తెరాసకు తుమ్మల గుడ్ బై? తెలుగుదేశం గూటికేనా?
posted on Nov 10, 2022 @ 4:11PM
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరాసకు గుడ్ బై చెప్పనున్నారా? అంటే పరిశీలకులు ఔనంటూ విశ్లేషిస్తున్నారు. ములుగు జిల్లాలో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన ఆ సమావేశానికి హాజరయ్యేందుకు గురువారం (నవంబర్ 10) దాదాపు 350 కార్లలో వాజేడుకు బయలుదేరారు. అంతకు ముందు ఉదయం ఆయన భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడి నుంచి నేరుగా భారీ ర్యాలీతో వాజేడు కు బయలు దేరారు. కాగా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం, లక్ష్యం పార్టీ మార్పుపై చర్చించేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుమ్మల ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతు దారులు, అనుచరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ఆయన తెరాసను వీడటంపై చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉండటం కూడా తుమ్మల పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే తుమ్మల తెరాసను వీడుతారన్న ఊహాగానాలు గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి. తెరాసలో ఇటీవలి కాలంలో తుమ్మల ప్రాధాన్యత తగ్గింది. తగ్గిందనే దాని కంటే ఆయనే పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనడం లేదనీ, తనంత తానుగానే పార్టీకి దూరంగా ఉంటున్నారనీ ఆయన మద్దతు దారులు అంటున్నారు. ఇటీవలి కాలంలో తుమ్మల కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. అలాగే ఆయన తెలుగుదేశంకు చేరువ అవుతున్నారన్న చర్చా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా తెలుగు దేశం కూడా తన వ్యూహాలకు పదును పెడుతుండటం, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత కాసాని జ్ణానేశ్వర్ కు పార్టీ అధినేత చంద్రబాబు పగ్గాలు అప్పగించడంతో ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పుంజుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెరాసను వీడి తుమ్మల హోం కమింగ్ అంటూ తెలుగుదేశం పంచన చేరు అవకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
2014లో తెరాస గూటికి చేరిన తుమ్మల అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తరువాత కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించి తన కేబినెట్ లో పదవి కూడా ఇచ్చారు. అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత తుమ్మలకు తెరాసలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మరో సారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారని తుమ్మల ఆశించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఆయన బీజేపీ గూటికి చేరుతారని గతంలో బలంగా వినిపించినా తుమ్మల ఖండించారు.
అలాగే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనీ వదంతులు వినిపించాయి. అయితే తుమ్మల వాటిపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆత్మీయ సమ్మేళనం అంటూ పెద్ద సంఖ్యలో మద్దతు దారులను సమీకరించి సమావేశం పెట్టడంతో ఆయన తెరాసను వీడటం ఖాయమేనని అంటున్నారు. అయతే అయన ఏ పార్టీలోకి వెళతారన్నది మాత్రం ఇతమిథ్ధంతా తెలియరాలేదు. ఇంకో వైపు ఇదేరోజు (నవంబర్10) తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయడం, అదే రోజు తుమ్మల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కాకతాళీయమేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.