బాణసంచా గోడౌన్ లో పేలుడు.. నలుగురు సజీవదహనం
posted on Nov 10, 2022 @ 10:14PM
బాణ సంచా గోడౌన్ లో గురువారం (నవంబర్ 10)సాయంత్రం సంభవించిన భారీ పేలుడులో కనీసం నలుగురు మరణించారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
తాడేపల్లి గూడెం సమీపంలోని కడియుద్ద వద్ద ఈ దారుణ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం గోడౌన్ మంటల్లో చిక్కుకుంది.
ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని తాడేపల్లి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దాలు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బాణసంచా గోడౌన్ ఊరికి దూరంగా ఉండటంతో ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమైందని చెబుతున్నారు.
తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, డీఐజీ పాల్ రాజ్ సందర్శించారు.