ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకుని డిఫెన్స్‌లో పడ్డ వైసీపీ

ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీ అసెంబ్లీ వేడెక్కింది. అగ్రిగోల్డ్‌ ఇష్యూతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తే, ఊహించని విధంగా అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. దాంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ రణరంగాన్ని తలపించింది. ముందుగా అగ్రిగోల్డ్ వ్యవహారంపై సభలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.... అధిక వడ్డీ ఆశచూపి లక్షలాది మందిని మోసం చేసిందన్నారు. చంద్రబాబు ప్రకటనపై స్పందించిన జగన్‌.... ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై జుడీషియల్‌ విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు. అయితే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు....ఆయన భార్య పేరిట అగ్రిగోల్డ్ భూములను కొన్నారని జగన్‌ ఆరోపించడంతో సభలో రగడ మొదలైంది.   అగ్రిగోల్డ్ భూములను తాను కొన్నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్‌ చేశారు. నిరూపించలేకపోతే జగన్‌ రాజకీయ సన్యాసం చేయాలన్నారు..పుల్లారావు సవాల్‌తో అధికారపక్షం.... జగన్‌పై మూకుమ్మడి దాడికి దిగింది. జగన్‌కు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు కూడా... ప్రత్తిపాటి సవాల్‌ను స్వీకరించాలంటూ జగన్‌ను టార్గెట్ చేశారు. అదే సమయంలో మంత్రి ప్రత్తిపాటి అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొన్నారన్న జగన్ ఆరోపణలపై న్యాయ విచారణకు సిద్ధమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎవరిది తప్పని తేలితే వారిని సభ నుంచి వెలివేద్దామంటూ సంచలన ప్రకటన చేశారు.   మంత్రిపై చేసిన ఆరోపణల విషయంలో సవాల్‌ను స్వీకరిస్తున్నారో తిరస్కరిస్తున్నారో ఏదో ఒకటి స్పష్టంచేయాలని జగన్‌‌ను స్పీకర్‌ కోరారు. అయితే అధికార పక్షం ఎదురుదాడితో డిఫెన్స్‌లో పడ్డ వైసీపీ.... సభ నుంచి వాకౌట్‌ చేసింది. దాంతో తమ సవాళ్లకు భయపడి ప్రతిపక్షం పారిపోయిందంటూ అధికార పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే అగ్రిగోల్డ్‌ వ్యవహారంలోనే కాదు, స్పీకర్‌ వ్యాఖ్యలను సైతం వక్రీకరించారంటూ ఆరోపించిన బాబు....  సభలో వీడియోలను ప్రదర్శించి వైసీపీకి కౌంటర్‌ ఇఛ్చారు.

తెలంగాణ అసెంబ్లీలో రోల్ మోడల్స్‌‌గా మారిన మంత్రి, ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ చాలా భిన్నమైన వాతారణం కనిపించింది వెల్‌లోకి దూసుకురావడం.... దూషణలు, నినాదాలు, గొడవలే కాదు.... అవసరమైతే క్షమాపణ చెప్పి... సభ హుందాతనాన్ని కాపాడతామని నిరూపించారు తెలంగాణ శాసనసభ సభ్యులు. మంత్రి జగదీశ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలు తెలంగాణ శాసనసభ గౌరవం పెంచేవిధంగా వ్యవహరించారు. వెల్‌లోకి వచ్చినందుకు కిషన్‌రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తంచేయడంతో.... స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి.... మోడీనుద్దేశించిన తాను చేసిన వ్యాఖ్యలను అంతే హుందాగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో ప్రవర్తన విషయంలో ఇద్దరూ రోల్ మోడల్‌లా వ్యవహరించారు.   ఇక ప్రశ్నోత్తరాల్లో అధికార పార్టీ సభ్యుడి నుంచే విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఏ ప్రాంతం నుంచైనా రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల చార్మినార్, గోల్కొండలను కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని తీవ్రస్థాయిలో అడిగారు. అయితే 48గంటల ముందుగా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ వివరణ ఇఛ్చారు. ముందుగా ఇన్ ఫర్మేషన్ ఇచ్చాకే రిజిస్టేషన్లు జరుగుతున్నాయన్నారు.   2016లో విద్యా పరిస్థితిపై వార్షిక నివేదిక విడుదల చేయాలన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి.... డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళిత సీఎం హామీ ఎలాగూ పెండింగ్‌లో ఉంది కాబట్టి.... కడియం ముఖ్యమంత్రి కావాలంటూ వ్యాఖ్యానించారు. వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్‌తోపాటు అధికారపక్షం కూడా అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రచ్చరచ్చ.... తెలంగాణ‌లో కూల్‌కూల్‌...

ఏపీ, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు... ఒకదానికొకటి పూర్తి భిన్నంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తుంటే, తెలంగాణలో మాత్రం ఇరువర్గాలు సంయమనంతో ముందుకెళ్తున్న వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్‌ను వదిలి నవ్యాంధ్ర  రాజధాని అమరావతిలో కొత్త అసెంబ్లీ నిర్మించుకుని తొలి సమావేశాలు నిర్వహిస్తోన్న తెలుగుదేశం ప్రభుత్వం.... ప్రతీ చిన్న విషయానికీ పంతానికి పోతున్నట్లు కనిపిస్తోంది. ఒకపక్క తెలంగాణలో విపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సభ నడుపుతుంటే, ఏపీలో మాత్రం ప్రతిపక్షానికి ధీటుగా అధికారపక్షం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నా మైక్‌ కట్‌ చేస్తున్నారంటూ ఏపీ అసెంబ్లీలో వైసీపీ పదేపదే వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తుంటే, తెలంగాణ అసెంబ్లీలో మాత్రం రివర్స్‌ సీన్‌ కనిపిస్తోంది.   ఏపీ అసెంబ్లీలో సభ లోపలా, బయటా అధికార, ప్రతిపక్షాలు బాహాబాహీకి దిగుతున్నాయి. సభలో కాలు దువ్వుతున్న ఇరువర్గాలు, మీడియా పాయింట్‌లోనూ రచ్చరచ్చ చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మంత్రులం, ప్రజాప్రతినిధులనే సంగతి సైతం మర్చిపోయి.... తోపులాటకు దిగుతున్నారు. అసలు వీళ్లు మంత్రులేనా? ఎమ్మెల్యేలేనా? అని అనేలా ప్రవర్తిస్తున్నారు. చిల్లర రౌడీలు సైతం సిగ్గుపడేలా తిట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు.   ఇక తెలంగాణ అసెంబ్లీలో దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు సైతం హుందాగా నడుచుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు అధికార పక్షం ధీటుగా సమాధానం చెబుతుందే కానీ, వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రధాని మోడీని మంత్రి జగదీశ్‌రెడ్డి కించపర్చారంటూ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి.... పోడియం దగ్గరకు వచ్చినందుకు పశ్చాతాపపడుతున్న ప్రకటించారు.    వెల్‌లోకి వచ్చినందుకే కిషన్‌రెడ్డి పశ్చాత్చాపం వ్యక్తంచేయడంతో.... తాను మోడీనుద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. వెల్‌లోకి దూసుకొచ్చినందుకు కిషన్‌రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తంచేయడాన్ని మంత్రి హరీష్‌రావు అభినందించారు. తెలంగాణ సభ గౌరవాన్ని, హుందాతనాన్ని మరింత పెంచారంటూ ప్రశంసించారు.   అయితే ఏపీ అసెంబ్లీలో ప్రతిరోజూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం ఎవరూ వెనక్కితగ్గడం లేదు. సభలోనూ, బయటా మాటల యుద్ధానికి దిగుతున్నారు, వ్యక్తిగత దూషణలతో సభ గౌరవాన్ని తగ్గిస్తున్నారు. విపక్షాలకు ధీటుగా మంత్రులు సైతం మీడియా పాయింట్‌ దగ్గరకొచ్చి రభస సృష్టిస్తున్నారు. అయితే తమ ప్రవర్తనకు సిగ్గుపడుతున్నామని కానీ, క్షమాపణ చెబుతున్నామని గానీ ఇటు ప్రతిపక్షం చెప్పడం లేదు, అటు అధికార పక్షమూ తగ్గడం లేదు.   విచిత్రమేమిటంటే... ఏపీలో ఇంత రచ్చ జరుగుతున్నా.... స్పీకర్ సస్పెన్షన్ల దాకా పోవటం లేదు.. తెలంగాణలో మాత్రం గవర్నర్ ప్రసంగం రోజే రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. ఇలా రెండు అసెంబ్లీలు డిఫరెంట్ డైరెక్షన్‌లో నడుస్తున్నాయి.

గడప దగ్గరి ఉగ్రవాదాన్ని... పార్లమెంట్లోకి రాకుండా ఎన్నాళ్లు ఆపగలం?

ట్రంప్ అధికారంలోకి వచ్చాక అతిపెద్ద రచ్చగా మారిన అంశం ఇస్లామిక్ టెర్రరిజమ్. అమెరికా అధ్యక్షుడు తన ఎన్నికల ప్రచారం సమయం నుంచే ఉగ్రవాదాన్ని తీ్వ్రంగా పరిగణించాడు. అంత వరకూ అందరికీ ఓకే. కాని, ట్రంప్ నేరుగా ఇస్లామిక్ ఉగ్రవాదం అంటూ వేలెత్తి చూపటం ఆయనని చాలా మందికి శత్రువుని చేసింది. టెర్రరిజమ్ "హేజ్ నో రిలీజన్" అనే వారికి ట్రంప్ అస్సలు నచ్చలేదు. ఇప్పటికీ నచ్చటం లేదు కూడా. అందుకే, ట్రంప్ ప్రతీ నిర్ణయానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత, నిరసనలు వస్తున్నాయి. మీడియా బోలెడంత హైలైట్ చేస్తోంది. కాని, తాజాగా జరిగిన లండన్ వెస్ట్ మినిస్టర్ ఎటాక్ ట్రంప్ వాదన పై మరోసారి దృష్టి పెట్టేలా చేస్తోంది!   ఇంతకీ లండన్ పార్లమెంట్ మీదకి దూసుకొచ్చి దాడికి తెగబడ్డ వ్యక్తి ఎవరు? ఇప్పటి వరకూ బయటకొచ్చిన సమాచారం ప్రకారం అతను బ్రిటన్ లోనే పుట్టిన పౌరుడు. కాని, అతని పేరు, ఇతర వివరాలు ఇంకా బయటకి రాలేదు. అతను ముస్లిమ్ అని బ్రిటన్ ప్రధాని కూడా చెప్పలేదు. కాని, జరిగిన దాడి మాత్రం ఎవరో ఉన్మాది చేసింది కాదనీ, ఉగ్రవాద చర్యేనని ఆమె పార్లమెంట్లో అదికారికంగా చెప్పారు.    అసలు ఒక బ్రిటన్ పౌరుడు తమ స్వంత పార్లమెంట్ మీదకి వాహనంలో ఎందుకు దూసుకొచ్చాడు? ఏ పాపం తెలియని వివిధ దేశాల పౌరుల్ని ఎందుకు పొట్టన బెట్టుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలుతాయి. కాని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న ధోరణి చూస్తే మనం చాలా స్పష్టంగా కారణం ఏంటో గ్రహించవచ్చు. సిరియా, ఇరాక్ లాంటి అంతర్యుద్ధంతో దద్ధరిల్లుతోన్న ఇస్లామిక్ దేశాలు మొదలు అక్కడి శరణార్థులకి ఆశ్రయం ఇచ్చిన యూరోపియన్ దేశాల వరకూ అన్నీ ఉగ్రవాదంతో ఉడికిపోతున్నాయి. అందుకు కారణం ఇస్లామిక్ అతివాదం. దీన్ని చాలా మంది మేధావులు, మీడియా వారు, రాజకీయ నేతలు గుర్తించటానికి ఇష్టం పడటం లేదు. అక్కడే సమస్యంతా ఉత్పన్నం అవుతోంది. నిజానికి ఇస్లామిక్ ఉగ్రవాదం అనగానే ముస్లిమ్ లు అంతా టెర్రరిస్టులని ఎవ్వరి ఉద్దేశమూ కాదు. కాని, ప్రపంచ వ్యాప్తంగా ఇతర మతాలతో పోలిస్తే ప్రస్తుతం ఇస్లామ్ ఎక్కువగా ఉగ్రవాదానికి దోహదపడుతోంది. అందులోని మత బోధనలు, గ్రంథాలు అన్నీ హింసను ప్రేరేపించేవిగా వ్యాఖ్యానించబడుతున్నాయి. అదే మరే మతంలోని యువతా హింసకు ఆకర్షింపడబనంతగా ముస్లిమ్ యువకులను ఉగ్రవాదం వైపు నెడుతోంది.    కొన్నాళ్ల వరకూ అమెరికా, ఇతర అగ్రదేశాలు తమ స్వార్థం కోసం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రాజేస్తూ వచ్చాయి. కాని, ఇప్పుడు అది వారి వద్దకు వచ్చేసింది. సెగ తమకు తగిలిన కొద్దీ ట్రంప్ లాంటి వారు అలెర్ట్ అయ్యి ముస్లిమ్ లను తిట్టిపోస్తున్నారు. కొన్ని దేశాల వారు అసలు తమ భూభాగంలో కాలుపెట్టొద్దని అంటున్నారు. అది తాత్కాలికంగా భద్రత సమస్యకు పరిష్కారం కావొచ్చు. కాని, అసలు ప్రపంచాన్ని కబళిస్తున్న ఉగ్రవాదానికి సమాధానం కాదు.   టెర్రరిజానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి అమెరికా లాంటి దేశాలు తమ నీచమైన స్వార్థం కోసం ఎక్కడో ఒక దగ్గర యుద్దాలు జరిపించటం మానుకోవాలి. చమురు కోసం, రాజకీయం కోసం ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాల భవిష్యత్ ఆటలాడుకోవటం మానాలి. అలాగే, ఇస్లామ్ లో కొనసాగుతున్న అతివాద ధోరణుల్ని అందరూ గుర్తించాలి. అమెరికా తన ఆయుధాలు అమ్ముకోటానికి ప్రపంచంలో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుందన్నది నిజమే. కాని, అంతే నిజం, ఇస్లామిక్ అతివాద ప్రభావం ఎక్కువగా వున్న ప్రాంతాలే అమెరికా ఆయుధాల విక్రయానికి ఫేవరెట్స్ గా వుంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో మీడియా, మేధావులు, రాజకీయ నేతలు, రచయితలు, విద్యావంతులు చర్చ చేయాలి! అప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుంది...    తాజాగా జరిగిన లండన్ దాడిలో ఒక బ్రిటన్ పౌరుడే మాతృ దేశానికి శత్రువయ్యాడు. పార్లమెంట్ మీదకి తెగబడ్డాడు. మన దగ్గర అఫ్జల్ గురు కేసు కూడా ఇలాంటిదే! ఈ దేశం వనరులు వాడుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని కూడా కూర్చున్న కొమ్మనే నరుక్కోటానికి వ్యూహం పన్నాడు. అంతకంటే ఆందోళనకరం ఏంటంటే... అఫ్జల్ గురుకు ఢిల్లీ నడిబొడ్డులో జేఎన్ యూ క్యాంప్ లో మద్దతు లభించింది! అతడ్నో త్యాగమూర్తిగా భావించే అతివాద విద్యార్థులు మన విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు.   సరిగ్గా ఇలాంటి పరిస్థితే బ్రిటన్ ది కూడా. అక్కడికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమ్ ప్రజలే కాదు... ఆ దేశ పౌరులు కూడా వ్యవస్థకి వ్యతిరేకమవుతున్నారు. యూరోపియన్ దేశాలన్నిట్లో ఇదే పరిస్థితి! ఎందుకు ఇలా జరగుతుందో నిజాయితీగా విమర్శ చేసుకోవాలి, అందులో మతం పాత్ర ఎంతో, స్వార్థ రాజకీయం పాత్ర ఎంతో తేల్చుకోవాలి. సరి చేసుకోవాలి. లేదంటే... పార్లమెంట్ ముంగిట దాకా వచ్చిన ఉగ్రవాది ఏదో ఒక రోజు లోనికి కూడా రాగలుగుతాడు. ఇవాళ్ల భద్రత సిబ్బంది, అమాయక ప్రజలు చనిపోయినట్టే... రేపు ప్రముఖ రాజకీయ వేత్తలు కూడా బలవుతారు. ఎందుకంటే, బుల్లెట్ కు కామన్ పీపుల్, వీఐపీలు అన్న తేడా వుండదు! వినాశనమే దాని ఫలితం... 

పన్నీర్ కి 'విద్యుత్ స్థంభం' షాకిచ్చి.. శశికళకి 'టోపీ' పెట్టిన ఈసీ!

జయలలిత మరణంతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలమైంది. మెల్లమెల్లగా ఇప్పుడే సద్దుకుంటోంది. కాని, జయలలిత సారథ్య వహించిన అన్నాడీఎంకే మాత్రం ఇంకా స్థిమితపడటం లేదు. ఒకవైపు అమ్మ తరువాత చిన్నమ్మ అనుకున్న వారికి ఆమె జైలుకి వెళ్లటం షాకైతే... పన్నీర్ సెల్వం అమ్మ ఆశీస్సులు అందుకున్న అసలు సిసిలు సీఎం అనుకున్న వారికీ విభ్రాంతే మిగిలింది. అసెంబ్లీలో ఆయనకు హ్యాండిచ్చారు మెజార్జీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు! అయితే, చెన్నైలో ముగిసిన పోరు ఢిల్లీ ఎలక్షన్ కమీషన్ ముందు ఇంకా కొనసాగుతూనే వుంది!   అన్నాడీఎంకేకి మొదట్నుంచీ ఎన్నికల గుర్తుగా వుంటోంది రెండాకుల సింబల్! ఆ రెండాకుల మాదిరిగానే పార్టీలో ఎప్పుడూ ఎవరో ఇద్దరూ రాజ్యమేలుతుంటారు. మొదట్లో ఎంజీఆర్, జయలలిత ప్రతాపం నడిచేది. తరువాత ఎంజీఆర్ చనిపోయాక జయకి, ఆయన భార్య జానకీ రామచంద్రన్ నికి మధ్య గొడవ జరిగింది. అప్పుడు కూడా రెండాకుల బొమ్మ కీలకమై కూర్చుంది. అయితే, తరువాతి కాలంలో ఎలాగో తన పట్టు బిగించిన జయలలిత పార్టీలో తిరుగులేని నేత అయ్యారు. కాని, ఆమె జీవితంలోకి చాప కింద నీరులా వచ్చిన శశికళ... మరోసారి పార్టీలో రెండో ఆకుగా మారిపోయారు! డిసెంబర్ 5న జయ మరణం వరకూ అమ్మ, చిన్నమ్మలే అన్నాడీఎంకే రెండు ఆకులు!   జయలలిత మరణం తరువాత గత కొన్ని నెలల్లో జరిగిన రాద్ధాంతం మనకు తెలిసిందే. సెక్రటేరియట్ కు వెళదామనుకున్న చిన్నమ్మను పన్నీర్ సెల్వం అడ్డుకుని మరీ జైలుకి వెళ్లేదాకా వ్యవహారం లాక్కొచ్చాడు. భీకరమైన మూడు దెబ్బల శపథం తరువాత శశి బెంగగా బెంగళూరు వెళ్లిపోయింది. అలా దశాబ్దాల పాటూ పార్టీకి రెండు ఆకుల్లా వుంటూ వచ్చిన అమ్మ, చిన్నమ్మ ఇద్దరూ ఇప్పుడు ఏఐఏడీఎంకేకి లేకుండా పోయారు. అయితే, రాబోయే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల సింబలే కనిపించకుండా పోనుంది.   జయలలిత నియోజక వర్గమైన ఆర్కే నగర్ లో ఏప్రెల్ నెలలో ఎలక్షన్ జరగనుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో చూస్తే మనకు తమిళ ప్రజల మూడ్ తెలిసిపోతుంది. ఒకవైపు పన్నీర్ సెల్వం తనకు అమ్మ అనుగ్రహం వుందంటూ పోరాటం చేశాడు. ఇంకో వైపు అమ్మకు వారసురాలు చిన్నమ్మే అంటూ ఎమ్మెల్యేలంతా పళనిస్వామివైపు నిలిచారు. ఇక ఇప్పుడు జయలలిత మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానంలో జనం ఎవర్ని కూర్చోబెడతారో చూడాలి. దాంతో పళనీ స్వామి వర్గం నిజమైన జయ వారసులా? లేక శశికళ వర్గమే అమ్మకు వారసులా తెలిసిపోతుంది! అందుకే, ఈసీ రెండు వర్గాలుగా చీలిన రెండాకుల పార్టీ వారికి ... ఎవ్వరికీ రెండాకుల గుర్తును ఇవ్వలేదు. పన్నీర్ సెల్వం సమర్థిస్తున్న మధుసూధనన్ కు ఎలక్ట్రిక్ పోల్ గుర్తు కేటాయించింది. శశికళ బృందం బరిలో నిలుపుతున్న దినకరన్ కు టోపీ గుర్తునిచ్చింది! అలాగే, వీళ్ల పార్టీల పేర్లు అన్నాడీఎంకే పురుచ్చి తలైవీ అనీ, అన్నాడీఎంకే అమ్మఅని వుండబోతున్నాయి రాబోయే బైపోల్స్ లో!   కొత్త పేర్లు, కొత్త సింబల్స్ తో బరిలోకి దిగబోతున్న పన్నీర్ సెల్వం, శశికళ బ్యాచ్ లు కేవలం ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోబోవటం లేదు. జయలలిత వారసత్వానికి సంకేతమైన రెండాకులు కూడా ఆర్కే నగర్ బైపోల్స్ లో గెలిచిన వారి వశమే అయ్యే అవకాశం వుంది! మొత్తానికి అంతర్గత పోరుతో బజారున పడ్డ అన్నాడీఎంకే నాయకుల్లో ఎవ్వరికీ ఇప్పటికిప్పుడు రెండాకులు ఇవ్వకుండా... ఎలక్షన్ కమీషన్ తాను రెండాకులు ఎక్కువే చదివిందని తేల్చేసింది! చూడాలి మరి... ఏప్రెల్ వార్ లో ఆర్కే నగర్ జనం... విద్యుత్ స్థంభం గుర్తున్న పన్నీర్ కి షాకిస్తారో... లేక టోపీ గుర్తున్న శశికళకి టోపీ పెడతారో... వెయిట్ అండ్ సీ!

డిప్యూటీని టార్గెట్‌ చేసిన విపక్షాలు... నొచ్చుకున్న స్పీకర్

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌‌రెడ్డిపై విపక్షాలు కన్నెర్ర చేశాయి. పదేపదే మైక్‌ కట్‌ చేస్తూ, ప్రతిపక్షాలను చిన్నచూపు చూస్తున్నారంటూ మూకుమ్మడి దాడికి దిగాయి. అధికారపక్షానికి అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్షాలపై పక్షపాతం చూపిస్తున్నారంటూ విపక్ష నేతలు మండిపడ్డారు. కీలక అంశాలపై మాట్లాడేటప్పుడు ఏకపక్షంగా మైక్‌ కట్‌ చేస్తున్నారని జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ను పిలిచి మాట్లాడాలని శాసనసభా వ్యవహారాల మంత్రిని జానా కోరారు. ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే పదేపదే మైక్‌ కట్‌ చేస్తున్నారని, శాసనసభాపక్ష నేతలకు కూడా అవకాశమివ్వకపోతే ఎలా అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.    ప్రతిపక్షాల ఆరోపణలపై శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావ్‌ ఘాటుగా స్పందించారు. అధికారపక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే వ్యవహరిస్తోందని, డిప్యూటీ స్పీకర్‌ అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నారని, ప్రతిపక్షాలు ఇలా చైర్‌ను డిక్టేట్‌ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలంటే తమకు గౌరవం ఉందన్న హరీష్‌.... ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మైక్‌ ఎన్నిసార్లు కట్‌ చేస్తున్నారో చూడండి అంటూ జానారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.   ఛైర్‌ను డిక్టేట్‌ చేయొద్దని విపక్షాలకు స్పీకర్‌ సూచించారు. ఎవరిపైనా తమకు చిన్నచూపు లేదన్న స్పీకర్‌ మధుసూదనాచారి.... ప్రతిపక్షాలకు అనుకున్నదాని కంటే ఎక్కువ సమయమే ఇస్తున్నామన్నారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా సభ జరగడం లేదన్న విపక్ష సభ్యుల వ్యాఖ్యలు.... ఛైర్‌ను బాధకలిగించాయన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల దూకుడుకి కళ్లెం వేసేందుకు టీడీపీ కొత్త ఎత్తు

అమరావతిలో జరుగుతోన్న తొలి సమావేశాలే హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. బడ్జెట్ సెషన్స్‌ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేపదే స్పీకర్‌ పోడియాన్ని ముట్టడిస్తున్న విపక్ష వైఖరితో అధికారపక్షం విసుగెత్తిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న సమయంలోనూ, ప్రతిపక్ష నేత అడ్డుతగలటం, వైసీపీ  ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేయటం, అందుకు ప్రతిగా అధికార పార్టీ కౌంటర్‌ ఇస్తుండటంతో సభా వ్యవహారాలు గందరగోళంగా మారాయి. దాంతో ప్రతిపక్షం దూకుడుకి కళ్లెం వేయడానికి ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. సభాధ్యక్షుడు మాట్లాడుతున్నపుడు అడ్డు తగిలితే ఆటోమేటిక్ సస్పెన్షన్ పడేలా రూల్స్‌ మార్చేందుకు వ్యూహ రచన చేసింది.   ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ జలదినోత్సవంపై మాట్లాడుతోన్న సమయంలోనూ వైసీపీ అడుగడుగునా అడ్డుతగిలింది. సీఎం మాట్లాడుతున్నపుడు తనకు మైక్ కావాలని వైసీపీ అధినేత జగన్ అడగటం, అందుకు స్పీకర్ తిరస్కరించటంతో వైసీపీ సభ్యులు పోడియం దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. దాంతో సభావ్యవహారాలకు ప్రతిపక్షం పదేపదే అడ్డుతగులుతోందని ఆరోపించిన టీడీపీ, బీజేపీ సభ్యులు.... అసెంబ్లీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టాలని స్పీకర్‌ను కోరారు. సభా నాయకుడు మాట్లాడుతున్నపుడు అడ్డుతగులుతోన్న విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు.    అసెంబ్లీలో కొత్త రూల్స్ గురించి రూల్స్ కమిటీకి సిఫార్సులు చేయాలని స్పీకర్ కోడెలకు శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల విజ్జప్తి చేశారు. సభా సమయాన్ని వృథా చేస్తే దానికి సమానమైన ధనాన్ని... ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసే విధంగానూ, పోడియం వద్దకు వచ్చి పదేపదే అడ్డుతగిలితే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ వేటు పడేవిధంగా చూడాలని అధికార పార్టీ నేతలు చేసిన సూచనలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ న్యూ రూల్స్‌ను అమలు చేస్తే వైసీపీ దూకుడుకి కళ్లెంపడినట్లే.

తెలంగాణ అసెంబ్లీలో మంట పుట్టించిన కాంగ్రెస్‌ లీడర్లు

సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కింది. ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథపై అధికార, ప్రతిపక్షాలు ఘాటైన విమర్శలు చేసుకున్నాయి. జానారెడ్డి-హరీష్‌రావ్‌, కేటీఆర్‌-కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువర్గాల విమర్శలు ప్రతివిమర‌్శలతో సభ వాడివేడిగా సాగింది. రీ-డిజైనింగ్‌తో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని జానారెడ్డి..... ఎలాంటి అవినీతి జరగకుంటే డీపీఆర్‌లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా... విపక్షాలను నిందించడం తగదన్నారు. జానారెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఇరిగేషన్ మినిస్టర్ హరీష్‌రావ్‌.... రీ-ఇంజనీరింగ్‌ను తప్పబట్టొద్దని సూచించారు. కృష్ణా-గోదావరి జలాలను అధికంగా వినియోగించుకునేందుకే అత్యంత శాస్త్రీయంగా ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు.   ఆ తర్వాత మిషన్‌ భగీరథపై వాడివేడి చర్చ జరిగింది. మిషన్‌ భగీరథలో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.... హౌస్‌ కమిటీ వేస్తే అవినీతి భాగోతం నిరూపిస్తానన్నారు. మిషన్‌ భగీరథలో అక్రమాలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ సవాల్‌ విసిరారు.కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ చరిత్రే అక్రమాల పుట్టన్న కేటీఆర్‌.... నిరాశా నిస్పృహలతోనే కోమటిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో కోమటిరెడ్డి-కేటీఆర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మిషన్‌ భగీరథలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదన్న కేటీఆర్‌.... హౌస్‌ కమిటీ వేయబోమంటూ తేల్చిచెప్పారు. కేటీఆర్‌ కామెంట్స్‌‌పై ఫైరైన జానారెడ్డి..... మిషన్‌ భగీరథలో ఎలాంటి అక్రమాలు జరగపోతే హౌస్‌ కమిటీ వేయడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

రచ్చరచ్చ చేసిన వైసీపీ... తన జీవితంలో చూడలేదంటూ బాబు ఫైర్‌

ఏపీ అసెంబ్లీలో వైసీపీ రచ్చరచ్చ చేసింది. పదేపదే స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగింది. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అగ్రిగోల్డ్‌ ఇష్యూపై ఒకసారి, రైతు ఆత్మహత్యలపై మరోసారి శాసనసభ వాయిదాపడగా, వైసీపీ రెండుసార్లు వాకౌట్‌ చేసింది. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఏదంటూ వైసీపీ పదేపదే స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ రచ్చరచ్చ చేసింది. దాంతో వైసీపీ సభ్యుల తీరుపై ఇటు స్పీకర్‌, అటు సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.    జల సంరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుండగా, సీఎం ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించిన వైసీపీ సభ్యులు.... రైతు వ్యతిరేక విధానాలు నశించాలంటూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు.... సభను తప్పుదోవ పట్టించారంటూ ఆరోపించారు. దాంతో సభా నాయకుడు ఏం మాట్లాడాలో కూడా మీరే చెబుతారా అంటూ వైసీపీ సభ్యులపై స్పీకర్‌ మండిపడ్డారు.   వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ముఖ‌్యమంత్రి చంద్రబాబునాయుడు.... తన 40ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. అయితే జలదినోత్సవంపై ప్రకటన అంటూ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారంటూ ప్రతిపక్షం అభ్యంతరం తెలిపింది. సభా నియమాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని, పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ వైసీపీ వాకౌట్‌ చేసింది. అనంతరం జల సంరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు.... ఎమ్మెల్యేలతో ప్రతిజ్ఞ చేయించారు. అయితే వాకౌట్‌ చేసిన వైసీపీ సభ్యులు తిరిగి సభలోకి రావడంతో, సభ‌్యులందరి చేత సీఎం మరోసారి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది.

రెయిన్‌ గన్లతో పంటలు కాపాడగలిగితే....ఇక ప్రాజెక్టులెందుకు?

రెయిన్‌ గన్లతో పంటలు కాపాడగలిగితే....ఇక ప్రాజెక్టులెందుకు? కోట్ల రూపాయల ఖర్చెందుకు అంటోంది వైసీపీ. రైతు రుణమాఫీపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ అబద్ధాల మయమేనంటూ ఆందోళనకు దిగింది. జగన్ మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడంతో వైసీపీ రచ్చరచ్చ చేసింది. అయితే ప్రతిపక్షం విమర్శలను ధీటుగా తిప్పికొట్టే క్రమంలో అసెంబ్లీని రెండుసార్లు వాయిదా వేసింది అధికారపక్షం.    ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నపై రచ్చరచ్చ జరిగింది. రాష్ట్రంలో 916మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతులను ఏవిధంగా ఆదుకుంటుందో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. కరువు ప్రాంతాల్లో రెయిన్‌గన్ల సాయంతో పంటలు కాపాడేటట్లయితే, కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టులు కట్టడం ఎందుకని పెద్దిరెడ్ది ప్రశ్నించారు. రైతులకు లక్ష కోట్ల రుణభారం ఉంటే, ఇప్పటివరకు కేవలం 10వేల కోట్లు కూడా మాఫీ చేయలేదని పెద్దిరెడ్డి అనడంతో రగడ మొదలైంది. పెద్దిరెడ్డి ఆరోపణలపై మంత్రి పుల్లారావు ఘాటుగా జవాబిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని 5లక్షలకు పెంచామన్న ప్రత్తిపాటి..... ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా అమలు చేయడం లేదని తెలిపారు.    మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేత జగన్‌ కల్పించుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. రైతుల ఆత్మహత్యలు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీపై మంత్రి తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న జగన్‌, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఆరోపించారు.  అయితే అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో స్పీకర్‌..... జగన్‌ మైక్‌ కట్ చేశారు. అదే సమయంలో అధికార పార్టీ సభ్యులు.... జగన్‌పై మూకుమ్మడి విమర్శల దాడి చేశారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకల్‌ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభ మరోసారి వాయిదా పడింది.

నీళ్ల కోసం ఆడాళ్లు కొట్టుకున్నట్లు... మందు కోసం మగాళ్లు తోసుకున్నట్లు...

ఏపీ అసెంబ్లీ దగ్గర మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీటైంది. నిన్న మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌ దగ్గర తన్నుకుంటే, ఈసారి మగాళ్ల వంతు వచ్చింది. మీడియా పాయింట్‌ దగ్గరకొచ్చిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు....  వీధి పోరాటానికి దిగారు. నీళ్ల కోసం కుళాయిల దగ్గర ఆడాళ్లు కొట్టుకున్నట్లు, మందు కోసం వైన్స్‌ షాపుల ముందు మగాళ్లు తోసుకున్నట్లుగా మీడియా పాయింట్‌ దగ్గర మైకుల కోసం ఎమ్మెల్యేలు తిట్టుకున్నారు.   ఎమ్మెల్యేలంటే కాస్తాకూస్తో ఇంగిత జ్ఞానం ఉంటుందనుకుంటాం, కానీ మినిమమ్‌ కామన్ ‌సెన్స్‌ లేనివాళ్లు చేసినట్లు, బుద్ధిజ్ఞానం లేనివాళ్లు వాగినట్లు... సభ్యత సంస్కారం మరిచి వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నట్లు... ఎమ్మెల్యేల వ్యవహారం కనపడుతోంది. తాము ప్రజాప్రతినిధులమనే సంగతి మర్చిపోయి... ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు వీళ్లు ఎమ్మెల్యేలేనా అనే అనుమానం కలిగే దిగజారి ప్రవర్తించారు. అసెంబ్లీలోనైనా, బయటైనా తమ ప్రవర్తన మారదంటూ నిరూపించుకున్నారు. టీవీల్లో చూసేవాళ్లకి అసలు వీళ్లు ఎమ్మెల్యేలేనా అనే సందేహాలు పుట్టిస్తున్నారు.   నిన్న మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌ దగ్గర తన్నుకుంటే, ఈసారి మగాళ్ల వంతు వచ్చింది. అగ్రిగోల్డ్‌‌పై వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దాంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. ఆ తర్వాత రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీపై జగన్‌ మాట్లాడేందుకు ప్రయత్నించగా మైక్‌ కట్‌ చేయడంతో మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. దాంతో మరోసారి సభ వాయిదాపడింది.   ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మీడియా పాయింట్‌ దగ్గరకొచ్చిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు....  వీధి పోరాటానికి దిగారు. నీళ్ల కోసం కుళాయిల దగ్గర ఆడాళ్లు కొట్టుకున్నట్లు, మందు కోసం వైన్స్‌ షాపుల ముందు మగాళ్లు తోసుకున్నట్లుగా మీడియా పాయింట్‌ దగ్గర మైకుల కోసం ఎమ్మెల్యేలు తిట్టుకున్నారు తన్నుకున్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి..... వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో అసెంబ్లీలోనే కాకుండా, బయట కూడా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంటూ చెవిరెడ్డి ఆరోపించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోనూ, బయటా అరాచకం సృష్టిస్తున్నారని మంత్రి పల్లె మండిపడ్డారు. మొత్తానికి ఏపీ కొత్త అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రచ్చరచ్చ చేస్తున్నారు. తాము ప్రజాప్రతినిధులమనే సంగతి మర్చిపోయి... ఎమ్మెల్యేలు వీధి రౌడీలను తలపిస్తున్నారు.

మనది 131వ ర్యాంక్! అయినా మురిసిపోవాల్సిందే! ఎందుకంటే...

  వాజ్ పేయ్ ప్రధానిగా వున్నప్పుడు ఒక స్లోగన్ అదరగొట్టేసింది. అదే.. ఇండియా షైనింగ్! అంటే... భారత్ వెలిగిపోతోంది అని! కాని, భారతదేశం వెలిగిపోతోంది అంటే ఎందుకోగాని... జనం నమ్మలేదు. యూపీఏకు అధికారం ఇచ్చారు. పదేళ్ల తరవాత మోదీ వచ్చేదాకా మన్మోహన్ సింగ్ ఇండియాను డెవలప్ మెంట్ రోడ్ పై ముందుకు నడిపారు. ఇక ఇప్పుడు ఇండియా ఫస్ట్ నినాదంతో నమో నడిపిస్తున్నారు! ఇంతకీ, మనమసలు బీజేపి వారు చెబుతున్నట్టు అభివృద్ధి చెందుతున్నామా? కాంగ్రెస్ , కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు గగ్గోలు పెడుతున్నట్టు దిగజారిపోతున్నామా? ఏం జరుగుతోంది? 1990లలో మన దేశం దివాలా తీసే పరిస్థితి దాపురించింది. కనీసం గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితి వచ్చింది. ఆర్బీఐ వద్ద వున్న బంగారు నిల్వలు ఇతర దేశాల వద్ద కుదవకు పెట్టుకోవాల్సి వచ్చింది! అటువంటి విషమ పరిస్థితుల్లో పీవీ నరసింహా రావు నెహ్రు కాలం నుంచీ వచ్చిన సోషలిస్టు గేట్లన్నీ ఎత్తేశారు! ఫ్రీగా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ని దేశంలోనికి రానిచ్చారు. దాని ఫలితమే ఇవాళ్ల మనం చవి చూస్తోన్న కార్పోరేట్ అభివృద్ధి ఫలాలు! ఇందులో చాలా మందికి నచ్చని చాలా చాలా లోపాలుండవచ్చు! కాని, లోపాలతో అయినా ఈ మోడల్ ఆఫ్ డెవలప్ మెంట్ వంద కోట్లు దాటిన భారతీయులకి అన్నం పెడుతోంది! మెల్ల మెల్లగా అయినా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతోంది! అందుకు సాక్ష్యం తాజాగా విడుదలైన మానవ అభివృద్ది సూచీనే! హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్, అంటే, హెచ్ డీఐ... మొత్తం 188 దేశాలకు ప్రకటించారు. 25ఏళ్ల కింద ప్రకటించిన ఈ సూచీలో భారతదేశం ర్యాంకింగ్ దారుణంగా వుండేది. అప్పట్లో మన దేశం 'లో' క్యాటగిరీలోకి వచ్చేది. అంటే మానవ అబివృద్ధి అత్యంత తక్కువ స్థాయిలో వుండేదని అర్థం. 1990ల నుంచీ ఇప్పటి వరకూ భారత్ అవలంబిస్తూ వచ్చిన ఆర్దిక సంస్కరణల వల్ల మనం ఇప్పుడు 131వ ర్యాంక్ సాధించగలిగాం. దీని వల్ల 'మిడియం' క్యాటగిరీలోకి చేరాం! ఒక అభివృద్ధి చెందుతోన్న సువిశాల దేశంగా ఇది గొప్ప విజయమే! పైగా విపరీతమైన జనాభా వున్నప్పటికీ తట్టుకుని ముందడుగు వేస్తున్నాం! 1990లలో 0.428 స్కోర్ ఇండియాకు దక్కగా ఇప్పుడది 0.624కి చేరింది. అంటే, 45.8శాతం అభివృద్ధి అన్నమాట! మనకంటే బెటర్ పొజీషన్లో చైనా అభివృద్ది శాతం వుంది. 48శాతం అభివృద్ధి బీజింగ్ నమోదు చేసింది. కాని, అక్కడ ఆర్దిక సంస్కరణలు మనకంటే చాలా ముందు మొదలయ్యాయి. అలాగే, ఆశ్చర్యకరంగా మనం ఊహించని దేశాలైన శ్రీలంక, మాల్దీవ్స్ మనకంటే ముందున్నాయి మానవ అభివృద్ధిలో! ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రం 139, 147 ర్యాంకులతో ఇండియా కంటే వెనుకబడ్డాయి! హ్యూమన్ డవలప్ మెంట్ ఇండెక్స్ అంటే కేవలం ఆర్దిక పెరుగుదల, జీడీపీ అభివృద్ధి మాత్రమే కాదు. ఒక్కో దేశంలో సగటున జనాలు ఎంత కాలం బతుకుతున్నారు, ఎంత కాలం కనీసం విద్యాభ్యాసం చేస్తున్నారు లాంటి అనేక విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అలా చూసినప్పుడు మన దేశం ఆరోగ్య, విద్యా రంగాల్లాంటి వాటిల్లో గణనీయమైన అభివృద్ది సాధించింది. కాని, అదే సమయంలో మనకు ఆందోళన కలిగించే అంశం కూడా తాజా రిపోర్ట్ లో బయటపడింది. మొత్తానికి మొత్తంగా భారతదేశం అభివృద్ధి దిశగా సాగిపోతోన్నా అంతర్గతంగా అసమానతలు రోజు రోజుకి పెరిపోతున్నాయట! దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య తేడాలు గతంలో కన్నా ఇప్పుడు భారీగా పెరిగాయని చెబుతోంది నివేదిక. దాదాపు 27శాతానికి పైగానే ప్రాంతీయ అసమానతలు పెరిగాయట! దీనిపై మన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తీక్షణ దృష్టి పెడితే భారత్ ఖచ్చితంగా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సమతుల్యమైన వికాసం సాధ్యమవుతుంది! ఇన్ ఫ్యాక్ట్ మన ప్రధాని మోదీ నినాదం కూడా అదే... సబ్ కా సాత్ సబ్ కా వికాస్! అయితే, ఆచరణలో దాన్ని అమలు చేయటమే అసలు సాహసం!

అయోధ్య కోసం సుప్రీం కీలక సూచన... స్వాగతించిన బీజేపీ

  రామ‌జ‌న్మభూమి-బాబ్రీ మ‌సీదు వివాదం పరిష్కారానికి చర్చలే మార్గమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెండు వ‌ర్గాలు కోర్టు బ‌య‌ట చ‌ర్చల ద్వారా ప‌రిష్కరించుకోవాల‌ని సూచించింది. ఆరేళ్లుగా పెండింగ్‌లో అయోధ్య అంశంపై అత్యవసర విచారణ కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటీష‌న్‌ ను విచారించిన అత్యున్నత న్యాయ‌స్థానం... కీలక సూచనలు చేసింది. బాబ్రీ మసీదు వివాదం మతానికి, సెంటిమెంటుకు సంబంధించిన అంశమన్న సుప్రీం...నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో చర్చల ద్వారా పరిష్కారమే మంచిదని వ్యాఖ్యానించింది.   అయోధ్య వివాదంపై ఇరువర్గాలతో చర్చలు జరిపి ఈ నెల 31 లోగా నివేదిక అందించాలని సుబ్రమణ్యస్వామికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పరిష్కారం లభించని పక్షంలో తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు సూచనను బీజేపీ స్వాగతించింది. కోర్టు బ‌య‌ట స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని రామ జన్మ భూమి ఉద్యమం నిర్వహించిన కేంద్ర మంత్రి ఉమాభార‌తి విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే అయోధ్య విషయంలో చర్చలుండవని గతంలోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. వివాదాన్ని న్యాయస్థానమే తేల్చాలని స్పషం చేశారు.   మరోవైపు అయోధ్య స‌మ‌స్యను చ‌ర్చల ద్వారా ప‌రిష్కరించుకోవాల‌ని సుప్రీంకోర్టు సూచించిన రోజే విశ్వహిందూ పరిషత్ రామ మందిర నిర్మాణం కోసం కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. రామ్ మ‌హోత్సవ్ అనే పేరుతో... మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వ‌ర‌కు దేశవ్యాప్తంగా 2 లక్షల గ్రామాల్లో యాత్రలు చేస్తామని ప్రకటించింది. 

35లక్షల మందికి ఆసరా ఫించన్లు... 529 గురుకుల పాఠశాలు

అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌‌ శా‌ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ప్రకటించారు. 35లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నామన్న జూపల్లి.... పింఛన్ల విషయంలో మానవీయ కోణంలో ముందుకెళ్తున్నామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏప్రిల్‌ నుంచి ఒంటరి మహిళలకు ఫించన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వికలాంగ పింఛన్ల కోసం 9లక్షల 33వేల దరఖాస్తులు వస్తే... 6లక్షల 37వేల మందిని అర్హులుగా నిర్ధారించి పెన్షన్లు ఇస్తున్నట్లు సభలో ప్రకటించారు. ఎవరూ ఇబ్బందులు పడకుండా ఫించన్లను పోస్టాఫీసుల ద్వారా అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఇక కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుని పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు.   ఇక తెలంగాణలో విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 529 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతేడాది 5వేల పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టామన్న కడియం.... ఈ ఏడాది మరో 5వేల స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియానికి మార్చుతామన్నారు. తెలంగాణలో 7లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఇది చాలా గొప్ప విషయమన్నారు.    అంగన్‌వాడీలను ప్రైమరీ స్కూళ్లలోనే నడిపించాలనే ఆలోచన చేస్తున్నట్లు కడియం శ్రీహరి సభలో తెలిపారు. విద్యా వ్యవస‌్థ పటిష్టానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, పేద మధ్యతరగతి విద్యార్ధుల విద్యపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో విపక్షాలు అర్ధం చేసుకోవాలన్నారు.

తన మాటలతో తెలంగాణ అసెంబ్లీలో కలకలం రేపిన హరీష్‌రావ్

తెలంగాణ అసెంబ్లీలో హరీష్‌రావ్‌ మంటలు పుట్టించారు. తన వాడివేడి మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మంచి పని చేసినా, కేవలం తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై చర్చ సందర‌్భంగా సభలో మాట్లాడిన హరీష్‌‌.... కేసుల పేరుతో కాంగ్రెస్‌ నేతలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. చనిపోయిన వ్యక్తుల పేర్లతో, ఫోర్జరీ సంతకాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్‌రావ్‌.... పిల్లులు కూడా లేనిచోట పులులు ఉన్నాయంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై సుదీర్ఘంగా మాట్లాడిన ఇరిగేషన్‌ మినిస్టర్‌.... పాలమూరును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు.   రెండున్నరేళ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్న హరీష్‌రావ్‌.... అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్లలో చేసినదానికంటే ఈ రెండున్నరేళ్లలో ఎక్కువ ఖర్చు చేశామని లెక్కలు సభ ముందు పెట్టారు. కాంగ్రెస్‌ హయాంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా అంటూ ప్రశ్నించిన హరీష్‌.... తెలంగాణ నీటిని ఆంధ్రాకి తరలించింది కాంగ్రెస్‌ నేతలు కాదా అన్నారు. కల్వకుర్తికి గుండెకాయలాంటి రెండో లిఫ్ట్‌ కుంగిపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక మహబూబ్‌నగర్‌ జిల్లాకి నీళ్లిస్తుంటే, కాంగ్రెస్‌ నేతల కాళ్ల కిందకి నీళ్లొచ్చినట్లు భయపడుతున్నారని సెటైర్లేశారు. రీడిజైనింగ్‌పై రాద్థాంతం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు... రీ ఇంజినీరింగ్‌తో జరిగే నష్టమేంటో చెప్పాలన్నారు.   హరీష్‌రావ్‌ వ్యాఖల్యపై జానారెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. గత ప్రభుత్వాల నిర్ణయాలపై ఆధారపడే టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం నడుస్తోందని చురకలంటించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు.... కాంగ్రెస్‌ హయాంలోనే లక్షల ఎకరాల భూమిని సేకరించామన్నారు. తాము భూములు సేకరించకపోతే...ఈ ప్రాజెక్టులకు అడుగులు ముందుకు పడేవా అంటూ జానారెడ్డి ప్రశ్నించారు.

భారతీయుల బెంగకి కారణమవుతోన్న బెంగాల్!

మోదీ తరంగాలు దేశమంతా వీచినా కూడా కొన్ని రాష్ట్రాల్లో అస్సలు వీయలేదు. అలాంటి రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి! సీపీఎంని గద్దె దించి అధికారంలోకి వచ్చిన మమతా దీదీ రెండో సారి మరింత బలం పుంజుకుంది. కాని, బెంగాల్ ఇప్పుడు బెంగగా మారింది బీజేపికి మాత్రం కాదు. దేశ భద్రత గురించి ఏ మాత్రం ఆలోచించే వారు ఎవరికైనా బెంగాల్ పెద్ద బెంగగా మారిపోయింది. అందుక్కారణం బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వస్తోన్న ఉగ్రవాదులే!   బంగ్లాదేశ్ ని ప్రస్తుతం పరిపాలిస్తోన్న ప్రధాని షేక్ హసీనా. ఆమె వచ్చినప్పటి నుంచీ బంగ్లాదేశ్ అతి వాద ముస్లిమ్ లపై ఉక్కుపాదం మోపుతోంది. వందలు కాదు వేల సంఖ్యలో ఉగ్రవాదుల్ని ఊచలు లెక్కబెట్టిస్తోంది. కొందర్నైతే ఏకంగా కోర్టులో నిలబెట్టి ఉరిశిక్షలు కూడా వేయించేస్తోంది! ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో బంగ్లాదేశీ ఉన్మాదులు ఏం చేస్తారు? తప్పించుకునే మార్గం చూస్తారు! ఆ రాజ మార్గం మమతా బెనర్జీ బెంగాల్ ద్వారా వాళ్లకి లభిస్తోంది!   బంగ్లాదేశ్ తో 2వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహధ్దు వున్న బెంగాల్ ఉగ్రవాదులకి ఎప్పట్నుంచో స్వర్గధామం. గతంలో కమ్యూనిస్టుల పాలన వున్నప్పుడు కూడా పరిస్థితి సంతోషకరంగా వుండేది కాదు. అయితే, మమతా బెనర్జీ వచ్చాక మరింత దిగజారిందని తాజా రిపోర్ట్ చెబుతోంది! ఈ రిపోర్ట్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదైతే లైట్ తీసుకోవచ్చు. రాజకీయ ఆరోపణగా కొట్టిపారేయవచ్చు. కాని, మన అంతర్గత రాజకీయాలతో సంబంధం లేని బంగ్లాదేశ్ అందించింది! తమ దేశం నుంచి ప్రాణాలు అరి చేత పట్టుకుని పారిపోయిన ఉగ్రవాదులు బెంగాల్ గుండా భారత్ లో చొరబడి జనంలో కలిసిపోతున్నారని దాని సారాంశం!   బంగ్లాదేశ్ అందించిన రిపోర్ట్ లో అస్సొమ్, త్రిపురా రాష్ట్రాల్ని కూడా ఉగ్రవాదుల అడ్డాలుగా పేర్కొన్నారు. అయితే, ఆ రెండు రాష్ట్రాలు బంగ్లాదేశ్ చొరబాటు దారుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాని, అతి పెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ మాత్రం మౌనంగా ఉగ్రమూకల్ని లోనికి రానిస్తోందని ఆరోపణలు వున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని కూడా బెంగాల్ వైపే వేలెత్తి చూపడం సమస్య తీవ్రతకి అద్దం పడుతుంది!   బెంగాల్ విషయంలో బీజేపి, ఆరెస్సెస్ చేసే ఆరోపణలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవ్వి రాజకీయ ఉద్దేశాలతో చేసేవి. బెంగాల్ ఓటర్లు మమతా బెనర్జీకి మతాలకతీతంగా స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఆమె అయిదేళ్లు ఎదురులేకుండా పాలన చేయవచ్చు. కాని, అదే సమయంలో ఒక పక్క దేశం కూడా బెంగాల్ లో జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల్ని ఎత్తి చూపుతోందంటే తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమే! తృణమూల్ నేతల్లోనే కొందరు బంగ్లాదేశీ చొరబాటు దారులతో కలసి పని చేస్తున్నారని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కాబట్టి ఇకనైనా మమతా బెనర్జీ ఉగ్రవాదుల కదలికలపై గట్టి నిఘా పెట్టి ఆటకట్టించాలి. లేకపోతే బెంగాల్ తో పాటూ దేశానికి ప్రమాదం ముంచుకు వస్తుంది!

మంత్రి అయ్యాక కూడా కామెడీ మాననంటోన్న సిద్దూ!

  కొందరు వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారు. కాని, మరికొందర్ని వెతుక్కుంటూ వివాదాలే బయలుదేరుతాయి. ఈ టైపుకే చెందుతాడు పంజాబ్ కే పాజీ.... సిద్దూ! క్రికెటర్ గా వున్నప్పుడు ఆయన కెరీర్ లో సిక్సులూ ఎక్కువే! కాంట్రవర్సీలు ఎక్కువే. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆయనని వదిలి వివాదాలు ఎక్కడికీ వెళ్లటం లేదు! హ్యాపీగా ఎన్నికల్లో గెలిచి మినిస్టర్ అయ్యాడో లేదో మరో వివాదం తరుముకొచ్చింది...   సిద్దూ గత పదిహేనేళ్లుగా ఎంపీగా వుంటూనే వున్నాడు. లోక్ సభలో వున్న ఆయన కాంగ్రెస్ లో చేరే ముందు  రాజ్యసభలో కూడా కనువిందు చేశాడు! కాని, ఎంపీగా ఎప్పుడూ మాత్రం సభలో ప్రశ్నలు సంధించి హడావిడి చేసిన దాఖాలాలు లేవు. మరి సిద్దూ ఏం చేస్తుంటాడు? కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే పాప్యులర్ షోలో రెగ్యులర్ గా కనిపిస్తాడు! పార్లమెంట్ లో కనిపించకపోయినా టీవీలో మాత్రం ఠీవీగా దర్శనమిస్తాడు!   తాజాగా జరిగిన ఎన్నికలకి ముందు సిద్దూ బీజేపీతో గొడవపడ్డాడు. ఆ పార్టీ వాళ్లు ఇచ్చిన రాజ్యసభ సీటు కూడా వద్దని వదిలేసి వచ్చి కాంగ్రెస్ లో చేరాడు. అదృష్టం బావుండీ ఆయన గెలవటం, పార్టీ గెలవటం, ప్రభుత్వం ఏర్పడటం చకచకా జరిగిపోయాయి. కాని, పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని లోలోన కలలుగన్న సిద్దూ కోరిక మాత్రం కాంగ్రెస్ లో సిద్ధించలేదు. కనీసం ఆయన్ని డిప్యుటీ సీఎంని కూడా చేయలేదు హస్తం పెద్దలు! ఎంతో సీనియర్ అయిన అమ్రిందర్ సింగ్ సిద్దూ ఉత్సాహాన్ని చిదిమేస్తూ ట్యూరిజమ్, కల్చర్ అండ్ లోకల్ బాడీస్ మినిస్టర్ని చేశాడు! అప్పట్నుంచీ సిద్దూ అసంతృప్తిగానే వున్నాడు!   ఎలాగూ తనకు కావాల్సినంత పెద్ద పదవి రాలేదు కాబట్టి పార్టీ పెద్దల మీద అలిగిన సిద్దూ రీసెంట్ గా మీడియా ముందు ఓ బాంబ్ పేల్చాడు. తాను ఇంత కాలం చేసిన కామెడీ షో ఇక మీదట కూడా కొనసాగిస్తానన్నాడు! రాష్ట్రానికి మంత్రై వుండీ ఇదేం చోద్యమని అందరూ అవాక్కయ్యారు. తరువాత మీడియా వారు ఈయన వ్యవహారం ఏంటని పంజాబ్ సీఎం కెప్టెన్ అమ్రిందర్ సింగ్ ని అడిగారు. ఆయన మొహమాటం లేకుండా న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ తరువాత సిద్దూతో మాట్లాడతానని అన్నారు. అంతే తప్ప మా వాడు సెలబ్రిటీ జడ్జ్ గా కామెడీ షోలో కూర్చుంటే తప్పేంటని వెనకేసుకు రాలేదు!   సిద్దూకి క్రికెట్ టీమ్ లో వున్నప్పుడు అజరుద్దీన్ లాంటి కెప్టెన్ లతో గొడవలు వస్తుండేవి! ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా పంజాబ్ సీఎం కెప్టెన్ అమ్రిందర్ తో పడుతున్నట్టు కనిపించటం లేదు. ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుని సిద్దూతో మాట్లాడతానంటే ... సిద్దూ ఏమో నేను షో లో కనిపించటం ఆపనని తెగేసి చెబుతున్నాడు. కపిల్ శర్మ షోలో తాను కనిపించటం ఆదాయం తెచ్చిపెట్టే పనేం కాదనీ ఆయన అంటున్నాడు. మంత్రిగా పని పూర్తయ్యాక తాను ఏం చేసుకున్నా అది ఎవ్వరికీ సంబంధం లేని విషయం అంటున్నాడు. చూడాలి మరి... చివరకు సిద్దూ కామెడీ షో వ్యవహారం ఆయనను కొత్తగా తమలోకి కాంగ్రెస్ పెద్దల మధ్య ఎలాంటి ట్రాజెడీగా మారుతుందో! లేక సిద్దూనే కాంప్రమైజ్ ఫార్ములాలో ముందుకు పోతాడో!

అయోధ్య విషయంలో సయోధ్యకి సమయమైందా?

ఎప్పుడో బాబార్ దండెత్తి వచ్చినప్పడు మొదలైన వివాదం. వందల ఏళ్ల గాయం. ఇంకా ఇప్పటికీ మన దేశ హిందూ, ముస్లిమ్ ల మధ్య అత్యంత సున్నితమైన అంశం. కాని, త్వరలో పరిష్కారం కాబోతోందా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది! అయోధ్య రామ మందిర అంశం తేలిపోవాలని సుప్రీమ్ కూడా కోరుకుంటున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి! సుప్రీమ్ కోర్టులో తుది తీర్పు కోసం ఎదురు చూస్తోంది బాబ్రీ వివాదం. 1992లో కరసేవకులు ఆ కట్టడాన్ని నేలమట్టం చేశారు. అప్పటి నుంచీ రాముడి జన్మస్థానంగా భావింపబడుతోన్న చోట రామ లల్లా పేరుతో శ్రీరాముడే పూజలందుకుంటున్నాడు. అయితే, అదే స్థానంలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేయాలన్నది హిందూ సంస్థల ఆశయం. కాగా బాబ్రీ కూల్చిన చోటనే తిరిగి మసీదు నిర్మాణం చేయాలని సుప్రీమ్ లో కేసు వేసిన ముస్లిమ్ వర్గాల ఆకాంక్ష. అయితే, దీనిపై ఎలాంటి తీర్పునిచ్చినా మతాల మధ్య సంఘర్షణకు దారి తీస్తుందని చీఫ్ జస్టిస్ ఖేహర్ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు వల్ల ఏదో ఒక వర్గం అసంతృప్తికి లోనయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకే, కోర్టు బయట సామరస్య పూర్వకంగా వివాదం పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే స్వయంగా తానే మధ్యవర్తిత్వం జరుపుతాననీ కూడా అన్నారు!   కోర్టులో కొనసాగే చాలా కేసుల్లో అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ సూచించటం జరుగుతూనే వుంటుంది. మరీ ముఖ్యంగా, ఇటు హిందూ సమాజం, అటు ముస్లిమ్ సమాజం రెండిటి మనోభావాలతో ముడిపడ్డ అయోధ్య కేసు లాంటి వాటిలో ఇరు వర్గాల మధ్య సయోధ్యకే కోర్టు ప్రయత్నిస్తుంది. అలా కాకుండా ఒక వర్గాన్ని సమర్థించే తీర్పునిస్తే రాజకీయంగా సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా వుంటుంది.    కోర్టులో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం పోరాడుతున్న సుబ్రమణియం స్వామీ ఆవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ కి ఒప్పుకోలేదు. గతంలో అలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయని ఆయన గుర్తు చేశారు. కాని, వాటి వల్ల ఫలితం లేదని అన్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో సమూలమైన మార్పులు వచ్చాయి. మోదీ పూర్తి స్థాయి స్వంత మెజార్జీతో ప్రధాని కావటమే అయోధ్య రామ మందిర నిర్మాణంపై ఆశలు రేకెత్తించింది. ఇక తాజాగా యోగీ ఆదిత్యనాథ్ యూపీ పీఠంపై ఆసీనులు కావటం బాబ్రీ వివాదానికి అంతం పలుకుతుందని గట్టి నమ్మకం కలిగించింది అందరికీ! ఈ సమయంలో సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కూడా ఇరు వర్గాలు కోర్టు బయట సమస్య పరిష్కరించుకోవాలని సూచించటం ఆసక్తికర పరిణామమే!    ఇప్పటికే అలహాబాద్ హై కోర్టు 2010లో సామరస్య పూర్వక తీర్పునిచ్చింది. హిందూ, ముస్లిమ్ వర్గాలు రెండూ సంతృప్తి పొందేలా అప్పటి న్యాయమూర్తి వివాదాస్పద భూభాగాన్ని మూడు భాగాలు చేసి గుడి, మసీద్ నిర్మాణాలు చేసుకోమని చెప్పారు. ఇంచుమించూ ఇలాంటి పరిష్కారమే ఇప్పుడు కూడా కోర్టు బయటి చర్చల ద్వారా సాధించవచ్చు. కాని, అలా విజయవంతంగా జరగాలంటే... అందరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందకు పోవాలి. ఆ విషయం కూడా అత్యున్నత న్యాయస్థానం పిటీషనర్లుకు చెప్పటం గమనార్హం!

తాటాకు చప్పుళ్ల చైనా... తన పని తాను చేసుకుపోతున్న ఇండియా!

ఇండియా, పాకిస్తాన్ కసిగా కొట్లాడుకునే శత్రువులైతే ... ఇండియా , చైనా నవ్వుతూ బెదిరించుకునే ప్రత్యర్థులు! మరీ ముఖ్యంగా, డ్రాగన్ దాదాగిరి మరీ దారుణంగా వుంటుంది మన మీద. గత ప్రభుత్వాల కాలంలో బాగా అలవాటైపోయిన ఆచారం అంత త్వరగా వదులుకోలేకపోతోంది బీజింగ్. మనతో వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు లాభపడుతున్నా తన అజమాయిషీ మాత్రం వదలుకోవటం లేదు. ఇండియా భూభాగంలో జరిగే అంశాల మీద కూడా తన ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది!   టిబెట్ బౌద్ధుల మత గురువు దలైలామా మన దేశంలో ఎప్పట్నుంచో ఆశ్రయం పొందుతున్నారు. అమెరికాతో సహా చాలా దేశాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఆయన టిబెట్ ప్రజలకు చైనా పాలన నుంచి విముక్తి కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో శతాబ్దాలు స్వతంత్రంగా బ్రతికిన టిబెట్ ఇప్పుడు డ్రాగన్ రాక్షస హస్తాల్లో బందీ అయిపోయింది. ఆ విషయాన్ని భారత్ దలైలామా సాయంతో ఎక్కడో అంతర్జాతీయ గొడవగా మారుస్తోందనని చైనా భయం! అందుకే, వీలు చిక్కినప్పుడల్లా తాటాకు చప్పుళ్లకు తెగబడుతుంటుంది!   ఇప్పటి వరకూ మనం ఓడిన ఒకే ఒక్క యుద్ధం చైనాతో చేసిందే. అందుకే, గత పాలకులు బీజింగ్ బెదిరింపులకు ఎప్పుడూ తలవగ్గుతూనే వచ్చారు. ఆ క్రమంలోనే దలైలామ మన దేశంలో వుంటున్నా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి కదలాలి అన్నది చైనానే నిర్ణయిస్తుంటుంది. బీహార్లోని బౌద్ధ క్షేత్రాల మొదలు అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఎక్కడా దలైలామ సంచరించకూడదని చైనా ఉద్దేశం!   దశాబ్దాలుగా చైనీస్ దాదాగిరి నడిచినా.. మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. అదీగాక వివాదాస్పద ప్రాంతమని చైనా చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపి ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి చైనీస్ కమ్యూనిస్ట్ పాలకుల భయం మరింత ఎక్కువైంది. అందుకే, దలైలామ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారని అనగానే నానా యాగీ చేసింది బీజింగ్. అయినా న్యూ ఢిల్లీ దూకుడుగా ముందుకు పోయింది. ఇలాంటి పరిణామం చైనా గతంలో ఎప్పుడూ చూడలేదు! అందుకే మొన్న మార్చ్ 17న బీహార్లోని రాజ్ గిర్ లో దలైలామ అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకు హాజరైతే కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఇది మాకు ఎంత మాత్రం అంగీకారం కాదనీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాగైతే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది!    పాక్ తో దోస్తీ చేస్తూ, ఐక్యరాజ్య సమితిలో వెనకేసుకొస్తూ , మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదిని కాపాడుతూ డ్రాగన్ దలైలామా విషయంలో మాత్రం మనకు నీతులు చెబుతోంది. కోట్లాది మంది దేవుడుగా భావించే గురువుని మన దేశంలోని ఏయే ప్రాంతాల్లో తిరగాలో, తిరగవద్దో చైనా నిర్ణయించాలనుకోవటం అహంకారం తప్ప మరేం కాదు. మోదీ సర్కార్ ఇక మీదట కూడా డ్రాగన్ తో కఠినంగా ద్వైపాక్షిక క్రీడ ఆడాలి. చైనాకు దానికి తెలిసిన భాషలో సమాధానం ఇస్తే అర్థమవుతుంది.