పెట్రోల్ రేట్ పెంచినా! జనానికి నిరసన తెలిపే ఛాన్స్ లేదు
మనకు స్వతంత్రం రాక ముందు ప్రతీ రోజూ నిరసనలు, ధర్నాలు, హర్తాళ్లూ జరిగేవి. స్వాతంత్ర్యం వచ్చాక బాగా తగ్గిపోయాయి. అయినా అనేక అంశాలపై జనం రోజూ రోడ్డు మీదకి ఎక్కుతునే వుంటారు! అలాంటి సమస్యాత్మక అంశాల్లో తప్పకుండా చేరేది పెట్రోల్ రేట్లు! అవును… పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం పెట్రోల్ నిరసనలు, ధర్నాలు, నినాదాలు కామన్! ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినందుకు జనం ప్రభుత్వాలపై ఆగ్రహం ప్రకటిస్తూనే వుంటారు! మరీ ముఖ్యంగా లెఫ్టు పార్టీలు , వాటి కార్యకర్తలు దశాబ్దాలుగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా వీధి పోరాటం చేస్తూనే వున్నారు. వాళ్ల ఒత్తిడికి తలొగ్గి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం దాదాపు ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. అయినా రూపాయి, రెండు రూపాయల చొప్పున ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ పార్టీలు రచ్చ చేస్తూనే వుంటాయి! కాని, ఇక ఇదంతా చరిత్ర….
మీకు పెట్రోల్ రేట్ పెరిగిందనే నిరసనలు కనిపించాయి గాని … ఎప్పుడైనా బియ్యం ధర పెరిగిందని జనం రోడ్డెక్కటం చూశారా? దేశంలోని దాదాపు అన్ని ఉత్పత్తుల ధరలు పెరుగుతూ, తరుగుతూ వుంటాయి. వాటి విషయంలో జరగని రచ్చ ఇంతకాలం పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో జరిగేది! ఇక ఇప్పుడు అలా జరిగే అవకాశాలు లేకుండాపోనున్నాయి! మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్ గా కొత్త విధానాన్ని వైజాగ్ లో స్టార్ట్ చేయనున్నారు. అదీ లేబర్ డే అయిన మే ఒకటవ తేదీన!
మన వైజాగ్ తో పాటూ పుదుచ్చేరి, ఛండీఘర్, ఉదయ్ పూర్, జంషెడ్పూర్ లలో రోజువారి రేటింగ్ విధానం మే ఒకటి నుంచీ అమల్లోకి రానుంది! దీని ప్రకారం పెట్రోల్ , డీజిల్ ధరలు ప్రతీ రాత్రీ మారిపోతాయి. తెల్లవారే సరికల్లా నిన్నటి కంటే కొన్ని పైసలు ఎక్కువో, తక్కువో అవుతాయి! అంటే, వంద, యాభై రూపాయల చొప్పున పెట్రోల్ కొట్టించే సామాన్య జనానికి రేట్ ఎంత మారింది, ఇంధనం ఎంత ఎక్కువ, తక్కువలు వస్తోంది స్పష్టంగా తెలిసే అవకాశం లేదన్నమాట! పర్సులోంచి వంద నోటు బయటకి వెళితే పెట్రోల్ ట్యాంక్ లోకి ఎన్ని మిల్లీ లీటర్లు వచ్చింది జాగ్రత్తగా లెక్కపెట్టుకుని , రోజువారిగా పోల్చుకుంటే తప్ప రేటు పైన అవగాహన రాదు!
మే ఫస్ట్ న వైజాగ్ లో ప్రారంభించి తరువాత తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ రేట్ల రోజువారి మార్పుని క్రమంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం పదిహేను రోజులకి ఒకసారి చమురు కంపెనీలు రేట్లు రివైజ్ చేస్తుంటాయి. మే తరువాత అది కాస్తా రోజువారి వ్యవహారం అయిపోనుంది! దీని వల్ల ప్రధానంగా ఎదురయ్యే పరిణామం ఒకేసారి రేటు పెరిగిపోయినట్టు కాని, తగ్గిపోయినట్టు కాని అనిపించకపోవటం! తగ్గినా, పెరిగినా కొన్ని పైసల్లో మాత్రమే మార్పు వుంటుంది! అందుకే, ఇక ప్రతి పక్షాలు, మరీ ముఖ్యంగా, ఇంత కాలం ఇంధన ధరల పెరుగుదలకి శాశ్వత వ్యతిరేకులుగా వుంటూ వచ్చిన లెఫ్ట్ పార్టీలు… నిరసనలు, నినాదాలు చేయలేవన్నమాట!