మహిళా ఓటర్లే అధికం.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన
posted on Nov 10, 2022 @ 9:53AM
ఆంధ్రప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ (సీఈవో)ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. బుధవార (నవంబరు 9) నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు, 1,97,15,614 మంది పురుష ఓటర్లు, 68,115 సర్వీసు ఓటర్లు, 3,858 ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని సీఈవో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా పేర్కొంది.
18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉన్నట్లు వెల్లడించారు. నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో జాబితా నుంచి తొలగించినట్టు చెప్పారు. 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి డిలీట్ చేశామని సీఈవో వెల్లడించారు. గత ఏడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈసారి 8,82,366 మంది ఓటర్లు తగ్గారని పేర్కొన్నారు.
ఓటరు కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదని సీఈవో స్పష్టం చేశారు. అయితే, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తయిందన్నారు. ఓటరు నమోదు కోసం వాలంటీర్ల సేవలను వాడుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.
ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై 19వ తేదీ వరకు విచారణ చేపడతామని తెలిపారు. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి నిరాశ్రయులకు ఓటరు కార్డు ఇవ్వాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఎలాంటి గుర్తింపూ లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని ప్రకటించారు