అయ్యన్నకు బెయిల్ మంజూరు
posted on Nov 3, 2022 @ 6:34PM
భారీ బందోబస్తు మధ్య తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌ను సిఐడి పోలీసులు విశాఖ జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ వారికి వెంటనే బెయిలు మంజూరు చేశారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు గురువారం (నవంబర్3) తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి విదితమే.
నర్సీపట్నంలో అయ్యన్నను ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు తెల్లవారు జామున దొంగల్లా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందవే.గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పిం చిన డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు గా పేర్కొంటూ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురిపైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు దొంగల్లా గోడ దూకి దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించారనీ, తలుపులు పగులగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నించారనీ అయ్యన్న పాత్రుడి కోడలు, రాజేష్ భార్య పద్మావతి ఆరోపించారు. తన భర్త రాజేష్ తలుపులు తీసి ఎందుకు వచ్చారని ప్రశ్నిచారనీ, అయితే అందుకు సమాధానం చెప్పకుండా ఈడ్చుకుపోయారనీ ఆమె ఆరోపించారు. తెల్లవార జామున తమ నివాసంపై దాడి చేసిన పోలీసులు తాగి ఉన్నారనీ, దుర్భాషలాడారని ఆమె పేర్కొన్నారు. తన భర్త రాజేష్, మామ అయ్యన్న పాత్రుడులను ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్టు చేశారని ఆమె పేర్కొన్నారు.
గతంలో అయ్యన్నపాత్రుడి నివాసం దగ్గర ప్రహరీ గోడ విషయంలో వివాదం రేగిన సంగతి విదితమే. అయ్యన్న పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. అనంతరం హైకోర్టులో పిటిషన్ వేయగా అయ్యన్న కుటుంబానికి ఊరట దొరికింది. మళ్లీ అదే కేసులో ఫోర్జరీ డాక్యు మెంట్లు కోర్టుకు సమర్పించారనే అభియోగాలపై ఇప్పుడు అయ్యన్నపాత్రుడితో పాటూ ఆయన కుమా రుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అయ్యన్ప పాత్రుడిని అక్రమంగా అరెస్టు చేయడం పట్ల తెలుగుదేశం మండి పడింది. ఏడు పదుల వయస్సులో ఉన్న వ్యక్తినీ, నాలుగు దశాబ్దాలుగా క్రీయాశీల రాజకీయాలలో ఉన్న వ్యక్తిని రెండు సెంట్ల భూమిలో అక్రమ నిర్మాణం చేశారంటూ అరెస్టు చేస్తారా? ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.