సమ్మర్‌ హాలీడేస్‌..డేంజర్ జోన్‌లో పిల్లలు

వేసవి సెలవులు వచ్చేశాయ్‌. పొద్దున్నే లేవనవసరం లేదు. పిల్లలను రెడీ చేయనవసరం లేదు. వాళ్లే ఏదోఒక టైమ్‌లో నిద్రలేచి, ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో తమకు నచ్చిన గేమ్స్‌ ఆటలు ఆడుకుని ఇంటికి తిరిగొస్తారులేనని రిలాక్స్‌ అయ్యారా? అయితే మీ పిల్లలు డేంజర్‌లో ఉన్నట్లే. సమ్మర్ హాలీడేస్‌ని పిల్లలు సరదాగా ఎంజాయ్‌ చేస్తారని వాళ్ల ఇష్టానికి వదిలేస్తున్నారా? అయితే మీ పిల్లలపై మీరు ఆశలు వదులుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్లిన మీ పిల్లలు తిరిగొస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే సమ్మర్‌లో సరదాగా ఆడుతోన్న ఆటలు... కిల్లర్‌ గేమ్స్‌గా మారుతున్నాయి. తోటి ఫ్రెండ్సే ప్రాణాలు తీస్తున్నారు. తెలిసినవాళ్లే చంపేస్తున్నారు. చిన్నపాటి గొడవకే నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.    సరదాగా మొదలవుతున్న గేమ్స్ కాస్తా.... చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్‌ ప్రాణాలు తీస్తోంది. బంతి తగిలో లేక ఆటలో చెలరేగిన చిన్నపాటి గొడవో చివరికి ప్రాణాలు తీసేంతవరకూ వెళ్తోంది. విజయవాడలో అదే జరిగింది. క్రికెట్... ఓ కుటుంబంలో నిషాదాన్ని నింపింది. బెజవాడ పీ అండ్ టీ కాలనీలో జరిగిన గొడవ ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. క్రికెట్ బంతి తగిలిందని యువకుడ్ని కత్తితో పొడిచి చంపేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన నగర ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. కొంతమంది యువకులతో కలిసి కిరణ్‌ క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న ఓ మహిళకు కిరణ్ కొట్టిన బంతి తగిలింది. ఇదే అతని ప్రాణాలను తీసింది.    చిన్నపాటి గొడవకే ప్రాణాలు తీసేయడంతో... తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. సమ్మర్‌ హాలీడేస్‌లో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్తే, ఏం గొడవలు ఇంటిమీదకొస్తాయోనని భయపడుతున్నారు. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సమ్మర్‌ హాలీడేసే కదా అని, వాళ్ల ఇష్టానికి వదిలేస్తే, ఆ తర్వాత ఏదైనా జరగకూడనిది జరిగితే, నష్టపోయేది తల్లిదండ్రులే. అందుకే బీ కేర్‌ఫుల్‌ పేరెంట్స్‌... టేక్‌ కేర్‌ యువర్ చిల్డ్రన్.

బాబ్రీ విధ్వంసం ఎందుకు జరిగింది? అసలు వివాదం ఏంటి?

బీజేపీ అగ్రనేతలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో....అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో పాటు 15మందిని కుట్రదారులుగా తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది.   1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. బాబ్రీమసీదు స్థలంలో రామాలయం నిర్మించాలని.... అయోధ్యకు కరసేవకులు ఇటుకలతో రావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. భారీగా అయోధ్యకు తరలివచ్చిన కరసేవకులు డిసెంబరు 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు.  దీంతో ఎన్నడూ లేని విధంగా మతఘర్షణలు చెలరేగడంతో...3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.    అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం ఈనాటిది కాదు....కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతోంది. అసలు వివాదం...యూపీలోని అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలం గురించే. రాముడి పుట్టిన స్థలం...మసీదు నిర్మించిన స్థలం ఒక్కటేనంటారు. రామాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని హిందూవులంటుంటే....మసీదును కూల్చేసి ఆలయాన్ని నిర్మించారని ముస్లింలు వాదిస్తున్నారు.    1989లో విశ్వహిందూ పరిషత్ నేతలు.. రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు. మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాదిరాయి వేశారు. ఈ సమయంలోనే అప్పటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా...సఫలం కాలేదు. 1992లో అయోధ్యకు ఇటుకలతో తరలిరావాలంటూ బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన కరసేవకులు వేలాది మంది అయోధ్యకు వచ్చి....1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1993లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, అశోక్ సింఘాల్, గిరిజా కిషోర్, విష్ణు హరి దాల్మియా, సాధ్వి రితంభరపై సీబీఐ క్రిమినల్ కేసులను పెట్టింది.    అప్పటి ప్రధానిగా పీవీ నరసింహరావు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌లు....కరసేవకులకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం నియమించిన జస్టిస్‌ లిబర్హాన్ కమిషన్....అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీతో సహా పలువురి పేర్లను చేర్చింది. అంతేకాదు....బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందుగానే వ్యూహాన్ని రచించారని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. దీనికి బలం చేకూరేలా....బాబ్రీమసీదు కూల్చివేతలో అద్వానీ పాత్ర ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారిణి అంజుగుప్తా సాక్ష్యం చెప్పారు. అద్వానీతోపాటు సంఘ్ పరివార్‌కు చెందిన పలువురు నాయకులు కరసేవకుల ఎదుట ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసి వారిని రెచ్చగొట్టారని వెల్లడించారు. అయితే 2003లో అద్వానీపై పెట్టిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవడంతో ఆ కేసు నుంచి అద్వానీ బయటపడ్డారు.    బాబ్రీ మసీదు కూల్చివేతపై 18 ఏళ్ల విచారించిన రాయబరేలీ కోర్టు....అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి పాటు నిందితులందర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసు కొట్టివేసింది. దీన్ని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో....అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు బీజేపీ నేతలను కుట్రదారులుగా తేల్చింది. కేసును మళ్లీ పునర్విచారించాలంటూ సుప్రీంకోర్టు సీబీఐను కోరింది.

కేసీఆర్‌కి దిమ్మదిరిగేలా కాంగ్రెస్‌ ఉచిత హామీలు

ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా హామీలే ఆయుధం... ఎన్నికల సమయంలో ఇచ్చే ఆ హామీలే పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తుంటాయ్‌. పార్టీల జాతకాన్నే కాదు... అభ్యర్ధులకు గెలుపోటములకు కూడా హామీలే కారణమవుతుంటాయ్‌. వందల హామీలు కాదు.... ఒక్కటి చాలు.... పార్టీ జాతకం మారిపోవడానికి, అధికారంలోకి రావడానికి. 2014 ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌... అధికారంలోకి రావడానికి హామీలదే ప్రధాన పాత్ర.   ముఖ్యంగా ఉచిత హామీల పవరే వేరు... ఫ్రీ...ఫ్రీ...ఫ్రీ ఈ పదం వింటే చాలు ప్రజలు దాసోహమైపోతారు. అందుకే పార్టీలన్నీ ఉచితానికి అత్యంత ప్రాధాన్యతిస్తాయి. అందుకే ఈ ఉచిత మంత్రాన్ని ఎక్కువ వినిపంచేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. 2014 ఎన్నికల్లో... తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనంటూ ప్రజల్లోకి వె‌ళ్లినా... అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతోనే దెబ్బతిన్నామని గ్రహించిన టీకాంగ్రెస్‌ లీడర్లు.... ఈసారి హామీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారు. అందుకే మేనిఫెస్టోపై కసరత్తు మొదలుపెట్టారు.   గత ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించిన రుణమాఫీ హామీని ఈసారి కాంగ్రెస్‌ జపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పంట రుణాలు మాఫీ చేయగా, కాంగ్రెస్‌ మాత్రం అన్ని రకాల రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అది కూడా విడతల వారీగా కాకుండా, ‎ఒకేసారి ఏకమొత్తం చెల్లిస్తామంటూ హామీ ఇవ్వబోతోంది. అలాగే ఇప్పుడున్న పెన్షన్ల అమౌంట్‌ను రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి, ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నారు.   ముఖ్యంగా రైతులను ఆకట్టుకునేలా వ్యవసాయ ప్యాకేజీ ప్రకటించేందుకు టీకాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది.కేసీఆర్‌ ఇఫ్పటికే ఉచిత ఎరువులు ప్రకటించడంతో దానికి అదనంగా ఫ్రీగా విత్తనాలు అందిస్తామని కాంగ్రెస్‌ చెప్పనుంది. మొత్తానికి ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా, టీఆర్‌ఎస్‌కు దిమ్మదిరిగే హామీలు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ మెనూ చూస్తే మీరు షాక్ తింటారు?

అసలే అధికార పార్టీ... పైగా ప్లీనరీ... ఏర్పాట్లకు కొదువే ఉండదు... గాలి జనార్దన్‌రెడ్డి కూతురి పెళ్లి కంటే వైభవంగా ప్లీనరీ జరనుంది. ఏర్పాట్లు వరకూ ఓకే... మరి అక్కడికొచ్చే నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి వంటకాలు వడ్డించబోతున్నారో తెలిస్తే ...మనమూ వెళ్తే పోలే అనుకుంటాం. పార్టీ ప్లీనరీ అంటే భారీ ఏర్పాట్లు, తోరణాలు, స్వాగత ఏర్పాట్లే కాకుండా వచ్చిన వారికి ....నచ్చిన ఫుడ్ పెట్టేందుకు పెద్దఎత్తున వంటకాలను రెడీ చేయిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటకాల రుచి చూపించబోతున్నారు.    తెలంగాణలో నాన్ వెజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే కర్రీల లిస్ట్ పెద్దగా ఉంది. దీంతోపాటు మిగతా మెనూ భారీగానే ఉంది. మొత్తం 24 వంటకాలను సిద్ధంచేస్తున్నారు. మటన్ బిర్యానీ, ధమ్ చికెన్ ఫ్రై, మటన్ షారువా, ఫిష్ ఫ్రై, మటన్ దాల్శా, ఎగ్ పులుసు‌తోపాటు ప్లెయిన్ పుల్కా, మిర్చికా సలాడ్, బగారా రైస్, ప్లెయిన్ రైస్, ఆలూ టమాటా కర్రీ, గంగాబావి యాంజిదాల్, పప్పు చారు, పచ్చి పులుసు, పెరుగు చట్నీపెరుగు... సిద్ధం చేయబోతున్నారు.     సమ్మర్‌ కావడంతో అందుకు తగ్గట్టుగా ఐస్‌క్రీమ్స్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌, స్వీట్లు తయారు చేయిస్తున్నారు, ఆ లిస్టులో ఫైనాపిల్ ఫెర్నీ స్వీటు, ఫ్లమ్ కేక్ ఐస్ క్రీమ్‌, కట్ ఫ్రెష్ ఫ్రూట్, స్వీట్ పాన్, గ్రీన్ సలాడ్, ఆనియన్ సలాడ్ లాంటివి సిద్ధంచేస్తున్నారు. మొత్తానికి ప్లీనరీకి వచ్చినవాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ లీడర్లు భారీ ఏర్పాట్లే చేస్తున్నారు.

ఒకడే ఒక్కడు మొనగాడు… ఊరే మెచ్చిన పనివాడు!

    బహుశా… దేశంలోనే ఇన్నేసి సార్లు సీఎం సీటులోకి ఎక్కటం, దిగిపోవటం, మళ్లీ ఎక్కటం… ఎవ్వరూ చేసి వుండరనుకుంటా! ఆ రికార్డ్ ను తమిళనాడు మాజీ సీఎం… కాబోయే సీఎం… పన్నీర్ సెల్వం స్వంతం చేసుకుంటున్నాడు! మొదటిసారి జయలలిత జైలుకి వెళ్లినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆమె బయటకి రాగానే అమాంతం అమ్మ పాదాల వద్ద సీఎం పోస్టుని అర్పించేశాడు. మళ్లీ జయ అనారోగ్యంతో సీఎం అయ్యాడు. శశికళ పట్టుదలతో దిగిపోయాడు. కాని, తాజా పరిస్థితులు చూస్తుంటే… తమిళనాడుపై మరోసారి పన్నీరు జల్లు తప్పదనిపిస్తోంది!   జయలలిత మరణంతో తమిళనాడులో రణం మొదలైంది. ఒకవైపు చిన్నమ్మ శశికళ, మరోవైపు అమ్మ ఆత్మ శాసించిందంటూ ఎదురుతిరిగిన పన్నీర్ సెల్వం… ఇద్దరి మధ్యా జరిగిన రచ్చలో చివరకు ధర్మమే గెలిచింది. ఏ అర్హతా, విచక్షణా లేకుండా అధికారం కొట్టేద్దామనుకున్న శశికళ, ఆమె బంధువు దినకరన్ ఇద్దరూ అన్నాడీఎంకే నుంచి ఔట్ అయ్యారు. బహుశా పన్నీర్ సెల్వం చెప్పినట్టు జయలలిత ఆత్మవాంఛ కూడా ఇదేనేమో!   అన్నాడీఎంకే నుంచీ మన్నార్ గుడి మాఫియా పూర్తిగా గెంటివేయబడటంతో ఇప్పుడు పన్నీర్, పళనిస్వామి వర్గాలు మిగిలాయి. కాకపోతే, వీరిద్దరూ కేంద్రంలోని మోదీ సర్కార్ కనుసన్నల్లో కలిసిపోతారనేది బహిరంగ రహస్యమే. రోజుల వ్యవధిలోనో, కాదంటే గంటల వ్యవధిలోనో పన్నీర్, పళని కలిసి కెమెరాల ముందుకు రావొచ్చు. అయితే, అంతా ఒక్కటై అమ్మ పార్టీని చీలిపోకుండా చూసుకున్నాక.. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దీని మీదే అందరి దృష్టి వుంది! కొందరు జయలలిత ఆజ్ఞ ప్రకారం పన్నీర్ సెల్వం మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. ఇక ఇప్పుడు సీఎంగా వున్న ఈపీఎస్ ఓపీఎస్ కు డిప్యూటీ అవుతాడంటున్నారు. ఒకవేళ పళని స్వామీ ఉప ముఖ్యమంత్రి కాకుంటే కేంద్రంలో మంత్రి అవుతాడని కూడా ప్రచారం జరుగుతోంది!   పళని స్వామీ ఢిల్లీకి, పన్నీర్ చెన్నైకి పరిమితం అయితే అన్నాడీఎంకే లుకలుకలు లేకుండా ప్రశాంతంగా వుండే ఛాన్స్ వుంది. అలాగే, బీజేపికి ఎన్డీఏలో బలం చేకూరుతుంది. అంతకంటే ముఖ్యంగా తమిళనాడులో ప్రవేశించాలన్న కమలం కల త్వరలోనే సాకారం అవుతుంది! మొత్తానికి మోదీ, అమిత్ షా, ఓపీఎస్, ఈపీఎస్… అందరికీ విన్ విన్ సిట్యుయేషన్ అన్నమాట!

టీడీపీలో ఒంటరి పోరు... కాంగ్రెస్‌‌లో అనైక్యత... కేసీఆర్‌కి కలిసొస్తున్న గందరగోళం

ఒకరు తిడతారు....మరొకరు పొగుడుతారు. ఒకరు ప్రభుత్వంతో చెడుగుడు ఆడేస్తారు...మరొకరు శాలువాలతో సన్మానిస్తారు. ఒకరు దండకాలు చదివితే...మరొకరు దండలు వేస్తారు. ఇదీ తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీల పరిస్థితి. రిజర్వేషన్ల బిల్లు సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. జీవన్‌రెడ్డి దెబ్బకు కేసీఆర్‌ సైతం కంగుతిన్నారు. పాయింట్‌ టు పాయింట్‌ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌‌ను కార్నర్‌ చేశారు జీవన్‌రెడ్డి, అయితే బిల్లు ఆమోదం తర్వాత అదే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్ మాత్రం కేసీఆర్‌ను కలిసి శాలువా కప్పి అభినందించారు. కాంగ్రెస్‌లో ఇలాంటి సీన్లు కొత్తేమీ కాదు. గతంలోనూ హస్తం నేతలు టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడితే... సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారంటూ తుస్సుమనిపించేవారు.   టీడీపీ నాయకులు కూడా హస్తం నేతల బాటలోనే నడున్నారు. సేమ్‌ టు సేమ్‌ కాంగ్రెస్‌లోని పరిస్థితే తెలంగాణ తెలుగుదేశంలోనూ కనిపిస్తోంది. ఒకరు కేసీఆర్ సర్కార్‌పై రంకెలేస్తుంటే.... మరొకరు భేష్ అంటున్నారు. రిజర్వేషన్ల బిల్లుపై రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు పరస్పరం విరుద్ధంగా స్పందించడమే అందుకు రుజువు. ఇక అధికార పార్టీపై పోరాటానికి ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ ముందుకు రావడం లేదు. ఎప్పుడు చూసినా రేవంత్‌రెడ్డి, అప్పుడప్పుడూ ఎల్ రమణ మాత్రమే యుద్ధ క్షేత్రంలో కనిపిస్తున్నారు. మిగతావారు అధికార పార్టీకి వ్యతిరేకంగా నోరు విప్పడం చాలా అరుదుగా కనిస్తోంది.   2019లో అధికారం మాదే అంటున్న ఈ రెండు విపక్ష పార్టీల్లో ఎందుకీ గందరగోళం?. అధికారం కోసం అర్రులు చాస్తూనే... ఆ కలలు కల్లలయ్యే పరిస్థితి వారే తెచ్చుకుంటున్నారా?. నాయకులే కన్ఫ్యూజ్ అవుతూ అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుంటే, ఇక కేడర్‌ సంగతి ఏంటి?. ఈ ప్రశ్నలకు ఆ రెండు పార్టీలే సమాధానాలు వెతుక్కోవాలి. అయితే కాంగ్రెస్‌, టీడీపీలు.... అధికార పార్టీ ట్రాప్ లో పడిపోతున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో సమన్వయం లేకపోవడం, మరో విపక్షం టీడీపీలో ఒంటరి పోరు.... టీఆర్‌ఎస్‌కి కలిసొస్తున్నాయంటున్నారు.

శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక అసలు కథ ఇదే? తెలిస్తే షాక్‌ అవుతారు?

చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక అసలు కారణమేంటి? నిజంగానే ఆయనకి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందా? దళితులకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు? దాడులు జరిగినప్పుడు నోరు మెదపని శివప్రసాద్‌... ఇంత సడన్‌గా ఇప్పుడు కుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు? నిజంగా దళితులకు అన్యాయం జరుగుతుంటే, ఈ మూడేళ్లలో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు కులం గుర్తొచ్చింది? శివప్రసాద్‌ను ప్రతిపక్ష పార్టీ నేతలు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక ఉన్నది కుల సమీకరణాలా? లేక క్యాష్‌ ఈక్వేషన్సా?   అయితే శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక అసలు కథ క్యాస్ట్‌ కంటే క్యాషే కారణమనే టాక్‌ వినిపిస్తోంది. హాథీరాంజీ భూములను దళితులకు ఇవ్వాలన్న శివప్రసాద్‌ డిమాండ్‌ వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. ప్రభుత్వంపైనా..టీడీపీపైనా పెద్ద గొంతు వేసుకుని విరుచుకుపడే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేకి ఎర్రచందనమే ప్రధాన ఆదాయ వనరు. ఎర్రచందనం సాయంతో వారు కోట్లకు పడగలెత్తారు..అందుకే వారిద్దరికి ఆ పార్టీలో అంత ప్రాధాన్యత. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపారు. దీంతో స్మగ్లర్లు శేషాచలం వైపు రావడానికే భయపడుతున్నారు. దీంతో టీటీడీకీ చెందిన హాథీరాంజీ భూములపై కన్నెశారు. అయితే పవర్ వారి చేతిలో లేకపోవడంతో అధికార పక్షానికి చెందిన కీలక నేత అవసరం పడింది. అప్పుడు వారి దృష్టిలోకి వచ్చారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఆయనకు మొత్తం మేటర్ చెప్పి డీల్ కుదుర్చుకున్నారు. దళితుల పేరు చెప్పి ఆ భూములను చేజిక్కించుకునేందుకు పావులు కదిపారని జిల్లాలో చర్చ నడుస్తోంది. అయితే ఇంటెలిజెన్స్ ద్వారా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి..వారి ఎత్తులను చిత్తు చేశారు. ఈ విషయంలో సీరియస్‌గా ఉన్న సీఎం కనీసం ఆరు నెలలుగా శివప్రసాద్‌తో మాట్లాడలేదట.   అయితే తమ ప్లాన్‌ రివర్స్ కావడంతో సదరు నేతలు కులం కార్డ్‌ని పైకి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..మంత్రివర్గ విస్తరణలో దళితులకు కనీస ప్రాధాన్యత దక్కలేదంటూ శివప్రసాద్ హైకమాండ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిని ఆయన చేత అనిపించింది ఆ ఇద్దరు నేతలేనని టాక్. వైసీపీ నేతలు శివప్రసాద్‌ని వెనకేసుకురావడం ఈ అనుమానాలను బలపర్చేలా ఉంది. ఎందుకంటే శివప్రసాద్‌ ఇష్యూ టీడీపీ అంతర్గత విషయం, అయితే శివప్రసాద్‌కేదో అన్యాయం జరిగిపోతున్నట్లు వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 

వందల కోట్లతో ప్రైవేట్‌ జెట్‌... మాల్యాను తలపిస్తోన్న మెగా కాంట్రాక్టర్‌

ఈయనో మెగా కాంట్రాక్టర్‌... తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద కాంట్రాక్ట్‌ అయినా ఈయనిదే... ఈ మెగా కాంట్రాక్టర్‌కి అధికార పార్టీలకే కాదు... విపక్షాలకు కూడా ఈయన బాగా కావాల్సినవాడు... ప్రభుత్వ పెద్దలతో, బడా నేతలతో అయితే ఇంకా క్లోజ్‌గా ఉంటాడు... అంతేకాదు ఏం మాయ చేస్తాడో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎలాంటి బిగ్‌ కాంట్రాక్ట్‌ అయినా ఈయనిదే...అయితే ఇప్పుడు ఈ మెగా కాంట్రాక్టర్‌ సరికొత్త ఎత్తు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాధినేతలను, మంత్రులను, పలుకుబడిగల ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకునేందుకు 150 కోట్ల రూపాయలతో ప్రైవేట్‌ జెట్‌ కొనుగోలు చేశాడు. అంతేకాదు ఆ ప్రైవేట్‌ జెట్‌లో మరో 75కోట్లతో స్వర్గాన్ని తలపించేలా ఇంటీరియల్‌ డెకరేషన్‌ చేయిస్తున్నాడట.   సకల సౌకర్యాలు, సుఖభోగాలకు నిలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ జెట్‌ను పొలిటికల్‌ లీడర్లకు సప్లై ఇవ్వబోతున్నాడట. ఇలాంటి ప్రైవెట్‌ జెట్‌ ఇంతకుముందు ఒక్క విజమ్‌మాల్యాకే ఉండేదని, విహార యాత్రలకు విలాసాలకు అమ్మాయిలతో కలిసి తిరుగుతూ జల్సాలు చేయడానికి దాన్ని ఉపయోగించేవాడని, ఇప్పుడు అలాంటి జెట్‌‌నే ఈ మెగా కాంట్రాక్టర్‌ ప్రత్యేకంగా తయారు చేయించడంతో.... ఈయన కూడా అలాంటి పనులకే దీన్ని ఉపయోగిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.అయితే దేశంలోని పెద్దపెద్ద ఇన్‌ఫ్రా కంపెనీలు సైతం తమ సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేక కొట్టుమిట్టాడుతుంటే, ఈ మెగా వీరుడు మాత్రం వందల కోట్ల ఖర్చుతో ప్రైవేట్‌ జెట్‌ను సమకూర్చుకోవడం అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు ఇన్‌ఫ్రా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.   ఒకవైపు మెజారిటీ ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ ఏడాదిగా జీతాలు కూడా ఇవ్వలేక, బ్యాంకుల అప్పులు కట్టలేక రుణాలను రీషెడ్యూల్‌ చేసుకుంటుంటే, ఈ మెగా కాంట్రాక్టర్ మాత్రం ఏవిధంగా వందల కోట్లతో ప్రైవెట్‌ జెట్ కొనగలుగుతున్నారో, ఆ జిమ్మిక్కు ఏమిటో తెలియడం లేదంటున్నారు. ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ నష్టాల్లో నడుస్తుంటే, ఈ మెగా కాంట్రాక్టర్‌ ఒక్కడు మాత్రమే ఇలా దూసుకుపోవడం ఎలా సాధ్యమంటున్నారు?. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ ఈయనకే దక్కడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మెగా కాంట్రాక్టర్‌.... రెండు తెలుగు రాష్ట్రాలకు ముద్దుబిడ్డగా మారాడని, పైగా ఇప్పుడు ఇంద్రభవనంలాంటి ప్రైవేట్‌ జెట్‌‌తో ప్రభుత్వ పెద్దలను బుట్టలో వేసుకోవడం ఖాయమంటున్నారు. 

ఆ నది రూటు మార్చింది..

  మానవజాతి పుట్టుక, అభివృద్ధి అంతా నదుల దగ్గరే జరిగింది అని చరిత్ర చెబుతుంది. ఎరిడినాస్, ఇల్లిసాస్ నదుల తీరాన గ్రీకు నాగరికత, సింధునది ఒడ్డున హరప్పా మొహంజోదారో సంస్కృతి ఇలా చెప్పుకుంటూ పోతే నదులే నాగరికతకు జీవనాడులు. తమ గలగలలతో ఉన్న చోటును సస్యశ్యామలం చేస్తూ మనిషికి దాహాన్ని, ఆకలిని తీరుస్తున్నాయి నదులు. అలాంటి నదులకు తన చేతులారా కోపం వచ్చేలా చేస్తున్నాడు మనిషి. స్వార్థంతో వాతావరణాన్ని కలుషితం చేస్తూ తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. వాతావరణ కాలుష్యంతో భూతాపం విపరీతంగా పెరిగిపోయి మంచు వేగంగా కరిగితే పెను విధ్వంసం జరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నదులు తమ ప్రవాహ దిశను మార్చుకునే అవకాశం ఉందని వారు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు వారి భయం నిజమైంది. వాయువ్య కెనడాలోని ఓ హిమానీనదం గతేడాది ఒక్కసారిగా రూటు మార్చింది. ఆ నది ప్రవాహం గతంలో బేరింగ్ సముద్రంలో కలిసేది..కానీ గతేడాది నుంచి ఆ హిమానీనదం పసిఫిక్ మహాసముద్రం దిశగా పరుగులు తీయడం ప్రారంభించింది. భూతాపమే దీనికి కారణమని వాషింగ్టన్ యూనివర్శిటీ నిపుణులు గుర్తించారు. మంచు దిబ్బల చివరి ప్రాంతంలో ఏర్పడిన భారీ లోయ వల్లే ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. జరుగుతున్న ధ్వంసం చూస్తుంటే ప్రపంచంలోని మరిన్ని నదులు ఇలాగే దిశ మార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. నదులు తాము ప్రవహించే ప్రాంతం నుంచి రూటు మార్చితే ఇంకేమైనా ఉందా...?  జరిగే నష్టం ఊహకు కూడా అందదు. ఇకనైనా మనిషి ప్రకృతి గురించి కాస్త ఆలోచిస్తే మంచిది.

ఏటీఎంలలో డబ్బులు ఎందుకు ఉండటం లేదు

  దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి..నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఏటీఏంలలో డబ్బు అందుబాటులో ఉండటం లేదు. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే..ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్‌ అన్న మ్యాటరే. ఒక రకంగా పెద్ద నోట్లు రద్దు చేసిన పరిస్థితి కంటే దారుణంగా ఉంది బయట. ఢిల్లీకి చెందిన లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఇంతకంటే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. బ్యాంకులు ఏటీఎంలలో నగదు పెట్టకపోవడానికి కొన్ని కారణాలు చెప్పారు సర్వేలో పాల్గొన్న వారు.   * కేంద్ర ప్రభుత్వం ప్రజలను బలవంతంగా డిజిటలైజేషన్, ఆన్‌లైన్‌ చెల్లింపుల వైపు నెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.   * దేశంలో 90% మంది నగదు వాడుతుండగా..10% ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుగుతున్నాయి..ఇలా కాకుండా 90 శాతం ఆన్‌లైన్ లావాదేవీలు జరిగేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.   * ఆన్‌లైన్‌లో రూ.800 కోట్ల లావాదేవీలు జరగ్గా..దీనిని మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో డబ్బులే అందుబాటులో లేకుండా చేస్తోంది..బ్యాంకులకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ కావడంతో అవి ఏటీఏంలను తగ్గించే పనిలో పడ్డాయి.   * బ్యాంకులకు ఆర్బీఐ నుంచి అందుతున్న నగదులోనూ ఇప్పుడు భారీగా కోత పడుతోంది. గతంలో వారానికి పది నుంచి 10 నుంచి 12 సార్లు నగదు సరఫరా చేసే ఆర్బీఐ ప్రస్తుతం 5 సార్లు మాత్రమే సరఫరా చేస్తోంది.   * నగరాల్లో ఏటీఎంలను మూసేసి..ఉన్న వాటిలోనూ సరిపడా నగదు ఉంచకుండా..ప్రజలు డిజిటల్ లావాదేవీలు చేయక తప్పని పరిస్థితి కల్పించాలని బ్యాంకులు వ్యూహాలు రచిస్తున్నాయి.

భారతీయులారా మా దేశం రాకండి

  ప్రపంచంలో బాగా శ్రమించే వారు..అత్యంత నమ్మదగిన వ్యక్తులు అంటే టక్కున చెప్పే పేరు భారతీయలనే..దేశం ఏదైనా, ప్రాంతమేదైనా భారతీయులు ఉన్న చోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. చాలా దేశాలు తమ కంపెనీల్లో ఇండియన్స్‌ని ఏరి కోరి పెట్టుకుంటాయి..కానీ ఇదంతా గతం..ఇప్పుడు భారతీయులంటే ఎవరికీ గిట్టడం లేదు కారణం ఆయా దేశాల్లోని స్థానికులకు మన వాళ్లు ఉద్యోగాలు దొరకకుండా చేస్తున్నారట ..అన్ని చోట్లా భారతీయులే ఉన్నత స్థానాల్లో ఉంటున్నారనే ద్వేషం మన మీద పెరిగిపోతోంది. అందుకే ఇండియన్స్‌ని తమ దేశాలు రాకుండా వీసా నిబంధనల్లో కఠిన మార్పులు చేస్తున్నాయి ఆయా దేశాలు. అమెరికాలో ట్రంప్ ప్రచారంతో మొదలైన ఈ ధోరణి రోజు రోజుకి పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌లు ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండగా, ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడుస్తూ తాత్కాలిక ఉద్యోగ వీసా విధానంపై కొరడా ఝళిపించింది. నైపుణ్యాలతో ముడిపడిన ఉద్యోగాల్లో చేరేందుకు భారతీయులు ఉపయోగించుకునే 457 వీసా విధానాన్ని రద్దు చేసి..దాని స్థానంలో కొత్త నిబంధనలతో తాత్కాలిక వీసా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. స్థానికంగా వనరులు ఉన్నప్పటికీ..తక్కువ వేతనం ఇచ్చి పనిచేయించుకోవచ్చనే ఉద్దేశ్యంతో విదేశీయులను దీని కింద ఆస్ట్రేలియాకు తెస్తున్నారని ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ అన్నారు. 457 వీసా కింద ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నవారిలో అత్యధికులు భారతీయులే.   ఈ నిర్ణయం కారణంగా కొత్తగా ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయులు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇక మనదేశంపై అక్కసు వెళ్లగక్కుతున్న మరో దేశం బ్రిటన్ సంగతి చూస్తే..ఆ దేశం 2016 జనవరి నుంచి భారతీయ ఐటీ కంపెనీలకు వీసాల జారీని నామమాత్రం చేసింది. బ్రిటన్‌కు వచ్చే ఉద్యోగికి కనిష్ట వేతన పరిమితిని 30 వేల పౌండ్లకు పెంచింది. ఉద్యోగుల భార్య లేదా భర్త, తల్లిదండ్రులు రెండున్నరేళ్లకు మించి బ్రిటన్‌లో ఉండాలంటే..ఆంగ్ల భాషపై పట్టును పరీక్షించే కొత్త టెస్టును ఉత్తీర్ణులు కావాల్సిందేననే నిబంధన తెచ్చింది. ప్రస్తుతానికి ఈ మూడు దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేయగా వీటి బాటలో నడిచేందుకు సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇతర గల్ఫ్ దేశాలు రెడీ ఉన్నాయి. ఫలితంగా భారతీయుల విదేశీ కలలు చెదిరిపోతున్నాయి.

మహాభారతం టూ మోడ్రన్ భారత్ … ఎందరో బిజ్జలదేవుళ్లు!

  బాహుబలి సినిమా మన పురాణల్లోని కథ కాదు! కాని, అందులోని పాత్రలు మన పురాణాల్లోంచి ప్రేరణ పొంది సృష్టించినవే! మరీ ముఖ్యంగా, భల్లాలదేవుడి తండ్రి, శివగామి భర్త… బిజ్జలదేవుడు మహాభారతంలోని ధృతరాష్ట్రుడు! అక్కడ ముసలాయనకి కళ్లు వుండవు. ఇక్కడ బిజ్జలదేవుడికి చేయి సరిగ్గా లేక అవిటితనం వుంటుంది. కాని, బిజ్జలదేవుడు అచ్చూ ధృతరాష్ట్రుడి మాదిరిగానే కొడుకు మీద వ్యామోహంతో న్యాయం పట్ల గుడ్డివాడైపోతాడు. బాహుబలికి దక్కాల్సిన సింహాసనం… తన కొడుకు భల్లాలదేవుడు అర్హుడు కాకపోయినా, దుర్మార్గుడైనా… వాడికే దక్కాలనుకుంటాడు! ధృతరాష్ట్రుడు కూడా దౌర్జన్యానికి దిగిన తన దుర్మార్గపు కొడుకు, దుర్యోధనుడ్ని గుడ్డిగా సమర్థిస్తాడు!   భారతంలోని ధృతరాష్ట్రుడు, బాహుబలిలోని బిజ్జలదేవుడు ఇద్దరూ విలన్లే! కాదంటే విలన్లను సమర్థించిన వయసు ముదిరిన విలన్లు! ఇప్పటి ఆధునిక కాలంలోనూ ధృతరాష్ట్రులున్నారు రాజకీయాల్లో! అయితే, వారందర్నీ చెడ్డవారని జమకట్టాల్సిన పనిలేదు. కానీ, పాపం… ధృతరాష్ట్రుడు, బిజ్జలదేవుడి మాదిరిగానే చాలా మంది నేతలు తమ పుత్ర రత్నాల విషయంలో బలహీనతకి లోనయ్యారు. తాము కష్టపడి నారు వేసి, నీరు పోసిన పార్టీని ఎలాగోలా వారసుల చేతుల్లో పెట్టాలని రూల్స్ ని , టాలెంట్ ని పట్టించుకోకుండా పట్టాభిషేకాలు చేసేశారు! తరువాత అవ్వి ప్రజాస్వామ్యం దెబ్బకు, బ్యాలెట్ బ్యాటిల్లో బెడిసికొట్టాయి! చక్కగా ఎదిగిన పార్టీలు కాస్తా సన్ స్ట్రోక్ కు ఎండిపోయాయి!   ఈ మధ్య కాలంలో తనయుడి దెబ్బకు బాల్చీ తన్నిన పార్టీ ఎస్పీ! ములాయం దశాబ్దాలు కష్టపడి పెంచిన సమాజ్ వాది అఖిలేష్ ఐదేళ్ల పాలనలో ఘోరంగా పంక్చరైంది! ఇప్పుడప్పుడే టైర్లు, ట్యూబ్ లు మార్చుకునే స్థితిలో కూడా లేదు! పైగా ఈ యూపీ రాష్ట్ర భల్లాలదేవుడు… బిజ్జలదేవుడి లాంటి ములాయంపైనే తిరుగుబాటు చేసి రచ్చ రచ్చ చేశాడు! ములాయం, అఖిలేష్ లాంటి రాజకీయ తండ్రి, కొడుకుల జంటలు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో వున్నాయి! కాని, ప్రతీ చోటా ప్రూవ్ అవుతోన్న ఒకే ఒక్క సత్యం.. భారతమైనా, బాహుబలి అయినా, ఆధునిక భారతదేశమైనా… అధికారానికి ప్రధానంగా కావాల్సింది అర్హత! వారసత్వం కాదు! 

పరువు కోసం గర్బిణీ అని కూడా చూడకుండా..కూతుర్నే

దేశం అభివృద్ధిలో దూసుకువెళుతున్నా..శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా పరువు హత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు. కులం తక్కువ వాళ్లని చేసుకుందనో..వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందనో కారణం ఏదైనా తల్లిదండ్రులే పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ సంతానాన్నే ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరు పరువు హత్య. ఇందులో పరువు ఏమీ లేదు, హత్య మాత్రం ఉంది. తమ కులాన్ని, వంశాన్ని, ఇష్టాన్ని కాదన్నారన్న ఒకే కారణంతో తమ కూతురిని, ఆమెను ప్రేమించిన వ్యక్తిని హత్య చేయడానికి ఆమె కుటుంబం వెనుకాడటం లేదు. తాజాగా చెన్నైలోని అరియలూరు జిల్లా సెందురైలో ఇలాంటి ఘటనే జరిగింది.   కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని వెతికి పట్టుకుని మరీ హత్య చేశారు. సెందురై సమీపంలోని పొన్ పరప్పి గ్రామానికి చెందిన తంగరాజ్, భవానీల కుమార్తె షర్మిల సమీప గ్రామానికి చెందిన కలై రాజన్‌ను ప్రేమించింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో 2008లో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే షర్మిల కుటుంబీకులు ఆమెను వెతికి పట్టుకొచ్చి..సమీప బంధువుతో బలవంతపు వివాహం చేశారు..ఆమెకు ఓ ఆడపిల్ల జన్మించింది..బలవంతపు కాపురం ఇక తన వల్ల కాదంటూ 2013లో షర్మిల మరోసారి ఇంట్లోంచి పారిపోయింది.   తన మాజీ ప్రియుడు కలైరాజన్‌తో ఓ ఊరిలో సహజీవనం చేస్తోంది..ఈ క్రమంలో షర్మిల మరోసారి గర్భం దాల్చింది..షర్మిల ఆచూకీని మళ్లీ కనుగొన్న ఆమె కుటుంబసభ్యులు..మాయ మాటలతో ఇంటికి తీసుకువచ్చారు. ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి కలైరాజన్‌ను అల్లుడిగా స్వీకరించేందుకు అంగీకరించారు..అనంతరం షర్మిలను ఇంటికి తీసుకువెళ్లారు..ఇది జరిగిన రోజు రాత్రి షర్మిల శవమై కనిపించింది..మొదట దీనిని అంతా ఆత్మహత్య అనుకున్నారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం బయటపడింది. షర్మిలను ఇంటికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు గర్భం తొలగించుకోవాల్సిందిగా ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో..ఆగ్రహంతో తీవ్రంగా కొట్టారు.. తీవ్ర గాయాల కారణంగా షర్మిల మరణించింది. అయితే నిజం బయటపడకుండా ఉండేందుకు ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. 

మాల్యా అరెస్ట్ స్కెచ్ గీసింది అరుణ్ జైట్లీనా..?

బ్యాంకులకు లక్షల కోట్లు ఎగనామం పెట్టి..లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఆయన్ను అరెస్ట్ చేయించడానికి భారత ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐబీ, సీబీఐ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఎందుకంటే మాల్యా తలదాచుకుంది మనదేశంలోని ఏదో మారు మూల ప్రాంతంలో కాదు..బ్రిటన్ రాజధాని లండన్‌లో. మనదేశపు చట్టాలు వేరు..అక్కడి నిబంధనలు వేరు.   అందుకే ఎన్ని సార్లు మన దర్యాప్తు బృందాలు ముందుకు అడుగువేసినా రూల్స్ వెనక్కు లాగేవి. చివరికి మాల్యాను బలవంతంగా దేశం నుంచి పంపించేయాలని భారత విదేశాంగ శాఖ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ భారత్ విజ్ఞప్తిని యూకే తిరస్కరించింది. అయితే మాల్యాను అక్కడి నిబంధనల ప్రకారమే దారిలోకి తెచ్చుకోవాలని భావించిన ఈడీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహాయాన్ని కోరింది. దీనిలో భాగంగా 2 నెలల క్రితం లండన్ పర్యటనకు వెళ్లిన జైట్లీ అక్కడి కీలక నేతలను కలిసి..స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.   బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని రూ.9000 కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టారని లండన్ హైకమిషన్ అధికారులకు వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకమైన ఎగవేతదారుడిగా ఉంటూ..కేవలం చట్టం నుంచి తప్పించుకోవడం కోసమే మాల్యా బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారని జైట్లీ అధికారులకు వెల్లడించారు. ఆయనే సీనియర్ న్యాయవాదులతో మాట్లాడి..పక్కాగా కేసును రూపొందించడంతో స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. అంటే రెండు నెలల నుంచి వేటాడితే గానీ లిక్కర్ కింగ్ ఈడీ గాలానికి చిక్కలేదన్న మాట. 

ట్రంప్ ఒక్క సంతకం చేస్తే..ఇండియా పరిస్థితి ఏంటీ..?

సిరియాపై మిస్సల్స్..ఆఫ్గాన్‌పై అతిపెద్ద బాంబు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నెక్స్ట్ ఫోకస్ ఇండియాపై పెట్టారు. అమెరికా వస్తువులే కొనాలి..అమెరికా వారినే ఉద్యోగులుగా చేర్చుకోవాలని ఎన్నికల సందర్భంగా చెబుతూ వచ్చిన ఆయన ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై కొరడా ఝళిపించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన వీసా నిబంధనల ముసాయిదాపై ట్రంప్ సంతకం చేయనున్నారు. దీని ప్రకారం అత్యున్నత నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ఇతర దేశాల నుంచి అమెరికాలో అడుగుపెట్టవలసి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికన్లకు బాగానే ఉన్నప్పటికీ..ప్రపంచ దేశాలపై ముఖ్యంగా భారత్‌పై పెను ప్రభావం చూపించనుంది.   ట్రంప్ సంతకం చేస్తే అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం..హెచ్1బీ వీసాలను ప్రత్యేక విధులు నిర్వర్తించేందుకు మాత్రమే కేటాయిస్తారు. అంతేకాదు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి..శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కంప్యూటర్ ప్రొగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. గతంలో లాగా ఇష్టం వచ్చినట్లు వీసాలు జారీ చేయకుండా వాటిని 65 వేలకు పరిమితం చేసి లాటరీ విధానం ద్వారా కేటాయిస్తారు. విద్యార్థుల కోసం మరో 20 వేల వీసాలను కేటాయించనుంది. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత హెచ్1 బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య బాగా పడిపోయింది. గత ఏడాది 2,36,000 ఉన్న ఈ సంఖ్య ఈ సారి 1,99,000లకు పడిపోయింది. ట్రంప్ తమపై కఠినంగా వ్యవహరించడని భావిస్తోన్న భారతీయ ఐటీ కంపెనీలు, విద్యార్థులకు ఆయన నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో ఒకసారి చర్చలు జరిపి కొన్ని మినహాయింపులు అడిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

నెహ్రూ పవర్‌ ముందు అనంత రక్తచరిత్ర దిగదుడుపే

అనంతపురం రక్తచరిత్రకు ఎంత పేరుందో, బెజవాడ రౌడీయిజానికి అంతకంటే ఒక ఆకు ఎక్కువే ఉంటుంది. చలసాని వెంకటరత్నంతో మొదలైన కథ... అనేక మలుపులు తిరిగి, చివరికి వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వార్‌తో రక్తచరిత్రగా మారింది. 1978-79 నాటికి అది తీవ్ర రూపం దాల్చింది. ఒకప్పుడు కలిసి పనిచేసిన వంగవీటి-దేవినేని కుటుంబాలు.. ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుకుంటూ రక్తచరిత్రను రాసుకున్నారు. మొదట్లో వంగవీటి వర్గం పైచేయి సాధించినట్లు కనిపించినా, దేవినేని నెహ్రూ ఎంట్రీతో అది తారుమారైంది. తన సోదరులు దేవినేని గాంధీ, మురళిల హత్యతో రగిలిపోయిన నెహ్రూ... అందుకు తిరుగులేని ప్రతీకారం తీర్చుకున్నారని అంటారు. అంతేకాదు ప్రత్యర్ధులు కనీసం తన నీడను కూడా తాకలేని స్థాయికి దేవినేని నెహ్రూ ఎదిగారు.   తన సోదరుడు దేవినేని మురళి హత్యకు గురయ్యాక.... శపథం చేసి మరీ వంగవీటి రంగాను నెహ్రూ మట్టుబెట్టాడని నేటికీ విజయవాడ వాసులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మురళి సంవత్సరీకంలోపే వంగవీటి రంగా అంతు చూస్తానని శపథం చేసిన దేవినేని నెహ్రూ.... తాను అన్నట్లుగానే 9 నెలల్లోపే రంగాను అడ్డుతొలగించాడని చెబుతారు. అయితే రంగా హత్యకు ప్రతీకారంగా నెహ్రూని చంపేస్తామని రంగా అనుచరులు శపథం చేసినా అది వాళ్ల వల్ల కాలేకపోయిందట. అందుకు నెహ్రూ తీసుకున్న జాగ్రత్తలే కారణం . ఇంటి నుంచి కాలు బయటికి పెట్టాలన్నా, వంద రకాలుగా ఆలోచించేవారట. ఎంతో తెలివిగా, ముందుచూపుతో వ్యవహరిస్తూ ప్రత్యర్ధులకు చిక్కకుండా తిరిగేవారట. అందుకే వందసార్లు పైగా నెహ్రూని చంపేందుకు రంగా వర్గీయులు ప్రయత్నించినా తప్పించుకోగలిగారని బెజవాడ టాక్.   ఇంకో విషయం ఏంటంటే రంగా హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నెహ్రూని అంతం చేయాలనుకున్న రంగా వర్గీయులకు నిరాశే ఎదురైందట. శత్రుశేషం లేకుండా రంగాకి కుడిభుజం, ఎడమభుజాలుగా చెప్పుకునే ముఖ్యమైన వ్యక్తులను నెహ్రూ వర్గీయులు మట్టుబెట్టారట. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్ల రూలింగ్‌లో ....అపోజిషన్‌లో ఉండి కూడా వంగవీటి వర్గంలోని పదిమందికి పైగా హత్యకు గురయ్యారట. దీంతో విజయవాడపై దేవినేని నెహ్రూకి తిరుగులేని పట్టు దొరికింది. నెహ్రూ ఎంత పవర్‌ఫు‌‌ల్‌గా ఎదిగారంటే... రంగా వర్గీయులు.... తన అనుచరుల్లో ఒక్కరినీ కూడా టచ్ చేయలేనంతగా. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా కూడా రంగా వర్గీయులను ముట్టుబెట్టడంతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో దేవినేని నెహ్రూ ప్రాబల్యం పెరిగింది. అప్పటి నుంచి నెహ్రూ చెప్పిందే వేదం... మాటే శాసనంగా మారింది.

ఎన్టీఆర్‌తో నెహ్రూ అనుబంధం ప్రత్యేకం..

బెజవాడ... పౌరుషానికి, ప్రతీకారానికి ప్రతీక... బెజవాడ ఊరుకాదు... ఒక చరిత్ర. ఆ చరిత్రలో దేవినేని నెహ్రూ అంతర్భాగం. ఆయన పేరు లేనిదే బెజవాడ రౌడీయిజాన్ని, రాజకీయాన్ని ప్రస్తావించలేం... ఆయన గురించి చెప్పనిదే బెజవాడ రౌడీ రాజకీయాలకు పరిపూర్ణతే రాదు. స్టూడెంట్స్ పాలిటిక్స్ మొదలు... రాజకీయంగా బెజవాడ నగరాన్ని శాసించే స్థాయివరకు ఆయన జీవితంలోని ప్రతీ మలుపూ ఆసక్తికరమే.   విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైన నెహ్రూ రాజకీయ ప్రయాణం... తెలుగుదేశం రాకతో కొత్త మలుపు తిరిగింది. రాజకీయ నేపథ‌్య కుటుంబం నుంచి వచ్చిన నెహ్రూ.... విద్యార్ధి రాజకీయాల్లో చురుగ్గా పాల్గోనేవారు. నెహ్రూ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే యునైటెడ్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ స్థాపించారు. అలా స్టూడెంట్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ, 1982లో తెలుగుదేశంలో చేరి, స్టేట్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.   కంకిపాడు నుంచి నాలుగుసార్లు, విజయవాడ తూర్పు నుంచి ఒకసారి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ....ఎన్టీఆర్‌కు వీర విధేయుడుగా, అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. ఎన్టీఆర్‌ హయాంలోనే టీడీపీ తరపున నాలుగుసార్లు కంకిపాడు నుంచి వరుసగా విజయం సాధించిన నెహ్రూ.... సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1996 సంక్షోభ సమయంలో నెహ్రూ... ఎన్టీఆర్‌ పక్షానే నిలిచారు. ఎన్టీఆర్‌‌తో అంత సన్నిహితంగా ఉండేవారు నెహ్రూ. అందుకే తనకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని తండ్రీకొడుకుల బంధంతో పోల్చిచెప్పేవారు.    చివరివరకు ఎన్టీఆర్‌‌తో ఉన్న నెహ్రూ ఆయన మరణాంతరం కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్‌ నుంచి నాలుగుసార్లు పోటీ చేస్తే, ఒక్కసారి మాత్రమే 2004లో విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌‌లో ఉన్నప్పటికీ ఎన్టీఆరే తమ దైవమని చెప్పుకునేవారు. అయితే ఏ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో, తన చివరి రోజుల్లో మళ్లీ అదే పార్టీలో చేరి, తెలుగుదేశం జెండా కప్పుకుని వెళ్లిపోతానన్న నెహ్రూ తన మాట నెగ్గించుకున్నారు.

ఎన్నికల్లో హామీలు... ఎదురుచూపుల్లో జనాలు… మధ్యలో కోర్టులు!

ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు సాధారణంగా అమలుకు నోచుకోవు. వాట్ని ఖచ్చితంగా అమలు చేయాలన్న రూల్ కూడా లేదు. అందుకే, ఎన్నికల మ్యానిఫెస్టోలోని దాదాపు 90శాతం హామీలు మళ్లీ ఎన్నికల నాటికి నిక్షేపంగా వుండిపోతాయి. అవే హామీల్ని అదే పార్టీ తిరిగి వల్లెవేయటమో, లేదా గతంలో వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు సమర్థించి తాము అమలు చేస్తామని చెప్పటమో జరుగుతూ వుంటుంది! కాని, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కి ఎన్నికల హామీలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో చెప్పని పనులు చకచకా జరిగిపోతోన్న చెప్పినవి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి!   అసెంబ్లీలో ముస్లిమ్ , ఎస్టీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన కొన్ని గంటల్లోనే సుప్రీమ్ కోర్టులో టీఆర్ఎస్ కు చుక్కెదురైంది. అయితే, ఈ తీర్పు రిజర్వేషన్ల గురించి కాదు. సింగరేణి వారసత్వ నియామకాలపై! ముందు ముందు మత ఆధారిత రిజర్వేషన్ల అంశం కూడా ఎలా కొనసాగబోతోందో ఈ తీర్పే తేల్చి చెప్పేస్తోంది! అసలు ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకి… వారసత్వ ఉద్యోగాలకి సై అంటాం… అని హామీ ఇచ్చే ముందు కేసీఆర్ ఆలోచించుకున్నారా? కోర్టుల్లో ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి అని అంచనా వేశారా? పరిస్థతి చూస్తుంటే అలాంటిదేం జరగలేదనిపిస్తోంది!   ఎప్పుడో ఆపేసిన వారసత్వ ఉద్యోగాల్ని పునరుద్ధరిస్తామని టీఆర్ఎస్ ఎలక్షన్స్ కి ముందు హామీ ఇచ్చింది. దాదాపు 25 నియోజకవర్గాలు, 3 లోక్ సభ స్థానాల్ని గెలిపించటంలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. అందుకే, గులాబీ పార్టీ రిస్క్ చేసి మాటిచ్చింది. అనుకున్నట్టే గెలిచింది. కానీ, ఇప్పుడు హామీని అమలు చేద్దామంటే కుదరటం లేదు. హైకోర్ట్ తో బాటూ అత్యున్నత న్యాయస్థానం కూడా వారసత్వంగా ఉద్యోగం ఇవ్వటానికి వీలులేదని తేల్చేసింది. నిజంగా కూడా లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంటే పదవి విరమణ చేసిన వారి సంతానానికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? తగిన పరీక్ష, ఇంటర్వ్యూ లాంటివి జరిగాకే అర్హులకి ఉద్యోగం దక్కాలి. కోర్టులు చెబుతోంది అదే! గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోన్న వారి వ్యక్తిగత ఆస్తి కాదు కదా…   వారసత్వ ఉద్యోగాల మంచి , చెడులు పక్కన పెడితే అసలు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో పార్టీలు , నాయకులు పాటించాల్సిన నియంత్రణ అంటూ ఏం లేదా? ప్రజలు నమ్మి ఓట్లు వేశాక తీరా కోర్టులు అడ్డుపడితే రాజకీయ పక్షాలు చేతులెత్తేసి తప్పించుకునే అవకాశాలే ఎక్కువ! తెలంగాణలో ఇప్పుడు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ముస్లిమ్ రిజర్వేషన్ల విషయంలో అదే జరిగేలా కనిపిస్తోంది. పట్టుదలగా కేసీఆర్ ఎన్నికల హామీల్ని ఏదో ఒక విధంగా అమలు చేస్తే తప్ప కోర్టుల అడ్డంకుల్ని దాటుకుని ఈ నిర్ణయాలు కార్యరూపం దాల్చే అవకాశం లేదు! 

రెండాకుల పార్టీని… పువ్వు పార్టీ… హైజాక్ చేసేసిందా?

ఒకప్పుడు ఛాయ్ అమ్ముకున్నాడని చెప్పే పన్నీర్ సెల్వం… మరో వైపు దేశాన్నే ముందుకు దూకిస్తున్న అసలు సిసలు ఛాయ్ వాలా మోదీ… ఆయన అభిప్రాయాలకు, అంచనాలకు అనుగుణంగా నడుచుకునే అపర చాణక్యుడు, పక్కా గుజరాతీ పొలిటికల్ కిల్లర్ అమిత్ షా! వీళ్లు చాలరన్నట్టు ఇప్పుడు స్వంత వర్గంగా వుంటూ వచ్చిన పళనిస్వామి కూడా రివర్స్ అయిపోయాడు శశికళ అండ్ దినకరణ్ లకు! రాజకీయంలో, రౌడీయిజంలొ తమకు ఎదురులేదనుకున్న మన్నార్ గుడి మాఫియా ఇప్పుడు విలవిలలాడిపోతోంది! రెండాకుల పార్టీని తమ గుత్త సొత్తని భావించిన శశి వర్గం ఇప్పుడు మోదీ నుంచీ పన్నీర్ దాకా అందరూ ఏకమై పావులు కదిపే సరికి… వారంతా తమ కంటే రెండాకులు ఎక్కువే చదివారని అర్థం చేసుకుంటోంది!   జయ బతికి వున్నప్పుడు అమ్మ చాటు బిడ్డల్లా బతికిన శశికళ, ఆమె కుటుంబం ఇప్పుడు నిజమైన కరుడుగట్టిన పాలిటిక్స్ వేడిని అనుభవిస్తున్నారు. అతి తెలివికిపోయి జైలుకి వెళ్లేలోగానే సీఎం అవ్వాలని కలలుగన్న చిన్నమ్మ ఇప్పుడు జైల్లో సామాన్య ఖైదీగా వుంది. మరో వైపు ఆమె నియమించిన ఆమె ఉప ప్రధాన కార్యదర్శి దినకరణ్ ఈసీకే లంచం ఇవ్వజూపిన కేసులో ఇరుక్కున్నాడు. ఇక అరెస్ట్ ఒక్కటే మిగిలి వుంది. అన్నిటికంటే ఆందోళనకరంగా, శశికళ నమ్మి ముఖ్యమంత్రిని చేసిన ఈ. పళనిస్వామి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపాడని టాక్! శశికళ, దినకరణ్ జైళ్లలో వుండగానే అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమై మళ్లీ ఒకే పార్టీగా అవతరించాలనుకుంటున్నాయట! అదే జరిగితే పళని స్వామీ ఆకు ఒకటి, పన్నీర్ సెల్వం ఆకు ఒకటి కలిసి… రెండాకుల ఏఐఏడీఎంకే ప్రతిష్ఠాత్మక ఎన్నికల గుర్తు గొడవ తీరిపోయినట్టే!   రెండాకుల గుర్తు తాను ఉప ప్రధాన కార్యదర్శిగా వున్న అన్నా డీఎంకే వర్గానికి చెందేలా దినకరణ్ పావులు కదిపాడు. అందుకోసం, అరవై కోట్లు లంచం ఇవ్వటానికి కూడా సై అన్నాడు. ఇదంతా ఎందుకూ అంటే.. ఆ రెండాకుల గుర్తు వుంటేనే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓట్లు పడతాయి. దినకరణ్ గెలుస్తాడు! కాని, కేంద్రంలో వున్న మోదీ సర్కార్ తమకంటే రెండాకులు ఎక్కువే రాజకీయం చదివిందని దినకరణ్ గ్రహించలేకపోయాడు. మొదట్నుంచీ శశికళ బ్యాచ్ వారి రౌడీ రాజకీయాలకి వ్యతిరేకంగా వుంటూ వస్తోన్న ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీగా లంచం కేసులో ఇరికించేసింది దినకరణ్ ని! ఇక ఇప్పుడు ఆయన ఎంతో ఎక్కువ సేపు జైలు బయట వుండే పరిస్థితులు లేవు. మరి ఆయన కూడా శశికళ బాటలోనే జైలుకి వెళితే పరిస్థితి ఏంటి?   ప్రస్తుతం రెండు వర్గాలుగా వున్న ఈపీఎస్, ఓపీఎస్ పార్టీలు శశికళ , దినకరణ్ ల బెదిరింపులు లేకపోతే తక్షణం ఏకమైపోతాయి. ఇది పెద్దగా ఆశ్చర్యకరం కాదు. అసలు కథంతా ఆ తరువాతే వుండనుంది. ఇప్పుడు తెర వెనుక నుంచి డ్రామా నడిపిస్తోన్న బీజేపి పెద్దలు ముందు ముందు నేరుగానే ఎంట్రీ ఇవ్వొచ్చు. జయలలిత లాంటి కరుడుగట్టిన నేత లేకుండా స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేను ఎదుర్కోవటం చాలా కష్టం. కాబట్టి పన్నీర్ సెల్వం, పళని స్వామి వచ్చే ఎన్నికల లోపు తమ ఎమ్మేల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అందరితో సహా కమల కండువాలు కప్పుకోవచ్చు! అన్నాడీఎంకే ఒక చరిత్రగా మిగిలిపోయి బీజేపి తమిళనాడులో ప్రధాన పక్షంగా ఎదగవచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక విలీనం జరగకున్నా… సగానికి సగం సీట్లు పంచుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపితో పొత్తు పెట్టుకోవటం మాత్రం అన్నాడీఎంకేకి తప్పనిసరి. కారణం కేంద్రంలోని సర్కార్ నుంచి నిధులు రాకుండా పన్నీర్ కాని, పళని కానీ ఏం చేయలేని పరిస్థితి వుంది. అలాగే, స్టాలిన్ రాజకీయాన్ని ఎదుర్కోవటం కూడా మోదీ, అమిత్ షా లాంటి వారి నాయకత్వంలో ముందుకు సాగితేనే వీలవుతుంది. ఈ కాలిక్యులేషన్స్ అన్నిట్నీ చూపిస్తూ కొందరు రాజకీయ పండితులు ముందు ముందు తమిళనాడు కాషాయమయం అవకాశాలు లేకపోలేదంటున్నారు!