అహంకారంలో ఘనాపాటి!
posted on Oct 8, 2022 @ 2:18PM
అహం తలకెక్కితే ఘనాపాటి అయినా, గురవయ్యయినా ఒకటే. చదువుకి, సంస్కారానికి తేడాలేకుండా పోతే ప్రవచనకర్తకీ, ప్రచారసామగ్రి మోసేవాడికీ పెద్దగా తేడా ఉండదు. ఇతరుల ప్రత్యేకతను గుర్తించి గౌరవించాలి. సందర్భం ఏదయినా కొన్నిసార్లు మనకు నచ్చకున్నా ఎదుటివారి ప్రత్యేకతను గౌరవించి అంగీకరించాల్సిందే. ఇదుగో ఇక్కడే మన ఘనాపాటి గరికపాటి తప్పులో కాలేసిందీను. చిరంజీవి లోకం మెచ్చిన నటుడు. అంతులేని ఫాలోయింగ్ ఉన్నవాడు. అలయ్ బలయ్ సందర్భంగా రాజకీయ నాయ కులు ఆయన్ను ఆహ్వానించారు. సినీస్టార్లు.. అందునా చిరు లాంటివారు పదిమందిలోకి వచ్చినపుడు ఇరవయిమంది ఫోటోలకో, ఆటోగ్రాఫ్‌లకో ఎగబడటం మామూలే. అది వాస్తవానికి వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ తప్పని పరిస్థితి. కానీ అదే సమయంలో అవతల వేదిక మీద ప్రసంగిస్తున్న ఘనాపాటివారు ఆగ్రహించడం అర్ధంలేనిదే. ఆయన కాస్తంత నోటిదురుసు ప్రదర్శిం చకుండా ఉండాల్సింది.
‘అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే.. నేను మాట్లాడతా.. లేకపోతే వెళ్లిపోతా. నాకేం మొహమాటంలే.. అక్కడే ఫొటో సెషన్ మొత్తం ఆగిపోవాలి.. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారూ దయచేసి మీరాపేసి, ఈ పక్కకు రండి. నేను మాట్లాడతా. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి.. ఫొటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేకపోతే నాకు సెలవిప్పించండి’ ఇవీ.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు. దసరా పండుగ మరుసటి రోజు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిషన్ గ్రౌండ్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం వేదికపై గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి. చిరంజీవి అభిమానులైతే ఓ రేంజ్ లో గరికపాటిని ట్రోల్ చేశారు. గరికపాటికి మర్యాద తెలియదని కొందరు, అహంకారంలో ఆయన ఘనాపాటి అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా తనదైన శైలిలో స్పందించారు.
గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా అహంకారపూరితంగా మాట్లాడి వివాదాలు కొనితెచ్చుకున్నారు. ఆపై ఆయన సంజాయిషీ ఇచ్చుకోవడమో లేక క్షమాపణలు చెప్పుకోవడమో జరిగింది. ఇప్పుడు కూడా చిరంజీవి పట్ల తాను అలా మాట్లాడి ఉండకూడదంటూ క్షమాపణలు చెప్పారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతే కాదు చిరంజీవితో స్వయంగా మాట్లాడతానని కూడా గరికపాటి చెప్పినట్లు చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్ తెలిపారు.
గతంలో గరికపాటి నరసింహారావు స్వర్ణకారులపై చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ‘కన్న తల్లికి బంగారు వస్తువు చేసినా సరే.. స్వర్ణకారుడు కొంచెం పక్కన పెట్టేస్తాడట. అది వృత్తి ధర్మమట. మా వృత్తి ధర్మమండి.. కాస్తయినా పక్కన పెట్టకపోతే మాకు కలిసిరాదంటారు. వాళ్లకు అదో సెంటిమెంటు’ అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలతో స్వర్ణకారులు ఆయనపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. గరికపాటి తమకు క్షమాపణ చెప్పాలంటూ జంగారెడ్డిగూడెం పీఎస్ ముందు స్వర్ణకారులు నిరసన వ్యక్తం చేసి, ఫిర్యాదు చేసేదాకా పరిస్థితి వెళ్లింది. గరికపాటి నరసింహారావు భీమవరం పర్యటన సందర్భంగా నిరసన ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు. ఈ వివాదం ముదిరిపోవడంతో గరికపాటి దిగి వచ్చి స్వర్ణకారులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ‘ఎవరినీ కించపరచాలని నేను మాట్లాడలేదు. విశ్వబ్రాహ్మణులకు బాధ కలిగితే.. నాకు బాధ కలిటినట్లే. చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా’ అన్నారు.
ఇటీవలే మరోసారి గరికపాటి తన మాటలతో వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా గురించి స్పందిస్తూ.. ‘ఒక స్మగ్లర్ ను హీరోగా చూపించడం ఏంటీ’ అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ‘సినిమా అంతా హీరోను స్మగ్లర్ గా చూపించి, చివరిలో ఐదు నిమిషాలు మంచిగా చూపిస్తామనో, లేదా తరువాతి పార్ట్ లో చూపిస్తామంటే.. అప్పటి లోగా సమాజం చెడిపోవాలా?’ అంటూ పుష్ప మూవీ మేకర్స్ పై ఫైరయ్యారు. ‘స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అది ఈ రోజు ఉపనిషత్తు సూక్తిగా అయిపోయింది. ఇప్పుడు కుర్రాళ్లు కూడా ఎవరినైనా గూబమీద కొట్టి తగ్గేదేలే అంటున్నారు. దీనికి ఎవరు కారణం. ఆ హీరోను, డైరెక్టర్ ను కడిగేస్తా’ అని గరికపాటి ప్రశ్నించడం సంచలనం అయింది.
ఇక మరో ప్రసిద్ధ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పైన కూడా గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పలువురి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అమ్మాయిల వస్త్రధారణ విషయంలో కూడా గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ‘స్త్రీలు ఇష్టానుసారంగా వస్త్ర ధారణ చేస్తే.. పురుషులు తమను తాము నియంత్రించుకోలేర’ని అనడం సంచలనం అయింది. అత్యాచారం అంశంపై ప్రసంగించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యల్ని సింగర్ చిన్మయి లాంటి వారు తప్పుపట్టారు. సమాజాన్ని గరికపాటి తప్పుదోవ పట్టిస్తున్నారని వీడియో చేసి మరీ గరికపాటి బోధనలపై విరుచుకుపడ్డారు.
మనిషిలో కోపం ఉండకూడదని, అసూయా ద్వేషాలు అసలే పనికిరావంటూ ప్రవచనాలు చెప్పే గరికపాటి ఇలా పలు సందర్భాల్లో పలు వర్గాలు, వ్యక్తులపై అసందర్భంగా, ఆగ్రహంగా, అనాలోచితంగా వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న గరికపాటి అంతకు మించిన పద్మభూషణ్ గ్రహీత చిరంజీవి విషయంలో చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవే అంటూ జనం నిప్పులు చెరుగుతున్నారు. పైగా వయస్సులో, జనాభిమానంలో కూడా తన కంటే అధికుడైన చిరంజీవిని చిన్నబుచ్చేలా గరికపాటి మాట్లాడడం ఏంటని ఫైరవు తున్నారు.
ప్రవచనాలకు కేరాఫ్ అడ్రస్ గా అని అందరూ అనుకునే గరికపాటి తాను వివాదాస్పదంగా మాట్లాడాలని అనుకోనని, కొన్ని విషయాలను ఘాటుగా చెప్పడం వల్ల వివాదం కావచ్చని చెబుతుండడం ముక్తాయింపు.