భారత్‌ని బెదిరించైనా… గెలవాలనుకుంటోన్న చైనా!
posted on Apr 1, 2017 @ 3:18PM
ఒకప్పుడు బ్రిటన్, తరువాత అమెరికా, ఇప్పుడు చైనా… ఏంటి అంటారా? ప్రపంచంపై దాదాగిరి చేయటంలో ఈ దేశాల తరువాతే ఎవరైనా! ఒకప్పుడు పారిశ్రామిక విప్లవంతో ఇష్టానుసారం ఉత్పత్తి చేసుకుని ప్రపంచం మీద పడ్డాయి యూరోప్ దేశాలు. కొత్త మార్కెట్ల కోసం అమెరికా మొదలు ఆస్ట్రేలియా దాకా ఏ ఖండాన్ని వదల్లేదు. అయితే యూరోపియన్ దేశాల్లో బ్రిటన్ అత్యంత ఎక్కువగా ప్రపంచాన్ని ఆక్రమించుకుని దోచుకుంది. తరువాత ఆ స్థానంలోకి వచ్చిన అమెరికా మరో పద్ధతిలో దేశాల్ని దోచుకుంటోంది. బ్రిటన్ లాగా ఆక్రమించుకోవటం ఆమెరికా వ్యూహం కాదు. ఏ దేశానికి ఏం బలహీనత వుందో కనిపెట్టి దెబ్బ కొడుతుంది. అరబ్ దేశాల నడుమ యుద్ధాలు పెడుతుంది. అదే భారత్ లాంటి దేశమైతే ఇక్కడి మార్కెట్ ను మన పాలకుల సాయంతో గుప్పిట్లో పెట్టుకుని లాభాలు ఆర్జిస్తుంది. ఇక పాకిస్తాన్ లాంటి దేశాల్ని అయితే పావుల్లా వాడుకుని ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తుంది!
బ్రిటన్, అమెరికా చేసిన పనులన్నీ ఇప్పుడు చైనా చేయాలిన ఉవ్విళ్లూరుతోంది. విపరీతమైన జనాభ, విపరీతమైన కమ్యూనిస్టు ఆంక్షలు, ఫలితంగా అమాంతం వచ్చిపడ్డ విపరీతమైన ఆర్దిక, సైనిక శక్తిని చూసుకుని డ్రాగన్ రెచ్చిపోతోంది. ఎంతగా అంటే ఇండియా, జపాన్ లాంటి దేశాల్ని కూడా తన కను సైగలతో గడగడలాడించాలని కోరుకుంటోంది. అది వీలు కానప్పుడల్లా గూండాగిరికి దిగుతుంటుంది!
ఇండియా మీద చైనాకి ఎప్పుడూ పగ, అనుమానాలే! అందుక్కారణం ఆసియాలో చైనా ఆధిపత్యానికి గండికొట్టగలిగేది కేవలం ఇండియానే. ఇప్పుడైతే ఇండియా, చైనా ప్రపంచం గతినే నిర్దేశిస్తున్నాయి. అందుకే తనకు ఆర్దికంగా, ఆర్మీ పరంగా కూడా పోటీ అయిన ఇండియా అంటే చైనాకు చిరచిర. అందుకే, పాక్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను బెదిరించాలని పదే పదే ప్రయత్నిస్తుంటుంది. తాజాగా దలైలామ అంశంలో బీజింగ్ విపరీతమైన అసహనానికి లోనవుతోంది!
ఇండయాలో భాగంగా వుంటూ ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగే భారతీయ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అక్కడ బీజేపి సీఎం వున్నారు ప్రస్తుతం. కాని, చైనా తన తోక వంకర బుద్దిని ఎప్పట్నుంచో ప్రదర్శిస్తూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తన భూభాగమని అడ్డంగా వాదిస్తుంటుంది! అందుకే, ఇప్పుడు దలైలామా త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తారంటే అగ్గి మీద గుగ్గిలం అయిపోతోంది! దలైలామా అరుణాచల్ రావటానికి వీలు లేదని పదేపదే వారెంట్లు ఇస్తోంది!
మన దేశంలోని మన రాష్ట్రంలో దలైలామా ఎక్కడ పర్యటిస్తే చైనాకెందుకు ? ఈ అనుమానం రావటం సహజమే!కాని, చైనాకు దలైలామాకు వున్న శత్రుత్వం టిబెల్ కారణంగా. ఆ దేశాన్ని బలవంతంగా ఆక్రమించిన చైనా అక్కడ మానవహక్కులు కాలరాస్తోంది. దానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న దలైలామా టిబెటన్ల గురువు, పాలకుడు కూడా! ఆయనకి ఆశ్రయం ఇవ్వటమే చైనాకు మన మీద కోపానికి కారణం. ఇప్పుడిక టిబెట్ బార్డర్ లో వున్న అరుణాచల్ కు కూడా ఆయన రావటం డ్రాగన్ కు మంటగా వుంది.
ఇండియానే కాదు… దక్షిణా చైనా సముద్రంలో చైనా ఆధిపత్య వైఖరితో జపాన్, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు కూడా గుర్రుగా వున్నాయి. అందుకే, అమెరికా, ఇండియాతో కలిసి చైనా వ్యతిరేక దేశాలన్నిట్ని జట్టు కడుతోంది. ఫలితంగా చైనా పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. అందుకే, పాక్ కి సాయం చేస్తూ పీఓకేలో భారీ నిర్మాణాలు కొనసాగిస్తోంది చైనా. ఇదంతా ఇండియా మీద ఒత్తిడి తెచ్చేందుకే! అయితే, ప్రపంచాన్ని శాసించాలన్న చైనా ఆదుర్ధా ముందు ముందు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మరీ ముఖ్యంగా, ఇండియాతో యుద్ధం దిశగా పయనిస్తే అది డ్రాగన్ కి భారీ నష్టం మిగులుస్తుంది. ఇండియాకి కూడా అలాంటి ఫలితమే వుంటుంది. అందుకే, ప్రస్తుతానికి రెండు దేశాలు మాటలతోనే సరిపెడుతున్నాయి. కాని, చైనా, పాక్ ప్రవర్తనతో భవిష్యత్ లో ఏమైనా జరగవచ్చు!