనలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై ఖండనకు కాదు కదా కనీసం మాట్లాడేందుక కూడా వైసీపీ మంత్రులు నేతలకు నోరు రాలేదు. అదే సమయంలో అదే విమర్శ చేసిన తెలుగుదేశం నాయకుల మీద మాత్రం జగన్ వార్నింగ్ తరువాత వమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ఇక తెలుంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధం ఉందని మీడియా ముందే ప్రకటించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సైతం ఢిల్లీ లిక్కర్ స్కాం లో వైసీపీలో పై స్థాయిలో ఉన్న వారి హస్తం ఉందని ఆరోపణలకు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై నోరెత్తని వైసీపీ తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శలపై మాత్రం రగిలిపోతోంది. ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కౌంటర్లు ఇవ్వకుంటే మంత్రి పదవులు ఊడబెరికేస్తానంటూ తన పార్టీ వారిని హెచ్చరిస్తున్నారు. ఈ తేడా ఏమిటి. ఒకే రకమైన విమర్శ విషయంలో వైసీపీ రెండు రకాలుగా ఎందుకు స్పందిస్తోంది. బీజేపీ విమర్శలపై మౌనం ఎందుకు?బీజేపీ వారి విమర్శలు ఓకే.. కానీ తెలుగుదేం విమర్శంలు నాట్ ఓకే అన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. వైసీపీ వ్యవహరిస్తున్న ఈ తీరే.. తెలుగుదేశం విమర్శలలో వాస్తవం ఉందన్న భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి తెలుగుదేశం ఆరోపణల కంటే బీజేపీ ఆరోపణలనే వైసీపీ సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వారి వద్ద పక్కా సమాచారం ఉంటేనే కేంద్ర మంత్రి ఆరోపణలు చేస్తారు. వారి ఆరోపణలకు కౌంటర్ ఇస్తే వారు వెంటనే ఆధారాలివిగో అని బయటపెట్టేస్తారు. అందుకే బీజేపీ విమర్శలపై వైసీపీ నోరెత్తేందుకే భయపడుతోంది. జగన్ సైతం స్వయంగా తన సతీమణిపై ఆరోపణలు చేసినా బీజేపీకి ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని ప్రశ్నించడం లేదు. రాష్ట్రంలో విపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతల విమర్శలకు సమాధానం ఇవ్వడం లేదు కానీ బూతులతో, దూషణలతో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అదీ జగన్ వార్నింగ్ ఇచ్చిన తరువాత. దీంతో తెలుగుదేశం నేతలు తమ విమర్శల స్టైల్ మార్చారు. తాము ఆరోపణలు చేయడం కంటే.. వైసీపీ నేతలపై బీజేపీ ఆరోపణల వీడియోలను చూపుతూ స్పందించే ధైర్యముందా అంటూ సవాళ్లు విసురుతున్నారు.
మామూలుగా సామాజిక మాధ్యమంలో దూకుడుగా ఉండే వైసీపీ మాత్రం ఈ విషయంలో సైలెంట్ అయిపోయింది. దీనిని బట్టే వైసీపీకి కేంద్రం అన్నా, బీజేపీ అన్నా భయం అని అవగతమౌతోంది. వైసీపీ ఎన్డీయేలో లేదు. బీజేపీ వైసీపీకి మిత్రపక్షం కూడా కాదు. అయినా బీజేపీ చేసిన విమర్శలపై స్పందించడానికి నోరు రావడం లేదు. హస్తినలో జరిగిన ఒక సమావేశంలో యధాలాపంగా తెలుగుదేశం అదినేత చంద్రబాబు, ప్రధాని మోడీ ఓ రెండు నిముషాలు మాట్లాడుకుంటేనే ఏపీలో వైసీపీ తన కాళ్ల కింద భూమి కదలిపోయిందన్నంత ఖంగారు పడింది. ఏకంగా రెండు పార్టీల మధ్యా పొత్తు కుదిరిందని నిర్ధారించేసి ప్రెస్ మీట్లు పెట్టేసింది. సకల సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే.. ఆ పొత్తు అనైతికమంటూ మీడియా ముందు అక్కసు కూడా వెళ్లగక్కేశారు.
మరి అలాంటి వైసీపీ ఇప్పుడు బీజేపీ చేస్తున్న విమర్శలపై నోరెత్తేందుకు ఎందుకు భయపడుతోంది? ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో వరుసగా బయటపడుతున్న వాస్తవాలపై వణుకు, జంకే కారణమా అన్న సందేహాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక అయిన దానికీ కానీ దానికీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడే విజయసాయి రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో స్వయంగా తన అల్లుడి పేరు ఉందని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఇసుమంతైనా స్పందించకుండా మౌనంగా ఎందుకు ఉన్నారు? నోరెత్తితే తన తలకు చుట్టుకుంటుందని భయపడుతున్నారా? అన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమం వేదికగా నెటిజన్లు సంధిస్తున్నారు.
మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ కుంభకోణంలో వైసీపీ పెద్దల పాత్ర ఉందా? అన్న అనుమానాలకు బలం చేకూర్చేదిగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇక విజయసాయి వ్యవహార తీరు ఈ స్కాంలో తన అల్లుడి పాత్రను నిర్ధారిస్తున్నట్లే ఉందని కూడా చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన అల్లుడి పాత్రపై ఆరోపణలు వెలుగుతోనికి వచ్చిన నాటి నుంచీ విజయసాయి రెడ్డి నోరు మూతపడింది. రోజూ తిట్లతో తనదైన ప్రత్యేక శైలి భాషలో ట్విట్లర్లలో పోస్టుల మీద పోస్టులు పెట్టే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆశ్చర్యకరంగా ట్విట్లర్ లో కనిపించడమే మానేశారు. ఏదో ఒకటో రెండో ట్వీట్లు చేసినా అవి తెలుగులో కాదు హిందీలో చేస్తున్నారు. అవి కూడా ప్రధాని మోడీని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటున్నాయి.
ఇటీవలే.. రాష్ట్రాల అప్పులపై కేంద్రం మాట్లాడిన సందర్బంగా రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ మోడీ సర్కార్ పై విరుచుకుపడుతూ విజయసాయి చేసిన ప్రసంగం గురించి ఆయన పూర్తిగా మర్చిపోయారనిపించేలా మోడీని పొగుడుతూ ఆయన ట్వీట్లు ఉంటున్నాయి. అవి కూడా తెలుగులో అయితే ఉత్తరాది వారికి, ముఖ్యంగా మోడీకి అర్ధం కావేమో అని హిందీలో ట్వీట్ చేస్తున్నారు విజయసాయి. దీనిని బట్టే తన అల్లుడి విషయంలో విజయసాయి ఆందోళనలో ఉన్నారని అనుకోవలసి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పునాదులు ఏపీలో ఉన్నాయన్న ఆరోపణలు మొదలైన తరువాత విజయసాయి హస్తినను వదలడం లేదని సామాజిక మాధ్యమంలో విజయసాయిని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నా ఆయన స్పందించడం లేదు.