కాంగ్రెస్ గూటికి తుమ్మల?.. టీఆర్ఎస్ కు ఝలక్కేనా?
posted on Oct 8, 2022 @ 12:02PM
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోందా? మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా సాగుతోందా? అంటే జిల్లాలో వరుసగా సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వచ్చేటట్లుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ సీనియర్ల మాట ఎలా ఉన్నా క్యాడర్ లో మాత్రం కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే పార్టీలోకి చేరికలు పెరిగాయి. అదే దారిలో టీఆర్ఎస్ కు చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
కందాల ఆ తరువాత తెరాస గూటికి చేరారు. దీంతో తుమ్మల ప్రాభవం నియోజకవర్గంలో బాగా తగ్గిపోయింది. తెరాస అధినేత కూడా తుమ్మలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో కందాల మాటే చెల్లుబాటౌతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకింత అసంతృప్తికి గురైన తుమ్మల.. తాజాగా కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు అనడంతో ఇక తెరాసలో ఉంటే రాజకీయంగా మనుగడ ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ సమావేశాలకు కూడా తుమ్మలకు ఆహ్వానం అందడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తుమ్మల కాంగ్రెస్ వైపు దృష్టి సారించారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరే విషయంపై తన అనుచరులతో పలు మార్లు చర్చించిన తుమ్మల ఇక ఏ క్షణంలోనైనా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెరాస వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.