తెగిన విద్యుత్ తీగలు లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతుంది
posted on Nov 3, 2022 @ 11:56AM
అనంత జిల్లాలో తెగిపడిన విద్యుత్ తీగలు లాగితే తాడెపల్లి ప్యాలెస్ డొంక కదులుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలిలు మరణించిన విషాద సంఘటన తెలిపిందే.
ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జగన్ సర్కార్ రూ. 10లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై లోకేష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో విద్యుత్ తీగలు తెగిపడుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి.
ఇలా ఎందుకు అవుతోంది అని ప్రశ్నించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఎవరు? అంటూ నిలదీశారు. తీగలాగితే డొంక కదులుతుందంటారు. అలాగే తెగిపడుతున్న విద్యుత్ తీగలను లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదలడం ఖాయమన్నారు. విద్యుత్ తీగలు తెగిపడి అనంతపురం జిల్లాలో నలుగురు వ్యవసాయ కూలీలు మరణించిన సంఘటన జరగడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా విద్యుత్ తీగలు తెగిపడిన ఉదంతంలో ముగ్గురు రైతులు మరణించారని గుర్తు చేశారు.
ఈ దారుణ ఉదంతానికి నాలుగు రోజుల క్రితమే ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిని ఉదంతంలో.. ముగ్గురు రైతులు మరణించటం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పుడల్లా ఉడత కథ చెప్పి చేతులు దులుపుకోవటం జగన్ సర్కారుకు అలవాటైందని మండిపడ్డారు. హైటెన్షన్ వైర్లు కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల తెగిపడవు. ఇక సర్కార్ చెబుతున్నట్లుగా ఉడుతలు.. పక్షుల వల్ల అయితే.. ముందుగా ట్రిప్ అయి విద్యుత్ సరఫరా ఆగిపోవాలి.
కానీ ఇటీవల విద్యుత్ తీగలు తెగిపడిన సంఘటనల్లో వైర్లలో కరెంట్ ప్రవహిస్తోంది. అంటే.. వైర్లే తెగిపడుతున్నాయని స్పష్టంగాతెలుస్తోంది. దీంతో విద్యుత్ తీగల కాంట్రాక్టర్లు నాసిరకం కరెంట్ వైర్లు వాడించడం వల్లనే అవి తెగిపడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉడుత కథలు చెబుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతుందంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.