కర్నాటకలో పాయె అయిపాయె.. బీఆర్ఎస్ పొత్తుకు నో అన్నకుమార స్వామి
posted on Oct 8, 2022 6:54AM
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటించేందుకు దసరా రోజున ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అంత కంటే ఆర్భాటంగా కర్నాటక నుంచి మందీ మార్బలంతో తరలి వచ్చిన జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరిగి తమ రాష్ట్రం వెళ్లగానే బీఆర్ఎస్ గాలి తీసేశారు.
ఇక్కడ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మీడియా చిట్ చాట్ లో బీజేపీ పై విమర్శలు గుప్పిస్తూ.. బీఆర్ఎస్ వేగంగా విస్తరిస్తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పోటీ చేస్తుదని, వేగంగా జాతీయ హోదా తెచ్చుకుంటుందనీ చెప్పారు. సరిగ్గా దాదాపు అదే సమయంలో కర్నాటకలో జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మాట్లాడుతూ, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదనీ, ఆ పార్టీకి కర్నాటకలో తాము అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశమే లేదనీ కుండ బద్దలు కొట్టేశారు.
తెలుగువారు ఎక్కువ ఉన్న చోట బీఆర్ఎస్ .. జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందన్నారు. ఇక పార్టమెంటు స్థానాల విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణ శివారు ప్రాంతాలైన ఒకటి, రెండు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ పోటీచేసే అవకాశం ఉందని వివరించారు. అంటే.. జేడీఎస్ నేత కుమారస్వామి బీఆర్ఎస్ కర్నాటకలో పోటీ చేయదనీ, ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడితే తమ మద్దతు ఉండదనీ, జేడీఎస్, బీఆర్ఎస్ ల మధ్య పొత్తేమీ లేదనీ చెప్పకనే చెప్పేశారు.
ఉంటే గింటే జాతీయ స్థాయిలో అంటే పార్లమెంటు ఎన్నికలలో కొద్దో గొప్పో అవగాహన ఉంటుందని కుమారస్వామి చెప్పారు. దీంతో కేసీఆర్, కేటీఆర్ లు బీఆర్ఎస్ విషయంలో చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రగల్భాలు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదన్న చందంలో ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ మంతా తెలంగాణ మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్నది అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. జాతీయ స్థాయిలో మద్దతు వచ్చే వారు ఎవరన్న విషయంలో ఇప్పటి దాకా స్పష్టత ఇవ్వలేకపోతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.