ఆయేషా కేసులో సత్యం వధ-సత్యం వ్యథ... డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు
posted on Apr 1, 2017 @ 11:39AM
వంద దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు, కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదన్నది న్యాయసూత్రం. కానీ ఆయేషాలో నిర్దోషిగా బయటపడిన సత్యంబాబు ఎనిమిదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. పోలీసులు చేసిన తప్పులకు పక్షవాతం బారినపడి జీవశ్చవంలా మారాడు. మరి దీనికి సమాధానం ఎవరు చెబుతారు? తమ కూతురి హత్యతో సత్యంబాబుకి సంబంధం లేదని ఆయేషా తల్లిదండ్రులు మొత్తుకున్నా పట్టించుకోని పోలీసుల శిక్షించారా? కొంతమంది అధికారులు, నాయకులు, అసలు దోషులు కలిసి... సత్యాన్ని ఇరికించారని మొర్రపెట్టుకున్నా, కనికరించని కర్కశ ఖాకీలపై చర్యలు తీసుకోరా? అసలు హైకోర్టు ఏం చెప్పింది?
తమ కూతురు ఆయేషా హంతకులను శిక్షించాలని మాత్రమే కాకుండా, సత్యంబాబుని విడుదల చేయాలంటూ ఆయేషా తల్లిదండ్రులు న్యాయపోరాటం చేశారంటే ఈ కేసులో పోలీసుల తప్పిదం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. చివరికి వాళ్ల పోరాటం ఫలించింది. అయితే సత్యాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరుపై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దోషులను విడిచిపెట్టారు, ఆధారాల్లేకుండా అమాకుడ్ని ఎనిదేళ్లుగా జైలుపాలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఆయేషా కేసుని దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద సత్యంబాబుకి లక్ష రూపాయలు చెల్లించాలని సూచించింది.
అసలు దోషులను వదిలేసి, ఒక అమాకుడిపై అభియోగాలు మోపి, జైలుపాలు చేయడాన్ని అమానవీయమైన చర్యగా హైకోర్టు అభివర్ణించింది. సత్యంబాబు నేరం చేసినట్లు ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు చూపలేకపోయారన్న డివిజన్ బెంచ్... ఈ కేసుతో సత్యానికి ఎలాంటి సంబంధంలేదని, అకారణంగా ఇరికించారని అభిప్రాయపడింది. అసలు నేరస్థులను తప్పించడం కోసం కట్టుకథలు అల్లారని, వాటినే కింది కోర్టు విశ్వసించిందని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు ఆయేషా తల్లి ఆరోపిస్తున్న వ్యక్తికి, కోర్టు అనుమతించినా పోలీసులు ఎందుకు నార్కో పరీక్ష నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆయేషాను చంపాక నిందితుడు ఆమె గదిలోనే కూర్చుని తాపీగా లేఖ రాసినట్లు పోలీసులు చెబుతున్న కథనం నమ్మశక్యం లేదంది. అయినా అంతసేపు నిందితుడు ఆయేషా గదిలోనే ఉంటే, అక్కడున్న 55మందిలో ఒక్కరైనా గమనించారా అంటూ సందేహం వ్యక్తంచేసింది. అంతేకాదు సరిగ్గా నడవలేని సత్యంబాబు.... 8 అడుగుల ఎత్తున్న గోడను కేవలం రోకలి పట్టుకుని ఎక్కాడంటే ఎలా నమ్మేదన్నారు. ఆ ఫీట్ చేయగలిగేది ఒక్క సూపర్‌మ్యానేనంటూ పోలీసులకు చురకలేసింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సరిగా వ్యవహరించలేదని, సాక్షుల వాంగ్మూలాలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయంది డివిజన్ బెంచ్.
అయితే కోర్టు ఖర్చుల కింద సత్యంబాబుకి లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు... నష్టపరిహారం కోరుతూ సర్కార్‌పై దావా వేసే అంశాన్ని అతనికే వదిలిపెడుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఓ పొలిటీషియన్ కుటుంబాన్ని కాపాడేందుకే సత్యంబాబుని ఇరికించారన్న వాదనలతో ఏకీభవించేందుకు తమకు అందించిన సాక్ష్యాధారాలు సరిపోవని డివిజన్ బెంచ్ తెలియజేసింది.