మరో వివాదంలో బోండా... బాబు వార్నింగ్‌తో తోకముడిచిన ఉమా..!

  కేబినెట్‌‌లో స్థానం దక్కకపోవడంతో, కాపుల గొంతు కోశారంటూ పార్టీ అధినేతనే బ్లాక్‌ చేయడానికి ప్రయత్నించి, చంద్రబాబు వార్నింగ్‌తో తోక ముడిచిన బోండా ఉమా... మరో వివాదంలో తలదూర్చినట్లు తెలుస్తోంది. నోటి దురుసు, అధికారులపై దాడి, గూండాయిజం, భూకబ్జాలతో బోండా ఉమా చెలరేగిపోతుంటే, మరోవైపు బోండా కొడుకులు, బంధువర్గం, అనుచరులు కూడా భూకబ్జాలు, రౌడీయిజానికి పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.   2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే విజయవాడలో విలువైన భూములపై కన్నేసిన బోండా ఉమా.... ఇప్పుడు తాజాగా సింగ్‌నగర్, ఇందిరానాయక్ నగర్లో బొండా ఉమా సోదరుడు, అనుచరులు ఓ భూమి కబ్జాకి ప్రయత్నిస్తున్నారట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఇందిరానాయక్ నగర్ లో 16 ఏళ్ల క్రితం కొనుగోలు చేసుకున్న తమ స్థలాలను, బోండా బంధువులు, అనుచరులు కబ్జా చేసేందుకు బెదిరింపు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ బాధితులు... బెజవాడ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ప్రహరీ గోడలను, ఇళ్లను కూల్చేస్తున్నారని, ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.   బోండా చుట్టూ వివాదాలు చేరటం కాదు, వివాదాలున్న చోటే బోండా వాలిపోతారనే టాక్‌ ఉంది. గతంలోనూ విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ కళ్యాణ మంటపం విషయంలో బొండా ఉమా జోక్యం చేసుకోవడంతో వివాదం చెలరేగింది. అలాగే అజిత్ సింగ్‌నగర్‌లో కార్పొరేషన్ భూములను అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడంతో రచ్చ జరిగింది. అలాగే బోండా పెద్దకొడుకు సిద్ధూ కారు రేసింగులతో ఒకరు చనిపోతే, ఆ కేసును కూడా తారుమారుచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు విజయవాడ నడిబొడ్డున బైక్‌ ర్యాలీతో బోండా కొడుకులు అరాచకం సృష్టిస్తున్నారనే, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదులు కూడా అందాయి.   మంత్రి పదవి ఇవ్వలేదని, నోటికొచ్చినట్లు మాట్లాడిన బోండా ఉమాను.... ఇవే అంశాలను ప్రస్తావించి చంద్రబాబు వార్నింగ్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. నీ చిట్టా నా దగ్గర ఉంది... నకరాలు చేస్తే తాటా తీస్తా బిడ్డా అని అధినేత హెచ్చరించడంతోనే బోండా తోకముడిచినట్లు చెబుతున్నారు. బోండా అవినీతి  కార్య‌క‌లాపాల ఫైల్‌ను అతని ముందుపెట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బోండా చేసిన పలు భూకబ్జాలను కూడా చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. తన అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టడంతోనే బోండా తోకముడిచి సైలెంటైపోయాడని, అందుకే బాబుతో భేటీ తర్వాత అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని, ఆయన మాటనే శాసనంగా పాటిస్తానని బోండా చెప్పాడని గుసగుసలాడుకుంటున్నారు.

కుల సమీకరణలకే పెద్దపీట వేసిన చంద్రబాబు

  మిషన్ 2019 టార్గెట్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీమ్‌ను ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా కులం, ప్రాంతం... ఇలా అనేక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నారు. కాపు సామాజిక వర్గంతో సమానంగా రెడ్లకు పెద్దపీట వేశారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి ఐదుగురు మంత్రులుగా ఉన్నారు. అయితే అత్యధికంగా 8మంది బీసీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.   సీఎం చంద్రబాబు మినహా కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్, దేవినేని ఉమా, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌ ఉన్నారు. ఇక బలమైన బలమైన కాపు సామాజికవర్గానికి కాస్త సంఖ్య తగ్గించినట్లు కనిపించినా, చినరాజప్ప, గంటా శ్రీనివాస్, నారాయణ, మాణిక్యాలరావులు కేబినెట్‌లో కొనసాగుతున్నారు.   అలాగే రెడ్డి ఓటర్లను కూడా ఆకర్షించేందుకు బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందులో భాగంగానే నలుగురికి కేబినెట్‌లో చోటు దక్కింది. ఇందులో పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు... ఆదినారాయణ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియారెడ్డికి బెర్తులు దక్కాయి. అదేవిధంగా 8మంది బీసీలకు మంత్రి పదవులు కట్టబెట్టారు చంద్రబాబు. ఇక వైశ్య, వెలమ సామాజిక వర్గాలకు చెందిన శిద్దా రాఘవరావు, సుజయకృష్ణ రంగారావులు మంత్రులుగా ఉన్నారు. అయితే గత మంత్రివర్గంలోనూ... ప్రస్తుత మంత్రివర్గంలోనూ మైనార్టీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు.   గత ఎన్నికల్లో రెడ్డి, ఎస్సీ, మైనార్టీ, క్రిస్టియన్స్.... వైసీపీకి అండగా నిలిచారనే అంచనాలు ఉండటంతో, ఆ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

కాల్వ ఎంట్రీతో అనంతలో మారిపోయిన సమీకరణలు..

టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో.. మంత్రివర్గ విస్తరణ రాజకీయ సమీకరణలను, ప్రాధాన్యతలను మార్చేసింది. మూడేళ్లుగా మంత్రిగా కొనసాగిన పల్లె రఘునాథరెడ్డి పదవి కోల్పోవడం... చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మినిస్టర్ అవటంతో.. ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. మంత్రిగా పరిటాల సునీత కంటిన్యూ అవుతున్నా.. శాఖ మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దాంతో కాల్వ శ్రీనివాసులు.... ఇకపై జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారతారనే టాక్‌ వినిపిస్తోంది.   అయితే కేబినెట్‌లో బెర్త్ కోసం.. చివరిదాకా ప్రయత్నించిన బీకే పార్థసారథి, చాంద్ బాషా, పయ్యావులకు నిరాశే మిగిలింది. బీసీ కోటాలో బీకే పార్థసారథి, మైనారిటీ కోటాలో చాంద్ బాషా మంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించారు. కానీ.. కాల్వ శ్రీనివాసులుకు కేబినెట్ బెర్త్ దక్కటంతో.. మిగిలిన వారంతా ఆవేదనకు గురయ్యారు.   మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. పల్లె రఘనాథరెడ్డి మంత్రి పదవి కోల్పోయారు. పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లె.. ఐదు శాఖలకు మంత్రిగా పనిచేశారు. మూడేళ్లుగా మినిస్టర్‌గా ఉండి జిల్లాకు గానీ.. నియోజకవర్గానికి గానీ.. పల్లె చేసిందేమీ లేదన్న విమర్శలూ ఉన్నాయి. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు పెంచి పోషించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా.. మంత్రి పదవి కోల్పోయిన పల్లెకు.. చీఫ్ విప్ పదవి దక్కడం కాస్త ఊరటనిచ్చే విషయం.   ఇక మంత్రిగా పదవి నిలుపుకున్న పరిటాల సునీత.. శాఖ మారొచ్చన్న ప్రచారమైతే జరుగుతోంది. కేబినెట్ విస్తరణకు ముందు.. పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగినా.. పదవి నిలుపుకోవటంతో.. అభిమానులు, కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. అనంతలో ముందు నుంచి రెండు మంత్రి పదవులు, చీఫ్ విప్ పదవి ఉన్నాయి. ఈసారి కూడా అవే పదవులు జిల్లాను వరించినా.. వ్యక్తులు మాత్రం మారారు. కొత్త మంత్రులతో.. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

అసలు ఏఏ జిల్లా నుంచి ఎంతమంది, ఎవరెవరు మంత్రులు?

ఆంధ్రప్రదేశ్‌లో ఫుల్‌ కేబినెట్‌ కొలువుదీరింది. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 26మందికి అవకాశం ఉండగా, తాజా విస్తరణతో ఫుల్‌ ప్లెజ్జెడ్‌‌గా కేబినెట్‌ రీలోడైంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా టీమ్‌‌ను ఎంపిక చేసుకున్న చంద్రబాబునాయుడు... కీలకమైన జిల్లాలకు పెద్దపీట వేశారు. ముఖ‌్యంగా పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి ముగ్గురేసి చొప్పున మంత్రి పదవులు కట్టబెట్టారు. కృష్ణాజిల్లా నుంచి దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌ మంత్రులుగా ఉండగా, విస్తరణలో కొత్తగా ఎవరికి ఛాన్స్‌ దక్కలేదు. ఇక పశ్చిమగోదావరిలో ఇప్పటికే మాణిక్యాలరావు మంత్రిగా ఉండగా, కొత్తగా కేఎస్‌ జవహర్‌ పితాని సత్యనారాయణకి అవకాశం కల్పించారు.   ముఖ‌్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండగా, కొత్తగా నారా లోకేష్‌, అమర్‌నాథ్‌రెడ్డిలు కేబినెట్‌లో చేరారు, ఇక అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా నుంచి కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ, కడప జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి మంత్రులుగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పటికే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా, కొత్తగా కళా వెంకట్రావుకి...  అలాగే విజయనగరం జిల్లా నుంచి సుజయకృష్ణ రంగారావుకి కేబినెట్‌లో చోటు దక్కింది. ఇక విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, తూర్పుగోదావరి నుంచి యనమల, చినరాజప్ప మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు..... నెల్లూరు జిల్లా నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... ప్రకాశం జిల్లా సిద్ధా రాఘవరావు... కేబినెట్‌లో ఉన్నారు.   మొత్తానికి 2019 ఎన్నికలే టార్గెట్‌గా ఏపీ కేబినెట్‌ను ఫుల్‌ ప్లెజ్జెడ్‌‌గా నింపేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాంతం, కులం, బలం... ఇలా అన్ని సమీకరణలను కౌంట్‌లోకి తీసుకున్న బాబు.... వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీమ్‌‌ ఎంచుకున్నారు.

లేడీ పొలిటీషన్స్ కోసం… యాంటీ రోమియో స్క్వాడ్ అవసరమా?

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైంది అక్రమ గోవధ శాలల మూసివేత. దాని తరువాత న్యూస్ లో బాగా వినిపించింది, కనిపించింది యాంటీ రోమియో స్క్వాడ్! ఈ స్క్వాడ్స్ అమ్మాయిలు, మహిళల్ని వేదించే ఈవ్ టీజర్ల తాట తీస్తున్నాయి. పోకిరీల్ని గజగజలాడిస్తున్నాయి. అయితే, యోగీజీ పార్టీకి చెందిన సీనియర్ నేతే ఇప్పుడు తలవంపులు తీసుకొచ్చారు. బీహార్ కు చెందిన ఆ బీజేపి నేత… ఇక ముందు చట్ట సభల్లో కూడా యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తే బావుంటుందోమో అనిపించేలా ప్రవర్తించాడు! అదీ తోటీ లేడీ ఎమ్మెల్సీతో…   బీహార్ బీజేపికి ఉపాధ్యక్షుడిగా వుండేవాడు లాల్ బాబూ ప్రసాద్! అయితే, ఈయన గారు గత బుధ వారం వున్నట్టుండీ నూతన్ సింగ్ అనే లేడీ ఎమ్మెల్సీని అసెంబ్లీ, కౌన్సిల్ రెండూ వుండే ప్రాంగణంలోనే వేధించాడు! హోదాలోనూ , వయస్సులోనూ పెద్దవాడే అయినా వంకర బుద్ది పోనిచ్చుకోలేదు. ఎవరూ చూడకుండా లోక్ జనశక్తి పార్టీకి చెందిన నూతన్ సింగ్ అనే మహిళా ఎమ్మెల్సీని లైంగికంగా ఇబ్బంది పెట్టాడు!   తనని వేధించిన లాల్ బాబూ ప్రసాద్ గురించి సదరు ఎమ్మెల్సీ భర్తకు కంప్లైంట్ చేసింది! ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… లేడీ ఎమ్మెల్సీ భర్త బీజేపికే చెందిన ఎమ్మెల్యే, నీరజ్ కుమార్ సింగ్! ఆయనకి ఒళ్లు మండిపోవటంతో లాల్ బాబూ ప్రసాద్ వద్దకి వెళ్లి చితక్కొట్టేశాడు! కాని, గొడవ అక్కడితో ఆగలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన లాల్ బాబూ గురించి కంప్లైంట్ బీహార్ శాసన మండలి చైర్ పర్సన్ నారాయణ్ సింగ్ వద్దకి వెళ్లింది. సాటి ఎమ్మెల్సీని లైంగికంగా వేధించటంపై అందరూ సీరియస్ అయ్యారు. నైతిక విలువల కమిటీ విచారణ జరుపుతోంది!   బీజేపి పార్టీ ఈ రోమియో ఎమ్మెల్సీని అర్జెంట్ గా పార్టీ నుంచి బహిష్కరించేసింది! ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. కాకపోతే, ఎన్ని చేసినా… అసలు ఇలాంటి నేతలు చట్ట సభల్లో వుంటే కాలేజీలు, హాస్టల్స్ ముందు పోకిరిలు బుద్ధిగా వుండమంటే ఎలా వుంటారు? ఆ మధ్య ఇదే బీహార్లో ఓ కాంగ్రెస్ ముసలాయన నగ్మ మీద స్వేచ్ఛగా చేయి వేసి చీవాట్లు తిన్నాడు. కేరళలో అయితే శ్వేత మీనన్ అనే నటిని మరో నాయకుడు పబ్లిగ్గా ఇబ్బంది పెట్టాడు! ఇలా చెబుతూ పోతే అన్ని పార్టీల్లోంచి పొలిటికల్ రోమియోలు బోలెడు మంది బయటకొచ్చేస్తారు! వీర్ని కంట్రోల్ చేయటానికి కూడా ఓ యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేస్తే బావుంటుందేమో!

సంవత్సరానికి 2 పిచ్చోళ్ల దినాలు… ఎవరి ‘పిచ్చి’ వారికానందం!

ఏప్రిల్ ఒకటి అంటే కొత్త ఆర్దిక సంవత్సరం మొదలయ్యే రోజు! కాని, దాని గురించి కంటే ఎక్కువ మందికి తెలిసింది ఫూల్స్ డేనే! ప్రపంచ వ్యాప్తంగా ఏప్రెల్ ఒకటిని ఫూల్స్ డేగా జరుపుకుంటారు. ఇండియాలో కూడా జనాన్ని పిచ్చోళ్లని చేయటానికి చాలా మంది ట్రై చేస్తుంటారు! కొన్ని సార్లు ప్రయత్నం బెడిసికొట్టి జోక్ మొదలు పెట్టిన వాడే ఫూల్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు!   ఫూల్స్ డే జరుపుకోవటం పక్కన పెడితే…. దీని వెనుక వున్న కథ భలే ఆసక్తికరంగా వుంటుంది! 15వ శతాబ్దంలో పోప్ గ్రెగోరీ యూరోపీయన్ల కొత్త సంవత్సరాన్ని ఏప్రెల్ నుంచి జనవరికి మార్చేశాడు. జనవరి ఒకటిన న్యూ ఇయర్ జరుపుకోవటం అలా మొదలైంది. అయితే, ఇప్పటిలా కమ్యూనికేషన్లు లేని ఆ సమయంలో కొందరు పాత పద్ధతిలోనే ఏప్రెల్ ఒకటిన కొత్త సంవత్సరం జరుపుకునేవారట! వాళ్లని ఫూల్స్ అనటంతో ఈ ఫూల్స్ డే మొదలైందంటారు!   బ్రిటీషర్స్ మన దేశంలోకి వచ్చాక కూడా ఇక్కడ ఏప్రెల్ లో వచ్చే ఉగాది పండగనాడు కొత్త సంవత్సరం జరుపుకోవటం చూసి… వాళ్లు మనల్ని ఫూల్స్ అనుకున్నారని అంటారు! ఇందులో నిజం ఎంతో తెలియదుగాని… మార్చ్ , ఏప్రెల్ నెలల్లో వసంతం వస్తుంది. అప్పుడు ప్రకృతిలో అందమైన మార్పులు తొంగిచూస్తాయి. అందుకే, వేల ఏళ్లుగా వేసవి ప్రారంభంలో కొత్త సంవత్సరం జరుపుకోవటం అనవాయితీ! అది పట్టించుకోకుండా యూరోపియన్లు జనవరికి కొత్త సంవత్సరాన్ని మార్చేసుకుని… అలా చేయని వారినందర్నీ ఫూల్స్ అనటం… నిజంగా ఫూలిష్ నెస్సే! అయినా… ఫూలే తాను తప్ప మిగతా వారు ఫూల్స్ అనుకుంటాడు కదా… ఇదీ అంతే!   ఏప్రెల్ ఫస్ట్ న వచ్చే ఈ ఫూల్స్ డే కాకుండా మరో పిచ్చోళ్ల దినం కూడా వుంది! స్పెయిన్, లాటిన్ అమెరికా దేశాల్లో డిసెంబర్ 28న ఫూల్స్ డేనట! ఆ రోజున బైబిల్ లో చెప్పిన ఓ రాజు అమాయక యువకుల్ని చాలా మందిని చంపించాడట! మరి అటువంటి విషాదానికి, ఫూల్స్ డేకి సంబంధం ఏంటి? ఏమో! జరుపుకునేవారికే తెలియాలి!   ఏప్రెల్ వచ్చే ఫూల్స్ డేనాడు ఊరికే జోక్స్, ప్రాంక్స్ తో సరిపెడితే… డిసెంబర్ 28న వచ్చే ఫూల్స్ డేనాడు కాస్త హంగామా ఎక్కువే వుంటుంది. స్పెయిన్ లో అయితే పిండి యుద్ధం చేస్తారు! రెండు వర్గాలుగా జనం విడిపోయి ఒకరి మీద ఒకరు పిండి చల్లకుంటూ కోడిగుడ్లు, నీళ్లు ప్రయోగించుకుంటారట! దీనికి కూడా కారణం అంటూ ఏం చెప్పలేం! ఆఫ్ట్రాల్… పిచ్చోళ్ల డే కాబ్టటి… ఎవరి పిచ్చి వారికానందం!

భారత్‌ని బెదిరించైనా… గెలవాలనుకుంటోన్న చైనా!

  ఒకప్పుడు బ్రిటన్, తరువాత అమెరికా, ఇప్పుడు చైనా… ఏంటి అంటారా? ప్రపంచంపై దాదాగిరి చేయటంలో ఈ దేశాల తరువాతే ఎవరైనా! ఒకప్పుడు పారిశ్రామిక విప్లవంతో ఇష్టానుసారం ఉత్పత్తి చేసుకుని ప్రపంచం మీద పడ్డాయి యూరోప్ దేశాలు. కొత్త మార్కెట్ల కోసం అమెరికా మొదలు ఆస్ట్రేలియా దాకా ఏ ఖండాన్ని వదల్లేదు. అయితే యూరోపియన్ దేశాల్లో బ్రిటన్ అత్యంత ఎక్కువగా ప్రపంచాన్ని ఆక్రమించుకుని దోచుకుంది. తరువాత ఆ స్థానంలోకి వచ్చిన అమెరికా మరో పద్ధతిలో దేశాల్ని దోచుకుంటోంది. బ్రిటన్ లాగా ఆక్రమించుకోవటం ఆమెరికా వ్యూహం కాదు. ఏ దేశానికి ఏం బలహీనత వుందో కనిపెట్టి దెబ్బ కొడుతుంది. అరబ్ దేశాల నడుమ యుద్ధాలు పెడుతుంది. అదే భారత్ లాంటి దేశమైతే ఇక్కడి మార్కెట్ ను మన పాలకుల సాయంతో గుప్పిట్లో పెట్టుకుని లాభాలు ఆర్జిస్తుంది. ఇక పాకిస్తాన్ లాంటి దేశాల్ని అయితే పావుల్లా వాడుకుని ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తుంది!   బ్రిటన్, అమెరికా చేసిన పనులన్నీ ఇప్పుడు చైనా చేయాలిన ఉవ్విళ్లూరుతోంది. విపరీతమైన జనాభ, విపరీతమైన కమ్యూనిస్టు ఆంక్షలు, ఫలితంగా అమాంతం వచ్చిపడ్డ విపరీతమైన ఆర్దిక, సైనిక శక్తిని చూసుకుని డ్రాగన్ రెచ్చిపోతోంది. ఎంతగా అంటే ఇండియా, జపాన్ లాంటి దేశాల్ని కూడా తన కను సైగలతో గడగడలాడించాలని కోరుకుంటోంది. అది వీలు కానప్పుడల్లా గూండాగిరికి దిగుతుంటుంది!   ఇండియా మీద చైనాకి ఎప్పుడూ పగ, అనుమానాలే! అందుక్కారణం ఆసియాలో చైనా ఆధిపత్యానికి గండికొట్టగలిగేది కేవలం ఇండియానే. ఇప్పుడైతే ఇండియా, చైనా ప్రపంచం గతినే నిర్దేశిస్తున్నాయి. అందుకే తనకు ఆర్దికంగా, ఆర్మీ పరంగా కూడా పోటీ అయిన ఇండియా అంటే చైనాకు చిరచిర. అందుకే, పాక్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను బెదిరించాలని పదే పదే ప్రయత్నిస్తుంటుంది. తాజాగా దలైలామ అంశంలో బీజింగ్ విపరీతమైన అసహనానికి లోనవుతోంది!   ఇండయాలో భాగంగా వుంటూ ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగే భారతీయ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అక్కడ బీజేపి సీఎం వున్నారు ప్రస్తుతం. కాని, చైనా తన తోక వంకర బుద్దిని ఎప్పట్నుంచో ప్రదర్శిస్తూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తన భూభాగమని అడ్డంగా వాదిస్తుంటుంది! అందుకే, ఇప్పుడు దలైలామా త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తారంటే అగ్గి మీద గుగ్గిలం అయిపోతోంది! దలైలామా అరుణాచల్ రావటానికి వీలు లేదని పదేపదే వారెంట్లు ఇస్తోంది!   మన దేశంలోని మన రాష్ట్రంలో దలైలామా ఎక్కడ పర్యటిస్తే చైనాకెందుకు ? ఈ అనుమానం రావటం సహజమే!కాని, చైనాకు దలైలామాకు వున్న శత్రుత్వం టిబెల్ కారణంగా. ఆ దేశాన్ని బలవంతంగా ఆక్రమించిన చైనా అక్కడ మానవహక్కులు కాలరాస్తోంది. దానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న దలైలామా టిబెటన్ల గురువు, పాలకుడు కూడా! ఆయనకి ఆశ్రయం ఇవ్వటమే చైనాకు మన మీద కోపానికి కారణం. ఇప్పుడిక టిబెట్ బార్డర్ లో వున్న అరుణాచల్ కు కూడా ఆయన రావటం డ్రాగన్ కు మంటగా వుంది.   ఇండియానే కాదు… దక్షిణా చైనా సముద్రంలో చైనా ఆధిపత్య వైఖరితో జపాన్, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు కూడా గుర్రుగా వున్నాయి. అందుకే, అమెరికా, ఇండియాతో కలిసి చైనా వ్యతిరేక దేశాలన్నిట్ని జట్టు కడుతోంది. ఫలితంగా చైనా పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. అందుకే, పాక్ కి సాయం చేస్తూ పీఓకేలో భారీ నిర్మాణాలు కొనసాగిస్తోంది చైనా. ఇదంతా ఇండియా మీద ఒత్తిడి తెచ్చేందుకే! అయితే, ప్రపంచాన్ని శాసించాలన్న చైనా ఆదుర్ధా ముందు ముందు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మరీ ముఖ్యంగా, ఇండియాతో యుద్ధం దిశగా పయనిస్తే అది డ్రాగన్ కి భారీ నష్టం మిగులుస్తుంది. ఇండియాకి కూడా అలాంటి ఫలితమే వుంటుంది. అందుకే, ప్రస్తుతానికి రెండు దేశాలు మాటలతోనే సరిపెడుతున్నాయి. కాని, చైనా, పాక్ ప్రవర్తనతో భవిష్యత్ లో ఏమైనా జరగవచ్చు!

రెండో పెళ్లి… ఒక్క రోజు కాపురం… పోస్టులో విడాకులు!

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపి భారీ విజయం సాధించింది. అందుకు ఎప్పటిలాగా హిందూ ఓటు బ్యాంక్ కాకుండా ఈసారి ముస్లిమ్ లు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది! అది నిజమా? స్పష్టంగా చెప్పలేం. కాని, దాదాపు ఇరవై శాతం ముస్లిమ్ లు వున్న యూపీలో వాళ్ల సపోర్ట్ ఏ మాత్రం లేకుండా 320కిపైగా సీట్లు సాధించటం కష్టమే! ఇంతకీ ఒకవేళ నిజమే అయితే… ఎప్పుడూ ద్వేషించే బీజేపికి ఈసారి ముస్లిమ్ లు ఎందుకు ఓటు వేసి వుంటారు? మరీ ముఖ్యంగా, ముస్లిమ్ మహిళలు ఎందుకు కమలాన్ని ఎంచుకుని వుండవచ్చు?   బీజేపికి ముస్లిమ్ మహిళలు కూడా ఓటు వేయటానికి కారణం అర్థం కావాలంటే …. హైద్రాబాద్ లో జరిగిన ఒక దారుణం ముందు మనం తెలుసుకోవాలి! మహ్మద్ హనీఫ్ అనే కూకట్ పల్లి వాసి బహదూరున్నీసాను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు కూతుళ్లు. అయితే పదే పదే బహదూరున్నీసాకు గర్భస్రావాలు జరగటంతో పిల్లలు పుట్టారని చెప్పేశారు డాక్టర్స్. మరి కొడుకు కావాలనే కోరిక మహ్మద్ హనీఫ్ కు తీరేదెట్లా? అందు కోసం భార్య బహదూరున్నీసాను ఒప్పించాడు. రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. పాతబస్తీలోని ఫర్హీన్ బేగం అనే యువతిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు! కాని, పెళ్లి రోజు ఖాజీకి తన మొదటి భార్య బహదురున్నీసా నుంచి విడాకులు తీసుకున్నట్టు లేఖ మాత్రం చూపించలేదు!   ఫర్హీన్ బేగమ్ ను పెళ్లాడిన హనీఫ్ ఒకే ఒక్క రోజు కాపురం చేసి మరునాడు మొదటి భార్య వద్దకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లు ఆరోగ్యం బాగా లేదని ఫర్హీన్ కు చెప్పిన ఆయన వున్నట్టుండీ పోస్ట్ లో తలాఖ్ పత్రాన్ని పంపించాడు! ఆరోగ్యం బాగా లేని కారణంగా విడాకులు ఇస్తున్నట్టు ఫర్హీన్ కు హనీఫ్ చెప్పేశాడు! బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు అరెస్ట్ చేశారు!   హైద్రాబాద్ లో జరిగిన మహ్మద్ హనీఫ్ వ్యవహారం ఎన్నో తలాఖ్ కేసుల్లో అత్యంత తాజా కేసు మాత్రమే! పోస్టులో, వాట్సప్ లో, ఫేస్బుక్ లో, మెయిల్ లో కూడా తలాఖ్ లు చెప్పేయటంతో ఎందరో ముస్లిమ్ మహిళల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. ఇదే యూపీలోని చాలా మంది స్త్రీలు బీజేపికి ఓటు వేయటానికి కారణమైందంటున్నారు విశ్లేషకులు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తలాఖ్ బాధిత మహిళలున్నారు. కాని, ఎక్కడా వారికి రాజకీయ పార్టీల భరోసా లభించటం లేదు. ముస్లిమ్ ఓటు బ్యాంక్ కోసం జాగ్రత్తపడుతోన్న చాలా పార్టీలు తలాఖ్ దారుణాలపై మాట్లాడటం లేదు. కాని, బీజేపి యూపీ ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కూడా హామీ ఇచ్చేసింది. అదే కమలానికి బాగా వర్కువుట్ అయిందంటున్నారు!   ప్రస్తుతం సుప్రీమ్ లో తలాఖ్ కేసుల విషయంలో విచారణ నడుస్తోంది. ఈ మధ్యే రాజ్యాంగ ధర్మాసనానికి చేరింది తలాఖ్ అంశం. ముందు ముందు దీనిపై కీలక తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా కోర్టుల వల్లనో, బీజేపి రాజకీయ చొరవ వల్లనో తలాఖ్ రద్దుకు మార్గం సుగమం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ముస్లిమ్ లలో కూడా హిందువులు, క్రిస్టియన్ల మాదిరిగా విడాకులు కోర్టుల పరిధిలో చట్టబద్ధంగా జరగాలని వారి వాదన. ఇందులో మతం కూడా ముడిపడి వున్నప్పటకీ… లక్షలాది మంది మహిళల జీవితాలకి సంబంధించిన విషయమన్నది అందరూ గుర్తించాలి! 

ఆయేషా కేసులో సత్యం వధ-సత్యం వ్యథ... డివిజన్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు

  వంద దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు, కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదన్నది న్యాయసూత్రం. కానీ ఆయేషాలో నిర్దోషిగా బయటపడిన సత్యంబాబు ఎనిమిదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. పోలీసులు చేసిన తప్పులకు పక్షవాతం బారినపడి జీవశ్చవంలా మారాడు. మరి దీనికి సమాధానం ఎవరు చెబుతారు? తమ కూతురి హత్యతో సత్యంబాబుకి సంబంధం లేదని ఆయేషా తల్లిదండ్రులు మొత్తుకున్నా పట్టించుకోని పోలీసుల శిక్షించారా?  కొంతమంది అధికారులు, నాయకులు, అసలు దోషులు కలిసి... సత్యాన్ని ఇరికించారని మొర్రపెట్టుకున్నా, కనికరించని కర్కశ ఖాకీలపై చర్యలు తీసుకోరా? అసలు హైకోర్టు ఏం చెప్పింది?   తమ కూతురు ఆయేషా హంతకులను శిక్షించాలని మాత్రమే కాకుండా, సత్యంబాబుని విడుదల చేయాలంటూ ఆయేషా తల్లిదండ్రులు న్యాయపోరాటం చేశారంటే ఈ కేసులో పోలీసుల తప్పిదం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. చివరికి వాళ్ల పోరాటం ఫలించింది. అయితే సత్యాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరుపై బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దోషులను విడిచిపెట్టారు, ఆధారాల్లేకుండా అమాకుడ్ని ఎనిదేళ్లుగా జైలుపాలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఆయేషా కేసుని దర్యాప్తు చేసిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద సత్యంబాబుకి లక్ష రూపాయలు చెల్లించాలని సూచించింది.   అసలు దోషులను వదిలేసి, ఒక అమాకుడిపై అభియోగాలు మోపి, జైలుపాలు చేయడాన్ని అమానవీయమైన చర్యగా హైకోర్టు అభివర్ణించింది. సత్యంబాబు నేరం చేసినట్లు ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు చూపలేకపోయారన్న డివిజన్‌ బెంచ్‌... ఈ కేసుతో సత్యానికి ఎలాంటి సంబంధంలేదని, అకారణంగా ఇరికించారని అభిప్రాయపడింది. అసలు నేరస్థులను తప్పించడం కోసం కట్టుకథలు అల్లారని, వాటినే కింది కోర్టు విశ్వసించిందని డివిజన్ బెంచ్‌ వ్యాఖ్యానించింది. అంతేకాదు ఆయేషా తల్లి ఆరోపిస్తున్న వ్యక్తికి, కోర్టు అనుమతించినా పోలీసులు ఎందుకు నార్కో పరీక్ష నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆయేషాను చంపాక నిందితుడు ఆమె గదిలోనే కూర్చుని తాపీగా లేఖ రాసినట్లు పోలీసులు చెబుతున్న కథనం నమ్మశక్యం లేదంది. అయినా అంతసేపు నిందితుడు ఆయేషా గదిలోనే ఉంటే, అక్కడున్న 55మందిలో ఒక్కరైనా గమనించారా అంటూ సందేహం వ్యక్తంచేసింది. అంతేకాదు సరిగ్గా నడవలేని సత్యంబాబు.... 8 అడుగుల ఎత్తున్న గోడను కేవలం రోకలి పట్టుకుని ఎక్కాడంటే ఎలా నమ్మేదన్నారు. ఆ ఫీట్‌ చేయగలిగేది ఒక్క సూపర్‌మ్యానేనంటూ పోలీసులకు చురకలేసింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సరిగా వ్యవహరించలేదని, సాక్షుల వాంగ్మూలాలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయంది డివిజన్‌ బెంచ్‌.   అయితే కోర్టు ఖర్చుల కింద సత్యంబాబుకి లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు... నష్టపరిహారం కోరుతూ సర్కార్‌పై దావా వేసే అంశాన్ని అతనికే వదిలిపెడుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఓ పొలిటీషియన్‌ కుటుంబాన్ని కాపాడేందుకే సత్యంబాబుని ఇరికించారన్న వాదనలతో ఏకీభవించేందుకు తమకు అందించిన సాక్ష్యాధారాలు సరిపోవని డివిజన్‌ బెంచ్‌ తెలియజేసింది.

షోరూమ్ లు రైతు బజార్లు! టూ వీలర్స్ కూరగాయల్లా కొనేశారు!

  మార్చ్ 31… ఈ డేట్ చెప్పగానే ఆర్దిక లావాదేవీలు పెద్ద ఎత్తున చేసే వారికైతే ఇయర్ ఎండింగ్ గుర్తుకు వస్తుంది! కాని, సామాన్యులకి? ఇప్పుడైతే జియో ఫ్రీ ఆఫరే మదిలో మెదులుతోంది! ఏప్రెల్ ఒకటి నుంచీ డబ్బులు కడితేనే జియో! లేదంటే నో డేటా! కాని, ఇయర్ ఎండింగ్, జియో ఆఫర్ గురించే కాదు దేశంలో మరో విషయం కూడా కలకలం రేపుతోంది! అదే టూ వీలర్ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్ లు!   సాధారణంగా దీపావళి, దంతేరస్ లాంటి పండగలు వస్తే జనం వాహనాల షో రూంలకి క్యూలు కడతారు. కాని, ఈసారి విచిత్రంగా ఊగాది మర్నాటి నుంచీ హోండా, బజాజ్ లాంటి షో రూంలకి పరుగులు పెట్టారు! ఏ పండగా లేకున్నా కంపెనీలు వేలకు వేలు డిస్కౌంటులు ప్రకటించాయి. ఇదే అదునుగా జనం కూడా పండగ కాని రోజుల్లోనే పండగ చేసేసుకుంటున్నారు! ఇంతకీ ఈ సడన్ డిస్కౌంట్ ఆఫర్ల గోలేంటి? మీకు తెలుసుగా…   ఆటోమొబైల్ కంపెనీలకు సుప్రీమ్ కోర్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. వేల కోట్లు విలువ చేసే బీఎస్ III కేటగిరీకి చెందిన వాహనాలు ఏప్రెల్ ఒకటి తరువాత అమ్మకూడదని తీర్పునిచ్చింది. కారణం కాలుష్యమే! బీఎస్ త్రీ దశకు చెందిన టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్ అండ్ కమర్షియల్ వెహికల్స్ రోడ్లపైకి రావటానికి వీలులేదని తెగేసి చెప్పింది. అందుకే, గత రెండు రోజుల్లో సాధ్యమైనన్ని పాత వాహనాల్ని జనానికి అంటగట్టేద్దామని డిసైడ్ అయ్యాయి కంపెనీలు. ముఖ్యంగా, పెద్ద ఎత్తున బీఎస్ త్రీ టూ వీలర్స్ తయారు చేసి పెట్టిన హోండా లాంటి కంపెనీలు పది నుంచి 22వేల దాకా డిస్కౌంట్ ప్రకటించి మరీ తమ వాహనాలు అమ్మేశాయి!   యాభై, అరవై వేలకు పైనే ధర పలికే ద్విచక్ర వాహనాల్ని కూడా మన వాళ్లు ఒక రేంజ్లో కొనేశారు మంత్ అండ్ ఇయర్ ఎండింగ్ లో! అసలు వాహనాల షోరూంలు రైతు బజార్ల మాదిరిగా మారిపోయాయి. కూరగాయలు కొన్నంత ఈజీగా కొనుగోలు చేసేశారు బళ్లని! వేలకు వేలు తక్కువగా వస్తుంటే ఎవరు మాత్రం టెంప్ట్ అవ్వరు చెప్పండి? కాని, దురదృష్టవశాత్తూ చాలా మంది విషయం తెలిసి షో రూంకి వెళ్లే సరికే నో స్టాక్ బోర్డ్ లు కనిపించాయట! రేషన్ షాపుకి వెళ్లి నిరాశగా తిరిగొచ్చిన పేదోళ్ల లాగా ముఖాలు పెట్టుకున్నారు టూ వీలర్ బయ్యర్స్!   ద్విచక్ర వాహనాలు వేల సంఖ్యలో అమ్ముకున్న కంపెనీలకు పెద్ద బళ్ల విషయంలో మాత్రం నష్టం తప్పేలా లేదు. కార్లు, త్రిచక్ర వాహనాలు, లారీలు, డీఎంల వంటి కమర్షియల్ వెహికల్స్ ఈ రెండు రోజుల్లో పెద్దగా అమ్ముకోలేకపోయాయి! వాట్ని రేపట్నుంచీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మటానికి వీలు లేదు. ఇక వాట్ని బీఎస్ ఫోర్ టైపు కిందకి అప్ గ్రేడ్ చేయటమో, లేదంటే బీఎస్ త్రీ వాహనాల్ని అమ్మనిచ్చే ఇతర దేశాల మార్కెట్లకి ఎగుమతి చేయటమో చేయాలి! అంటే… లాభాల్లో కొంత కోతేనన్నమాట!   బీఎస్ త్రీ రకం వాహనాలు కాలుష్యం పెంచుతాయని సుప్రీమ్ వాట్ని బ్యాన్ చేస్తే… వీలైనన్ని ఎక్కువ కాలుష్య కారకలైన వాహనాల్ని రెండు రోజుల్లో రోడ్లపైకి తెచ్చేశాయి కంపెనీలు! జనం కూడా కాలుష్యం సంగతి తుంగలో తొక్కి డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎగబడ్డారు! మనుషులకి ఇలాంటి నిజాయితీ వుండబట్టే రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతోంది! మనషి మనస్సులో … బయట కూడాను!

ఆయన హైకోర్ట్ జడ్జ్! కాని, జైలుకి పంపమని అడుగుతున్నాడు!

  నన్ను జైలుకి పంపండి… ఇలా అన్నది ఎవరో తెలుసా? కోల్ కతా హైకోర్ట్ జడ్జుల్లో ఒకరైన సీఎస్ కర్నన్! వినటానికే ఆశ్చర్యంగా వుంది కదా? ప్రతీ రోజూ నేరస్థుల్ని జైలుకి పంపే ఒక న్యాయమూర్తే తనని జైలుకి పంపమని అడిగాడంటే సమస్య తీవ్రత ఎంతగా వుందో అర్థం చేసుకోవచ్చు! అసలు ఇంతకీ సుప్రీమ్ కోర్టు జడ్జులతో జగడానికి దిగిన కర్నర్ కి ఏమైంది? ఎందుకని ఆయన నేను ఒక్కడని ఒకటైపు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు?   సీఎస్ కర్నన్ కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తుల్లో ఒకరు. 61ఏళ్ల ఆయన చాలా సీనియర్! అయితే, గొడవంతా ఆయన ఆ మధ్య ఇష్టానుసారం ఆరోపణలు చేయటంతో వచ్చి పడింది! మన కోర్టుల్లోని టాప్ 20 జడ్జెస్ అవినీతి పరులంటూ పేరు పేరున ఆరోపణలు గుప్పించాడు! అది సీరియస్ గా తీసుకున్న సుప్రీమ్ సార్ వార్ని కోల్ కతా నుంచి ఢిల్లీ వచ్చిపొమ్మని పదే పదే చెప్పింది. కాని, విచారణకు తాను హాజరు కానని భీష్మించిన ఆయన విచిత్రంగా సుప్రీమ్ కోర్టు జడ్జీల మీదనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాడు! ఇక లాభం లేదనుకుని మార్చి 31న తప్పకుండా కోర్టుకు రావాల్సిందేనని సుప్రీమ్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కర్నన్ కి!   వారెంట్ దాకా వ్యవహారం రావటంతో సుప్రీమ్ కు వచ్చిన జస్టిస్ కర్నన్ తనదైన రీతిలో కేసు వాదించుకున్నాడు. నాలుగు వారాల తరువాత కోర్ట్ ముందుకు తగిన వివరణతో రావాలని చీఫ్ జస్టిస్ చెబితే… రానని తెగేసి చెప్పాడు. అంతే కాదు, కోల్ కతా హైకోర్ట్ జడ్జ్ గా తన బాధ్యతలు తనకు అప్పజెప్పాలనీ, లేదంటే అరెస్ట్ చేసుకోవాలని కోర్టుకే సూచించాడు! మరోసారి మాత్రం తాను కోర్టుకి రానని చెప్పేసి బయటకొచ్చాడు కర్నన్!   ఇరవై మంది న్యాయమూర్తులు అవినీతి పరులన్న కర్నన్ తాను దళితుడ్ని కాబట్టే వేధిస్తున్నారంటూ కులం కార్డ్ కూడా ప్రదర్శించాడు. ఆయన చేసిన ఆరోపణల్లో నిజం లేదని మనం చెప్పలేం కాని… నిరూపించటం సాధ్యం కాదు. అలాగని బేషరతుగా క్షమాపణ చెప్పమంటే కర్నన్ అంగీకరించటం లేదు. మొత్తం మీద సీఎస్ కర్నన్ వ్యవహారం మన న్యాయ వ్యవస్థలో వున్న అవినీతి ఆరోపణలపై అందరి దృష్టిని ఆకర్షించింది. కాని, చరిత్రలోనే తొలిసారి ఒక న్యాయమూర్తి సుప్రీమ్ లో విచారణ ఎదుర్కుంటుండటం ఈ కేస్ మరో ప్రత్యేకత! మరి అటువంటి సెన్సేషనల్ అండ్ కాంట్రవర్సియల్ కేసులో సుప్రీమ్ జడ్జులు ఎలా ముందుకు పోతారో చూడాలి!   గతంలోనూ మద్రాస్ హైకోర్ట్ నుంచి కోల్ కతా హైకోర్ట్ కు ట్రాన్స్ ఫర్ అయిన కర్నన్ … ఆ ట్రాన్స్ ఫర్ ను తనకు తానే స్టే చేసుకున్నాడు! మళ్లీ తన మానసిక ఆరోగ్యం బాగోలేక అలా చేశానని క్షమాపణలు చెప్పాడు! మరి ఈసారి చివరకు ఏం చేస్తాడో!

కాటమరాయుడు కదిరిలో కాలు దువ్వితే గెలుస్తాడా? ఓడిపోతాడా?

  వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత వన్ కల్యాణ్... కదిరి నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కదిరిని వెంటాడుతున్న కరవు, వలసలు, మహిళల అక్రమ రవాణా జనసేన అధినేత పవన్‌ను కదిలించాయి. వారి బతులకు ఓ భరోసా ఇవ్వాలనుకుంటన్న పవన్... తన పోరాటానికి, తన రాజకీయ జీవితం ఆరంభానికి కదిరినే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాటమరాయుడుకి కదిరి కలిసొస్తుందా? కదిరి నుంచి పవన్‌ పోటీ చేయడానికి ఓ లెక్కుందా? పవన్‌ కదిరి నుంచి బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచినా ఓడినా పోటీ చేయడం మాత్రం పక్కా అన్న పవన్‌... కదిరి నుంచి బరిలోకి దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇంతకీ కదిరిలో పవన్‌కు కలిసొచ్చే అంశాలేంటి? అసలు కదిరిలో పోటీచేస్తే పవన్‌ గెలుస్తాడా? లేదా?   కరవు, రైతు ఆత్మహత్యలు, సాగు, తాగు నీరు, ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా అన్ని సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమంటూ అనంతపురం జిల్లా సమస్యలపై ఏకరువు పెట్టిన పవన్... సామాజిక సమీకరణాలను మాత్రం లెక్కలోకి తీసుకున్నట్టు లేదు. కదిరిలో ముస్లిం, రెడ్డి, వడ్డెర, బలిజ ఓటర్లే ప్రధానం. ముస్లిం ఓట్లు 20 శాతం ఉంటే, రెడ్డి సామాజికవర్గం ఓట్లు దాదాపు 16 శాతం ఉన్నాయి. వీరి తర్వాత 10 శాతం ఓట్లతో వడ్డెర, 9 శాతం ఓట్లతో బలిజ సామాజిక వర్గాలున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వైసీపీ చేతిలో ఉంది. ముస్లిం వర్గానికి చెందిన చాంద్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నారు. ముస్లిం, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లన్నీ వైసీపీవే. అంతేకాదు కదిరిలో టీడీపీ బలమేమీ తక్కువ కాదు. ఆ లెక్కన తెలుగుదేశం, వైసీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉన్న చోట పవన్‌ గెలుపు సాధ్యమా? అంటే, చెప్పడం కష్టం.   జనానికి సమస్యలు ఉండొచ్చు కానీ... ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో కుల, మతాల పాత్ర తక్కువేం కాదు. అలా అని సినీ గ్లామర్ ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. అందరూ అనుకుంటున్నట్టు పవన్ కదిరి నుంచే పోటీ చేస్తే... సినీ అభిమానం, జనాన్ని పీడిస్తున్న సమస్యలే ఓట్లుగా మారాలి. ఒకవేళ కదిరివాసులను పవన్‌ అంతగా ప్రభావితం చేయగలితే... జనసేన పవనాలు పక్కనే ఉన్న కడప, చిత్తూరు జిల్లాల్లోనూ వీయడం ఖాయం.

ఏపీ పొలిటికల్‌ లీడర్స్‌లో సంగీత గుబులు... బయటికి రానున్న బడా బాబుల పేర్లు

  చూడ్డానికి హీరోయిన్‌లాగా ఉంటుంది. మంచి అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఆమె అసలు స్వరూపం తెలుసుకుంటే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే. మనమే కాదు పోలీసులు కూడా మొదట షాక్‌ తిన్నారు. ఈ అమ్మాయా... ఇంటర్నేషనల్‌ స్మగ్లరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించింది. కోర్టు సమన్లతో కోల్‌కతా వెళ్లిన పోలీసులకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. పేరు మోసిన న్యాయవాదులు పదుల సంఖ్యలో ఆమె కోసం క్యూకట్టారు. దాంతో ఆమెను అరెస్ట్ చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆ తర్వాత అనేకసార్లు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అలా దాదాపు 8నెలలపాటు ఏపీ పోలీసులను ముప్పుతిప్పలుపెట్టింది. ఇంతకీ ఈమె ఎవరునుకుంటున్నారా.... మోస్ట్‌ డేంజరస్‌ ఇంటర్నేషనల్‌ రెడ్‌శాండిల్‌ స్మగ్లర్‌ సంగీత ఛటర్జీ. కోల్‌కతాలో రెక్కీ నిర్వహించి, స్పెషల్‌ ఆపరేషన్‌తో లేడీ డాన్‌ సంగీతని ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు.   అందమైన ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగాన్ని వదిలేసి... ఎర్రదొంగలతో జతకట్టింది. బడా స్మగ్లర్‌ మార్కొండ లక్ష్మణ్‌తో పరిచయం పెంచుకుని, చివరి అతడ్నే పెళ్లి చేసుకుని, నేర సామ్రాజ్యాన్ని ఏలుతూవచ్చింది. ఒకపక్క ఎర్రచందనం స్మగ్లింగ్‌... మరోపక్క హవాలా బిజినెస్‌ చేస్తూ...వందల కోట్లు కూడబెట్టింది. అయితే లక్ష్మణ్‌ అరెస్టుతో సంగీత గుట్టురట్టయింది. సంగీత నేర సామ్రాజ్యాన్ని చూసిన పోలీసులే విస్మయానికి గురయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌, హవాలా వ్యాపారంతోపాటు నకిలీ తుపాకీ లైసెన్సుల దందా కూడా చేసిన సంగీత ఛటర్జీ వందల కోట్లు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.   అయితే సంగీత అరెస్టుతో పలువురు ఏపీ పొలిటికల్‌ లీడర్లలో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. సంగీతను నాలుగురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు... ఎవరెవరితో సంబంధాలున్నాయ్‌?... ఏ రాజకీయ నేతల అండ ఉంది?.... సహకరించిందెవరనే విషయాలపై కూపీ లాగుతున్నారు. సంగీత నోరువిప్పితే చాలామంది బడా బాబుల పేర్లు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. దాంతో సంగీతతో లింకులన్న నేతలు, బడా బాబుల గుండెల్లో గుబులు మొదలైందని, తమ పేర్లు బయటికి రాకుండా లాబీయింగ్‌ మొదలు పెట్టారని అంటున్నారు.

క్వాలిఫికేషన్ పై చంద్రబాబు జగన్ జోకులు...

  నారా చంద్రబాబునాయుడు.... వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి... ఒకరు ఏపీ ముఖ్యమంత్రి... మరొకరు ప్రతిపక్ష నేత... ఇద్దరూ కీలక నేతలే.... అయితే వీళ్లిద్దరూ అసలేం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? ఇలాంటి డౌట్‌ ఏమైనా మీకు వచ్చిందా? మీకే కాదు... చంద్రబాబు, జగన్‌కు కూడా ఒకరి క్వాలిఫికేషన్స్‌పై మరొకరికి  అనుమానాలు వచ్చాయి... అందుకే అసెంబ్లీ సాక్షిగా ఒకరిపై మరొకరు విమర్శలు, సెటైర్లు, జోకులు పేల్చుకున్నారు. నువ్వేం చదువుకున్నావ్.... అసలు నువ్వెక్కడ చదువుకున్నావ్ అంటూ ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు.   చంద్రబాబు మాట్లాడే బట్లర్‌ ఇంగ్లీష్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసిన జగన్‌.... ఎంఫిల్ చేయకుండా చేశానని బాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబు ఇంగ్లీష్‌ను చూసి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా హేళన చేశారని జగన్‌ సెటైర్లేశారు. టెన్త్, ఇంటర్‌, డిగ్రీలో తాను ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ని అన్న జగన్‌... తనకు చంద్రబాబులాగా ఇంగ్లీష్‌ని ఖూనీ చేయడం మాత్రం రాదన్నారు.   తన క్వాలిఫికేషన్స్‌, ఇంగ్లీష్‌పై సెటైర్లేసిన జగన్‌‌పై చంద్రబాబు కూడా జోకులు పేల్చారు. జగన్‌ అసలు పరీక్షలే రాసినట్లు లేరన్న బాబు, ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌నని చెప్పుకుంటున్న జగన్‌..... అసలు ఎక్కడ చదివారో ఎందుకు చెప్పడం లేదన్నారు. జగన్ ఎక్కడ... ఏం చదువుకున్నాడో కనీసం వాళ్ల ఎమ్మెల్యేలకైనా తెలుసో లేదోనంటూ పంచ్‌లేశారు. తాను ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్‌, ఎంఫిల్‌ చేశానన్న చంద్రబాబు.... అందుకు మీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే సాక్ష్యమన్నారు. తన క్వాలిఫికేషన్స్‌పై మీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని అడిగినా చెబుతారంటూ జగన్‌కు కౌంటర్‌ ఇచ్చారు.   అయితే క్వాలిఫికేషన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు... దుమ్మెత్తిపోసుకోవడంతో అటు టీడీపీ...ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు నోరెళ్లబెట్టారు. ఇదేం గోలరా బాబూ అంటూ తమలో తామే నవ్వుకుంటున్నారు.

ఏసీబీ కోర్టుకు సండ్ర.... ఓటుకు నోటు కేసులో కొత్త మలుపులు

  తెలుగు రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఓటుకు నోటు కేసు మళ్లీ ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు.... ఎమ్మెల్యే సండ్రకు నోటీసులు జారీ చేయడంతో విచారణ విచారణకు హాజరయ్యారు. తొలి ఛార్జిషీ‌ట్‌కు అనుబంధంగా 60 పేజీల్లో మరిన్ని వివరాలు అందజేసిన అధికారులు.... సండ్ర, సెబాస్టియన్‌, ఉదయ్‌ సిన్హాతోపాటు రేవంత్‌రెడ్డి ఫోన్‌ సంభాషణల వివరాలను ప్రధానంగా ప్రస్తావించారు. తొలి ఛార్జిషీట్లో సమర్పించిన ఆడియోల్లోని గొంతులు ఒరిజనల్‌వేనంటూ ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్‌నూ, ఆధారాలను కోర్టుకు సమర్పిస్తూనే, ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్య పోషించిన పాత్రపై వివరాలు అందజేశారు.   2015 టీడీపీ మహానాడు కేంద్రంగా ఓటుకు నోటు వ్యవహారం సాగిందని, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించినట్లు ఏసీబీ అధికారులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు నోవాటెల్‌‌లో క్యాంపు ఏర్పాటు చేశారని, హోటల్స్‌లో రూమ్స్‌ బుకింగ్ బాధ్యతను ఎర్రబెల్లి దయాకర్‌రావు చూశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి, సండ్ర, సెబాస్టియన్లు ఇక్కడే సమావేశమై మాట్లాడుకున్నట్లు...నోవాటెల్‌ హోటల్‌ ఫైనాన్షియల్‌ మేనేజర్‌ వాంగ్మూలాన్ని కూడా ఏసీబీ నమోదు చేసింది. ప్రధానంగా 99కి పైగా ఫోన్‌ కాల్స్‌ వివరాలను అనుబంధ ఛార్జిషీట్లో పొందుపర్చింది.   ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ 50లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో మాత్రం స్పష్టంగా ఛార్జిషీట్లో అధికారులు పేర్కొనలేదు. అయితే టీడీపీ లీడర్‌ వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌.... సెబాస్టియన్‌కు డబ్బు సమకూర్చినట్లు అనుబంధ ఛార్జిషీట్లో తెలిపారు. అయితే ఎంత డబ్బు ఇచ్చాడు... ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పట్టుబడ్డ నగదు ఎవరు సమకూర్చారనే సంగతి ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంది. ఇక సండ్ర వెంకటవీరయ్య, సండ్ర గన్‌మెన్లు, డ్రైవర్‌‌తోపాటు వేం నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరుడు, అలాగే జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, గన్‌మెన్లు, వేం నరేందర్‌రెడ్డి కొడుకు కృష్ణకీర్తన్‌ వాంగ్మూలాలు నమోదు చేసినట్లు ఏసీబీ.... కోర్టుకు తెలిపింది. అయితే అనుబంధ ఛార్జిషీట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై ఎక్కడా ప్రస్తావించని ఏసీబీ బృందం.... అందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలియజేసింది.   మరోవైపు ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, వివరణ ఇవ్వాలంటూ బాబుకి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులివ్వడం... ఇటు ఏసీబీ కోర్టులో విచారణ వేగవంతం కావడంతో ఓటుకు నోటు కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఉత్కంఠంగా మారింది.

టీ అసెంబ్లీ VS ఏపీ అసెంబ్లీ…

  ఈ మధ్య కాలంలో ఇంచుమించూ ఒకేసారి తెలంగాణ, ఆంధ్రా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అటుఇటుగా ఒకేలా జరిగాయి కూడా! రోజూ ఏదో ఒక విషయంపై చర్చ కంటే రచ్చ ఎక్కువ జరిగింది. కాని, ఏపీ అసెంబ్లీ తెలంగాణ శాసనసభని గందరగోళం విషయంలో చాలా సార్లు దాటేసింది! ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని స్థితి నెలకొంటూ వచ్చింది. మరీ ముఖ్యంగా, లేడీ ఎమ్మెల్యేలు సభ లోపలే కాదు సభ బయట మీడియా పాయింట్ దగ్గర కూడా తోసేసుకుని తిట్టేసుకుని చరిత్ర సృష్టించారు. అసలు ఇందులో ఎవరి తప్పు వుందో కూడా అర్థం కానంత అరాచకం రాజ్యమేలింది! అయితే, ఏపీ అసెంబ్లీ మొదట్నుంచీ ఇలాగే నడుస్తోంది!   ఆంధ్రా అసెంబ్లీకీ పూర్తి భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ నడుస్తోందా అంటే … అదేం కాదు! కేసీఆర్ నాయకత్వంలోని సభలోనూ కేకలు, అరుపులు మామూలే. అయినా కూడా అమరావతిలోని సీన్స్ కంటే హైద్రాబాద్ లో కాస్త బెటర్! టీటీడీపీ, టీ బీజేపి ఎమ్మెల్యేల్ని బహిష్కరించటం లాంటివి పక్కన పెడితే మిగతా అంతా కాస్త పద్ధతిగానే నడిచిందని చెప్పొచ్చు! దీనికి కారణం ఏంటి? ఒకే సమైక్య రాష్ట్రం నుంచీ విడివడ్డ రెండు సభల్లో ఈ వ్యత్యాసం ఎందుకు?   ఆంధ్రా అసెంబ్లీలో గోలని కాస్త తీక్షణంగా అధ్యయనం చేస్తే మనకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది! తెలంగాణ సభలో కంటే ఏపీ సభలో ప్రతిపక్షం కాస్త స్ట్రాంగ్. దాని వల్ల అధికార పక్షం డామినేషన్ తట్టుకోలేక తిరగబడుతున్నారు. కాని, టీ అసెంబ్లీలో టీ కాంగ్రెస్ నేతలది ఎవరి తొవ్వ వారిదే! ఇక అందరూ కలిసి కేసీఆర్ సైన్యాన్ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. దీని వల్ల సభ హాయిగా నడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది. అలాగే, అక్కడ ఆంధ్ర అసెంబ్లీలో జగన్ పార్టీ సభ్యులు అయినా దానికి కాని దానికి స్పీకర్ పోడియం చుట్టు ముడుతున్నారు. వీళ్ల ప్రతాపం తెలిసే అంత ఎత్తున సభాపతిని కూర్చోబెట్టినా ఎగిరి గంతులేస్తూ అయోమయం సృష్టిస్తన్నారు. అంత దారుణమైన ఉత్సాహం తెలంగాణ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు … ఏ పార్టీల వారిలోనూ కనిపించదు మనకి! రోజా రేంజ్లో కలకలం రేపి సంవత్సరం పాటూ సస్పెండ్ అయిన వీర లేడీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ అసెంబ్లీలో వున్నట్టు అనిపించటం లేదు!   ఆంధ్రా అసెంబ్లీలో గొడవలన్నీ ప్రతిపక్షం వారు జనం కోసమే చేస్తున్నారా అంటే అలా కూడా అనిపించదు! చాలా సార్లు వ్యక్తిగత పట్టుదలతోనే గందరగోళం నెలకొంటోంది. దీనికి అధికార పక్షం వారు కూడా మినహాయింపు కాదు. కాని, ఎక్కువ సార్లు మాత్రం జగన్ మొండితనంతో చర్చ జరగకుండా చేసేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగిపోయిన తన ఎమ్మెల్యేలకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. చంద్రబాబు మీద నేరుగా పర్సనల్ దాడి చేసేస్తూ తన పార్టీ నాయకులకి అలాగే చేయాలన్నట్టు సంకేతాలు పంపుతున్నారు. దాంతో వారు మరింత చెలరేగి అధినేత మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టెన్త్ పేపర్ల లీకేజీ చర్చలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. జగన్ ఎక్కడ చదివాడో తనకు తెలియదని బాబు ఎద్దేవ చేస్తే తాను పీహెచ్ డీ మధ్యలో డిస్ కంటిన్యూ చేయలేదని జగన్ అన్నారు. అంతే కాదు, చంద్రబాబుకి సరిగ్గా ఇంగ్లీషు రాదంటూ కూడా జగన్ ప్రతి దాడి చేశారు. ఇవన్నీ జనానికి ఏ మాత్రం ఉపయోగపడని మాటలే!   తెలంగాణ అసెంబ్లీతో పోలిస్తే ఆంధ్రా సభలో రచ్చకి అసలు కారణం నేతల వ్యక్తిగత అహాలు దెబ్బతినటమే! చర్చని కేవలం రాజకీయాల వరకే పరిమితం చేస్తే సభ హుందాగా సాగే అవకాశాలుంటాయి!

జనం… జగన్ కంటే పవన్‌ని ఎక్కువగా నమ్ముతున్నారా?

ఏపీలో జనానికి ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకుంటారు? వీలైతే చంద్రబాబుకు మొరపెట్టుకుంటారు! అధికార పక్షం వల్ల పని జరగదని జనం భావిస్తే ప్రతిపక్ష నేతని ఆశ్రయిస్తారు! కాని, ఇప్పుడు తెలుగు ప్రజలకి మరో ఆప్షన్ కూడా లభించింది! అదే జనసేన! జనం ఇప్పుడు జనసేనాని పవన్ వైపు కూడా చూస్తున్నారు ఏదైనా కష్టం వస్తే! ఇన్ ఫ్యాక్ట్, జగన్ కంటే ఎక్కువగా పవన్ని నమ్ముతున్నట్టుగా వుంది వ్యవహారం!   ఆంధ్ర రాష్ట్ర అంసెబ్లీలో టీడీపీ, బీజేపి కాకుండా వున్నది వైసీపీ మాత్రమే! అదే ఏకైక ప్రతిపక్షం, విపక్షం అన్నీ కూడా! కాని, వైసీపీ అధినేత జగన్ ఒకప్పటిలా ఇప్పుడు జనంలో వుండటం లేదు. వున్నా ఒకటి రెండు రోజులు పరామర్శలు, ఓదార్పులతో పని కానిచ్చేస్తున్నాడు. అంతే కాదు, ఆయన జనం తరుఫున గట్టిగా మాట్లాడినా కూడా ప్రభుత్వం విన్నది, భయపడ్డది ఎంత మాత్రం వుండటం లేదు. అమరావతి రైతుల కష్టాలు మొదలు టెన్త్ విద్యార్థుల పేపర్ లీకేజీ ఇబ్బందుల వరకూ జగన్ ఎన్నో అంశాలు ప్రస్తావించినా ఏం సర్కార్ వెనక్కి తగ్గిన సందర్భాలు పెద్దగా కనిపించవు! సభ లోపలా, బయటా కూడా ఇదే పరిస్థితి!   జగన్ వెనుక పెద్ద పార్టీ, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేత హోదా… ఇన్నీ వున్నా జనం ఆయనతో సమానమైన ప్రాధాన్యాన్ని పవన్ కు ఇస్తున్నట్టు కనిపిస్తోంది! ఇలా వచ్చి జనంలో కలిసి, వారితో మాట్లాడి, సమస్యల గురించి గొంతుక వినిపించి మళ్లీ షూటింగ్ కి వెళ్లిపోతుంటాడు కాటమరాయుడు. ఒక్కసారి సెట్స్ మీద హడావిడి మొదలైందా… ఆయన ఆరోపణలన్నీ ట్విట్టర్ కే పరిమితం! అయినా కూడా పవన్ అడపాదడపా వచ్చి వెళుతోంటే జనం ఆవురావురుమని గోడు వెల్లబోసుకుంటున్నారు. తాజాగా అగ్రి గోల్డ్ బాధితులు పవన్ ఆశ్రయించిన వారి లిస్ట్ లో చేరారు! పవర్ స్టార్ జోక్యంతో వారికి ఎంత వరకూ లాభం కలుగుతుంది అన్నది మనం చెప్పలేం. కాని, వారైతే పూర్తి విశ్వాసంతో గబ్బర్ సింగ్ దర్భార్ కి హాజరయ్యారు!   ప్రజ సమస్యలపై ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ అన్నంత పని చేస్తూనే వున్నాడు. అయితే, ఇప్పటికి మాత్రం పార్ట్ టైంగా ప్రశ్నిస్తున్నాడు. దాని వల్ల జనానికి అద్బుతమైన మేలైతే జరగలేదు. రైతులు మొదలు అగ్రి గోల్డ్ బాధితుల దాకా ఎవ్వరికీ పవన్ వల్లే కష్టాలు తీరాయని చెప్పటానికి వీలు లేని పరిస్థితి. కాని, జనం మాత్రం జనసేనాని ముందు తమ ఇబ్బందులు చెప్పుకోటానికి ఆశతో ముందుకు వస్తున్నారు! ఈ ట్రెండ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నష్టం కలిగించవచ్చు! పవన్ కు సీట్లు సాధించి పెట్టవచ్చు! అన్నిటి కంటే ముఖ్యంగా జగన్ కు తీవ్రమైన నష్టం తీసుకురావచ్చు! ప్రతిపక్ష నేతగా ఆయనని నమ్ముకోవాల్సిన జనం… పవన్ వెంట వెళ్లిపోతే… సీఎం కుర్చీ మళ్లీ మరింత దూరంగా వెళ్లిపోతుంది! 

పవన్ కళ్యాణ్… పర్యటనల కళ్యాణ్ అయిపోతున్నాడా?

  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓదార్చే బాధ్యత మీద పేటెంట్ ఎవరు తీసుకున్నారు? ఇంకెవరు… జగనే! వైఎస్ చనిపోయిన మరు క్షణం నుంచీ ఆయన ఎవర్ని పడితే వార్ని అవసరాన్ని బట్టీ, వీలుని బట్టీ ఓదారుస్తూ వస్తున్నారు! అయితే, ఆశ్చర్యకరంగా ఒక్కసారి తెలంగాణ ఏర్పడ్డాక జగన్ ఓదార్పు మొత్తం ఆంధ్రాకే పరిమితం అయిపోయింది! తెలంగాణలో వైసీపీకి పెద్దగా సీన్ లేదని తేలిపోవటంతో రాజకీయ ఓదార్పంతా పదమూడు జిల్లాల్లోనే పొంగిపోర్లించారు! అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్… పర్యటనల కళ్యాణ్ గా మారిపోయి ఓదార్చటంలో తానూ ఏం తీసిపోలేదని నిరూపిస్తున్నాడు!   పవర్ స్టార్ పవర్ ఫుల్ ఓదార్పు అందుకుని ఫుల్ హ్యాపీ అయిపోయిన తాజా బాధితులు ఎవరో తెలుసా? అగ్రిగోల్డ్ ఆర్తులు! అగ్రి గోల్డ్ వ్యవహారం బయటకు పొక్కి ఎప్పట్నుంచో రచ్చ నడుస్తోంటే… పవన్ హఠాత్తుగా ఇప్పుడు వార్ని ఆదుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాళ్ల తరుఫున ప్రశ్నించటానికి గొంతు సవరించుకున్నాడు. విజయవాడలో వాళ్లని కలిసిన ఆయన ఓపిగ్గా చెప్పిందంతా విన్నాడు. కాటమరాయుడు రిలీజ్ అయిపోయి నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లని ఈ షార్ట్ గ్యాప్ లో… ఆయన అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలవటం నిజంగా ఆనందించాల్సిన విషయమే! కాని, రేపో మాపో కొత్త సినిమా స్టార్టై స్టూడియో గేట్ దాటి పవన్ బాబు బయటకి రాకపోతే అగ్రి గోల్డ్ ఆర్తుల పరిస్థితేంటి? అలాగని పవన్ షూటింగ్ మధ్యలో బయటకొచ్చేసి రోడ్లపై బైటాయించి ఉద్యమం చేస్తే మేకప్ కరిగిపోతుంది! దాని వల్ల కోట్లు విలువ చేసే సినిమాకి నష్టం!   ఒకవైపు రాజకీయం, మరో వైపు సినిమాల్లో నాటకీయం… రెండూ పవర్ స్టార్ బ్యాలెన్స్ చేస్తే అంతకన్నా కావాల్సింది మరేం లేదు. కాని, గత అనుభవాలు మరో రకం సినిమాని చూపిస్తున్నాయి! అప్పుడెప్పుడో అమరావతి నగరం కోసం పొలాలు ఇచ్చిన రైతుల్ని ఆయన కలుసుకున్నారు. వాళ్లు టిఫిన్ బాక్స్ లో తీసుకొచ్చిన అన్నం కూడా తిన్నారు! కాని, ఆ అన్నదాతల కోసం తరువాత ప్రత్యక్ష కార్యాచరణ ఆచరణలో పెట్టినట్టైతే ఎవరికి కనిపించలేదు. గవర్నమెంటే వారికి తగిన నష్టపరిహారం ఇచ్చేసింది కాబట్టి సరిపోయింది! ఇక రైతన్నల నుంచీ మొదలు పెడితే నేతన్నల వరకూ పవన్ పరామర్శించనీ వర్గం లేదు. పర్యటించని ప్రాంతం లేదు. ఇలా చేయటం తప్పు కాకపోయినా … ఊరికే అలా వెళ్లేసి ఓదార్పు అందించి వచ్చేయటానికి ఆల్రెడీ తెలుగు జనానికి ఒక యువనేత వున్నారు కదా… మళ్లీ మరో స్టార్ పొలిటీషన్ అవసరమా అంటున్నారు క్రిటిక్స్! మరి పవన్ తన ఈ వరుస పర్యటనలు, పరామర్శలు ముందు ముందు ఇలాగే కొనసాగిస్తాడా?లేక తనదైన స్టైల్లో వేరే ఏదైనా మార్గంలో జనంలో వుంటాడా? చూడాలి! ఇప్పటికైతే జనసేనాని జగన్ ను ఫాలో అయిపోతున్నట్టే కనిపిస్తోంది!

కార్లు అమ్ముకోండి… కాలుష్యం అమ్మటానికి వీల్లేదన్న సుప్రీమ్ కోర్ట్!

  ఈ భూమ్మీద మనిషితో పాటూ కోటాను కోట్ల జీవులున్నాయంటారు. కాని, మనిషి అంత స్వార్థ జీవి మరొక్కటి కూడా లేదని చెప్పొచ్చు! అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కాలుష్యమే! మొదట విపరీతమైన లాభాపేక్షతో, సుఖాల యావతో తన మనన్సుని కలుషితం చేసుకున్న మానవుడు తరువాత యావత్ భూమండలాన్ని కాలుష్యమయం చేస్తున్నాడు. ఇతర జీవులకే కాదు… తనకి కూడా ఈ అందమైన భూమి ఎందుకు పనికి రాకుండా పోయేలా తయారు చేసుకుంటున్నాడు!   ప్రకృతి మనకిచ్చిన భూ గ్రహంపై మనిషి చేస్తో్న్న అత్యంత దారుణమైన దాడి వాహన కాలుష్యం. వేగంగా దూరాల్ని దాటేయాలనే ఆలోచనతో అసలుకే మోసం తెచ్చుకుంటున్నాడు! కోట్ల వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతూ ఎంత నష్టం చేస్తు్నాయో మనం అస్సలు ఊహించలేకపోతున్నాం. తాజాగా సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే మనకు తీవ్రత అర్థమవుతుంది. వ్యాపారం కోసం బడా కార్పోరేట్లు మనిషి అస్థిత్వమే ప్రశ్నార్థకమైనా పట్టించుకోవటం లేదు!   ఏప్రెల్ ఒకటవ తేదీ నుంచి భారత మార్కెట్లలో బీఎస్ 4 వాహనాలు తప్ప బీఎస్ 3 వాహనాలు అమ్మటానికి వీలు లేదని కోర్టు చెప్పింది. ఇంతకీ బీఎస్ అంటే ఏంటి? బీఎస్ అంటే భారత్ స్టేజ్ అని అర్థం. ప్రస్తుతం మన దేశంలో బీఎస్ 3 దశకు సంబంధించిన వాహనాలు కూడా అమ్ముడు అవుతున్నాయి. కోర్టు తీర్పుతో ఇక మీదట కేవలం బీఎస్ 4కు చెందిన వెహికల్స్ మాత్రమే అందుబాటులో వుంటాయి. దీని వల్ల ప్రధానమైన లాభం తక్కువ కాలుష్యం జరగటమే.   ఇప్పటికిప్పుడు కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాల్సిన స్థితిలో మన ప్రపంచం వుంది. కాని, వాహనాల ఉపయోగం అమాంతం ఆపేసేది, ఆపేయగలిగేది కాదు. అన్ని దేశాల ఆర్దిక వ్యవహస్థలు వాహనాలు, ఇంధనం వాడకంపైనే ఆధారపడి వున్నాయి. కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం మెల్లమెల్లగా అయినా వాతావరణానికి హాని చేయని వాహనాల్ని వాడాలని. ఆ క్రమంలో వచ్చినవే బీఎస్ 4 వాహనాలు. ఇవ్వి ఇంతకాలం మన దేశంలో తయారైన వాహనాల కంటే తక్కువ కాలుష్యం చేస్తాయి. అందుకు తగ్గట్టుగా సాంకేతిక ఏర్పాట్లు చేశారు బీఎస్ 4 ద్విచక్ర , త్రిచక్ర వాహనాల్లో. బీఎస్ 4 కిందకు వచ్చే కార్లు, ఇతర భారీ వాహనాలు కూడా గతంలో తయారైన వాటికంటే గణనీయమైన స్థాయిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకునే మారుతి, సుజుకీ లాంటి అనేక కంపెనీలు ఎప్పట్నుంచో బీఎస్ 4 వాహనాల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. 2010 నుంచీ వాహన తయారీ కంపెనీల్లో ఈ ప్రక్రియ నుడుస్తోంది. కాని, కొందరు ఆటోమొబైల్ తయారీదారులు మాత్రం కాలుష్యాన్ని, సమాజం పట్ల బాధ్యతని మరిచి బీఎస్ 3 వాహనాలే మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చారు. ఇప్పుడు సుప్రీమ్ కోర్టు తీర్పుతో వారికే ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది.   బీఎస్ 3 టైపు వాహనాల్ని భారీగా తయారు చేసి వుంచుకున్న కంపెనీలు ఏప్రెల్ ఒకటి తరువాత వాట్ని అమ్మలేవు. వారు బీఎస్ 3 వాహనాల్ని అమ్ముకోటానికి అంగీకరించే ఇతర దేశాలకి ఎగుమతి చేసుకోవాలి. లేదంటే, బీఎస్ 4 ప్రమాణాలకి సరిపోయేలా అప్ గ్రేడ్ చేసుకోవాలి. ఇలాంటి చర్యలన్నిటికి ఎంతో కొంత ఆర్దిక నష్టం భరించక తప్పదు. కొందరి అంచనా ప్రకారం బీఎస్ 3 వాహనాల అమ్మకాల్ని సుప్రీమ్ రద్దు చేయటంతో దాదాపు 20వేల కోట్ల నష్టం వస్తుందనీ! అయినా కూడా ఇది అందరూ కలిసి భరించాల్సిన ఆర్దిక భారం. లేదంటే… మనం భరించలేని ప్రకృతి నష్టం నెత్తిన పడుతుంది. ఇప్పటికే కాలుష్యం వల్ల మనిషి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కరువు నుంచీ క్యాన్సర్ వరకూ అన్నీ కాలుష్యం నుంచే పురుడు పొసుకుంటున్నాయి. కాబట్టి మనిషి వ్యాపారాన్ని మించి సామాజిక బాధ్యతతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆఫ్ట్రాల్… ఏ వ్యాపారమైనా మనిషి అనేవాడు భూమ్మీద వుంటేనే కదా ముందు ముందు జరిగేది!