మునుగోడు ఉపఎన్నిక... 92 శాతం ఓటింగ్ కి అవకాశం
posted on Nov 3, 2022 @ 4:00PM
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక పైనే ఇపుడు అందరి దృష్టి నిలిచింది. మునుగోడును టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కి మారడంతో ఇక్కడ ఉపఎన్నిక తప్పనిసరి అయిన సంగతి తెలిసిందే. అయితే రాజగోపాల్ రెడ్డిని అడ్డుపెట్టుకుని తెలంగాణాలో ఈ ఉప ఎన్నిక గెలవడం ద్వారా కేసీఆర్ కు గట్టి జవాబు చెప్పాలని బీజేపీ వర్గాలు కంకణం కట్టుకున్నాయి. కాగా ఇక్కడ ప్రజలకు నిజమయిన అభివృద్ధి తమ పార్టీతోనే జరుగుతుందని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. పైగా సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. అందుకే సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్ధిగా నిలబెట్టింది. అయితే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉంది గనుక బీజేపీ దాన్ని అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కనుకనే ఈ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టా త్మకంగా మారింది. కాగా టీఆర్ ఎస్ తరఫున నిలబడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తమ పార్టీ సాధించిన విజయాలు, చేస్తున్న పనులను ప్రచారం చేసుకుని గెలిపించుకోవాలని టీఆర్ ఎస్ దూకు డుగా ఉంది. ఇదిలా ఉండగా, మునుగోడు లో మూడు ప్రధాన పార్టీతో పాటు బీఎస్సీ తరఫున అందోజు శంకరాచారి, టీజెఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్, ప్రజాశాంతి తరఫున ఆ పార్టీ అధినేత కేఏపాల్ కూడా బరిలో ఉన్నారు.
మునుగోడులో కొత్తగా చేరిన ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిని ఇంతవరకు ఎవరు సుముఖు లుగా చేసుకుంటే వారికి అత్యంత మద్దతు లభిస్తుందన్న ప్రచారం ఉంది. కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు వేలాది వచ్చాయి. కేవలం రెండు నెలల్లోనే 24వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దరఖాస్తులపై పార్టీల మధ్య రగడ, కోర్టు తీర్పుల అనంతరం.. మొత్తం 2 లక్షల 41 వేలపై చిలుకు ఓట్లలో 14వేల మంది కొత్త ఓటర్లను ఫైనల్ చేసింది ఈసీ. గురువారం ఉదయం ఏడింటికి పోలింగ్ ఆరంభమయింది. పోలింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు, కొట్లాటలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.
పోలింగ్ సెంటర్లలోకి స్మార్ట్ ఫోన్లకు అనుమతి ఇవ్వడం లేదు పోలింగ్ అధికారులు. పోలింగ్ సెంటర్లకు ముందే ఫోన్లతో వచ్చినవారిని నిలివేస్తున్నారు. పోలీంగ్ స్లిప్పులు, ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉదయమే ఓటర్లు పోలింగ్ సెంటర్లకు వచ్చారు. పనులకు వెళ్లే వారు ఉదయమే వచ్చి ఓటేసి వెళుతున్నారు. వృద్ధులు,మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. తొలిగంటలోనే గ్రామాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడున్నర ప్రాంతంలో తంగేడుపల్లిలో గందరగోళం నెలకొంది. పోలీసులకు ఓటర్లకు వాగ్వాదం నెల కొంది.
పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తు న్నాయి.. ఇదే జోరు కంటిన్యూ అయితే గత రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018లో ఇక్కడ 91.3 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి జోష్ చూస్తుంటే..92 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్ బహిష్కరించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూరప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. డబ్బు లు పంచితేనే ఓట్లు వేస్తామని ఓటర్లు పేర్కొంటున్నారు. ఒంటిగంట సమయానికి 41.30 శాతం ఓటింగ్ నమోదు..మునుగోడులో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు
ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు చాలా సెంటర్ ముందు ఓటు వేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది. పోలింగ్ రోజు కూడా భారీగా నగదను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్‌హాల్‌లో ఇతర ప్రాంతల నుండి వచ్చి డబ్బులు పంచుతుండగా పట్టుకున్నారు. 2లక్షల 99 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చండూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది..టీఆర్ఎస్, బీజేపీ మధ్య వివాదం తలెత్తింది. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారని బీజేపీ ఆరోపించింది.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ స్పెషల్ అట్రాక్షన్. ఈయన పోలింగ్ కేంద్రాల పరిశీలి స్తున్నారు. ఒక సెంటర్ నుంచి మరొకరు సెంటర్‌కు ఆయన పరుగులు పెట్టారు. సిద్దిపేటకి చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ మర్రిగూడ పోలింగ్ బూత్ బయట బీజేపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఔటర్స్ ని ఎందుకు అను మతి ఇస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తక్షణమే బయటి వ్యక్తులను పంపించివేయాలని డిమాండ్ చేశారు. అటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరి స్థితి నెలకొన్నది. చండూరులో కొంతమంది నేతలు ఓటర్లకు నగదు పంచేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి డబ్బు అక్కడే వదిలి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలంలో రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కారును బీజేపీ శ్రేణులు పట్టుకున్నాయి. ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోన్న వేళ ఈ డబ్బు లభ్యం కావడం గమనార్హం. చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు పోలింగ్ నిలిచిపోయింది. ఇక్కడ ఈవీఎం మిషన్లు మొరాయించాయి. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లంతా పోలింగ్ సెంటర్లోనే కూర్చుండిపోయారు. మునుగోడు బైపోల్‌లో హీట్ కంటిన్యూ అవుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రశాంతంగానే జరిగింది పోలింగ్. అయితే.. పదిన్నర సమయంలో చాలా చోట్ల గొడవలు తలెత్తాయి.. బయటివారు ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని కొన్ని చోట్ల.. డబ్బులు పంచుతున్నారంటూ మరికొన్ని చోట్ల ఘర్షణ తలెత్తింది. ఓటింగ్ రోజు కూడా నగదు ప్రవాహం కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల క్యాష్‌ను సీజ్ చేస్తున్నారు అధికారులు. మర్రిగూడలో లాఠీఛార్జ్ వరకు వెళ్లింది పరిస్థితి. బయటి ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ రెండు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. సిట్యుయేషన్ సీరియస్‌గా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. రెండు వర్గాలను చెదరగొట్టారు . మధ్యాన్నం 12 గంటల సమయంలో నో మనీ.. నో ఓట్ అంటూ ఏకంగా పోలింగ్‌నే బహిష్కరించారు మర్రిగూడ మండలం అంతపేట గ్రామస్థులు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంచారని.. మరికొందరికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నగదు ఇస్తే తప్ప పోలింగ్ సెంటర్లకు వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు
మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా చండూరు మండలంలోని కోటయ్యగూడెంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సాధారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఓటర్లుగా వారిపై ఉండే బాధ్యలేంటి అనేవి అన్నీ వివరిస్తూ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎండలో నుంచోవాల్సిన అవసరం లేకుండా కూడా సౌకర్యాలు కల్పించారు. అలాగే ఎవరైనా క్యూలైన్లలో నిలబడం వల్ల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంటే.. ప్రథమ చికిత్స కోసం మందులు, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ఈ పోలింగ్ కేంద్రాన్ని అందంగా బెలూన్లతో డెకరేట్ చేశారు. చండూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.టీఆర్ ఎస్ మధ్య వివాదం తలెత్తింది. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారని బీజేపీ ఆరోపించింది..