అయ్యన్నపాత్రుడి అరెస్ట్ అందుకేనా?
posted on Nov 3, 2022 @ 12:28PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం గురించి తెల్లారితే ప్రింట్ మీడియాలో ప్రజల ముందుకు వస్తుందని, దాన్నుంచి జనం దృష్టి మళ్లించేందుకే అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేసినట్లు టీడీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే అభియోగాలపై పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నర్సీపట్నంలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
కడప ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ వివేకానందరెడ్డి గట్టి పోటీదారుగా ఉండడం వల్లే తమ చిన్నాన్నను వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చంపించారని షర్మిల సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఓ వార్తా పత్రికలో వార్త ప్రధానంగా వచ్చింది. సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలం తెల్లారితే రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచం మొత్తం తెలిసిపోతుందని, దాన్నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే అయ్యన్నపాత్రుడి అరెస్ట్ కథను జగన్ నడిపించారని టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఢిల్లీ వెళ్లి సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇచ్చిన సమాచారం తెలుసుకున్న జగన్ ఫైరయ్యారని, తమ తల్లి విజయమ్మకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోందని ఆ పత్రిక వార్త ప్రచురించింది. నిజానికి జగన్ కు షర్మిలకు మధ్య ఇప్పటికే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారులను జగన్ రక్షిస్తున్నారంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తూనే ఉన్నాయి కూడా. ఇప్పుడు షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన విషయం బయటపడడంతో తల్లి విజయమ్మతో షర్మిలపై జగన్ ఆగ్రహం వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓపికతో ఉన్నానని, తన పరువును షర్మిల బజారుకు ఈడుస్తోందని జగన్ మండిపడ్డారంటూ ఆ పత్రిక కథనంలో పేర్కొంది.
వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఇవ్వాలని వైఎస్ షర్మిలను కోరడమే కాకుండా నోటీసు కూడా ఇచ్చినట్లు సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం తెలిసిందని ఆ పత్రిక పేర్కొంది. దీంతో తాను తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నానని, వీలుచూసుకుని వస్తానని షర్మిల చెప్పారట. వాంగ్మూలం తాను కడపకే వచ్చి ఇవ్వాలా? అని షర్మిల అడిగినప్పుడు కడపలో కానీ, ఢిల్లీ అయినా ఇవ్వొచ్చని సీబీఐ అధికారులు తెలిపారని వార్తా కథకం వచ్చింది. దీంతో అక్టోబర్ 7వ తేదీన షర్మిల ఢిల్లీలో సీబీఐ ఆఫీసుకు వెళ్లి వివేకా హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో.. తనకు ఉన్న సమాచారం ప్రకారం అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే తమ చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేయించారని షర్మిల తెలిపారు.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వివేకాకు శత్రువులు లేరని, కడప జిల్లాలో ఆయనను అందరూ గౌరవిస్తారని, ఆయనను వ్యతిరేకించేవారు ఎవరూ లేరని సీబీఐకి షర్మిల వివరించారని ప్రింట్ మీడియాలో వచ్చిన కథనం. అయితే.. కడప ఎంపీ టికెట్ విషయంలో తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని, టికెట్ కోసం తమ చిన్నాన్న వివేకా గట్టి పోటీదారుగా ఉన్నారని, అవినాశ్ రెడ్డి కూడా ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు చెప్పారు. ఎంపీగా వివేకా బరిలో దిగితే తమ ఉనికికి ప్రమాదం అని అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే తమ చిన్నాన్నను చంపించారని తమకు ఉన్న సమాచారం అని షర్మిల వాంగ్మూలం ఇచ్చినట్లు పత్రికలో వచ్చింది.
కడప ఎంపీ టికెట్ తనకు ఇవ్వకపోతే.. షర్మిలకు లేదా విజయమ్మకే ఇవ్వాలంటూ వివేకానందరెడ్డి గట్టిగా కోరారని, ఈ నేపథ్యంలోనే అవినాశ్ రెడ్డి ఆయనను హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది కదా.. దీనిపై మీ స్పందన ఏమిటి? అని మీడియా ప్రశ్నించినప్పడు ‘వాస్తవం’ అని షర్మిల సూటిగా స్పందించారు. ‘నా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది. సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను ఎవరు అంత ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రావాలి. వారికి శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదు’ అని అక్టోబర్ 21న ఢిల్లీలో మీడియా సమావేశంలో షర్మిల అన్నారు.
ఈ విషయాలపై ఏపీ వ్యాప్తంగా జనంలో చర్చ జరుగుతుందని, అసలు రంగు బయటపడుతుందని.. దీన్నుంచి జనం దృష్టి మళ్లించేందుకే సీఐడీ పోలీసులతో అయ్యన్నపాత్రుడి అరెస్టుకు పథక రచన చేశారని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉత్తరాంధ్రలో పులిలా ఉన్న అయ్యన్నపాత్రుడిని తాడేపల్లి ప్యాలస్ లో పిల్లిలా దాక్కున్న జగన్ అర్ధరాత్రి అరెస్ట్ చేయించారంటూ నిప్పులు చెరుగుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత అయ్యన్నపై 15 తప్పుడు కేసులు పెట్టడంపై టీడీపీ నేతలు తూర్పారపడుతున్నారు.