జగన్ జైలుకు.. వైసీపీ బంగాళాఖాతంలోకి..!
posted on Nov 3, 2022 @ 6:34PM
జగన్ జైలుకు వెళ్లడం తథ్యమని, ఆ తరువాత వైసీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం (నవంబర్ 3) విలేకరులతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్టుపై మండిపడ్డారు. జగన్ హయాంలో జరుగుతున్న అరాచకపాలనకు ఈ అరెస్టు పరాకాష్టగా అభివర్ణించారు. ప్రభుత్వానికి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను అరెస్టు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ రక్తం పంచుకుపుట్టిన స్వంత చెల్లి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారనీ, ఆ వాంగ్మూలంలో తన బాబాయ్, మాజీ మంత్రి వివేకాను ఎవరు చంపారో స్పష్టంగా చెప్పారని, దీంతో జగన్ దిక్కు తోచని పరిస్థితుల్లో పడ్డారని అన్నారు. ఆ విషయం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి దాటిన తరువాత అమానుషంగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖలో భూ కబ్జాల వ్యవహారంపై తెలుగుదేశం పోరాడుతోందనీ, దాని నుంచి కూడా దృష్టి మరల్చాలనే అయ్యన్న పాత్రుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు.
రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయని హైకోర్టులో తేలిందనీ, దానిపై జగన్ తన తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఏడు పదుల వయస్సున్న అయ్యన్ప పాత్రుడిని తెల్లవారు జామున 3 గంటలకు ఆయన ఇంటి గోడలు దూకి మరి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారనీ, ఆయనేం చేశారని ఈ దుర్మార్గపు అరెస్టు అని నిలదీశారు. అయ్యన్న పాత్రుడు ఏమైనా హత్యలు చేశారా? అరాచకాలు చేశారా? కబ్జాలు చేశారా? అని నిలదీశారు. ఆ చరిత్ర జగన్ కుటుంబానిది, ఆయన పార్టీదీ అని విమర్శించారు. అయ్యన్న పాత్రుడి ఇంట్లోకి పోలీసులు దొంగల్లా వెళ్లారనీ, ఎందుకు వచ్చారని అడిగినందుకు దాడి చేశారని చంద్రబాబు అన్నారు. అయ్యన్న పాత్రుడికి కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా లాక్కెల్లారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ కు దమ్ముంటే ఆయన సొంత బాబాయ్ ని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యన్నది వందల ఎకరాలు దానం ఇచ్చిన కుటుంబమని చెప్పిన చంద్రబాబు అయ్యన్న తాత ఎమ్మెల్యే.. స్వయంగా అయ్యన్న పాత్రుడు 40 ఏళ్లుగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న వ్యక్తి, మాజీ మంత్రి అటువంటి వ్యక్తిని రెండు సెంట్లలో అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని అరెస్టు చేస్తారా అని నిప్పులు చెరిగారు.
ఇడుపుల పాయలో వైఎస్ కుటుంబం 650 ఎకరాల భూమి కబ్జాపై వాస్తవాలను అప్పట్లో నిరూపించి, అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డిని నిలదీసిన సంగతిని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసైన్డ్ భూములను కబ్జా చేసి.. దాని నుంచి బయటపడేందుకు చట్టం చేసిన కుటుంబం మీది అని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ లో భూమిని ఆక్రమించి అక్రమించి వైఎస్ ఇళ్లు కట్టుకున్నారు. ఈ విషయంలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు కూడా వచ్చిందని చంద్రబాబు అన్నారు. కానీ అయ్యన్న పాత్రుడిది అటువంటి చరిత్ర కాదన్నారు. భూములు దానం చేసిన కుటుంబం అయ్యన్న పాత్రుడిది అని చెప్పారు. మంగంపేటలో వైఎస్ కుటుంబం బైరైటీస్ గనుల అక్రమాలపై నటరాజన్ కమిషన్ తో పాటు హౌస్ కమిటీ కూడా నిర్ధారించిందని చంద్రబాబు చెప్పారు. ఇంకా కడపలో జగన్ మేనమామ వక్ఫ్ బోర్డు భూముల్లో థియోటర్ నిర్మించుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకోగలరా అని ప్రశ్నించారు. ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఉన్మాదుల్లా, రౌడీల్లా అర్ధరాత్రి ఇళ్లపై పడుతున్నారు. కొందరు రిటైర్డ్ అధికారులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి, శారీరకంగా బాధలు పెట్టేవారు అన్నింటికీ అనుభవిస్తారని అన్నారు.
వివేకా హత్య కేసులో వాస్తవాలను సిఐ శంకరయ్య అంగీకరించాడు. తరువాత అతనిపై ఒత్తిడి తెచ్చి హత్యపై స్టేట్మెంట్ ఇవ్వకుండా చేశారు.
వివేకా కేసులో సస్పెండ్ అయిన సిఐకి ప్రమోషన్ ఇచ్చారు. తరువాత సిబిఐ పైనే ఆరోపణలు చేయించారు. కోర్టులో ఉన్న కేసుపై ఎవరో వచ్చి ఫోర్జరీ అని సిఐడికి ఫిర్యాదు చేశారట. విజయ్, రాజేష్ పై ఆస్థి ఉంటే అయ్యన్నపై కేసు పెడతారా? ఈ భూమి ఆయన పేరున లేదు.. ఆయన ఈ కేసులో ఏ రకంగా ఏ1 కింద వస్తారు అని నిలదీశారు. అయ్యన్న ను ఇతర కేసుల్లో ఏమీ చెయ్యలేక....రెండు సెంట్ల భూమి అని కేసు పెట్టి దుర్మార్గంగా అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు.
ఇదే విధంగా అయితే 14 ఏళ్లు కేసులు పెట్టే వాళ్లం కాదా...భవిష్యత్ లో పెట్టలేమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఐడీ కార్యాలయం టార్చర్ కార్యాలయంగా మారిపోయింది, సీఐడీ పోలీసులు జగన్ సర్కార్ కుఊడిగం చేసే వారిలో తయారయ్యారని విమర్శించారు. ఇవన్నీ చూస్తూ మేం సైలెంట్ గా ఉండాలా అని చంద్రబాబు నిలదీశారు. విశాఖలో రూ.40 వేల కోట్లు దోచింది కాక మాపై కేసులు పెడతారా? 0 ఏళ్ల అయ్యన్నపై సిగ్గు లేకుండా రేప్ కేసు పెడతారా? ఇప్పుడు భయపడి తప్పులు చేస్తున్న అధికారులు...రేపు నిజం ఒప్పుకోరా అని చంద్రబాబు నిలదీశారు. అయ్యన్న కుటుంబం పై ఇప్పటికి 12 కేసులు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వమే చేస్తున్న టెర్రరిజం ఇది మాపై కేసులు పెడుతున్న సిఐడి అధికారుల చరిత్ర ఏంటి? ఎవడికి చెపుతారు కాకమ్మ కబుర్లు...నువ్వు కేసు పెడితే అయిపోతుందా? అని నిలదీశారు.