క్యూలైన్లు నిండిపోయాయి.. రేపు రండి.. భక్తులకు టీటీడీ విన్నపం
posted on Oct 8, 2022 7:22AM
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని అంచనా వేయడంలో విఫలమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమై చేతులెత్తేసింది. క్యూలైన్లు నిండిపోయాయి.. రేపు రండి అంటూ భక్తలను వేడుకుంటోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తలు తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
వారాంతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తిరుమల భక్త జనంతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్నాయి.
దీంతో భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి 48 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక క్యాటేజీలన్నీ నిండిపోవడంతో వసతి దొరకక భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. క్యూలైన్లన్నీ నిండిపోయాయనీ, భక్తులు యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకుని శనివారం ఉదయం క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ భక్తులను కోరుతోంది.