కాటమరాయుడు కదిరిలో కాలు దువ్వితే గెలుస్తాడా? ఓడిపోతాడా?
posted on Mar 31, 2017 @ 4:39PM
వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత వన్ కల్యాణ్... కదిరి నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కదిరిని వెంటాడుతున్న కరవు, వలసలు, మహిళల అక్రమ రవాణా జనసేన అధినేత పవన్‌ను కదిలించాయి. వారి బతులకు ఓ భరోసా ఇవ్వాలనుకుంటన్న పవన్... తన పోరాటానికి, తన రాజకీయ జీవితం ఆరంభానికి కదిరినే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాటమరాయుడుకి కదిరి కలిసొస్తుందా? కదిరి నుంచి పవన్ పోటీ చేయడానికి ఓ లెక్కుందా? పవన్ కదిరి నుంచి బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచినా ఓడినా పోటీ చేయడం మాత్రం పక్కా అన్న పవన్... కదిరి నుంచి బరిలోకి దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇంతకీ కదిరిలో పవన్‌కు కలిసొచ్చే అంశాలేంటి? అసలు కదిరిలో పోటీచేస్తే పవన్ గెలుస్తాడా? లేదా?
కరవు, రైతు ఆత్మహత్యలు, సాగు, తాగు నీరు, ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా అన్ని సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమంటూ అనంతపురం జిల్లా సమస్యలపై ఏకరువు పెట్టిన పవన్... సామాజిక సమీకరణాలను మాత్రం లెక్కలోకి తీసుకున్నట్టు లేదు. కదిరిలో ముస్లిం, రెడ్డి, వడ్డెర, బలిజ ఓటర్లే ప్రధానం. ముస్లిం ఓట్లు 20 శాతం ఉంటే, రెడ్డి సామాజికవర్గం ఓట్లు దాదాపు 16 శాతం ఉన్నాయి. వీరి తర్వాత 10 శాతం ఓట్లతో వడ్డెర, 9 శాతం ఓట్లతో బలిజ సామాజిక వర్గాలున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వైసీపీ చేతిలో ఉంది. ముస్లిం వర్గానికి చెందిన చాంద్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నారు. ముస్లిం, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లన్నీ వైసీపీవే. అంతేకాదు కదిరిలో టీడీపీ బలమేమీ తక్కువ కాదు. ఆ లెక్కన తెలుగుదేశం, వైసీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉన్న చోట పవన్ గెలుపు సాధ్యమా? అంటే, చెప్పడం కష్టం.
జనానికి సమస్యలు ఉండొచ్చు కానీ... ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో కుల, మతాల పాత్ర తక్కువేం కాదు. అలా అని సినీ గ్లామర్ ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. అందరూ అనుకుంటున్నట్టు పవన్ కదిరి నుంచే పోటీ చేస్తే... సినీ అభిమానం, జనాన్ని పీడిస్తున్న సమస్యలే ఓట్లుగా మారాలి. ఒకవేళ కదిరివాసులను పవన్ అంతగా ప్రభావితం చేయగలితే... జనసేన పవనాలు పక్కనే ఉన్న కడప, చిత్తూరు జిల్లాల్లోనూ వీయడం ఖాయం.