గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల
posted on Nov 10, 2022 6:18AM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పీడీయాక్ట్ కింద ప్రభుత్వం విధించిన ఏడాది నిర్బంధాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బుధవారం విడుదయ్యారు. ర్యాలీలు నిర్వహించరాదనీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదనీ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దనీ షరతులు విధించిన కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది.
కోర్టు షరతుల మేరకు జైలు నుంచి విడుదలైన రాజాసింగ్ మీడియాతో మాట్లాడకుండానే నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. రాజాసింగ్ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఘోషామహల్ మార్మోగింది. రాజా సింగ్ విద్వేష ప్రసంగాలతో, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ గత ఆగస్టు 25న ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచీ జైలులోనే ఉన్న రాజాసింగ్ చివరాఖరికి హైకోర్టు తీర్పుతో విడుదలయ్యారు. శ్రీరాముడి ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చానని రాజాసింగ్ అన్నారు. ఇక రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటును కూడా ఎత్తివేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు బీజేపీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.