ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు సీబీఐకి.. నందకుమార్ భార్య పిటిషన్
posted on Nov 4, 2022 6:25AM
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. తన భర్త ఫోన్ ను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేశారని ఆరోపించారు.
తన భర్త నందకుమార్ తో పాటు ఇతర నిందితులకు రిమాండ్ విధించడానికి ఏసీబీ కోర్టు తొలుత నిరాకరించిన విషయాన్ని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగకుండా పలుకుబడి కలిగిన వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.
సీబీఐ, సిట్ లేదా సిట్టింగ్ జడ్జికి కేసు దర్యాప్తును అప్పగించాలని ఆమె తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు నిందితులకు సంబంధించిన ఎటువంటి ఆడియోలను, వీడియోలను మీడియాకు, సోషల్ మీడియాకు, ఇతరులకు విడుదల చేయకుండా పోలీసులను కట్టడి చేయాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐ, సిట్ లేదా సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం (నవంబర్ 4) మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది.