టీ అసెంబ్లీ VS ఏపీ అసెంబ్లీ…
posted on Mar 31, 2017 @ 3:33PM
ఈ మధ్య కాలంలో ఇంచుమించూ ఒకేసారి తెలంగాణ, ఆంధ్రా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అటుఇటుగా ఒకేలా జరిగాయి కూడా! రోజూ ఏదో ఒక విషయంపై చర్చ కంటే రచ్చ ఎక్కువ జరిగింది. కాని, ఏపీ అసెంబ్లీ తెలంగాణ శాసనసభని గందరగోళం విషయంలో చాలా సార్లు దాటేసింది! ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని స్థితి నెలకొంటూ వచ్చింది. మరీ ముఖ్యంగా, లేడీ ఎమ్మెల్యేలు సభ లోపలే కాదు సభ బయట మీడియా పాయింట్ దగ్గర కూడా తోసేసుకుని తిట్టేసుకుని చరిత్ర సృష్టించారు. అసలు ఇందులో ఎవరి తప్పు వుందో కూడా అర్థం కానంత అరాచకం రాజ్యమేలింది! అయితే, ఏపీ అసెంబ్లీ మొదట్నుంచీ ఇలాగే నడుస్తోంది!
ఆంధ్రా అసెంబ్లీకీ పూర్తి భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ నడుస్తోందా అంటే … అదేం కాదు! కేసీఆర్ నాయకత్వంలోని సభలోనూ కేకలు, అరుపులు మామూలే. అయినా కూడా అమరావతిలోని సీన్స్ కంటే హైద్రాబాద్ లో కాస్త బెటర్! టీటీడీపీ, టీ బీజేపి ఎమ్మెల్యేల్ని బహిష్కరించటం లాంటివి పక్కన పెడితే మిగతా అంతా కాస్త పద్ధతిగానే నడిచిందని చెప్పొచ్చు! దీనికి కారణం ఏంటి? ఒకే సమైక్య రాష్ట్రం నుంచీ విడివడ్డ రెండు సభల్లో ఈ వ్యత్యాసం ఎందుకు?
ఆంధ్రా అసెంబ్లీలో గోలని కాస్త తీక్షణంగా అధ్యయనం చేస్తే మనకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది! తెలంగాణ సభలో కంటే ఏపీ సభలో ప్రతిపక్షం కాస్త స్ట్రాంగ్. దాని వల్ల అధికార పక్షం డామినేషన్ తట్టుకోలేక తిరగబడుతున్నారు. కాని, టీ అసెంబ్లీలో టీ కాంగ్రెస్ నేతలది ఎవరి తొవ్వ వారిదే! ఇక అందరూ కలిసి కేసీఆర్ సైన్యాన్ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. దీని వల్ల సభ హాయిగా నడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది. అలాగే, అక్కడ ఆంధ్ర అసెంబ్లీలో జగన్ పార్టీ సభ్యులు అయినా దానికి కాని దానికి స్పీకర్ పోడియం చుట్టు ముడుతున్నారు. వీళ్ల ప్రతాపం తెలిసే అంత ఎత్తున సభాపతిని కూర్చోబెట్టినా ఎగిరి గంతులేస్తూ అయోమయం సృష్టిస్తన్నారు. అంత దారుణమైన ఉత్సాహం తెలంగాణ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు … ఏ పార్టీల వారిలోనూ కనిపించదు మనకి! రోజా రేంజ్లో కలకలం రేపి సంవత్సరం పాటూ సస్పెండ్ అయిన వీర లేడీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ అసెంబ్లీలో వున్నట్టు అనిపించటం లేదు!
ఆంధ్రా అసెంబ్లీలో గొడవలన్నీ ప్రతిపక్షం వారు జనం కోసమే చేస్తున్నారా అంటే అలా కూడా అనిపించదు! చాలా సార్లు వ్యక్తిగత పట్టుదలతోనే గందరగోళం నెలకొంటోంది. దీనికి అధికార పక్షం వారు కూడా మినహాయింపు కాదు. కాని, ఎక్కువ సార్లు మాత్రం జగన్ మొండితనంతో చర్చ జరగకుండా చేసేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగిపోయిన తన ఎమ్మెల్యేలకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. చంద్రబాబు మీద నేరుగా పర్సనల్ దాడి చేసేస్తూ తన పార్టీ నాయకులకి అలాగే చేయాలన్నట్టు సంకేతాలు పంపుతున్నారు. దాంతో వారు మరింత చెలరేగి అధినేత మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టెన్త్ పేపర్ల లీకేజీ చర్చలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. జగన్ ఎక్కడ చదివాడో తనకు తెలియదని బాబు ఎద్దేవ చేస్తే తాను పీహెచ్ డీ మధ్యలో డిస్ కంటిన్యూ చేయలేదని జగన్ అన్నారు. అంతే కాదు, చంద్రబాబుకి సరిగ్గా ఇంగ్లీషు రాదంటూ కూడా జగన్ ప్రతి దాడి చేశారు. ఇవన్నీ జనానికి ఏ మాత్రం ఉపయోగపడని మాటలే!
తెలంగాణ అసెంబ్లీతో పోలిస్తే ఆంధ్రా సభలో రచ్చకి అసలు కారణం నేతల వ్యక్తిగత అహాలు దెబ్బతినటమే! చర్చని కేవలం రాజకీయాల వరకే పరిమితం చేస్తే సభ హుందాగా సాగే అవకాశాలుంటాయి!