ఆసియాకప్ విజేత శ్రీలంక
posted on Sep 12, 2022 6:51AM
పాకిస్థాన్‌కు శ్రీలంక చుక్కలు చూపించింది. ఫైనల్‌కు ముందు జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో సరదాగా ఆడినట్టు కనిపించినా శ్రీలంక జట్టు చాలా తెలివిగా వ్యూహాత్మకంగా ఆడి ఫైనల్‌కు సిద్ధపడింది. ఫైనల్లో పాక్‌కి తాము గెలిచే అవకాశాలు లేనట్టే కనపడి శ్రీలంక విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్ 23 పరుగుల తేడాతో చిత్తయింది. ఆసియాకప్ ఫైనల్లో ఏడేళ్ల తర్వాత గెలిచిన లంకకిది ఆరో టైటిల్. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాట్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. హసరంగ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) బ్యాటింగ్‌లోనూ అండగా నిలిచాడు. రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్ (55), ఇఫ్తికార్ (32) మాత్రమే రాణించారు. కరుణరత్నెకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రాజపక్స, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా హసరంగ నిలిచారు. విజేత లంకకు రూ. కోటి 20 లక్షలు, రన్నర్‌పగా నిలిచిన పాక్‌కు రూ60 లక్షలు దక్కాయి.
ఇది పాక్ ఊహించని మలుపులతో సాగిన ఉత్కంఠభరిత ఫైనల్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక మ్యాచ్ సమర్పించుకుంది అనుకున్నారంతా. పాక్ విజయోత్సవాలు చేసుకోవడం ఆరంభించింది. అప్పు డు అసలు ఆట మొదలయింది. మహా అయితే 120 పరుగులు చేస్తుందనే అనుకున్నారంతా. కానీ ఒత్తిడి లో పాక్ వంటి ప్రత్యర్థులను ఎలా దీటుగా ఎదుర్కొనాలో చూపించింది శ్రీలంక. రాజపాక్సా, హసరంగ హీరోలుగ నిలిచారు. 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి పాకిస్థాన్‌కు సవాలు విసిరి ఆశ్చర్యపరిచింది.
171 పరుగుల లక్ష్యం ఇప్పటివరకూ టోర్నీలో ఎంతో ధాటిగా ఆడుతున్న పాకిస్థాన్‌కు మరీ అధిగమించలేనంత చాలా పెద్ద లక్ష్యం కాదు. కానీ పాకిస్థాన్‌కు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ల నుండి మంచి ప్రారంభం కావాలి. లంక తొలి ఓవర్లోనే చిత్రం గా 11 పరుగులు ఇచ్చుకుంది. ఇది పాక్‌కు శుభారంభంగా మారింది. కానీ మూడవ ఓవర్లోనే స్పిన్నర్ తీక్షణ వచ్చాడు. వచ్చీ రాగానే బాబర్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతికే ఫకర్ జమాన్ కూడా కెప్టెన్‌నే అనుసరించాడు. అప్పటికి పాక్ స్కోర్ 22 పరుగులే. పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి కేవలం 37 పరుగులు చేయగలిగింది. రిజ్వాన్ 16 ఇఫ్తికర్ 1 పరుగులతో ఉన్నారు. బాబర్ మళ్లీ త్వరగానే అవుటవడంతో జట్టు భారం మళ్లీ రిజ్వాన్ పైనే పడింది. అతను ఎంతో జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్‌ని ముందుకు తీసికెళ్లాడు. పది ఓవర్లలో పాక్ 68 పరుగులు చేసింది. 12వ ఓవర్లో హసరంగా ఏకంగా 13 పరుగులు ఇవ్వడం పాక్‌కి ఎంతో ఆనందం కలిగించింది. దీంతో జట్టు స్కోర్ 88 పరుగులకు చేరు కుంది. రిజ్వాన్ 64 పరుగులు చేశాడు. 13వ ఓవర్లో మధుశన్ మూడో బంతికే ఇఫ్తికర్ దొరికాడు. అతను 31 బంతుల్లో 32 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 93 పరుగులు చేరుకుంది. పాక్ వందపరుగులు 14.2 ఓవర్లలో పూర్తయింది. ఆ తర్వాత కరుణరత్నేకు నవాజ్ దొరికాడు. పాక్ స్కోర్ 101 పరుగుల వద్ద నవాజ్ అవుటయ్యాడు. అప్పుడే రిజ్వాన్ ఒక భారీ సిక్స్ కొట్టి అభిమానులను ఆనందపరిచాడు.
17వ ఓవర్లో హసరంగ రిజ్వాన్‌ను పెవిలియన్ దారి పట్టించడంతో శ్రీలంక అభిమానుల్లో విజయోత్సవం కనపడింది. అప్పటి వరకూ ఎంతో ధాటిగా ఆడిన రిజ్వాన్ అవుటవడంతో పాక్ ఆశలు కూడా దెబ్బతిన్నాయి. కానీ మహేశ్ తీక్షణతో కలిసి వనిందు హసరంగా బంతితో అద్భుతంగా రాణించాడు.అతను ఉంటే ఆట ముగించేసేవాడే. అతని తర్వాత ఆసిఫ్ కూడా వెనుదిరగడంతో పాక్ 111 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లో షాదాబ్ కూడా వెనుదిరిగాడు. దీంతో పాక్ ఆశలు గల్లంత య్యాయి. పాక్ గెలవడానికి చివరి రెండు ఓవర్లలో 51 పరుగులు కావాల్సివచ్చింది. ఇది అసాధ్యమని ప్రేక్షకులకు తెలిసి పోయింది. శ్రీలంక ఆరో పర్యాయం ఆసియాకప్ గెలిచింది