ఇండియా ఇంటికి ... టి20 ఫైనల్లో పాక్ ప్రత్యర్థి ఇంగ్లాండ్
posted on Nov 10, 2022 @ 3:37PM
క్రికెట్ ప్రపంచం కలల మ్యాచ్ కల్ల అయిపోయింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థులు పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా కోరుకున్నారు. అదే జరుగుతుందని ఆ క్రికెట్ ఫీస్ట్ కు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ వేదిక ఔతుందని విశ్లేషణలు కూడా సో కాల్డ్ క్రీడా పండితులు చేసేశారు. కానీ గురువారం జరిగిన సెమీ ఫైనల్ లో కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ చేతులెత్తేసింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే ఉఫ్ మని ఊదేసింది.
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయకుండా భారత్ ను నిర్దేశించింది. హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులకే పరిమితమైంది. స్కిప్పర్ రోహిత్ శర్మ మరో సారి విఫలమయ్యాడు. ఫామ్ లోకి వచ్చాడనుకున్న రాహుల్ సైతం నిరాశ పరిచాడు.
360 డిగ్రీల బ్యాటర్ అంటూ ఆశలు పెట్టుకున్న సూర్య కుమార్ యదవ్ కూడా విఫలమవ్వడంతో భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అయితే ఆ లక్ష్యాన్నికాపాడుకోవడంలో భారత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ పది వికెట్ల ఆధిక్యతతో సెమీస్ లో భారత్ ను చిత్తు చేసి ఘనంగా ఫైనల్ కు చేరుకుంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా కేవలం 16 ఓవర్లలోనే అంటే ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
దీంతో ఫైనల్ లో ఇంగ్లాండ్.. పాకిస్థాన్ లు తలపడనున్నాయి. భారత బౌలర్లు సమష్టిగా విఫలమైన వేళ ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బట్లర్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ హేల్స్ 47 బంతుల్లో 7 సిక్స్ లు 4 ఫోర్లతో 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్16 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 160 పరుగులు చేసింది.