సరదానా.. జనాకర్షణ ట్రిక్కా?
posted on Nov 3, 2022 @ 12:14PM
చింటూ లెక్క తప్పుచేశాడని టీచర్ కొట్టింది, పింకీ జడ సరిగావేసుకోలేదని తల్లి కొట్టింది, తనను రక్షించమని భక్తులు వినాయకుడి ముందు చెంపలేసుకుంటున్నారు.. కానీ హఠాత్తుగా రాహుల్ గాంధీ కొరడాతో కొట్టేసుకున్నారు.. జనమంతా ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు..అది సరదానా.. జనాకర్షణ ట్రిక్ .. తెలీడం లేదు.
భారత్ జోడో అంటూ పాదయాత్ర పేరుతో దేశాటన చేస్తున్నారు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ. అందులో భాగంగా తెలంగాణా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రయాణంలో భాగంగా సంగారెడ్డిలో అలా అభిమానులు, నాయకులతో ఉత్సాహంగా వెళుతూ అందరికి అభివాదం చేస్తూ ముందడుగు వేస్తు న్నారు. ఆయనకు బుడగ జంగాల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆయన ఎంతో ఆసక్తిగా వారిని చూశారు. వారు కొరడాతో కొట్టుకోవడం అమ్మవారి మీద భక్తితో అరవడం.. చాలా చిత్రంగా అనిపించింది. అదో భక్తిపారవశ్యంతో కూడిన సరదా అనుకున్నారేమో తెలీదు గాని ఆయనకీ కొరడాతో కొట్టుకోవా లనిపించింది.
ఇదే సినిమాలో అయితే పక్కనున్నవారు అమాంతం ఆపి హంగామా చేస్తారు. కానీ ఇది వాస్తవం. అందునా జనానికి పార్టీ ని మరింత దగ్గర చేయడం లో భాగంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలవారి అభిమానాన్ని చూరగొనాలి. అలాంటి గొప్ప ఆలోచన తట్టగానే రాహుల్ అమాంతం కొరడా చేతిలోకి తీసుకుని అలా కొట్టుకోవడం అందరూ చూసి విస్తుపోయారు. సరే ఒక దెబ్బవేసుకుని ఉంటారు. అదీ పెద్దగా తగిలిందో లేదో వేరే సంగతి కానీ ఇట్లాంటి జిమ్మి క్కులు పార్టీ నాయకులకు చాలా అవ సరం. అందునా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్న పట్టుదలతో ఉన్న నాయకునికి చాలా అవసరం.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజలకు కలుగుతున్న అవాంతరాలు, అవస్థలు, కష్టనష్టాలను ఏకరువు పెడుతూ కాంగ్రెస్ ను మళ్లీ పీఠం ఎక్కించాల్సిన అవసరం ఎంతో ఉందని దేశ ప్రజలకు పిలుపునివ్వడం లో భాగంగా తాను భారత్ జోడో యాత్రలో ప్రజల్లో కలిసిపోతున్నారు రాహుల్ గాంధీ. కేంద్రంలో పార్టీని నిలబెట్టడానికి, బీజేపీ వ్యూహాలను దెబ్బకొట్టడానికి, దేశమంతటా పార్టీ నాయకత్వాన్ని పటిష్టపరిచేందుకు వీలయినంత కష్టపడాల్సిన సమయం గుర్తించే రాహుల్ భారత్ జోడో చేపట్టారు. ఇందులో భాగంగా ఇటు తెలంగాణా ప్రాంతంలో గత ఎనిమిది రోజులుగా తిరుగుతు న్నారు. జాతీయ పార్టీల నాయకులు అందరూ ఈవిధంగా అన్ని రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతా ల్లోని వారిని ఇలా ఆకట్టుకోవడం మామూలే. పూర్వం ఇందిరాగాంధీ కూడా థిమ్సా వారితో కలిసి డాన్స్ చేశారు.