ఎట్టకేలకు పోసానికీ పదవి? ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం
posted on Nov 3, 2022 @ 3:13PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నటుడు పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గత మూడున్నరేళ్లుగా ఏదో ఒక పదవి కోసం చకోర పక్షిలా కళ్లకు కాయలు కాచేలా ఎదురు చూసిన పోసానికి ఎట్టకేలకు చైర్మన్ గిరీ దక్కింది. జగన్ ఆయనను ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నటుడు అలీని నియమించిన సంగతి తెలిసిందే. గత మూడున్నరేళ్లుగా ఈ ఇరువురూ జగన్ తమకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏళ్లు గడిచిపోతున్నా.. అటువంటి పదవి ఏదీ రాకపోవడంతో ఇరువురూ కూడా ఒకింత అసంతృప్తికి లోనైనట్లు వార్తలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలాయి. ఎంద చాట అలీ అంతేనా? ఏం రాజీ పోసానీ జగనన్న దయ రాలేదా? అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు జోకులు పేల్చారు. అదే సమయంలో ఇక సమయం వచ్చింది. అలీ పోసానిలకు పదవి ఖాయం అంటూ తెలుగు వన్ స్పష్టంగా చెప్పింది. నాడు తెలుగువన్ చెప్పింది.. నేడు నిజమైంది.
నవ్వండి .. నవ్వండి.. నవ్విన నాప చేనే పండుతుంది... ఇప్పుడు మీరు ఎన్ని జోకులైనా వేయవచ్చు. నవ్వచ్చు, ఎగతాళి చేయవచ్చు కానీ నిజ్జంగానే కమెడియన్ అలీకి త్వరలో నామినేటెడ్ పోస్టు ఖాయం. అని తెలుగువన్ రెండు నెలల కిందటే విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అది నిజమైంది. ఒక్క అలీకేనా.. అలీతో పాటుగా ఒక్క మాటలో చెప్పాలంటే అలీకంటే ఎక్కువగా జగన్ రెడ్డిని భుజాన మోసిన పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు ఖాయమని తెలుగువన్ అప్పుడే చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. కొంచెం అటూ ఇటూలో ఇద్దరికీ ఒకరి తరువాత ఒకరికి పోస్టులు ఇచ్చింది.
గత ఎన్నికలలో అలీ, పోసాని మాత్రమే కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం, ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కూడా వైసీపీ తరఫున కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ఒక్క పృద్వీని మాత్రమే ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్ పదవికి నామినేట్ చేశారు. అది కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయింది. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పెట్టేశారు.
పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు. ఇక మోహన్ బాబు కూడా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని మాత్రం పార్టీని వదల కుండా చకోర పక్షుల్లా జగన్ రెడ్డి దయకోసం, కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. జబర్దస్త్ రోజా మంత్రి పదవికోసం ఎంతగా తాపత్రయ పడ్డారో, అంతకంటే ఎక్కువగా అలీ, పోసాని నామినేటెడ్ పదవుల కోసం తాపత్రయ పడ్డారని అంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలీని ఒకటికి రెండు సార్లు ఇంటికి పిలిపించుకుని మరీ ఒట్టి చేతులతో పంపించారు. రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం కూడా సాగింది. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది.
అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో పాపం అలీ అమాయకంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిన పడలేదు. ఎట్టకేలకు అలీకి పోస్టు దక్కింది. ఆశించిన పదవి కాకపోయినా, కంటితుడుపు సలహాదారు పోస్టు అయినా ఏదో ఒకటి దక్కిందని అలీ కూడా సంతృప్తి పడ్డారు. ఇక పోసానిని వదిలేశారేమిటా? అని అందరూ అనుకున్నారు. ఎంతో కొంత నొచ్చుకున్నారు కూడా.
ఎందుకంటే పోసాని కృష్ణ మురళీ జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చే క్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆయనను టార్గెట్ చేస్తూ పవన్ ఫాన్స్ చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు. అయినా, తట్టుకుని మడమ తిప్పకుండా జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచినందుకు పోసాని సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకున్నారు. ఇవన్నీ గుర్తు చేసుకుని మరీ పలువురు అలీకి పోస్టు ఇచ్చి కూడా పోసానిని వదిలేశారేమిటని గుసగుసలు పోయారు. అయితే జగన్ పోసానిని వదిలేయలేదు. చివరాఖరికి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. దీంతో అలీ, పోసానిల కథ సుఖాంతమైనట్లేనా?