బట్టలు విప్పితే కాని ప్రభుత్వానికి అర్థం కాదా..?

తీవ్రమైన కరువు, వ్యవసాయంలో నష్టాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు సాయం చేయాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమిళకూలీలు చేసిన నగ్న ప్రదర్శన యావత్ జాతిని ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన నిరసన వేరు..నిన్న జరిగింది వేరు. బ్యానర్లు, ఫ్లకార్డులు, డౌన్ డౌన్ అనే నినాదాలు మాత్రమే నిరసన తెలిపేందుకు ఇప్పటి వరకు వాడిన సాధనాలు. కాని తమిళ రైతులు తెలిపిన నిరసన మాత్రం వినూత్నమైనది..విభిన్నమైనది. తమను ఆదుకోవాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో ఉండే ఆందోళన చేస్తున్నా.. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో నగ్నప్రదర్శనకు దిగారు  రైతులు. ఏకంగా శరీరంపై నూలు పోగు లేకుండా మొండిమొలతో పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెడుతూ..పీఎంవోలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.   ఈ వార్త దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. అయితే ఇలాంటి నగ్న ప్రదర్శనలు భారతావనికి కొత్త కాదు. 2004లో మనోరమ అనే మహిళను అస్సాం రైఫిల్స్‌కు చెందిన సైనికులు విచారణ పేరిట బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఆ మరుసటి రోజు ఆమె అర్థనగ్నంగా రోడ్డుపై శవమై తేలింది. ఆమె మృతదేహాన్ని చూసిన ఎవరికైనా మనోరమ అత్యాచారానికి గురైందని అర్థమవుతుంది. ఆమె హత్యకు నిరసనగా పదకొండు మంది మహిళలు పూర్తిగా వివస్త్రలై నగ్నంగా ప్రదర్శన నిర్వహించి సంచలనం సృష్టించారు.   "సైనికులారా మమ్మల్ని కూడా రేప్ చేయండి" అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శిస్తూ అస్సాం రైఫిల్స్ కార్యాలయం ముందు నగ్న ప్రదర్శన చేశారు. ఇంత ధైర్యం చేసినా న్యాయం జరిగింది లేదు. కారణం, ఆనాడు ఇంతటి మీడియా సౌలభ్యం లేదు..పైగా అస్సాం రైఫిల్స్ ఉన్నతాధికారులు ఈ వార్తను బయటకు రానీయలేదు. కానీ నిన్న తమిళ రైతులు ఏకంగా దేశ రాజధానిలోనే నగ్న దీక్ష చేయడంతో మీడియా, రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రజలు అందరూ అటెన్షన్ అయ్యారు. దీనిని చూసిన కొందరు యువత బట్టలు విప్పితే కానీ పాలకులు మాట వినరంటూ సెటైర్లు వేస్తున్నారు..చూస్తే అది నిజమే అనిపిస్తుంది కదూ.

పెద్దల సభల వల్ల పెద్దగా ఉపయోగం వుందా?

  ప్రజాస్వామ్యం అంటే ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అంటారు! కాని, కొన్ని వ్యవస్థలు మాత్రం ప్రజస్వామ్యంలో విచిత్రంగా, విషాదంగా వుంటాయి. కేవలం ప్రజాధనం దుబారా చేసేందుకు ఇవ్వి ఉపయోగపడుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటే పెద్దల సభకి కొంత మందిని నామినేట్ చేయటం! నిజానికి డెమోక్రసీ అంటే జనం మద్దతుతో పార్లమెంట్ కు రావటం! దానికి విఘాతం కలిగేలా పని చేసేదే రాష్ట్రాల స్థాయిలో శాసన మండలి, జాతీయ స్థాయిలో రాజ్యసభ! ఈ రెండు సభల్లోనూ నాయకుల్ని జనం ఎన్నుకోరు. ఎమ్మెల్సీల్ని కొందర్ని గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఎన్నుకున్నా సామాన్య జనం అందరూ ఓటు వేసే వీలుండదు. ఇక రాజ్యసభలో అయితే అందరూ పరోక్షంగా ఎన్నుకోబడ్డవారే! అయితే, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడతారు కాబట్టి వార్ని కూడా మనం ఎంచుకున్నట్టే లెక్కా! రాజ్యసభ అభ్యర్థుల విషయంలో ఆయా పార్టీల నిర్ణయామే ఫైనల్! అందుకే, దాదాపుగా అన్ని పార్టీలు పెద్దల సభ వ్వవహారాన్ని రాజకీయ పునరావాసంగా మార్చేశాయి! కొంత మంది దమ్మున్న రాజకీయ నేతలు తప్ప మిగతా వారంతా తమకు రాజ్యసభలోకి పార్టీల ప్రాపకాన్ని పొంది వచ్చిన వారే! బిజినెస్ మెన్ , జర్నలిస్టులు, స్పోర్ట్స్ స్టార్స్, సినిమా స్టార్స్… ఇలా అందరికందరూ పెద్దల సభనే ఎంచుకుంటూ వుంటారు. కారణం జనం ముందకు పోయి ఓట్లు అడిగి గెలవాల్సిన పని లేకపోవటమే!   ఎన్నో కీలకమైన బిల్లుల ఆమోదంలో ప్రధాన పాత్ర పోషించే రాజ్యసభ జనం ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎన్నికైనా వారితో వుండవచ్చా? ప్రస్తుతం 2014 నుంచీ పూర్తి మెజార్టీతో వున్న మోదీ సర్కార్ రాజ్యసభ గండాన్నే ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు విపక్షాలు అనేక బిల్లుల్ని రాజ్యసభలో అడ్డుకుంటున్నాయి. ఇది జనం నమ్మి అధికారాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని పని చేయనీయకపోవటమే తప్ప మరోకటి కాదు! గతంలో కాంగ్రెస్ అధికారంలో వుంటే బీజేపి కూడా రాజ్యసభలో అడ్డుకున్న సందర్భాలున్నాయి!   రాజ్యసభలో జనం చేత నేరుగా ఎన్నుకోని నాయకులు బిల్లులకి అడ్డు చెప్పటం ఒక ఎత్తైతే … మరి కొందరు సెలబ్రిటీలు రాజ్యసభ సభ్యత్వాన్ని కేవలం ఒక అవార్డ్ లాగా భావించటం మరింత శోచనీయం! ఈ విషయంలో పదే పదే ప్రస్తావనకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్, బాలీవుడ్ లివింగ్ లెజెండ్ రేఖ! వీరిద్దరూ దేశానికి చేసిన సేవ ఎవ్వరూ కాదనలేనిది! వారి వల్ల భారత్ కీర్తి ఇనుమడించింది. కాని, వీరు ఇద్దరూ రాజ్యసభకి నామినేట్ అయిన వారే. సరిగ్గా 5 ఏళ్ల కిందట ఏప్రెల్ 2012లో సచిన్, రేఖ పెద్లల సభలో కాలుమోపారు. అప్పటి నుంచీ మొత్తం 348 రోజులు సభ నడిస్తే వీరిద్దరూ పాల్గొన్నది పాతిక రోజులు కూడా లేదు! ఏ ఒక్కసారీ ఏ చర్చలోనూ సచిన్, రేఖ పాల్గొనలేదు. రేఖ అయితే కనీసం ఒక్క ప్రశ్న అన్నా అడగలేదు!   సచిన్ , రేఖా లాంటి వారు రాజ్యసభకు రాకపోతే ఏమవుతుంది? వారు సెలబ్రిటీలు కదా …. గౌరవ సూచకంగా వారికి సభ్యత్వం ఇచ్చి వుంటారు… అని కూడా కొందరికి అనిపించవచ్చు! కాని, దేశ అభివృద్ది కోసం ఉద్దేశించిన రాజ్యసభలో మెంబర్ అయి వుండీ ఎలాంటి సలహాలు, సూచనలు చేయకపోవటం, కనీసం అభిప్రాయాల్ని అయినా వ్యక్తపరచకపోవటం … సబబు కాదు. మరో విషాదం ఏంటంటే… సచిన్ , రేఖా లాంటి యాబ్సెంట్ సెలబ్రిటీల జీత, భత్యాలకి భారీగా ఖర్చవుతుంటుంది! రేఖ కోసం ఇప్పటి వరకూ 65 లక్షలు , సచిన్ కోసం 59లక్షలు ప్రజాధనం వృథా అయిందట! ఇది లివింగ్ లెజెండ్స్ గా పరిగణింపబడుతున్న వారికి ఎంత మాత్రం గౌరవం కాదు!   రాష్ట్రాల స్థాయిలోని శాసన మండళ్లనీ . జాతీయ స్థాయిలోని రాజ్యసభని మనం అప్ డేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చినట్టే అనిపిస్తోంది. ఈ రెండు వ్యవస్థల్లోని నాయకులు మరింత ఎక్కువగా జవాబుదారీతనంతో వుండేలా, దేశ అభివృద్ధికి చురుగ్గా తోడ్పాటు అందించేలా నియమాలు మార్చాలి. సంస్కరణలు తేవాలి!

పొలిటికల్ గా… స్పెషల్ స్టేటస్ ఇక మీదట నథింగ్ స్పెషల్!

తెగేదాకా లాగొద్దంటారు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు వ్యవహారం తెగిపోయినట్టే కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభలో జరిగిన చర్చ చూస్తే ఎవరికైనా అదే అర్థం అవుతుంది! కాంగ్రెస్ నాయకుడు కేవీపీ ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ అంటూ సభలో మాట్లాడారు. ఇంకా కొందరు ఏపీ ఎంపీలు కూడా హోదా కావాలని నినదించారు. కాని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం? స్పెషల్ స్టేటస్ అసాధ్యమని తేల్చి చెప్పేసింది!   జగన్ నుంచీ పవన్ దాకా అందరూ ప్రత్యేక హోదా అంటూనే వున్నాఅందరికీ లోలోన మాత్రం అలాంటి సీన్ లేదని బాగానే తెలుసు. అయితే గియితే సామాన్య జనం, అభిమానులు, కార్యకర్తలు ఆవేశపడ్డారు. అదీ ఇప్పుడు తగ్గిపోయింది. మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్లు, టీచర్లు అంతా కలిసి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపి పార్టీ అభ్యర్థినే ఎమ్మెల్సీగా ఎంచుకున్నారు. ఇందుకు కారణం, టీడీపీ మద్దతు వుండటం కూడా అని చెప్పుకోవచ్చు. కాని, ప్రత్యేక హోదా విషయంలో జనంలో వుండాల్సినంత ఆగ్రహం ఏం లేదనిపిస్తోంది పరిస్థితి చూస్తోంటే! అందుకే, వైజాగ్ ఆర్కే బీచ్ లో మౌన ప్రదర్శన మొదలు ఎవరు ఏ ఉద్యమానికి, ఏ నిరసనకి పిలుపునిచ్చినా జనం సంస్పదన ఆశించనంత వుండటం లేదు.   పార్లమెంట్ సాక్షిగా దేశం మొత్తం లైవ్ లో చూస్తుంటే మోదీ సర్కార్ నో స్పెషల్ స్టేటస్ అనేసింది. దీని వెనుక ఉద్దేశం ఏంటి? ఒకటి… పైకి చెబుతున్నట్టుగా నీతి ఆయోగ్ రావటంతో ప్రత్యేక హోదాలు ఇవ్వటం ఇక మీదట కుదరదు. ప్రత్యేక హోదాకు తగినంత స్థాయిలో ప్రత్యేక లాభాలు ఏపీకి ఆల్రెడీ సమకూర్చటం జరిగింది. ఇక ఈ కోణమే కాకుండా బీజేపి వ్యవహార శైలికి మరో కారణం కూడా వుంది. తమని భారీ మెజార్టీతో యూపీలో గెలిపించిన ఓటర్లకి భారీ నజరాన ప్రకటించింది. వేల కోట్ల రైతు ఋణాలు మాఫీ చేసింది. కాని, అదే తమకు అధికారం లేని, వచ్చే అవకాశం కూడా లేని తమిళనాడులో రైతుల రుణమాఫి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయటం లేదు. ఎన్నో రోజులుగా తమిళ రైతులు ఢిల్లీ వీధుల్లో దీక్ష చేస్తున్నా వార్ని పట్టించుకోవటం లేదు. కారణం… రాజకీయ లెక్కలే!   తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ బీజేపికి పెద్దగా బలం లేదు. ఓటర్లు ప్రత్యేక హోదా ఇచ్చినా … ఇవ్వకున్నా కమలానికి భారీగా ఎంపీ సీట్లేం కటబెట్టరు. మహా అయితే స్పెషల్ స్టేటస్ క్రెడిట్ మిత్రపక్షం టీడీపీకి దక్కవచ్చు! అందుకే, ఈ కోణంలో ఆలోచించి మోదీ ప్రభుత్వం ప్రత్యేక హాదా ఇంపాజిబుల్ అని తెగేసి చెబుతోంది! ఇక ఇప్పుడు ఆంధ్రాకు మిగిలిన మార్గం… కేంద్రంతో సఖ్యంగా వుంటూ సాధ్యమైనన్ని నిధులు పొందటమే! రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు మొదట్నుంచీ ఇదే చెబుతున్నారు. పవన్, జగన్, ఇతర నేతలే మైకులు ముందు హడావిడి చేసి పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తూ వచ్చారు… 

మనకు పాక్ వల్ల సమస్యలు కాదు… పాకిస్తానే సమస్య!

1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి నిజంగా స్వేచ్ఛ లభించిందా? కాదనే చెప్పాలి. అందుక్కారణం… పక్కలో బల్లెంలా గుచ్చుకుంటూ వస్తోన్న పాకిస్తానే! ఆర్దిక రంగం నుంచీ అంతరిక్ష రంగం దాకా మనం ఎన్ని విజయాలు సాధించినా పాకిస్తాన్ పాడు బుద్ది నుంచి మాత్రం మనల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. నేరుగా యుద్ధాలు చేసి ఓడిపోయిన పాక్ తన నక్క జిత్తులతో రోజుకోసారి భారత్ ని కవ్విస్తోంది. తాజాగా మన భారతీయుడైన కుల్భూషణ్ జాదవ్ ను ఉరితీయటానికి పూనుకుని తన రాక్షస ప్రవృత్తి బయటపెట్టింది…   భారత్, పాక్ మధ్య గూఢచర్యం ఆరోపణలు కొత్తవేం కావు. ఇరు దేశాలు అప్పుడప్పుడూ కొందరు వ్యక్తుల్ని గూఢచర్యం చేస్తున్నారంటూ అరెస్ట్ చేస్తుంటాయి. అయితే, ఇప్పటి వరకూ పాక్ ఎంతో మందిని రా ఏజెంట్లంటూ కటకటాల పాలు చేసింది. ప్రాణాలు కూడా తీసింది. కాని, ఎప్పుడూ సరైన సాక్ష్యాధారాలు అంతర్జాతీయ సమాజం ముందు వుంచలేకపోయింది. మరో వైపు ఇండియా ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరు దొరికినా చట్ట ప్రకారం విచారణ జరిపి శిక్షలు వేస్తూ వస్తోంది. గూఢచారుల్ని ఉరి తీయటం ఇప్పటి వరకూ ఏనాడూ జరగలేదు. కాని, అత్యంత తాజాగా కుల్భూషణ్ జాదవ్ విషయంలో కూడా పాకిస్తాన్ తన అరాచకత్వాన్ని చాటుకుంది. ఏ విచారణ, ఎలాంటి చట్టబద్ధమైన పద్ధతి పాటించకుండా సైనిక కోర్ట్ ద్వారా ఉరిశిక్ష విధించేసింది. ఒకవేళ నిజంగానే మాజీ నేవీ అధికారి అయిన జాదవ్ … గూఢచారి అయినా .. ఇది సరైంది కాదు. ఉరి తీసేంత ద్రోహం, నేరం జాదవ్ చేసినట్టు ఎక్కడా సాక్ష్యాలు లేవు…   భారత్ పార్లమెంట్లో మన దేశానికి చెందిన కుల్భూషణ్ పై పాక్ రాక్షసత్వంపైన చర్చ జరిగింది. పార్టీలకతీతంగా అందరూ పాకిస్తాన్ ది తప్పేనని అన్నారు. విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు కూడా. అయితే, ఎన్నో యుద్దాల్లో చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్ ఎప్పుడూ మారలేదు. ఇప్పుడు కూడా మారుతుందని ఆశించటం దురాశే. కాబట్టి కుల్భుషణ్ జాదవ్ సంరక్షణకి ఇండియా వీలైనంత ఒత్తిడి తీసుకురావలి. అప్పటికీ ఉగ్రవాద దేశం తన బుద్ధి మార్చుకోకపోతే… పాకిస్తాన్ కారణంగా బలయ్యే చివరి భారతీయుడు జాదవే అయ్యేలా శాశ్వత నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే… రాత్రికి రాత్రి సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మన ఆర్మీని పూర్తిస్థాయిలో వేటకి అనుమతిచ్చి వదిలేయాలి. ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటూ అటు బలూచిస్థాన్ కు స్వాతంత్ర్యం కలిగించాలి. మిగిలిన పాక్ ను కూడా ఎన్ని ముక్కలు చేయొచ్చో ఆలిచించాలి. ఎందుకంటే, మన సమస్యలకి పాకిస్తాన్ ఉగ్రవాదులు కారణం కాదు. నేరుగా పాకిస్తానే కారణం. అందుకే, పాక్ అంటూ అసలు ఒక దేశమే లేకుండా చేయటం తప్పేం కాదు!   పాకిస్థాన్ ను సైనికంగా జయించి ముక్కలు చేయటం అనుకున్నంత తేలిక కాదు. చైనా మద్దతు కూడా వుంది కాబట్టి మరింత కఠినం కూడా. అయినా కూడా మోదీ సర్కార్ ఈ దారుణమైన సమస్యకు చరిత్రలో నిలిచిపోయే పరిష్కారం ఖచ్చితంగా వెదకాలి. అందుకు తగిన సమయం ఇదే! ఇప్పటికే ఆలస్యమైపోయిందని దేశంలోని అత్యధిక జనం భావిస్తున్నారు… 

పార్టీయా? ప్రభుత్వమా? ధర్మ సంకటంలో చంద్రబాబు..!

  ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ...విమర్శలు, ఆరోపణలతోపాటు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే పోటీపడి మరీ విమర్శలను తిప్పికొట్టేవారు తెలుగు తమ్ముళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీ ఫస్ట్.. ప్రభుత్వం....నెక్ట్స్ అన్న ధోరణి కనిపిస్తోంది. దీనికి తోడు రెండింటి మధ్య తేడా లేకపోవడంతో.....ఏ విమర్శలు, ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రే అన్నింటికీ కౌంటర్‌ ఇవ్వాల్సి వస్తోంది. ఒకవైపు 2019 ఎన్నికల టైమ్ దూసుకొస్తుంటే.. తమ్ముళ్ల తగవులు తీర్చడంలోనే చంద్రబాబు సమయమంతా గడిచిపోతోంది.   సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లే టైముంది. పైగా ఏం చేసినా ఏడాదిన్నరలోపే చేయాలి. అంతేకాదు ఇటు ప్రభుత్వాన్ని, అటు పాలనను సమన్వయం చేసుకుంటూ సమర్ధవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. పాలనను పరుగులు పెట్టిస్తూనే, పార్టీకి కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది, లేదంటే గాడి తప్పే ప్రమాదముంటుంది. ఇప్పుడిదే ఏపీ సీఎం చంద్రబాబుకు సమస్యగా మారిందంటున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై పెట్టినంత శ్రద్ధ పార్టీపై పెట్టడం లేదని అంటున్నారు. బాబు తన  సమయమంతా అసంతృప్తులను అలకలను చక్కబెట్టడానికే సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయ్‌.   గతంలో ఎప్పుడూ లేనివిధంగా టీడీపీ నేతలు అధిష్టానంపైనే బహిరంగంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది, వేటుపడిన ఐదుగురు మంత్రులతోపాటు మంత్రి పదవి దక్కలేదన్న కోపంతో ధూలిపాళ్ల, గోరంట్ల, చింతమనేని, బోండా ఇలా అనేకమంది బాహాటంగానే తిరగబడ్డారు. మిగతా జిల్లాల్లో సిఎం నిర్ణయంమీద అసంతృప్తి ఉన్నా బహిరంగంగా వెళ్లగక్కలేకపోయారు. దాంతో నేతలను బుజ్జగించడానికే చంద్రబాబు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా అసంతృప్తులు, అలకలను చక్కబెట్టుకోడానికే విలువైన సమయాన్నంతా వినియోగిస్తుంటే పాలనపై, పార్టీ పట్టు బిగించడం ఎలా సాధ్యమవుతుందంటున్నారు.   మరో రెండేళ్లలో ఎన్నికలు ముంచుకొస్తుంటే.. ఆ దిశగా పార్టీలో కసరత్తు జరగడం లేదు. పార్టీ-ప్రభుత్వం, రెండూ ఎన్నికలకు సన్నద్ధం కావడం లేదు. సమయమంతా అసంతృప్తులు, బుజ్జగింపులకే కేటాయించాల్సి రావడంతో రెండువైపులా నష్టం జరుగుతోంది. కనీసం ఇప్పుడైనా అలకలు, బుజ్జగింపుల సీన్ కు స్వస్తి చెప్పి.. వెంటనే పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసి, సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ ఇదే సీన్ కంటిన్యూ అయితే.... 2019 ఎన్నికల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోక తప్పదు.

సైలెంట్‌గా కేడర్‌ నిర్మాణం... పవన్‌ పిలుపునకు సూపర్‌ రెస్ఫాన్స్‌

  జనసేన పార్టీలో యువతకు పెద్దపీట వేస్తానన్న పవన్ కల్యాణ్‌... పక్కా ప్లాన్‌‌తో ముందుకెళ్తున్నారు. ఒకపక్క సినిమాలు చేసుకుంటూనే, మరోపక్క సైలెంట్‌గా పార్టీ కేడర్‌ నిర్మాణం పూర్తిచేసుకుంటూ పోతున్నారు. సమస్యలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో క్యాడర్‌ నిర్మాణం పూర్తి చేస్తే, ప్రజల తరపున గొంతు వినిపించేందుకు మార్గం మరింత సులువవుతుందని భావిస్తోన్న జనసేన అధినేత... వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రజాసమస్యలపై పార్టీ తరపున గొంతు ఎత్తేందుకు జిల్లాల వారీగా జన సైనికులను నియమించుకుంటున్నారు. అయితే ఎవరికి బడితే వాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించకుండా ఒక వ్యూహం ప్రకారం ఎంపిక ప్రక్రియ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ గ్రేడ్‌ లీడర్ల ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రజాసమస్యలను గుర్తించి, పోరాటం చేసే యువకులను ఏరికోరి మరీ సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. అందుకే ప్రజాసమస్యలపై పోరాడే యోధులైన జన సైనికులు కావాలంటూ పవన్‌ విడుదల చేశారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి నాంది పలుకుతూ ఇలా జనసేన విడుదల చేసిన ప్రకటనకు సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. ముందుగా అనంతపురం జిల్లా నుంచి కార్యాచరణ ప్రారంభించిన పవన్‌.... స్థానిక, జిల్లా, రాష్ట్రస్థాయి సమస్యలపై అవగాహన ఉన్నవారిని ఆహ్వానించారు. దాంతో అనంతపురం జిల్లా నుంచి వివిధ స్థాయిలో జనసేన కోసం పనిచేస్తామంటూ 10వేల మందికి పైగా ముందుకొచ్చారు. ఈ పదివేల మందిలోనూ అందరినీ తీసుకోకుండా, ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరిని మాత్రమే ఎంపిక చేసుకోనున్నారు. ఫైనల్‌గా ఎంపికైన లిస్ట్‌ను పవన్‌ కల్యాణే అధికారికంగా ప్రకటించనున్నారు.   ఒక్క అనంతపురం జిల్లా నుంచే పదివేలమంది పైగా ముందుకు రావడం, గడువు ముగిసినా ఇంకా వేలకొలది దరఖాస్తులు వస్తుండటంతో జనసేన లీడర్లు ఉబ్బితబ్బితవుతున్నారు. పవన్‌ పిలుపునివ్వాలే గానీ... జనసేన పార్టీకి లీడర్లు, కార్యకర్తలకు కొదువే ఉండదంటున్నారు. ప్రజాసమస్యలపై పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలన్న పవన్‌ పిలుపునకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చిందని, త్వరలో అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో కేడర్‌ నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు.

2019 టార్గెట్‌గా కేసీఆర్‌ కొత్త గేమ్‌... కాంగ్రెస్‌, బీజేపీల్లో కలవరం

  ఆపరేషన్‌ ఆకర్ష్‌... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయ్‌, అంతలా ఉంది దాని ఎఫెక్ట్‌. ఆపరేషన్‌ ఆకర్ష్‌ దెబ్బకి పార్టీల మనుగడే ప్రశ్నార్ధకంగా మారగా... కొన్ని పార్టీలైతే మొత్తం తుడిచిపెట్టుకునిపోయే పరిస్థితి. ఇటు తెలంగాణలో కేసీఆర్... అటు ఏపీలో చంద్రబాబునాయుడు... ఇద్దరూ ఆపరేషన్‌ ఆకర్ష్‌లతో ప్రత్యర్ధి పార్టీలను దెబ్బకొట్టినవాళ్లే. అయితే ఏపీలో చంద్రబాబు దెబ్బకు వైసీపీ తట్టుకుని నిలబడినా, తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ స్ట్రాటజీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు టీడీపీ కుదేలైపోయాయి. తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. నలుగైదుగురు ఒకరిద్దరు మినహా ముఖ్యనేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. అయితే మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కేసీఆర్‌ ముహూర్తం ఫిక్స్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది. దాంతో ప్రతిపక్షాల్లో కలవరం మొదలైంది.   కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ దెబ్బకి కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి 12మంది, సీపీఐ నుంచి ఒక్కరు, వైసీపీ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే గులాబీ కండువా కప్పేసుకోగా, ఇప్పుడు తాజాగా మరికొందరు కారెక్కడానికి రెడీగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ రోజు వీళ్లంతా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ సీనియర్లతో టచ్‌లో ఉన్నారనే చెబుతున్నారు. ఇటీవల డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డితో పాటు ఎంపీ నంది ఎల్లయ్యలు... ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలవడం అనుమానాలకు తావిచ్చింది. పేరుకు పాలమూరు ప్రాజెక్టులపై కలిసినా, ఇంటర్నల్‌గా టీఆర్‌ఎస్‌లో చేరడంపైనే చర్చలు జరిగాయనే టాక్ బయటికొచ్చింది. దాంతో మలిదశ ఆపరేషన్ ఆకర్ష్‌‌కు బూస్ట్ ఇచ్చినట్లైంది.   కేసీఆర్‌ను కలిసిన పాలమూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో అందరూ కారెక్కకపోయినా, ఇద్దరు మాత్రం కచ్చితంగా ప్లీనరీ రోజు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటివరకూ బీజేపీని టచ్‌ చేయని కేసీఆర్‌... ఈసారి కమలం పార్టీని కూడా టార్గెట్‌ చేశారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్న బీజేపీని దెబ్బకొట్టేందుకు, కమలం పార్టీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రం ప్రయోగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ వలలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు పడ్డారని, వాళ్ల కూడా త్వరలోనే కారెక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.   2019 ఎన్నికలే టార్గెట్‌‌గా కేసీఆర్‌ మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌‌కు తెరతీశారన్న సమాచారంలో ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. మరి కేసీఆర్‌ కొత్త గేమ్‌లో ఈసారి ఎన్ని వికెట్లు పడతాయో చూడాలి.

ప్రైవేట్ లేక… ఆర్టీసీ రాక… జనానికి తప్పదా కాక

సంవత్సరం మొదట్లో వచ్చే సంక్రాంతి మొదలు చివర్లో వచ్చే దసరా, క్రిస్మస్ వరకూ మనకు ప్రతీ నెలా పండగలే. కాని, అందరికీ బాగా జ్ఞాపకం వుండేది మాత్రం సంక్రాంతి, దసరా లాంటి పండుగలే. అందుక్కారణం హైద్రాబాద్ నుంచి తమ తమ ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చేయాల్సి వచ్చే సర్కస్ ఫీట్లే! అసలు పెద్ద పండగ ఏదైనా వచ్చిందంటే చాలు ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే ప్రయాణీకులకి చుక్కలు కనిపిస్తుంటాయి. ఆకాశంలో ఎగిరే విమానాలు మొదలు, ట్రైన్లు, బస్సులు అన్నీ ఫుల్లే! అయినా కూడా అందరూ హాయిగా గమ్యం చేరుకుంటారా అదే లేదు! నానా తంటాలు పడి వెళ్లటమో, లేదంటే వాయిదా వేసుకోవటమో చేయాల్సిందే!   ఇప్పుడు ఏ పండగా లేకున్నా… హైవేలపై బస్సుల్లో రద్దీ లేకున్నా… ఎందుకీ డిస్కషన్ అంటే… తాజాగా మూతపడ్డ కేశినేని ట్రావెల్స్ వల్లే! కేశినేని బస్సుల్ని ఆ సంస్థ యజమాని ఎందుకు ఆపేశారు అనేది ఇక్కడ ప్రధానం కాదు. దాని వెనుక కొందరు రాజకీయ కారణాలు వెదికితే కొందరు ఆర్దిక కారణాలు వెదుకుతున్నారు. అందులో ఏవైనా నిజం అవ్వొచ్చు. కాని, మొన్నా మధ్య కాళేశ్వరీ ట్రావెల్స్ కూడా సర్వీసులు ఆపేసింది. ఇప్పుడు కేశినేని బస్సులు షెడ్డుకు చేరుకున్నాయి. వీటి ఫలితం ఎలా వుండబోతోంది?   సాధారణంగా ప్రయాణీకుల రద్దీ పెరిగినా , వరుస సెలవులు వచ్చిన ప్రైవేట్ బస్సులు కళకళలాడుతాయి. ప్రైవేట్ ట్రావెల్ ఓనర్స్ జనాన్ని దోచుకుంటారని ఆరోపణలు వున్నా … ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లటం ప్రైవేట్ బస్సులు లేకుండా సాధ్యం కాదు. పూర్తిగా రైళ్లు, ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడితే తగినన్ని సర్వీసులు, సీట్లు లేక ప్రయాణాలు చేయటం వట్టి మాటే అవుతుంది. అందుకే, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరమైనా కూడా జనం ప్రైవేటు బస్సులు ఎక్కేస్తుంటారు. కాని, ఇప్పుడు ఆ ప్రైవేటు ట్రావెల్స్ కూడా చేతులు ఎత్తేస్తే జనం పరిస్థితి ఏంటి?   రాబోయే పండుగల సీజన్లో ఎప్పటిలాగే రద్దీ వుంటుంది. కాని, కేశినేని, కాళేశ్వరీ ట్రావెల్స్ తరహాలో మరిన్ని కంపెనీలు బిజినెస్ కి దూరమైతే జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది ఆర్టీసీకి మంచి అవకాశమే అయినా రెండు రాష్ట్రాల ప్రభుత్వ బస్సులు ఒత్తిడి తట్టుకుంటాయా? డౌటే! కాకపోతే, ఏపీ, తెలంగాణ సర్కార్లు భద్రంగా జనాల్ని గమ్యాలు చేర్చే ఆర్టీసీకి తగినంత ప్రొత్సాహం, సహకారం ఇస్తే గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ మూతపడటానికి కారణాలు ఏవైనా సురక్షితమైన ఆర్టీసీ సేవలు ప్రజలకి పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే అది అందరికీ మంచిదే! ఆదాయం రూపంలో గవర్నమెంట్ కి, ఆర్టీసీ కూడా ఎంతో మేలు జరుగుతుంది! 

అసెంబ్లీకి పరుగు తీద్దామనుకున్న దినకరన్… కాలడ్డుపెట్టిన ఈసీ

అమ్మ, చిన్నమ్మ ఇద్దరూ లేని అన్నాడీఎంకేకి అర్కే నగర్ ఎన్నికలు చుక్కలు చూపిస్తున్నాయి. జయలలిత సమాధిలోకి చేరుకుంటే… శశికళ సుదూరంగా బెంగుళూరులో బెంగగా కూర్చుంది. అదే ఇప్పుడు శశికళ వర్గానికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఢిల్లీ నుంచి ఎదురయ్యే ఒక్కో ఎత్తూ ఎదుర్కోవటం పళని స్వామికి ఉన్నపళంగా సాధ్యం కావటం లేదు. పైగా శశికళ మేనల్లుడు దినకరన్ భవిష్యత్ కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికతోనే ముడి వుండటంతో… మిగతా అన్ని పార్టీల కన్నా శశికళ అన్నాడీఎంకే వర్గానికి టెన్షన్ ఎక్కువగా వుంది!   ఈసీ ఆర్కే నగర్ ఉప ఎన్నికని వాయిదా వేయటం పెద్ద ఆశ్చర్యకరమేం కాదు! ఎందుకంటే, అది రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర వ్యవస్థ అయినా రూలింగ్ పార్టీ ఒత్తిడి ఎంతో కొంత పని చేస్తుందని చెప్పే పని లేదు! అంతే కాదు, శశికళ టీమ్ మన్నార్ గుడి మాఫియాపై ముందు నుంచీ మోదీ సర్కార్ గుర్రుగానే వుంది. అందుకే, శశికళని సీఎం అవ్వకుండా చేసి ప్రస్తుతం జైలులో సాదాసీదా ఖైదీలా వుండేలా చేసింది. అదే ఫార్ములాను ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనూ వాడుతున్నట్టు కనిపిస్తోంది!   దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ధన ప్రవాహం మామూలే. అదే జరిగింది జయలలిత మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గంలోనూ! కాని, ఈసీ అనూహ్యంగా ఐటీ రైడ్స్ వంక చూపుతూ ఎలక్షన్నే వాయిదా వేసింది. ఇది మంచి పరిణామే అయినప్పటికీ దీని వెనుక ఉద్దేశం బహిరంగ రహస్యమే! జయలలిత స్థానం నుంచీ గెలిచేసి అసెంబ్లీలో కాలు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్న దినకరన్ ను సాధ్యమైనంత మేర అడ్డుకోవటమే కేంద్రంలోని బీజేపి లక్ష్యం. అందులో భాగంగానే అడ్డంగా డబ్బులు పంచుతూ దొరికిన శశికళ వర్గాన్ని ఎన్నికల వాయిదాతో చిరాకు పరుస్తోంది. ఇప్పటికే దినకరన్ వ్యాఖ్యల్లో ఆయన ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎలక్షన్ కమీషన్ కూడా నా విజయాన్ని అడ్డుకోవాలనుకుంటోంది… అంటూ ఈసీనే టార్గెట్ చేశాడు! మోదీ సర్కార్ కి కావాల్సింది .. ఖచ్చితంగా ఇదే!   ఆర్కే నగర్ లో డబ్బులు పంచేసి శశికళ వర్గం గెలుస్తుందని అందరూ ఊహించిందే! దాన్ని అడ్డుకోవటానికి ఎవ్వరి వద్దా ఎలాంటి మంత్ర దండం లేదు. అయినా సరే చివరి వరకూ గెలుపు అసాధ్యమయ్యేలా వ్యూహాలు పన్నుతున్నారు పన్నీర్ సెల్వం సహా ప్రత్యర్థులంతా! వారికి ఈసీ తీసుకున్న వాయిదా నిర్ణయం, ఆదాయ పన్ను శాఖ దాడులు, భారీగా లభించిన అక్రమ సొమ్ము… ఇవన్నీ కలిసొచ్చే అంశాలే! అయినా, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం దినకరన్ గెలుపును అడ్డుకోవటం ఆసామాషి కాదట! వాయిదాతో కాస్త లేటుగా అయినా ఖచ్చితంగా అసెంబ్లీలో కాలుపెడతాడని అంటున్నారు. అదే జరిగితే తమిళనాడుకి మరో కొత్త ముఖ్యమంత్రితో పాటూ కొత్త గందరగోళమూ తప్పకపోవచ్చు!

బాలీవుడ్ పై మేనక గాంధీ సంచలన వ్యాఖ్యలను ఎవరెలా తీసుకుంటున్నారు

  శుక్రవారం గోవా ఫెస్ట్‌కు హాజరైన కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్‌ పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాల పెరుగుదలకు బాలీవుడ్‌ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ కొందరు సమర్ధించగా మరి కొందరు ఖండించారు.   కొన్ని మహిళా సంఘాల నేతలు మేనక గాంధీకి బాసటగా నిలిచారు. "సినిమాలు నిజంగానే యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంచి కన్నా చెడుని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈవ్ టీజింగ్, మహిళలపై అకృత్యాలు వంటివి బాలీవుడ్ ప్రభావం వల్ల జరుగుతున్నాయి," అని ఒక ప్రముఖ మహిళా నేత తన అభిప్రాయం వెలిబుచ్చారు.   మరో వైపు కొందరు బాలీవుడ్‌ దర్శక-నిర్మాతలు మేనక గాంధీ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. సినిమా పరిశ్రమ శక్తిని తక్కువగా చూడొద్దని నిర్మాత అశోక్‌ పండిట్‌ కోరారు. సినీ పరిశ్రమపై  విమర్శలకు దిగడం ఫ్యాషన్‌గా మారిపోయిందని  విమర్శించారు. చాలా  మంది అగ్రదర్శకులు  మహిళా ప్రధాన సినిమాలను తీశారని గుర్తుచేశారు.

జగన్… సాక్షీ మీడియాకి సాక్షి మాత్రేమేనట!

గులాబీ పువ్వు అందంగా వుంటుంది! కాని, దానికి ముళ్లు కూడా వుంటాయి! జగన్ కు ఈ విషయం అంతగా తెలిసినట్టు లేదు. స్వంతంగా మీడియాను పెట్టుకుని ఆయన ఇంతకాలం చాలా మంది కథనాలు రాయించుకున్నారు. స్టోరీస్ ప్రసారం అయ్యాయి. కాని, తీరా అదే సాక్షి పేపర్, టీవీ వల్ల ఇప్పుడు ఆయనకి గండం ఎదురుకావటంతో .. తన మీడియాకి తనకి ఎలాంటి సంబంధం లేదనేస్తున్నారు! సాక్షి మీడియాకు తాను కేవలం సాక్షినే తప్ప అందులో తన ప్రమేయం, తన బాధ్యత ఏం లేదన్నట్టు మాట్లాడేశారు!   సాక్షి మీడియాకి మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదం అయింది. దాన్ని ఆధారం చేసుకునే సీబీఐ జగన్ బెయిల్ రద్దు చేయమంటూ కోర్టుకు వెళ్లింది. ఆ ఇంటర్వ్యూ సాక్షుల్ని ప్రభావితం చేసేలా వుందని సీబీఐ వాదన వినిపిస్తోంది. ఈ కేసులో ఏ మాత్రం తేడా వచ్చినా జగన్ మరోసారి జైలుకి వెళ్లాల్సి రావచ్చు. అలా జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం కాని ఆయన తాజా ఢిల్లీ పర్యటన కూడా అందుకే అంటున్నారు కొందరు విమర్శకులు. రాష్ట్రపతిని కూడా కలిసిన జగన్ బెయిల్ రద్దు కాకుండా వుండేలానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, కోర్టులో మాత్రం ఆయన తరుఫు లాయర్లు జగన్ మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూకి , జగన్ కి సంబంధం లేదని చెప్పుకొచ్చారు!   సాక్షిలో వచ్చిన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఫ్రీల్యాన్స్ జర్నలిస్టు చేసిందనీ, దానికి సాక్షి మీడియాని నడిపే జగన్ కి ఎలాంటి సంబంధం లేదనీ కోర్టు ముందు వాదనలు వినిపించారు లాయర్లు! టెక్నికల్ గా దీన్ని కోర్టు ఒప్పుకుంటుందేమో చూడాలి.కాని, ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఆయన డబ్బుతో నడిచే సాక్షి మీడియాలో ఎవరిది పడితే వారిది ఇంటర్వ్యూ వేసేస్తారా? జగన్ కి ఎంత మాత్రం సంబంధం వుండదా? కానే కాదు! జగన్ కోసం, జగన్ రాజకీయ విజయం కోసమే సాక్షి పని చేస్తుందన్నది జగమెరిగిన సత్యం! అయినా అందులో వచ్చిన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఒక్క దానికి మాత్రం తనకు సంబంధం లేదంటే ఎలా?   ఇప్పుడు సాక్షిలో వచ్చిన ఇంటర్వ్యూ ముల్లు తనకు గుచ్చుకోకుండా చూసుకుంటోన్న జగన్… నిండు అసెంబ్లీలో సాక్షి పత్రికను బోలెడు సార్లు లైవ్ లో ప్రదర్శించారు! ఆయనే కాదు… వైఎస్ బతికి వుండగా కూడా అసెంబ్లీలో… ఆ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా టీడీపీని, చంద్రబాబును కడిగిపారేసేవారు! అంటే… వైఎస్, జగన్ వ్యతిరేకుల్ని సాక్షి టార్గెట్ చేసినప్పుడు అది వాళ్లకు ఓకే. కాని, దాని వల్లే బెయిల్ రద్దయ్యే గండం దాపురిస్తే మాత్రం … సాక్షికి జగన్ కేవలం సాక్షి మాత్రమే అయిపోతారు! అంతేనా! ఒక్కోసారి మన గన్నే అయినా పొరపాటున పేలిపోయి ప్రమాదానికి దారి తీస్తుంటుంది! అందుకే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటారు పెద్దలు…

ప్రధాని అవ్వలేకపోయాడు… రాష్ట్రపతి అక్కర్లేదంటున్నాడు!

లాల్ కృష్ణ అడ్వాణీ … ఈ పేరు ఆధునిక భారతీయ చరిత్రలో ఎవ్వరూ మరవలేనిది. ఇష్టం వున్నా, లేకున్నా అడ్వాణీని మాత్రం ఎవ్వరూ పట్టించుకోకుండా మాత్రం వుండలేరు! అంతగా ప్రభావితం చేశారు ఆయన దేశాన్ని! మరీ ముఖ్యంగా తన రథ యాత్రతో కాంగ్రెస్ , ఇతర లౌకికవాద పార్టీల పునాదులకి 1980లలోనే బీటలు పడేలా చేశారు. అదే ఇవాళ్ల అద్భుత ఫలితాలు ఇస్తోంది. మోదీ లాంటి ప్రధానిని, యోగీ లాంటి ముఖ్యమంత్రిని భారీయులకి అందించింది! కాని, అడ్వాణీ తాజా వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని, బీజేపి కార్యకర్తల్ని అందర్నీ షాక్ కి గురి చేశాయి!   వాజ్ పేయి పక్కనే వుంటూ అన్ని కార్యాలు చక్క పెట్టిన అర్జునుడు అడ్వాణీ! అర్జునుడి లాగే అధికారం వచ్చేదాకా ఎంతో శ్రమించిన ఆయన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని అభ్యర్థిగా వాజ్ పేయినే సమర్థించారు! తాను హోం, డిప్యూటి ప్రధాని పదవులకే పరిమితం అయ్యారు. ఆ తరువాత ఎన్నికల్లో బీజేపి వరుసగా రెండు సార్లు ఓడిపోవటం, మూడోసారి కల్లా మోదీ తెరపైకి రావటంతో అడ్వాణీ ప్రధాని కల నెరవేరకుండానే మిగిలిపోయింది! అందుకే, ప్రధాని అవ్వలేకపోయిన అడ్వాణీని రాష్ట్రపతిని చేసి గురు దక్షిణ చెల్లిద్దామని మోదీ భావించినట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. కాని, తాజా న్యూస్ ప్రకారం అడ్వాణీ తనకు దేశాధ్యక్ష పదవిపై ఇంట్రస్ట్ లేదని చెప్పారట!   అడ్వాణీ రాష్ట్రపతి పదవి ఆఫర్ తిరస్కరిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కాని, ఆయన ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగానే రాష్ట్రపతి రేసులో తాను లేనని తే్ల్చేశారట! ఇందుకు కారణం ఏమై వుంటుంది అన్నది ఇంకా తెలియలేదు. మోదీ తనని ఓవర్ టేక్ చేసి ప్రధాని కావటం ఆయన ఇప్పటికీ జీర్ణించుకున్నట్టు లేదు. బీహార్ ఎన్నికల వైఫల్యం అప్పుడు కూడా అడ్వాణీ మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా అనేక సార్లు ఆయన 2014 నుంచీ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వస్తున్నారు. ఆయన టీమ్ గా ముద్రపడ్డ అరుణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా వగైరా వగైరా లాంటోళ్లు కూడా మోదీ మీద వీలైనప్పుడల్లా విమర్శలు చేస్తూనే వున్నారు! ఈ నేపథ్యంలోనే మోదీ ఆఫర్ చేసే రాష్ట్రపతి పదవి అడ్వాణీ స్వీకరించదలిచి వుండకపోవచ్చు!   ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ బాగవత్ కూడా తాను మీడియాలో ప్రచారం జరిగినట్టు రాష్ట్రపతి రేస్ లో లేనని చెప్పారు. ఇప్పుడు అడ్వాణీ కూడా తప్పుకోవటంతో జూలైలో ఎవ్వరూ ఊహించని వ్యక్తి భారతదేశానికి ప్రథమ పౌరుడు అయ్యే అవకాశం కనిపిస్తోంది! 

2019 తెలంగాణ సీఎం ఎవరో తేలిపోయినట్టేనా?

శ్రీరామ నవమినాడు అందర్నీ ఆకట్టుకున్న ఒక సన్నివేశం… భద్రాచల శ్రీరామచంద్రునికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి మనవడు తీసుకురావటం! అయితే, ఇది కరెక్టా? కాదా? అనేది వేరే చర్చ. దాని జోలికి మనం వెళ్లకున్నా … కేసీఆర్ మాత్రం క్రమంగా తన బాధ్యతలన్నీ కొడుకు , మనవడి నెత్తిన పెడుతున్నారన్నది నిజం! ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో డిస్కస్ అవుతోంది! స్వామి వారి పట్టు వస్త్రాల్ని పళ్లెంటో పెట్టి మనవడి నెత్తిన పెట్టేసిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కూడా పళ్లెంలో పెట్టి తనయుడు కేటీఆర్ నెత్తిన పెట్టేస్తున్నారని కొందరి అభిప్రాయం! జరుగుతోన్న పరిణామాలు కూడా అదే అనుమానాన్ని బలపరుస్తున్నాయి! టీఆర్ఎస్ లో నెంబర్ టూ ఎవరంటే ఇప్పుడు అందరి సమాధానం కేటీఆరే! ఒకవైపు హరీష్ రావు, మరో వైపు కవిత వున్నా క్రమంగా మేఘాలు తొలిగిపోతున్నాయి. తారక రాముడు చంద్రశేఖరుడి రాజకీయ వారసుడు కూడా అని తేలిపోతోంది! తాజాగా జరుగుతోన్న టీఆర్ఎస్ బహిరంగ సభలు, వాటిల్లో గులాబీ నేతల పొగడ్తలు, ఆహా, ఓహోలు దీన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి! నిజామాబాద్ లోని ఆర్మూర్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. అందులో నిజామాబాద్ ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. వేదికపై అన్నాచెల్లెళ్ల అనుబంధం అందర్నీ ఆకట్టుకుంది. కవిత పార్లెమంట్లో అద్బుతంగా మాట్లాడే అయిదుగురు వక్తల్లో ఒకరని కేటీఆర్ అంటే… రామన్న తనకే కాదు తెలంగాణలోని అందరికీ అన్నేనని కవితక్క చెప్పుకొచ్చింది! అయితే, గతంలో ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎప్పుడూ వేదకలపై మాట్లాడలేదు. కాని, ఇప్పుడు 2019 దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ లో కేటీఆర్ శకానికి బాటలు వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది! అసలు అన్నీ తానై పార్టీని నడిపే కేసీఆర్ లేకుండా ఆర్మూర్ లో సభ జరగటమే గొప్ప విషయమైతే… కవితతో సహా నాయకులందరూ యువరాజుని ఆకాశానికి ఎత్తటం మరో ఆసక్తికర పరిణామం! ఆర్మూర్ సభలో నిజామాబాద్ సీనియర్ నేత పోచారం కేటీఆర్ ని ఆణిముత్యం అన్నారు. మరో నేత అయితే కల్వకుంట్ల తారక రాముడు ఈ తరం శ్రీరాముడనేశారు! ఇక ఒకప్పటి కాంగ్రెస్ ఐకాన్, ఇప్పటి గులాబీ నేత డీఎస్ … తన దీవెనలు కేటీఆర్ కి పుష్కలంగా వుంటాయని ప్రకటించేశారు! ఇలాంటి కేటీఆర్ ప్రమోషన్ సభలు తెలంగాణ అంతటా ముందు ముందు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో.. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం క్యాండిడేట్ ఎవరనేది ఇకపైన బహిరంగ రహస్యమే! 

పులి లాంటి శివసేన… పులిహోర పార్టీ అవుతోందా?

  రాను రాను రాజు గుర్రం అదేదో అయిందట! అలానే వుంది శివసేన పరిస్థితి! పేరులో వున్న శివ… ఛత్రపతి శివాజీ నుంచీ తీసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు …. హిందూ హృదయ సామ్రాట్ బాల్ థాక్రే! అయినా కూడా రాను రాను శివసేన వ్యవహార శైలి మరీ దారుణంగా తయారవుతోంది. అంతకంతకూ మొరటుగా, మోటుగా మారిపోతోంది!   ప్రస్తుతం పార్లమెంట్లో కూడా రచ్చకి కారణమైంది శివసేన ఎంపీ రవీంద్ర గౌక్వాడ్. ఆయన చేసిన ఘనకార్యం అందరికీ తెలిసిందే! ఎయిర్ ఇండియా ఎంప్లాయిని పాతిక సార్లు చెప్పుతో కొట్టి, దాన్ని కెమెరాల ముందు గొప్పగా చెప్పుకున్నాడు. మళ్లీ ఇప్పుడు విమానాల్లో తిరగనీయాలంటూ పార్లమెంట్లో సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు ఒక ఎంపీ ఒక ఉద్యోగిని కొట్టటమే తప్పంటే… అదే శివసేనకి చెందిన ఒక కేంద్ర మంత్రి, అనంత్ గీతే, విమానయాన శాఖా మంత్రిపైనే చేయెత్తాడు! నిండు పార్లమెంట్లో శివసేన వారి వ్యవహారం ఇలా వుంటే… ఇక ఒక మామూలు ఎయిర్ పోర్ట్ ఉద్యోగిపై అరాచకం ఎలా వుంటుందో మనం స్పష్టంగా ఊహించుకోవచ్చు! ఇంతకాలం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తప్పు లేదేమో అనుకున్న వారు కూడా పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రి చేసిన నిర్వాకం చూస్తే … గుడ్డిగా నమ్మేస్తారు… సదరు రవీంద్ర గైక్వాడ్ ఒక గూండా అని!   రాజకీయ నాయకులు గూండాగిరి, రౌడీయిజం చేయటం పెద్ద ఆశ్చర్యకరమూ కాదు, మాట్లాడుకున్నా లాభం వుండే విషయమూ కాదు! మన దేశంలో పరిస్థితి అలా తయారైంది! కాని, శివసేన వారి దౌర్జన్యం మరీ విడ్డూరం! ఏకంగా పార్లెమంట్లో విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజునే వారు టార్గెట్ చేశారు! ఇప్పుడే కాదు… శివసేన ఈ మధ్య కాలంలో ఇలాంటి అరాచక, ఉన్మాద చర్యలకు పదే పదే పాల్పడుతోంది. ఆ మధ్య మహారాస్ట్రలోని బీజేపి సర్కార్ జైన మతస్థుల పండుగ సందర్భంగా కొన్నాళ్లు మాంసపు దుకాణాలు బంద్ చేయించింది! అప్పుడు కూడా హిందూ సమాజానికి రక్షణగా వుంటామని చెప్పుకునే శివసేన … కేవలం బీజేపి మీద కసితో … జైన మతస్థుల మనోభావాలు దెబ్బతీసింది. వాళ్ల గుళ్ల ముందే పచ్చి మాంసం విక్రయిస్తూ శునకానందం పొందింది!   బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే … ఆ పార్టీని, మోదీని తిట్టిపోయటం ఉద్ధవ్ థాక్రేకు పరిపాటి అయిపోయింది. దానికి తోడు సాదాసీదా టోల్ గేట్ ఉద్యోగులు మొదలు కేంద్ర మంత్రి దాకా ఎవర్నైనా కొట్టటం , దాడులు చేయటం కూడా శివసేన వారికి సంప్రదాయంగా మారింది! ఇదే చేస్తే … ఇప్పటికే సగం మునిగిన శివసేన పడవ మొత్తం మునగక మానదు. ఎందుకంటే, మహారాష్ట్రలో జరుగుతోన్న వరుస ఎన్నికల్లో క్రమంగా బీజేపి బలం పుంజుకుంటూనే వుంది. దానికి తోడు శివసేన ఇలాంటి రౌడీయిజాలకు పాల్పడితే… కమల వికాసం మరింత సులువైపోతుంది!

కేసీఆర్‌ బాటలో ప్రజాప్రతినిధులు... వాస్తు పేరుతో అధికారుల ఆటలు

జాగ్రత్తలు తీసుకోవడంలో కేసీఆర్‌నే మించిపోతున్నారు తెలంగాణ అధికారులు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుంటున్నారో లేక వ్యక్తిగత జాగ్రత్తలో ఏమో తెలియదుగానీ, వాస్తు సరిగా లేకపోతే కొత్త బిల్డింగ్‌ అయినాసరే అడుగు కూడా పెట్టబోమంటున్నారు. ప్రజాసమస్యలను సైతం గాలికొదిలేసి, తమ పేర్ల వాస్తుకు తగినట్లుగా కార్యాలయాల్లో మార్పులు చేర్పులపై దృష్టిపెడుతున్నారు. మార్పులు చేర్పులతో వాస్తు కుదరపోతే, బిల్డింగులనే కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులే కాదు... ప్రజాప్రతినిధులు కూడా వాస్తుకు పెద్దపీట వేస్తున్నారు.   ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాస్తు విషయంలో రాజీపడరు, సచివాలయమైనా, క్యాంపు ఆఫీసైనా, చివరికి సీఎంవో అయినా వాస్తుకు అనుకూలంగా లేకపోతే, క్షణాల్లో మారిపోవాల్సిందే, కోట్లు ఖర్చయినా సరే మార్పులు చేర్పులు జరిగితీరాలి, అందుకే పాత క్యాంపు ఆఫీస్‌ వాస్తు ప్రకారం లేదని, వందల కోట్ల రూపాయల ఖర్చుతో క్యాంపు ఆఫీస్‌ను నిర్మించుకున్నారు, అంతేకాదు వాస్తు దోషం ఉందని, సెక్రటేరియట్‌ను సైతం మార్చాలనుకున్న కేసీఆర్‌, అది కుదరకపోవడంతో ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చి, వాస్తుప్రకారం కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అది కూడా త్వరలోనే జరగనుంది. ఇదే బాటలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకెళ్తున్నారు. తమ పేరుకు తగ్గట్టు వాస్తు లేకపోతే, కొత్త బిల్డింగ్‌ అయినా సరే కాలు పెట్టేదే లేంటున్నారు. అందుకే ప్రజాసమస్యలను సైతం పక్కనబెట్టేసి, వాస్తు ప్రకారం మార్పులు చేర్పులపైనే దృష్టిపెడుతున్నారు. కొన్నిచోట్ల కొత్త బిల్డింగులను సైతం కూల్చేసి, మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు.    ఇలాంటి వ్యవహారమే సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతోంది. వైఎస్‌ హయాంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన బిల్డింగ్‌‌లో అధికారులు వాస్తు దోషాలు వెతుకుతున్నారు. ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి.... వచ్చీరాగానే ప్రజాసమస్యలపై కంటే ముందుగా కార్యాలయంలో వాస్తు దోషాలపై దృష్టిపెట్టారు. భారీ వ్యయంతో పలు నిర్మాణాలకు మార్పులు చేర్పులు చేయించారు. అంతేకాదు మెయిన్‌ గేటుకు తాళం వేయించి, వెనుక గేటు‌ను తెరిపించారు. ఇక కమిషనర్‌ గదితోపాటు అధికారుల గదుల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన అధికారుల్లో ఎక్కువ శాతం సస్పెన్షన్‌కు గురికావడం, లేదా ఏసీబీకి చిక్కడంతో... ఈ బిల్డింగ్‌కి వాస్తు దోషముందని భావిస్తూ, దోష నివారణ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఇవేమీ పైకి చెప్పకుండా, కార్యాలయానికి వాస్తు దోషం ఉందని, అన్నీ బాగుంటేనే కదా, అభివృద్ధికి అడుగులు పడేదని అంటున్నారు.   అయితే వాస్తు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మనిషి మనిషికి వాస్తు మారుతుందని, అలాంటప్పుడు అధికారి మారినప్పుడల్లా వాస్తు ప్రకారం కోట్లు ఖర్చుచేసి మార్పులు చేర్పులు చేయడం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లకోసారి ప్రజాప్రతినిధులు మారుతుంటారని, అధికారులైతే ఎప్పుడు బదిలీ అవుతారో తెలియదని, అలాంటప్పుడు అధికారి మారినప్పుడల్లా బిల్డింగులు కూల్చాల్సిందేనా? అంటున్నారు. అధికారులు మూఢనమ్మకాలు వీడి, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, వాస్తు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు. 

కోదండరాముడు…. గులాబీని ఎదుర్కోటానికి కమలాన్ని ఎంచుకున్నాడా?

బీజేపికి రాముడి అనుగ్రహం మిగతా పార్టీల కంటే ఎక్కువే! ఆయన దయతోనే రెండు సీట్ల నుంచి ఇవాళ్ల రెండు వందల ఎనభై సీట్లకు చేరుకుంది కమలం! అయితే, తెంగాణలోనూ బీజేపి ఒక రాముడితో క్లోజ్ అవుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ కోదండ రాముడు దేవుడు కాదు. అయోధ్య రాజు అంతకన్నా కాదు. మన ఉద్యమ వీరుడు ప్రొఫెసర్ కోదండరామ్!   ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత వేగంగా ఫేమస్ అయిన వారిలో కోదండరామ్ ఒకరు. మరీ ముఖ్యంగా, డిసెంబర్ తొమ్మది ప్రకటన చేసి కాంగ్రెస్ వెనక్కి వెళ్లాక ఆయన జేఏసీ చైర్మన్ గా ఇంతింతై అన్నట్టు ఎదిగారు. అసలు ఒక క్లాసులో పాఠాలు చెప్పుకునే లెక్చరర్ కి అంత పేరు రావటం మామూలు విషయం కాదు. కాని, ఉద్యమం కోదండరామ్ ని నాయకుడ్ని చేసేసింది. కాని, తీరా రాష్ట్రం సిద్ధించాక సీన్ రివర్స్ అయింది!   కేసీఆర్ తో భుజం భుజం కలిపి ఆంధ్రా పాలకుల్ని ఎదుర్కొన్న కోదండరామ్ పత్యేక రాష్ట్రం వచ్చాక మాత్రం గులాబీ పార్టీకి దూరంగా వుండిపోయారు. మూడేళ్లు పూర్తి కావొస్తోన్న తరుణంలో ఇప్పుడు ఆయన కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థిగా కూడా నిలబడతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వారు టీ కాంగ్రెస్ కన్నా సీరియస్ గా ప్రొఫెసర్ సాబ్ నే తీసుకుంటున్నారు. ఎంపీల వద్ద నుంచి చోటా మోటా నాయకుల వరకూ కూడా అందరూ కోదండరామ్ పై గుర్రుగా వున్నారు. అందుకు ఆయన యువతకు ఉద్యోగాలు ఏవీ అంటూ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తటడమే కారణం!   కోదండరామ్ ధర్నాలు, రాస్తారోకోలు అంటూ రోడ్లపైకి రావటంతో కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద నుంచి ధర్నా చౌక్ నే తొలగించారు. ఇది చాలా మందికి నచ్చటం లేదు. అందులో ప్రతిపక్ష బీజేపి కూడా వుంది. అందుకే, ధర్నా చౌక్ అంశం పై చర్చించటానికి కోదండరామ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తో భేటీ అయ్యారు. ఇది నిజంగా పెద్ద ఆశ్చర్యకర విషయం కాదు. కాని, బాగా లెఫ్ట్ ఓరియెంటెడ్ థింకింగ్ వు్న కోదండరామ్ బీజేపితో కూడా చర్చలు జరపటం అందర్నీ ఆకట్టుకుంది. అంతే కాదు, త్వరలో యూపీ సమరోత్సాహంతో వున్న అమిత్ షా హైద్రాబాద్ లో మకాం వేయనున్నారు. మూడు రోజులు ఇక్కడే వుండి తెలంగాణ బీజేపి స్థితిగతులు అంచన వేసి, కార్యకర్తలు, నాయకులకి దిశా నిర్దేశనం చేస్తారట! అంటే… 2019 ఎన్నికలే లక్ష్యంగా ఏం చేయాలో చెబుతారని అర్థం! సరిగ్గా ఇటువంటి నేపథ్యంలో కోదండరామ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ కావటం రాజకీయంగా ప్రాముఖ్యం కలిగిన విషయమే!   కోదండ రామ్ తన పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకున్నా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని అందరికీ తెలిసిందే! బీజేపికి టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా బలమైన శక్తి కావాలంటే తెలంగాణలో రెడ్డి నాయకులే శరణ్యం. ఆ కోణంలో కూడా బీజేపి కోదండరామ్ ని తమ వేపుకు తిప్పుకోవటం టీఆర్ఎస్ జాగ్రత్తపడాల్సిన పరిణామం. తెలంగాణలో బీజేపికి రెడ్డి సామాజిక వర్గం ఎంత దగ్గరైతే అంత ఆందోళన చెందాల్సి వుంటుంది టీఆర్ఎస్, కాంగ్రెస్ లు!

మమతపై రామబాణం ఎక్కుపెట్టిన ఆరెస్సెస్, బీజేపి!

బెంగాల్ లో భారీ మార్పులే జరుగుతున్నాయి. సాధారణంగా పెద్దగా వార్తల్లో కనిపించని మమత దీదీ సామ్రాజ్యం ఇప్పుడు ఎప్పటికప్పుడు వివాదాలతో న్యూస్ లో వుంటోంది. తాజాగా రామనవమి సెగ మమతమ్మకు బాగానే తాకింది. ఏకంగా హైకోర్ట్ మొట్టికాయలు వేసే సరికి బెంగాల్ పరిస్థితి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకొచ్చింది!   మూడు దశాబ్దాలు కమ్యూనిస్టులు కోల్ కతాని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్ల పట్టు నుంచి పట్టుదలతో బెంగాల్ ని విడిపించింది దీదీ. కాని, ఇప్పుడు ఆమె కూడా కమ్యూనిస్టులు చేసిన తప్పే తిరిగి చేస్తున్నట్టు కనిపిస్తోంది! నిజానికి మొదటి సారి అయిదేళ్ల కాలాన్ని చక్కగానే నెట్టుకొచ్చిన మమత రెండోసారి మరింత మెజార్టీతో అసెంబ్లీలో కాలు పెట్టింది. కాని, ఈసారి ఆమెకు ఆరెస్సెస్, బీజేపి తరుఫు నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. అందుక్కారణం మమత స్వయంగా చేసుకుంటోన్న కృతాపరాధలే!   బెంగాల్ లో భారీగా ముస్లిమ్ లు వుంటారు. హిందువులే మెజార్టీలు అయినప్పటికీ అక్కడ మొదటి నుంచి ముస్లిమ్ లు అధికంగానే వుంటారు. ఇప్పుడు మమత వచ్చాక పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వేల సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. ఆ మధ్య బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా ఇదే మాట చెప్పటం పరిస్థితి తీవ్రతని తెలుపుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఒక పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ ముస్లిమ్ లని బెంగాల్లోకి తీసుకు వచ్చి తన ఓటు బ్యాంక్ లో చేర్చుకుంటోంది. ఇదే ఇప్పుడు బెంగాలీ హిందువుల్లో కొందరికి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఆరెస్సెస్,బీజేపీ మమత మార్కు ఓటు బ్యాంక్ రాజకీయాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ వస్తున్నాయి.   బెంగాల్లో హిందూ పండుగలు జరుపుకోవటంపై ఈ మధ్య పదే పదే వివాదాలు తలెత్తున్నాయి. చాలా చోట్ల మమత ప్రభుత్వం దుర్గా పూజ లాంటి ప్రధాన సంబరాల్ని కూడా సరిగ్గా జరుపుకోనివ్వటం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులతో బెదిరించేస్తున్నారు తృణమూల్ మంత్రులు, కార్యకర్తలు! ఇప్పుడు ఇదే బీజేపికి రామబాణంలా చేతికి దొరికింది. తాజాగా రామనవమి సందర్భంగా కోల్ కతాలో అనేక ర్యాలీలు నిర్వహించింది ఆరెస్సెస్. బీజేపి మద్దతు పలికింది. కాని, మమత తనదైన స్టైల్లో లోకల్ మున్సిపాలిటీల చేత పర్మిషన్లు ఇవ్వనీయలేదు! చివరకు కొందరు రామనవమి ర్యాలీ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్ట్ తృణమూల్ ను తలంటి పర్మిషన్ ఇచ్చింది. రామనవమి ర్యాలీలకి పోలీస్ రక్షణతో సహా అన్ని బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలిని తీర్పునిచ్చింది!   కోర్టులో కూడా చుక్కెదురు కావటంతో ఈసారి రామ నవమి ఉత్సవాల్లో తృణమూల్ క్యాడర్స్ ఉత్సహంగా పాల్గొన్నాయి. మైనార్టీల మెప్పు కోసం దుర్గా, రామ నవమి పూజల్ని అడ్డుకున్న అదే పార్టీ ఈ సారి రూటు మార్చి రాములోరి ర్యాలీలు నిర్వహించింది! కాని, విడ్డూరంగా… అరెస్సెస్, బీజేపి నిర్వహించిన రామ నవమి ర్యాలీల్లో జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తే … తృణమూల్ వారి ర్యాలీల్లో జై మమత అంటూ నినాదాలు వినిపించాయి!   మైనార్టీల హక్కుల్ని కాపాడటం వరకూ సరైందే కాని… ఏకంగా బీజేపి చెబుతోన్నట్టు హిందువుల్ని మైనార్టీల్ని చేసి బంగ్లాదేశీ అక్రమ చొరబాట్లతో ముస్లిమ్ లను మెజార్టీల్ని చేయాలనుకోవటం … దుర్మార్గం అవుతుంది. అదే కాని, మమత బెనర్జీ వ్యూహమైతే మాత్రం రాబోయే ఎన్నికల్లో కమల వికసానికి దీదీయే అద్బుతమైన అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి, ఒకవేళ బెంగాల్లో మతోన్మాదం లాంటి సూడో సెక్యులర్ ఉన్మాదం అమలు అవుతోంటే… గుర్తించి రూపు మాపటం తక్షణ కర్తవ్యం. లేదంటే, అది రాజకీయంగా, సామాజికంగా కూడా అనేక ఘర్షణలకు దారి తీయవచ్చు! 

ఆయేషా కేసులో హైకోర్టు ఎత్తిచూపిన లోపాలేంటి? పోలీసుల వెర్షనేంటి?

ఆయేషా కేసులో సత్యంబాబును ఖాకీలు అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టు  తేల్చడం, కేసును దర్యాప్తు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. అసలు నేరస్థులను తప్పించేందుకు, వాస్తవాలను కప్పిపుచ్చి, కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఆయేషాపై అత్యాచారం జరిగిందన్న వాదనను పోలీసులు తెరపైకి తెచ్చారని హైకోర్టు వ్యాఖ్యానించడం... పోలీస్‌శాఖకే పెద్ద ఎదురుదెబ్బ. అంతేకాదు ఆయేషాను సత్యంబాబే చంపాడనడానికి తగిన ఆధారాలు చూపలేదన్న హైకోర్టు... ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు సాగిందని పోలీసులను కడిగిపారేసింది. నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు... మొత్తం పోలీస్‌ వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నించేలా చేశాయి. సత్యంబాబుపై గతంలో ఉన్న కేసులను కోర్టులు కొట్టేసినప్పటికీ, అతడ్ని కరుడుగట్టిన నేరస్తుడిగానే పోలీసులు చిత్రీకరించడాన్నిహైకోర్టు తప్పుబట్టింది.   సరిగ్గా నడవలేని సత్యంబాబు.... 8 అడుగుల గోడను రెండుసార్లు ఎక్కిదిగి, రెండోసారి రోకలి బండను ఓ చేత్తో పట్టుకుని ఆ గోడను ఎక్కి ఆయేషా గదికి వెళ్లాడన్న పోలీసుల వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తంచేసింది. ఐదున్నర అడుగుల ఎత్తు, 50 కేజీల బరువున్న వ్యక్తి, ఒక చేత్తో రోకలి బండను పట్టుకుని, ఒంటి చేత్తో 8 అడుగుల గోడను ఎక్కడం ఎలా సాధ‌్యమని ప్రశ్నించింది. ఇది సూపర్‌మ్యాన్‌ మాత్రమే చేయగల ఫీట్ అంటూ పోలీసులకు చురకలేసింది. అలాగే సాక్షుల వాంగ్మూలాలు, ఛార్జిషీట్లోని విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంది. అంతేకాదు ఆయేషాను చంపాక నిందితుడు ఆమె గదిలోనే కూర్చుని తాపీగా లేఖ రాసినట్లు పోలీసులు చెబుతున్న కథనం నమ్మశక్యం లేదంది.   అయినా అంతసేపు నిందితుడు ఆయేషా గదిలోనే ఉంటే, అక్కడున్న 55మందిలో ఒక్కరైనా గమనించారా అంటూ పోలీసులను ప్రశ్నించింది. మానవనైజం ప్రకారం ఘోరమైన చర్యకు పాల్పడితే, సహజంగా ఎవరైనా ఘటనాస్థలం నుంచి వెంటనే పారిపోతారని వ్యాఖ్యానించింది. అలాగే ఆయేషాను చంపేశాక రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న వాదనను కూడా ధర్మాసనం తప్పుబట్టింది. చనిపోయిన, స్పృహలోలేని స్థితిలో మహిళ ఉన్నప్పుడు మర్మాంగాలకు గాయం కాకుండా సంభోగం జరపడం సాధ్యం కాదని వైద్యశాస్త్రం చెబుతోందని, పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆయేషా శరీరంపై గానీ, మర్మాంగంపై గానీ ప్రతిఘటనకు సంబంధించి ఎటువంటి గాయాలు లేవని తేలిందని, అలాంటప్పుడు ఈ వాదనలోకూడా వాస్తవం లేదని వ్యాఖ్యానించింది.   ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సరిగా వ్యవహరించలేదని, సాక్షుల వాంగ్మూలాలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయంది. అంతేకాదు ఆయేషా తల్లి ఆరోపిస్తున్న వ్యక్తికి, కోర్టు అనుమతించినా పోలీసులు ఎందుకు నార్కో పరీక్ష నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. అసలు నేరస్థులను తప్పించడం కోసం పోలీసులు కట్టుకథలు అల్లారని, దాన్నే కింది కోర్టు నమ్మిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓవరాల్‌గా సత్యంబాబు నేరం చేసినట్లు ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు చూపలేకపోయారన్న డివిజన్‌ బెంచ్‌... ఈ కేసుతో సత్యానికి ఎలాంటి సంబంధంలేదని, అకారణంగా ఇరికించారని అభిప్రాయపడింది. అసలు దోషులను వదిలేసి, ఒక అమాకుడిపై అభియోగాలు మోపి, జైలుపాలు చేయడాన్ని అమానవీయమైన చర్యగా హైకోర్టు అభివర్ణించింది.    హైకోర్టు వ్యాఖ్యలపై ఇరకాటంలో పడ్డ పోలీసులు... కేసు ఎందుకు వీగిపోయిందో తెలుసుకునే పనిలో పడ్డారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. పైగా సత్యంబాబును నిర్దోషిగా విడిచిపెట్టడమే కాకుండా, పోలీసులనే తప్పుబట్టడంతో ఈ కేసు మరింత సవాలుగా మారింది. అయితే సత్యంబాబు నూటికి నూరుపాళ్లు దోషేనంటున్న పోలీసులు... అన్ని ఆధారాలు సమర్పించినా కేసు వీగిపోవడాన్ని జీర్జించుకోలేకపోతున్నారు. పైగా దర్యాప్తు జరిగిన తీరునే హైకోర్టు తప్పుబట్టడంతో.... కేసును తిరగదోడేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు.   తన తల్లిని, చెల్లిని ఎన్‌కౌంటర్‌ చేస్తానని బెదిరించడం వల్లే గత్యంతరంలేక చేయని నేరాన్ని అంగీకరించినట్లు సత్యంబాబు చేసిన ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. డీఎన్‌ఏ టెస్ట్‌ ఆధారంగానే సత్యంబాబుని అరెస్ట్ చేశామని, ప్రపంచంలో ఒకరి డీఎన్‌ఏతో మరొకరి డీఎన్‌ఏ సరిపోదని, అంతేకాదు ఆయేషాను తానే చంపినట్లు స్వయంగా సత్యంబాబే అంగీకరించాడని ఆనాడు కేసును ఇన్వెస్టిగేట్‌ చేసిన స్పెషల్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌ చెబుతున్నారు. ఆయేషా కేసులో తాము ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కోలేదన్న రంగనాథ్‌.... ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందంటున్నారు. సత్యంబాబును ఇరికించామనేది అబద్ధమన్నారు. సాంకేతికంగా కేసును హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూడాలన్నారు. ప్రస్తుత విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ కూడా సత్యంబాబే నిందితుడు అంటున్నారు. సాంకేతికంగా అన్ని ఆధారాలు కోర్టు ముందుంచామని, అయితే కేసు వీగిపోవడంతో... హైకోర్టు తీర్పుపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే దర్యాప్తు జరిగిన తీరునే హైకోర్టు తప్పుబట్టడంతో బలమైన, సాంకేతిక ఆధారాల కోసం పోలీసులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.    అయితే దొంగ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లు ఇఛ్చేందుకు అప్పటి ల్యాబ్‌ డైరెక్ట్‌ వెంకన్న లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో సత్యంబాబు నివేదికపైనా అనుమానాలు రేకెత్తాయి. పైగా ఆయేషా హత్య జరిగిన రాత్రి సత్యంబాబు ఇబ్రహీంపట్నంలోని ఓ చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొన్నట్లు అనేకమంది సాక్ష్యమిచ్చారు. దీనికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఇక హైకోర్టు కూడా పోలీసుల దర్యాప్తులో డొల్లతనాన్ని, అనేక లోపాలను ఎత్తిచూపింది. అయితే పోలీసులు... సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతుండటంతో ఈ కేసు మళ్లీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

అప్పట్లో రాముడు… తరువాత వైఎస్ఆర్… నెక్ట్స్ జగన్!

  రాజకీయాల్లో కొందరు నేతలు మెదడుతో నెగ్గుకొస్తే మరి కొందరు నోటితో నెగ్గుకొస్తారు. ఈ రెండో కోవకే చెందుతారు ఫ్రైర్ బ్రాండ్ పొలిటీషన్ రోజా! ఆమె ఎక్కడ ఏ చిన్న స్టేట్మెంట్ చేసినా గరం గరంగానే వుంటుంది కంటెంట్! శ్రీరామ నవమి సందర్భరంగా కూడా ఆమె తన పార్టీ విధేయత చాటుకున్నారు. అయితే, తనదైన స్టైల్లో రామ నవవి స్పెషల్ గా శ్రీరాముల వార్ని చర్చలోకి లాగారు!   రోజా ముందుకు మీడియా వారి మైకులు రావటం అంటే… పెట్రోల్ బావిలో అగ్గి రాజుకోవటమే! ఆమె గతంలో టీడీపీలో వున్నప్పుడు కాంగ్రెస్ ని కడిగి పారేసినా అదే రేంజ్లో వుండేది. ఇప్పుడు వైసీపీలో వుండి టీడీపీని టార్గెట్ చేసినా అలాగే వుంటుంది. ఇక రామ నవమి సందర్భంగా ఆమె ఒంటిమిట్ట చేరుకుని అక్కడ కూడా తనదైన స్టైల్లో జబర్ధస్త్ కామెంట్ ఒకటి చేశారు! ఏకంగా రాముడ్నే ప్రస్తావిస్తూ… ఆయన తరువాత అలాంటి పాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జనం చవి చూశారని అన్నారు! ఇది కాస్త ఎక్కువే అయినా వైఎస్ఆర్సీపీ నేతగా ఆమె మాటని అర్థం చేసుకోవచ్చు. కాని, ఇంకాస్త భవిష్యత్ దర్శనం కూడా చేయించారు రోజమ్మ! ముందు ముందు జగన్ పాలన వచ్చిన వెంటనే మరోసారి రామ రాజ్యం వచ్చస్తుందని భరోసా ఇచ్చారు!   రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం, రేపో మాపో జగనన్న రాజ్యం … ఇలా రకరకాల రాజ్యాలు ఆయా పార్టీల వారు గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. కాని, రోజా రాముడంతటి దేవుడ్ని కూడా తమ అభిమాన నాయకులు వైఎస్ఆర్, జగన్ ల సరసన నిలపటం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం! అదీ ఒంటిమిట్ట రామనవమి ఉత్సవాలకి హాజరై ఇలా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వటం మరింత అవాంఛనీయం. గతంలో కూడా రోజా తిరుమల శ్రీవార్ని దర్శించుకున్న వెంటనే…. కొండ మీదనే, ఆలయం ముందు నిల్చునే పొలిటికల్ కామెంట్స్ చేశారు!