మునుగోడులో ముసురుకుంటున్న యుద్ధమేఘం!
posted on Oct 8, 2022 @ 11:13AM
ఇక మునుగోడు యుద్ధక్షేత్రంగా మారినట్టే. తెరాస అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ బీఫామ్ ఇవ్వడంతో ఉప ఎన్నిక రంగంలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులెవరన్నది తేలిపోయింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు మునుగోడులో విజయమే లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు మునుగోడులో విజయాన్ని అత్యంత ప్రతిష్ఘాత్మకంగా తీసుకున్నాయి.
ఇప్పటికే మూడు పార్టీలూ కూడా మునుగోడులో తమ చతురంగ బలాలను దించేశాయి. ఎన్నికల యుద్ధానికి సర్వం సహా సిద్ధమైపోయాయి. ఇప్పటి వరకూ తెరాస అభ్యర్థి ఎవరన్న దానిపై ఉన్న సందిగ్ధం కేసీఆర్ కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ సస్పెన్స్ కూ తెరపడింది. మునుగోడు పై ప్రత్యేక దృష్టిసారిస్తూ టీఆర్ఎస్ వీరాభిమానులు, కార్యకర్త లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా పార్టీ విజయానికి కంకణం కట్టుకుని రంగంలోకి దిగారు. మొన్నటి వరకూ పార్టీ అభ్యర్ధి ప్రకటించకపోవడంతో కాస్తంత మెల్లగా కదిలిన కారు పార్టీ కార్యకర్తలు ఇపుడు ఇక జనాల్లోకి ప్రచారసామగ్రితో రంగంలోకి దిగిపోయారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వదలి బీజేపీ లోకి చేరడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.
మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తాజా మాజీ హోదాలో బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న సంగతి విదితమే. కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి చేరికతో అనూహ్యంగా మునుగోడులో కమలం బలం గణనీయంగా పెరుగుతుందని ఆశించినా, ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో కమలం హై కమాండ్ అప్రమత్తమైంది. సర్వ శక్తులూ ఒడ్డైనా మునుగోడులో విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కేడర్ లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని పట్లుదలతో ఉంది. అందేకే పార్టీ రాష్ట్ర నాయకులనే నమ్ముకుని కూర్చోకుండా కేంద్రం నుంచి పరిశీలకులు, పర్యవేక్షలను రంగంలోనికి దింపింది. ముఖ్యంగా జెపి నడ్డా, కేంద్రహోం మంత్రి అమిత్ షా కూడా మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, మునుగోడు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి ఉన్నా రు. బీజేపీ, టీఆర్ ఎస్‌లకంటే ముందే ఆమె ప్రచారం ప్రారంభించారు. సీనియర్ నేతగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేరును కూడా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. బీజేపీ, టీఆర్ ఎస్‌లది అధికార దాహమే తప్ప ప్రజలకు మేలు చేయా లన్న ఆలోచన తక్కువేనంటూ ప్రచారం ఆరంభించింది కాంగ్రెస్.