టి20వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్? ఇంగ్లాండ్ అడ్డంకిని టీమ్ ఇండియా దాటేస్తుందా?
posted on Nov 10, 2022 @ 11:43AM
ప్రపంచ క్రికెట్ మొత్తం ఎదురు చూస్తున్న కలల మ్యాచ్ ఏదైనా ఉందంటే అది టి20 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచే. అయితే ఆ కలల మ్యాచ్ జరగాలంటే గురువారం (నవంబర్10) ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్ లో ఇండియా గెలిచి తీరాలి. ఇప్పటికే పాకిస్థాన్ టి20 వరల్డ్ కప్ ఫైనల్ బెర్త్ ను రిజర్వ చేసేసుకుంది.
బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సాధికారక విజయం సాధించిన ఆ జట్లు ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ లో విజయం సాధించిన జట్టుతో ఫైనల్ లో తలపడుతుంది. ఒక వేళ ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించి ఫైనల్ లో పాకిస్థాన్ తో తలపడటమంటూ జరిగితే.. ఈ మ్యాచ్ వీక్షకుల సంఖ్య ఆకాశమే హద్దుగా పెరిగిపోతుంది. అలాగే స్పాన్సర్లకు పెద్ద ఫీస్ట్ గా మారిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకే కాదు... క్రికెట్ పై అంతగా ఆసక్తి లేని జనాలు కూడా ఆ మ్యాచ్ ఫలితంపై ఆసక్తి చూపుతారు. అసలు గ్రూప్ స్థాయిలో ఈ రెండు జట్ల మధ్యా జరిగిన మ్యాచ్ కే వీక్షకుల సంఖ్య రికార్డులను తిరగరాసింది. అటువంటిది ఈ రెండు జట్లూ ఫైనల్ లో తలపడ్డాయంటే ఆ మజాయే వేరబ్బా అన్నట్లుంటుంది.
అయితే ఈ రెండు జట్ల మధ్యా ఫైనల్ వద్దే వద్దు అనుకుంటున్న జట్లు రెండు ఉన్నాయి. అవేమిటంటే సెమీస్ లో భారత్ తో తలపడనున్న ఇంగ్లాండ్ జట్టు ఒకటైతే... భారత్ తో ఫైనల్ లో తలపడటం ఇసుమంతైనా ఇష్టం లేని పాకిస్థాన్ జట్టు. ఈ రెండు జట్ల కెప్టెన్లూ ఇప్పటికే ఆ విషయాన్ని ట్వీట్ల ద్వారా వెల్లడించేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ ను పాకిస్థాన్ తో ఫైనల్ ఆడనీయం అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ ట్వీట్ చేస్తే ఇంగ్లాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తాము భారత్ ఓటమినే కోరుకుంటున్నామని పాక్ కెప్టెన్ ట్వీట్ చేశారు. ఇక ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లైతే.. ప్లీజ్ కోహ్లీ సెమీ ఫైనల్ మ్యాచ్ కి సెలవు పెట్టవా అంటూ అభ్యర్థిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ తో భారత్ సెమీస్ లో అడిలైడ్ మైదానంలో తలపడనుంది. ఇప్పటికే ఈ టి20 ప్రపంచకప్ టోర్నీలో ఇదే మైదానంలో భారత్ రెండు మ్యాచ్ లు ఆడేసింది. ఈ టోర్నీలో అడిలైడ్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ కు ఇండియాతో తలపడపోయే మ్యాచ్ తొలి మ్యాచ్ అవుతుంది. దీంతో మైదానం, వాతావరణం, పిచ్ పరిస్థితుల విషయంలో ఇంగ్లాండ్ కంటే భారత్ కే ఎక్కువ అవగాహన ఉంటుంది.
ఇది కచ్చితంగా టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశమే. అలాగే టోర్నీలో ఇరు జట్లూ సెమీస్ వరకూ వచ్చిన తీరు చూస్తే.. టీమ్ ఇండియా ఒకే ఒక్క పరాజయంతో దర్జాగా సెమీఫైనల్ కు చేరుకుంది. అదే ఇంగ్లాండ్ అయితే ఆపసోపాలు పడుతూ సెమీస్ కు వచ్చింది. అన్నిటికీ మించి ఇంగ్లాండ్ జట్లు అత్యంత బలమైన జట్టుగా పేపర్ మీద కనిపిస్తోందే తప్ప ఆ స్థాయి ఆట మైదానంలో కనబడరచడం లేదు. ఇక టీమ్ ఇండియా విషయానికి వస్తే కింగ్ కోహ్లీ అద్భుత ఫామ్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, సరైన సమయంలో ఫామ్ దొరకబుచ్చుకున్న రాహుల్ లకు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లయ దొరకబుచ్చుకుంటే.. ఇక భారత్ అజేయ జట్టే అవుతుంది.
బౌలింగ్ లో కూడా అర్షదీప్ సింగ్, భువనేశ్వర్, షమీలు సమష్టిగా రాణిస్తుండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశం. ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ పేపర్ టైగర్ లా కనిపిస్తోందే.. కానీ ఈ వరల్డ్ కప్ లో ఆ జట్లు స్టార్ బౌలర్లెవరూ అనుకున్న స్థాయిలో రాణించలేదు. పైగా గాయాలు ఆ జట్లుకు ప్రతికూలాంశంగా మారాయి. ఫైనల్ ఎలెవెన్ లో ఆ జట్టులో ఎవరెవరన్నది మ్యాచ్ ముందు వరకూ సస్పెన్సే.