విద్వేషం పెంచడమే కమలం రాజకీయమా?
posted on Oct 8, 2022 @ 10:46AM
ప్రజలలో విద్వేషాలను రెచ్చగొట్టడమే తమ రాజకీయం అన్నంతగా తెగిస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. రాష్ట్రాలలో కూడా తమ అధికారాన్ని విస్తరించుకోవడానికి అదే మార్గం అన్న విశ్వాసంతో ముందుకు కదులుతున్నచందంగా ఉంది ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.
తెలంగాణలో ఎలాగైనా సరే పాగా వేయాలి, అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ ఇప్పుడు రజాకార్ల పేర సరికొత్త రాజకీయానికి తెరలేపుతోంది. నాటి రజాకార్ల అరాచకత్వాన్నిఇప్పటి ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామంటూ సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుబండి సంజయ్ పర్యవేక్షణలో రజాకార్ అనే పేరుతో ఒక సినిమా నిర్మాణంలో ఉందని చెబుతున్నారు.
ఇక కాశ్మీర్ ఫైల్స్ లా రజాకార్ ఫైల్స్ అనే సినిమా కోసం దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రెడీ చేశారని చెబుతున్నారు. ఆ కథను స్వయంగా మోడీ విని ఓకే చేశారని కూడా అంటున్నారు. ముందుగా విజయేంద్ర ప్రసాద్ కు కేవలం ఐదు నిముషాల సమయం కేటాయించి అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ.. కథ వింటూ దాదాపు అరగంట వరకూ ఆ అప్పాయింట్ మెంట్ సమయాన్నిపొడిగించారని కూడా బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఆ తరువాతే అమిత్ షా మోడీ సూచనల మేరకు తన హైదరాబాద్ పర్యటనలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
అప్పట్లో ఇరువురి భేటీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ భేటీపై పలు రకాల ఊహాగానాలు పైతం వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారనీ, తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారనీ.. ఇలా పలు రకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో భేటీపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ ఓ అద్భుత నటుడితో భేటీ ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ సీనియర్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆయనతో భేటీ కావాలని భావించారని, అందుకే ఆయన ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ భేటీ అయ్యారనీ చెప్పారు. అయితే అవన్నీ వాస్తవం కాదనీ, మోడీ ఆదేశాల మేరకు రజాకార్ ఫైల్స్ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ను ఒప్పించేందుకే అమిత్ షా ఆయనతో సమావేశమయ్యారని అప్పట్లోనే పరిశీలకులు పేర్కొన్నారు.
తరువాత తరువాత రజాకార్ ఫైల్స్ సినిమాపై చర్చించేందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని రాజకీయ వర్గాలు ధృవీకరించాయి. రజాకార్ ఫైల్స్ సినిమా తెలంగాణలో బీజేపీ పలుకుబడి పెంచుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రకు సర్వత్రా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజాకార్ ఫైల్స్ సినిమాలో నటిస్తే కాశ్మీర్ ఫైల్స్ ను మించి ప్రజలను ఆకట్టుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ ను సినిమాతో ఆపేయకుండా వెబ్ సిరీస్ కూడా తీయాలన్న భావనతో ఉన్నారనీ, రెంటిలోనూ జూనియర్ ఎన్టీఆరే ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని అప్పట్లో రాజకీయ, సినీ వర్గాలలో బాగా వినిపించింది. అయితే అటు బీజేపీ కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇప్పుడు మళ్లీ నటీనటుల ప్రస్తావన లేకపోయినా రజాకార్ ఫైల్స్ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.