బిన్నీ బీసీసీఐ ఛీఫ్ అవుతాడా?
posted on Oct 8, 2022 @ 3:38PM
రోజర్ బిన్నీ.. ఈ పేరు వినగానే 1983 ప్రపంచకప్ విజేత భారత్‌జట్టు గుర్తుకు వస్తుంది. అప్పటి అద్భుత విజయానందమే క్రికెట్ వీరాభిమానులు గుర్తుచేసుకుంటారు. చాలాకాలం తర్వాత మళ్లీ మాజీ టీమ్ ఇండియా పేసర్ రోజర్ బిన్నీ పేరు తెరమీదకి వచ్చింది. అయితే ఈసారి భారత్ క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా సౌరవ్ గంగూలీ స్థానంలోకి వస్తాడా అని. చాలామంది బిన్నీ రావాలనే కోరుకుంటున్నారు. గంగూలీ పదవీ కాలం అయిపోవడంతో ఈ నెల 18 వ తేదీన అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. రోజర్ బిన్నీ మంచి ప్లేయర్‌గా, సెలెక్టర్‌గా అందరి దృష్టిని ఎంతగానో ఆకట్టుకున్నారు.
గతంలో జాతీయ సెలెక్టర్‌గా సేవలు అందించిన కర్ణాటకా స్టార్ బిన్నీ పేరు ఊహించనివిధంగా తెర మీదకి వచ్చింది. మొన్నటి వరకూ ఆయన పేరు ప్రస్తావనకు రాలేదు. హఠాత్తుగా ఆయన పేరు బోర్డు వెబ్‌సైట్ లో పోటీదారుల్లో కనపడింది. అక్టోబర్ 18నే బోర్డు సమావేశం కూడా జరుగుతుంది. అందులో ఆయన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా పాల్గొంటారు.
కాగా గురువారం సమావేశమైన బీసీసీఐ అధికారులు, మాజీ హేమాహేమీలు బోర్డు అద్యక్ష పదవి ఎన్నిక గురించి ఎంతో చర్చించారు. అయితే ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి మాటను గౌరవిం చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది. సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి భారత్ ప్రతినిధిగా నియమితులయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ప్రస్తుతం భారత్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా మాత్రం అదే పదవిలో కొనసాగే అవకాశాలే ఉన్నాయి. బెంగా ల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా స్థానంలో కి గంగూలీ రావచ్చు. కనుక బోర్డు అత్యున్నత పదవికి అవిషేక్ అర్హత పొందరు. బోర్డు పదవికి నామినాషన్లు అక్టోబర్ 11, 12 తేదీల్లో దాఖలు చేయవచ్చు. పరిశీలన 13వ తేదీ ఉంటుంది, విత్‌డ్రా 14 వ తేదీ చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, బీసీసీ ఐ పదవి రేసులో అరుణ్ ధుమాల్(హిమాచల్ ప్రదేశ్), రాజీవ్ శుక్లా(యు.పి),ఆశిస్ షెలార్(ముంబై), అనిరుధ్ చౌదరీ(హర్యాణ), వైభవ్ గెహ్లాట్(రాజస్థాన్), అజారుద్దీన్(హైదరాబాద్), జయ దేవ్ షా(సౌరాష్ట్ర), అద్వైత్ మనోహర్(విదర్భా), ప్రణవ్ అమిన్(బరోడా), రోహన్ జైట్లీ(ఢి్లీ) ఉన్నారు.