సైకో పాలన పోతుంది.. సైకిల్ పాలన వస్తుంది.. లోకేష్
posted on Nov 10, 2022 9:19AM
జగన్ సర్కార్ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన, సైకో పాలన కొనసాగుతోందనీ, అధికార పార్టీ తప్ప ఇరత పార్టీలు సభలు సమావేశాలూ జరుపువడానికి వీల్లేదన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉన్నదని దుయ్యబట్టారు. అయితే ఈ పరిస్థితి మరెంతో కాలం సాగదనీ, ఏపీలో సైకో పాలన సాగుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
జగన్ హయాంలో రాష్ట్రంలో జేసీబీ రాజ్యం కొనసాగుతోందని, కూల్చివేతలు, విధ్వంసాలు వినా మరేం లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటంలో పర్యటించిన ఆయన జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న లోకేష్ వైసీపీ ప్రభుత్వ అధికార వాహనం జేసీబీ అని విమర్శించారు. జగన్ కు నిర్మాణం గురించి అసలు తెలియదనీ, ఆయనకు తెలిసిందల్లా ఒక్క కూల్చివేత, విధ్వంసం మాత్రమేనని దుయ్యబట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో బస్టాండ్ కూడా నిర్మించలేని జగన్ కు కూల్చే హక్కు లేదన్నారు. జగన్ రెడ్డి పెద్ద సైకో అయితే చిన్న సైకో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
ఎక్కడైనా నాయకుడికి రోడ్లు వేస్తేనో, పేదలకు ఇళ్ళు కడితేనో, ఉద్యోగాలు ఇస్తేనో ఆనందం వస్తుంది.
కానీ పెద్ద సైకో.. చిన్న సైకో లకు మాత్రం విధ్వంసంతో. పేదల ఇళ్ల కూల్చివేతలో, టిడిపి నాయకుల నిర్బంధంతో ఆనందం వస్తుందని లోకేష్ అన్నారు.
పేదల ఇళ్ళు జేసీబీతో కూల్చే వీడియోలు టివిలో చూసి ఆనందం పడే రకం ఈ పెద్ద సైకో, చిన్న సైకోలని దుయ్యబట్టారు. ప్రజా వేదిక కూల్చడం తో మొదలైన జగన్ రెడ్డి జేసీబీ పాలన, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ , సబ్బం హరి గారి ఇంటి గోడ , గీతం యూనివర్సిటీ గోడ కూల్చివేతలతో సాగుతోందన్నారు.
రోడ్డు కి అడ్డంగా గోడలు కట్టడం, ప్రతిపక్ష నాయకుల పంట తగలబెట్టడం, ప్రతిపక్ష నాయకుల ఇళ్ళు కూల్చడం వీళ్లకు ఫ్యాషన్ గా మారిపోయింది. పెద్ద సైకో జగన్ రెడ్డి మూడున్నర ఏళ్ల పాలనలో మొత్తం రాష్ట్రాన్నే కూల్చేసాడు. చిన్న సైకో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మూడున్నర ఏళ్లలో మంగళగిరి ని కూల్చేసి,
మంగళగిరిని డిస్ట్రక్షన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
పేదల ఇళ్ళు కూల్చడానికి ఎమ్మెల్యే ఆర్కే ఏకంగా సొంతంగా జేసీబీనే కొన్నారన్నారు.
ఇప్పటం లో జరిగింది మరీ అన్యాయమనీ, కేవలం రాజకీయ కక్షతోనే ఇక్కడ ఇళ్ళు కూల్చేసారనీ, రోడ్డు మీద గుంతలు పూడ్చలేని చెత్త ప్రభుత్వం రోడ్డు విస్తరణ అంటూ ఇళ్ళు కొట్టేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత చెత్త రోడ్లు ఉన్నది ఏపీలోనే...ఒక్క గుంత పూడ్చలేదు...ఒక్క కొత్త రోడ్డు వెయ్యలేదు. కానీ ఇప్పటంలో రోడ్డు విస్తరణ చేస్తామంటూ ఇళ్ళు కూల్చేసారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ అంటే కనీసం వైసీపీ వాళ్లైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.
ఇప్పటం ఒక చిన్న గ్రామం...ఊరి బయట కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరి రోడ్డుని 120 అడుగులు వెడల్పు చెయ్యడానికి కారణం కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రోడ్డు విస్తరణ ఇప్పటంలోనే ఎందుకు అని ప్రశ్నించారు. జనసేన సభకి భూములు ఇవ్వడం తప్పా? వైసిపి తప్ప ఇతర పార్టీలు సభలు నిర్వహించుకోకూడదా? అని నిలదీశారు. జనసేన సభకి భూములు ఇచ్చారని, పోయిన ఎన్నికల్లో ఈ గ్రామంలో టిడిపి కి మెజారిటీ వచ్చిందనే కోపంతోనే ఇళ్లను కూల్చేసారని ఆరోపించారు.