రెండో పెళ్లి… ఒక్క రోజు కాపురం… పోస్టులో విడాకులు!
posted on Apr 1, 2017 @ 3:00PM
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపి భారీ విజయం సాధించింది. అందుకు ఎప్పటిలాగా హిందూ ఓటు బ్యాంక్ కాకుండా ఈసారి ముస్లిమ్ లు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది! అది నిజమా? స్పష్టంగా చెప్పలేం. కాని, దాదాపు ఇరవై శాతం ముస్లిమ్ లు వున్న యూపీలో వాళ్ల సపోర్ట్ ఏ మాత్రం లేకుండా 320కిపైగా సీట్లు సాధించటం కష్టమే! ఇంతకీ ఒకవేళ నిజమే అయితే… ఎప్పుడూ ద్వేషించే బీజేపికి ఈసారి ముస్లిమ్ లు ఎందుకు ఓటు వేసి వుంటారు? మరీ ముఖ్యంగా, ముస్లిమ్ మహిళలు ఎందుకు కమలాన్ని ఎంచుకుని వుండవచ్చు?
బీజేపికి ముస్లిమ్ మహిళలు కూడా ఓటు వేయటానికి కారణం అర్థం కావాలంటే …. హైద్రాబాద్ లో జరిగిన ఒక దారుణం ముందు మనం తెలుసుకోవాలి! మహ్మద్ హనీఫ్ అనే కూకట్ పల్లి వాసి బహదూరున్నీసాను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు కూతుళ్లు. అయితే పదే పదే బహదూరున్నీసాకు గర్భస్రావాలు జరగటంతో పిల్లలు పుట్టారని చెప్పేశారు డాక్టర్స్. మరి కొడుకు కావాలనే కోరిక మహ్మద్ హనీఫ్ కు తీరేదెట్లా? అందు కోసం భార్య బహదూరున్నీసాను ఒప్పించాడు. రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. పాతబస్తీలోని ఫర్హీన్ బేగం అనే యువతిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు! కాని, పెళ్లి రోజు ఖాజీకి తన మొదటి భార్య బహదురున్నీసా నుంచి విడాకులు తీసుకున్నట్టు లేఖ మాత్రం చూపించలేదు!
ఫర్హీన్ బేగమ్ ను పెళ్లాడిన హనీఫ్ ఒకే ఒక్క రోజు కాపురం చేసి మరునాడు మొదటి భార్య వద్దకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లు ఆరోగ్యం బాగా లేదని ఫర్హీన్ కు చెప్పిన ఆయన వున్నట్టుండీ పోస్ట్ లో తలాఖ్ పత్రాన్ని పంపించాడు! ఆరోగ్యం బాగా లేని కారణంగా విడాకులు ఇస్తున్నట్టు ఫర్హీన్ కు హనీఫ్ చెప్పేశాడు! బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు అరెస్ట్ చేశారు!
హైద్రాబాద్ లో జరిగిన మహ్మద్ హనీఫ్ వ్యవహారం ఎన్నో తలాఖ్ కేసుల్లో అత్యంత తాజా కేసు మాత్రమే! పోస్టులో, వాట్సప్ లో, ఫేస్బుక్ లో, మెయిల్ లో కూడా తలాఖ్ లు చెప్పేయటంతో ఎందరో ముస్లిమ్ మహిళల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. ఇదే యూపీలోని చాలా మంది స్త్రీలు బీజేపికి ఓటు వేయటానికి కారణమైందంటున్నారు విశ్లేషకులు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తలాఖ్ బాధిత మహిళలున్నారు. కాని, ఎక్కడా వారికి రాజకీయ పార్టీల భరోసా లభించటం లేదు. ముస్లిమ్ ఓటు బ్యాంక్ కోసం జాగ్రత్తపడుతోన్న చాలా పార్టీలు తలాఖ్ దారుణాలపై మాట్లాడటం లేదు. కాని, బీజేపి యూపీ ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కూడా హామీ ఇచ్చేసింది. అదే కమలానికి బాగా వర్కువుట్ అయిందంటున్నారు!
ప్రస్తుతం సుప్రీమ్ లో తలాఖ్ కేసుల విషయంలో విచారణ నడుస్తోంది. ఈ మధ్యే రాజ్యాంగ ధర్మాసనానికి చేరింది తలాఖ్ అంశం. ముందు ముందు దీనిపై కీలక తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా కోర్టుల వల్లనో, బీజేపి రాజకీయ చొరవ వల్లనో తలాఖ్ రద్దుకు మార్గం సుగమం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ముస్లిమ్ లలో కూడా హిందువులు, క్రిస్టియన్ల మాదిరిగా విడాకులు కోర్టుల పరిధిలో చట్టబద్ధంగా జరగాలని వారి వాదన. ఇందులో మతం కూడా ముడిపడి వున్నప్పటకీ… లక్షలాది మంది మహిళల జీవితాలకి సంబంధించిన విషయమన్నది అందరూ గుర్తించాలి!