ఏపీలో… ఏప్రెల్ 2 విడుదల?

  ఏప్రెల్ 2 విడుదల… అదేంటీ ఏప్రెల్ 1 విడుదల అనేది కదా సినిమా పేరు అంటారా? మనం మాట్లాడుకుంటోంది సినిమా గురించి కాదండీ! అంతకంటే, ఆసక్తికరమైన క్యాబినేట్ విస్తరణ గురించి! ఏపీ క్యాబినేట్ విస్తరణ గత కొన్ని నెలలుగా ఊరిస్తూ ఉసూరూమనిపిస్తోన్న వ్యవహారం. పాపం… నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశామన్న ఆనందం చాలా మంది టీడీపీ నేతల్లో కనిపించాల్సినంత కనిపించటం లేదు. అందుక్కారణం, అమరావతిలో చంద్రబాబు సర్కార్ ఏర్పడి రెండున్నరేళ్లు దాటిపోయినా విస్తరణ వర్కవుట్ కావటం లేదు. దాంతో మంత్రులవ్వాలని కళ్లలో వత్తులు వేసుకున్న వారంతా అసహనంగా పడిగాపులు పడుతున్నారు!   ఎప్పుడో పోయిన సంవత్సరం దసరా కంటే ముందు నుంచీ మంత్రి పదవులు ఊరిస్తున్నాయి చాలా మంది టీడీపీ నేతల్ని. కాని, ఎంతకూ కసరత్తులు తెగక పోవటంతో దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి… ఇలా అన్నీ గడిచిపోతూనే వున్నాయి. ఇప్పుడు తాజా టాక్ ప్రకారం … చంద్రబాబు నాయుడు ఏప్రెల్ రెండును మూహూర్తంగా ఖరారు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇది కూడా ఫైనల్ అనలేకపోతున్నారు. ఏప్రెల్ ఆరవ తేదీన విస్తరణ తప్పుకుండా జరుగుతుందని కూడా కొందరంటున్నారు! కాకపోతే, దేనిపైనా అధికారిక ప్రకటన మాత్రం లేదు. కాబట్టి క్యాబినేట్ సస్పెన్స్ మరింత కాలం కొనసాగే సూచనలే కనినిస్తున్నాయి.   గతంలో చాలా సార్లు క్యాబినేట్ రిషఫుల్ అని హడావిడి జరిగినా వ్యవహారం మాత్రం ముందుకు పోలేదు. కాని, ఇప్పుడు తప్పకుండా జరిగే ఛాన్సెస్ వున్నాయంటున్నారు. ప్రధానం కారణం చిన బాబు లోకేషే! ఈసారి ఆయన కూడా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి సమరోత్సాహంతో వుండటంతో… చంద్రబాబు తప్పకుండా తనయుడ్ని క్యాబినేట్లోకి తీసుకుంటారని వాదన వినిపిస్తోంది. ఇక లోకేష్ తో పాటూ మరో యువ నేత భూమా అఖిలప్రియ కూడా మంత్రి అవుతారని అంటున్నారు. వీరిద్దరు కాకుండా మిగతా వారి పేర్లన్నీ డౌట్ ఫుల్ గా ప్రచారం జరుగుతున్నాయి. ప్రతీ జిల్లా నుంచీ చాలా పేర్లే వినిపిస్తున్నాయి. కొన్నిటికి కులం ఆధారమైతే, కొన్నిటికి ప్రాంతం, మరి కొన్నిటికి సామాజిక వర్గం ఆధారంగా నిలుస్తున్నాయి! మొత్తం మీద అయిదేళ్ల కాలంలో… సరిగ్గా సగం పూర్తయ్యాక జరగనున్న ఈ విస్తరణ… నెక్స్ట్ ఎన్నికల ఫలితాలపై బోలెడు ప్రభావం చూపుతుంది! మరి దీన్ని ఎంతో ఓర్పు, నేర్పు వున్న చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.   కొత్త మంత్రి వర్గంలో పని చేసే సత్తాకి పెద్ద పీట వేస్తారా? లేక కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య బేరీజులకే ప్రాధాన్యం ఇస్తారా? ఇది తేలాలంటే ఏప్రెల్ రెండు వరకో, ఆరు వరకో ఆగాల్సిందే!

పదే పదే ఫెయిలవుతోన్న తెలంగాణ విద్యాశాఖ!

2014లో సరికొత్త రాష్ట్రంగా ఏర్పాటైంది తెలంగాణ. అయితే, సాధారణంగా బాలారిష్టాలన్నీ కొత్త రాష్ట్రానికి వుంటాయి. కాని, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం అంతా రివర్స్. అవశేష రాష్ట్రమైన ఏపీకే చిక్కులన్నీ వచ్చిపడ్డాయి. రాజధాని నిర్మించుకోవటం దగ్గర్నుంచీ చాలెంజ్ లు అన్నీ ఆంధ్రాకే ఎదురయ్యాయి. కేసీఆర్ తొలి రోజు నుంచే పూర్తి స్థాయి సీఎంగా అన్ని హంగులతో తెలంగాణను ముందుకు నడుపుతున్నారు. అయినా కూడా కొన్ని రంగాల్లో సమైక్యాంధ్రప్రదేశ్ లో లేని అపశృతులు  ప్రత్యేక తెలంగాణలో కనిపిస్తున్నాయి...   తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైనా శాఖ పదే పదే తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచింది అంటే... అది విద్యా శాఖే! కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతృత్వంలో నడుస్తోన్నప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టరీ ఎప్పుడూ కలకలం రేపుతూనే వుంది. అత్యంత తాజా గందరగోళం టెన్త్ ఫిజిక్స్ పేపర్! అసలు ఎంతో ప్రధానమైన పదవ తరగతి పేపర్ చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. కాని, జాగ్రత్త మాట అటుంచితే కనీస స్పృహ కూడా లేకుండా ఫిజిక్స్ పేపర్ అచ్చేసినట్టు మనకు కనిస్తోంది. దాంట్లో పదవ తరగతి ప్రశ్నలు కాకుండా ఇంటర్ వి రావటం మొదలు అసలు పేపర్ చూసిన టెన్త్ విద్యార్థులు జుట్టు పీక్కునేలా వున్న మొత్తం సెటప్... ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారం నడిచిందో అర్థమయ్యేలా చేస్తుంది! అసలు స్కూల్ చదవు పూర్తి చేసుకుని కాలేజీ జీవితంలోకి ప్రవేశించే కీలకమైన దశలో వున్న విద్యార్థుల జీవితాలతో ఇలాగేనే ఆడుకునేది?   టెన్త్ పరీక్షల్లో ఒక పేపర్ లో తప్పులు దొర్లితే అర్థం చేసుకోవచ్చు. కాని, తెలంగాణ విద్యా రంగం ఈ మధ్య కాలంలో చాలా గందరగోళాల్లో చిక్కుకుని బయటపడుతూ వస్తోంది. ఇందుకు మంచి ఉదాహరణ మూడు సార్లు నిర్వహించిన ఎమ్ సెట్టే! ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులకి విద్యార్థులకి అవకాశం కల్పించే కీలకమైన ఆ పోటీ పరీక్ష కూడా అనేక ఒడిదుడుకులకు లోనైంది! ఇక మొన్నటికి మొన్న టీ సర్కార్ గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి వెనక్కు తీసేసుకుంది. ఇంత వరకూ దాని పై మళ్లీ క్లారిటీ లేదు!   గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయకపోవటం మొదలు ఇదుగో అదుగో డీఎస్సీ అంటూ కాలయాపన చేయటం వరకూ అంతా అగమ్య గోచరంగా వుంది తెలంగాణ విద్యారంగంలో! దీని వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నిరాశకి లోనవుతున్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల కారణాల్లో ఒకటే... విద్యా రంగం. అందులో సరైన ప్రొత్సాహం లభించటం లేదనీ, చదువకున్న వారికి ఉద్యోగాలు రావటం లేదనీ యువత ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. కాని, స్వంత రాష్ట్రం వచ్చాక కూడా విద్యా,ఉద్యోగాల్లో పెద్దగా ఆశాజనకంగా పరిస్థితులు వుండటం లేదు.   తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక వినూత్న పథకాలతో ముందకు పోతున్న కేసీఆర్ ముఖ్యమైన విద్యారంగంపై దృష్టి పెట్టాలి.  కేజీ టూ పీజీ అన్న ఆయన అందుకు తగ్గట్టు అధికారల్ని ఉరుకులు పరుగులు పెట్టించాలి. లేదంటే ఈ విద్యా శాఖలోని అవకతవకలన్నీ రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా వుంటుంది...

జయలలిత 'కొడుకు' జైలు పాలు!

  జయలలిత... ఈ పదం చాలా పవర్ ఫుల్! అవునులెండీ, బతికుండగా ఆమెకు తిరుగేలేదు... అనేయకండీ! జయ చనిపోయినా కూడా ఆమె పేరు అణుబాంబులా పేలుతూనే వుంది. అసలు మరణమే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ లా రోజుల తరబడి కొనసాగింది. 75రోజుల హైడ్రామా తరువాత పురుచ్ఛి తలైవీ సమాధిలోకి చేరుకుంది. ఇక ఆ తరువాత జరిగిన శశికళ, పన్నీర్ కుర్చీ యుద్ధం కూడా మనకు తెలిసిందే! పన్నీర్ ఓడి గెలిచాడు. శశికళ గెలిచి ఓడింది. అంతటికీ కారణం... జయలలిత అన్న పేరే! ఆమె పేరు చెప్పుకునే చిన్నమ్మ, పన్నీరు, మేనకోడలు దీప... ఇలా అందరూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరో వ్యక్తి కూడా జయలలిత పేరెత్తి న్యూస్ మేకర్ అయ్యాడు! అయితే, త్వరలో చిప్పకూడు కూడా తినబోతున్నాడు ఆ మహానుభావుడు!   జయలలిత క్రేజ్ అనే ల్యాండ్ మైన్ మీద కాలెట్టిన సదరు సన్నాసి ఎవరంటే ... జే. కృష్ణమూర్తి! ఈయన వారం క్రితం ఏకంగా చెన్నై హైకోర్ట్ ను ఆశ్రయించాడు. తాను జయలలిత కొడుకునన్నాడు. పనిలో పనిగా తన తండ్రి తెలుగు వారి ఆరాధ్యనటుడు శోభన్ బాబు అని కూడా చెప్పాడు! ఒకవేళ ఆయన చెప్పిందంతా నిజమై వుంటే... ఈ పాటికి తమిళ, తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీ అయ్యేవాడు కృష్ణమూర్తి! కాని, డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్టు... కృష్ణమూర్తి జయ కొడుకూ కాదు... శోభన్ బాబు అతగాడి బాబూ కాదని తేలింది.   చెన్నై హైకోర్ట్ కృష్ణమూర్తి పట్టుకొచ్చిన డాక్యుమెంట్స్ పోలీసులకి అప్పగించాలని గతంలో చెప్పింది. అలాగే చేయగా అవ్వి ఫోర్టరీ చేసినవని తేలింది. కృష్ణమూర్తి పాత స్టాంపు పేపర్లు కొని వాటిపై జయలలిత పేరును కోమలవల్లిగా పేర్కొంటే ఆమె సంతకం కూడా ఫోర్జరీ చేశాడు! ఇక ఆయనగారి అసలు తల్లిదండ్రులు తిరుపూర్ లోని కృష్ణమూర్తి, వసంతమణి అని కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు!   జయలలిత , శోభన్ బాబుల పుత్ర రత్నమైపోదామని ప్లాన్ వేసిన కృష్ణమూర్తిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలిన కోర్ట్ ఆదేశించింది. ఈ దొంగ తనయుడు కోర్ట్ కి అబద్ధం చెప్పటమే కాక దొంగ డాక్యుమెంట్లు కూడా తయారు చేసిన నేరానికిగానూ శిక్ష ఎదుర్కోబోతున్నాడు! మొత్తం మీద జయలలిత పేరు వాడుకుని చెలరేగిపోదామనుకున్న ముదురు మేధావి అమ్మ దెబ్బకి కటకటల పాలయ్యాడు!

పాకిస్తాన్ జాతిపితకు ముంబైలో ప్యాలెస్! కూల్చేయాల్సిందేనా?

  మహ్మాద్ ఆలీ జిన్నా... ఈయనెవరో మనలో చాలా మందికి తెలిసే వుంటుంది! ఎందుకంటే, జిత్తులమారి జిన్నా లేకుంటే దేశ విభజన జరిగేది కాదని చాలా మంది విశ్వసిస్తారు ఇప్పటికీ. అటు పాకిస్తాన్ కూడా తమ దేశ జాతిపితగా జిన్నానే పేర్కొంటుంది. కారణం... అఖండ భారత్ ని అడ్డంగా చీల్చి పాకిస్తాన్ అనే ఇస్లామిక్ దేశాన్ని ఆయన ఏర్పాటు చేయించాడు. స్వాతంత్ర్యం కోసం హిందువులు, ముస్లిమ్ లు కలిసి పోరాడితే సరిగ్గా స్వేచ్ఛ సిద్ధించే వేళ మతం ఆధారంగా జాతిని ముక్కలు చేశాడు. ఆ తరువాత ఇప్పటికీ ఆధ్వాన్నంగా నడుస్తోన్న పాక్ అనే ఉగ్రవాద దేశానికి ఆయనే కారణమయ్యాడు!   జిన్నా చారిత్రక పాత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంతగా ఇండియా, పాకిస్తాన్లను ఆయన ప్రభావితం చేశాడు. అయితే... భారతీయులు ద్వేషించే , పాకిస్తానీలు ప్రేమించే జిన్నా ప్యాలెస్ ఒకటి ఇంకా మన ముంబైలో వుందని మీకు తెలుసా? వేల కోట్లు ఖరీదు చేసే ఈ సువిశాల కట్టడం ముంబై సముద్ర తీరానికి ఎదురుగా వుటుంది. అందులో స్వతంత్రం తరువాత కూడా చాలా ఏళ్లు బ్రిటీష్ హై కమీషనర్ వుండేవాడు. 1982 తరువాత జిన్నా కుటుంబానికి చెందిన ఆ కోటని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పాడుబడి శిథిలమైపోయింది.   తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపి ఎమ్మెల్యే ఒకరు జిన్నా ప్యాలెస్ గురించి చర్చ లేవనెత్తారు. అదే కట్టడంలో కూర్చుని జిన్నా దేశ విభజన జిత్తులు పన్నాడని ఆయన ఆరోపించారు. అందుకే, ప్రభుత్వం వెంటనే ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేసి కొత్తగా ఒక సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని కోరారు. జాతి గుండెపైన గాయం లాంటి అటువంటి కట్టడం ఇంతకాలం వుంచినప్పటికీ... ఈ మధ్య అమల్లోకి వచ్చిన ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం ద్వారా దాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు! ఇప్పటికే శిథిలమైపోయిన జిన్నా ప్యాలెస్ తొలగించటం పెద్ద తప్పేం కాదు. ఇక బీజేపి సర్కార్ ఆ పనికి పూనుకుంటోంది కాబట్టి కాంగ్రెస్, ఎన్సీపీ లేదా శివసేన లాంటి పార్టీలు రాజకీయ ఉద్దేశ్యాలతో అభ్యంతరాలు ఏమైనా చెప్పినా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, జిన్నా జ్ఞాపకాల్ని తొలగించి ఒక మంచి సాంస్కృతిక చిహ్నం నిర్మిస్తే భారతీయులు తప్పక హర్షిస్తారు! ఆఫ్ట్రాల్... శత్రువు ఫోటోను ఫ్రేమ్ కట్టి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటరా? ఇదీ అంతే!

'నాయక్' గారింట్లో పెళ్లి... నాయకులందరికీ 'గులాబీ' డ్రస్సులు రెడీ!

పెళ్లి అంటే భారతీయుల్లో వుండే హడావిడే వేరు! మనకు పెళ్లి ఒక ఈవెంట్ కాదు... లైఫ్ టైం మెమరీ! అందుకే, పెళ్లి పెట్టుకుంటే ఆ ఇంట్లో జరిగే తతంగం మాటల్లో వర్ణించలేం. ఇది ఎవరి ఆర్దిక స్థోమతకి తగ్గట్టుగా వారికుంటుంది. ఎంత పేద వాడైనా తన రేంజ్లో తాను గాబరా పడిపోతుంటాడు.ఇక బాగా డబ్బున్న వాళ్లు, వీఐపీలు, సెలబ్రిటీలు అయితే చెప్పేదేముంది? తమ ఇంటి పెళ్లి జాతి చరిత్రలో నిలిచిపోవాలన్నంత కసితో ఏర్పాట్లలో మునిగిపోతారు!   ఈ మధ్య కాలంలో భారీ పెళ్లి హంగామా అంటే అందరికీ గుర్తొచ్చేది గాలి వారి పెళ్లే! వారింట్లో పెళ్లి ఈదురు గాలిలా చుట్టుముట్టేసింది! ఇప్పుడు మన తెలంగాణలో అటువంటిదే ఒక వీఐపీ వెడ్డింగ్ జరగబోతోంది. మరీ గాలి జనార్దన్ రెడ్డిలా ఆర్భాటానికి పోకున్నా... మన నేతగారు కూడా తన రేంజ్లో వివాహా ఏర్పాట్లతో అదరగొడుతున్నారు! ఇంతకీ... అసలు విషయం ఏంటంటే... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్! ఆయన తన మూడో కుమారుడి షాదీ గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, పెళ్లి, పెళ్లి పందిరి, ముత్యాల తలంబ్రాలు, నోరూరించే భోజనాలు .... ఇవన్నీ ఎంత స్పెషల్ గా చేసినా అందరూ అన్ని పెళ్లిళ్లో ప్రదర్శిచే బడాయిలే! కాబట్టి ఇంకా సమ్ థింగ్ స్పెషల్ చేయాలనుకున్నారు నాయక్! వెంటనే తన అభిరుచినంతా ఆహ్వాన పత్రికల్లో ఇమిడ్చేశారు!   రాములు నాయక్ ఎమ్మెల్సీ కాబట్టి తన తోటి ఎమ్మెల్సీలందరికీ, అలాగే ఇతర ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి. అలా ఇచ్చేప్పుడు ఆయన పెళ్లికి రాబోయే సదరు గెస్ట్ ఏం వేసుకుని రావాలి? అదుగో... ఆ సంప్రదాయబద్ధమైన లాల్చీ, పైజామా పత్రికతో పాటూ ప్యాక్ చేసి ఇచ్చే ఏర్పాటు చేశారు! ఆ బట్టలు వేసుకునే గెస్ట్ లు అంతా పెళ్లికి రావాలన్నమాట! అయితే, ఇందులో మరో ట్విస్ట్ కూడా వుంది. టీఆర్ఎస్ పెమ్మెల్సీ అయిన రాములు నాయక్ తన కొడుకు పెళ్లికి వచ్చే వారందరికీ పింక్ లాల్చీ, పైజామాలు అందించారట! అంతే కాదు, తాను పెళ్లికి పిలవబోయే అతిథుల బాడీ కొలతలు ముందుగానే తీసుకుని మరీ ఈ పింక్ , లాల్చీ పైజామాలు కుట్టించారట! మొత్తానికి త్వరలో జరగబోయే పెళ్లిలో వచ్చిన వారంతా ఎమ్మెల్సీగారు అందించిన వెండి కడియాలు తొడుక్కుని... గులాబీ రంగు డ్రెస్సుల్లో కళకళలాడనున్నారన్నమాట!   రాములు నాయక్ ఆహ్వానం మేరకు మిగతా పార్టీల్లోని ఆయన మిత్రులు కూడా పింక్ యూనీఫారాలు ధరిస్తారా? ఈ ధర్మ సందేహం పెళ్లి రోజే తేలుతుంది! కాకపోతే, ఒక్కటి మాత్రం పెద్ద రిలీఫ్ కలిగించే అంశం! పెళ్లనగానే ఏం వేసుకోవాలా అని బుర్రలు బద్ధలు కొట్టుకునే వారికి ఇలా వెల్ కమ్ డ్రస్సులు కూడా ఇవ్వటం చాలా వరకూ సమస్య సాల్వ్ చేస్తుంది! ఏమంటారు?

నల్గొండ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు.... మంత్రి-ఎంపీ మధ్య కోల్డ్‌ వార్‌

  నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతల్లో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రతి విషయంలోనూ గులాబీ నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరడంతో గ్రామస్థాయిలోనూ కార్యకర్తలు వేర్వేరు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మంత్రి జగదీశ్ రెడ్డికి తిరుగులేని పట్టున్నా....  ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో జగదీశ్‌రెడ్డి హవాకు గండిపడింది. దాంతో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గుత్తా అనుచరులకు, టీఆర్ఎస్ నేతలకూ మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా నల్గొండను మూడు జిల్లాలుగా విభజించాక టీఆర్ఎస్‌ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత తారాస్థాయికి చేరింది.   నల్గొండ నియోజకవర్గంలో నాలుగు గ్రూపులుగా ఏర్పడిన నేతలు పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టుబిగించగా.. మంత్రి జగదీశ్ రెడ్డి తన గ్రూపును పెంచుకుంటున్నారు. గిరిజన నియోజకవర్గమైన దేవరకొండలో ఇద్దరు నేతల మధ్య పోరు సాగుతోంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ తమ అనుచరులతో బలప్రదర్శన చేస్తున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ ఓ వర్గంగా.. జెడ్పీ చైర్మన్, మంత్రి జగదీశ్ రెడ్డి ఓ వర్గంగా పనిచేస్తున్నారు. దీంతో అధికారిక కార్యక్రమాల్లో ఎడమొహం, పెడమొహ‍ంగా ఉంటున్నారు.    ఇక మిర్యాలగూడలోనూ రెండు గ్రూపులు ఉన్నాయి. ఎంపీ గుత్తా అనుచరుడిగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు పావులు కదుపుతుండగా..... నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమరేందర్ రెడ్డి మంత్రి అనుచరుడిగా కొనసాగుతున్నారు. నాగార్జునసాగర్ ఇన్‌ఛార్జ్‌ నోముల నర్సింహయ్య నాన్ లోకల్ అన్న వాదన బలపడటంతో రెండు గ్రూపులు పనిచేస్తున్నాయి. దాంతో ఆయన ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా అతిథి గృహానికే పరిమితం కావాల్సి వస్తోంది. మునుగోడులో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గ్రూపుల మధ్య కూడా విబేధాలు తీవ్రమయ్యాయి. ఒకరు పాల్గొనే కార్యక్రమాలకు ఒకరు దూరంగా ఉండేంత పరిస్థితి అక్కడ నెలకొంది.    వర్గపోరు ఇలా ఉంటే.. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులను వలసొచ్చిన వారికే కట్టబెడుతున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీల నుంచి వలసొచ్చినోళ్లకు పదవులు ఇవ్వడమేంటని ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంతకాలం గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నల్గొండ కాంగ్రెస్‌కి పేరుంది. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు సాగుతోంది. దాంతో భవిష్యత్లో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.

కనీస హక్కుల్నీ హరిస్తున్నారు.... ఎమర్జెన్సీలోనూ ఇంత అణచివేత జరగలేదు.

  ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధానాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. ప్రశ్నించినా, విమర్శించినా, ఆరోపణలు చేసినా, ఆఖరికి ముఖ్యమంత్రిని గానీ, ప్రభుత్వాన్ని గానీ చిన్న మాటన్న తట్టుకోలేకపోతున్నారు. తమని ఎక్కడా, ఎవ్వరు విమర్శించరాదన్నట్లు వ్యవహరిస్తోంది. అసెంబ్లీ లోపలా బయలా అంతటా ఆంక్షలు పెడుతోంది. ఆందోళన చేస్తారన్న అనుమానం వస్తే చాలు ముందస్తుగా అరెస్టులకు దిగుతోంది. మొన్న టీ జాక్ నిరుద్యోగుల ర్యాలీని అడ్డుకునేందుకు వేల మంది కార్యకర్తలను అరెస్టు చేసింది. అర్ధరాత్రి జాక్ చైర్మన్ కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలుకొట్టి అరెస్టులకు దిగింది. ఏకంగా ధర్నాచౌకే ఎత్తేసింది.   అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ప్రజల నిరసన వేదికగా ఇందిరా పార్క్ నిలిచేది. ఆందోళనకారులు ఇందిరాపార్క్ దాటి అసెంబ్లీ లేక సచివాలయం వైపు రాకుండా కట్టడి చేసేవారు. ఎవరన్నా ఆ హద్దులు దాటి ముందుకొస్తే అరెస్టు చేసేవారు. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేసింది. సిటీకి దూరంగా శివారు ప్రాంతాల్లో ఆందోళన చేసుకోవాలని సూచించింది. విపక్షాలు ఎంత వ్యతిరేకించినా పట్టించుకోవడం లేదు. నిరసన హక్కు కాలరాయొద్దన్నా,. డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తోంది. ధర్నాలు, దీక్షలకు ముందురోజే అరెస్టులు చేస్తోంది.   అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సభ్యులు తప్పుబడుతున్నారు. మీడియా పాయింట్ లో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడొద్దని మౌఖిక ఆదేశాలివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే మాజీలనే కాదు సస్పెండైన తాజా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టనీయడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో రేవంత్‌రెడ్డి, సండ్ర, వీహెచ్‌తోపాటు పలువురికి తీవ్ర పరాభవం ఎదురైంది.  ఇది పోలీసు రాజ్యమా లేక ప్రజాస్వామ్యమా అంటూ విపక్ష నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమాల అణచివేతని తప్పుబడుతున్నారు.   ఎమర్జెన్సీ సమయంలోనూ ఇంత అణచివేత జరగలేదని, కనీస హక్కుల్ని కూడా హరిస్తున్నారని టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తానికి ఆందోళనకారులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఆందోళనలను అణచి వేసేందుకు ముందస్తు అరెస్టులు చేయడం, చిన్న విమర్శను కూడా సహించలేకపోవడాన్ని  మేధావులు సైతం తప్పుబడుతున్నారు. ఇదే కొత్త పోకడ అంటూ మండిపడుతున్నారు.

కాటమరాయుడు... కేటీఆర్ కి ఎందుకు నచ్చాడు?

ఆ మధ్య ఎన్నికల కోలాహలంలో కేసీఆర్ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో గుర్తుందా? పండగల సమయంలో గంగిరెద్దుల వాళ్లు వస్తుంటారు! పవన్ కూడా అంతే అన్నారు! అప్పట్లో కేసీఆర్ ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ సమర్థిస్తే పవన్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కాని, సీన్ కట్ చేస్తే,  2014 నుంచి 2017లోకి వచ్చే సరికి... మొత్తమంతా మారిపోయింది! అప్పట్లో ఎవర్నైతే గంగిరెద్దుల వారు అన్నారో... ఆ సినిమా హీరో కొత్త సినిమాకే కేటీఆర్ వెళ్లారు! కాటమరాయుడు సూపర్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు! అంతే కాదు, ట్విట్టర్ లో పవన్, కేటీఆర్ ల ఫోటో కూడా హల్ చల్ చేసింది! మరి ఈ కేటీఆర్ కాటమరాయుడి కొత్త క్లోజ్ నెస్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?   చాలా సింపుల్ గా పైపైన కనిపించేదే డిస్కస్ చేసుకుంటే ... కేటీఆర్ కాటమరాయుడు చూడటానికి కారణం... చేనేతకు చేయూతనివ్వటమే! పంచె కట్టి పంచ్ డైలాగ్ లు చెప్పిన కాటమరాయుడు బాగానే చేనేత వస్త్రాలకి ప్రొత్సాహం ఇచ్చాడు. సినిమాలోనే కాదు నిజంగా కూడా తనని కలవటానికి వచ్చిన చేనేత సంఘాలతో తాను బ్రాండ్ అంబాసిడర్ గా వుంటానని హామీ ఇచ్చాడు. అదే విషయాన్ని తన ట్వీట్ లో కేటీఆర్ చెప్పారు కూడా! సినిమా బాగుంది. సినిమాతో పాటూ పవన్ చేనేతకు అందించిన మద్దతు ఇంకా బావుందని అన్నారు! కాని, దీని వెనుక చేనేతే తప్ప రాజకీయ చేయూత ఏం లేదంటారా?   కేటీఆర్ పవన్ కలిసి ఫోటో దిగేదాకా రిలేషన్ రావటం మామూలు విషయం కాదు. గత ఎన్నికల్లో జనసేనాని మోదీ, చంద్రబాబుల టీమ్. కేసీఆర్ కి, కేటీఆర్ కి యాంటీ! అందుకే, బాగానే మాటల దాడి చేశారు. మరి ఇప్పుడు పరిస్థితేంటి? పవన్ అనంతపురం నుంచీ పోటీ చేస్తూ దృష్టంతా ఆంధ్రా మీదే పెట్టినా... తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పనే చెప్పాడు. అలా చూస్తే టీఆర్ఎస్ పవన్ పై దాడిని పెంచాలి. కాని, అనూహ్యంగా కాటమరాయుడు కలెక్షన్స్ పెంచే మాటలు చెప్పారు కేటీఆర్! అదే ఇక్కడ ట్విస్ట్!   రాజకీయ విమర్శకుల అభిప్రాయం ప్రకారం... వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపికి వ్యతిరేకంగానే పోటీ చేసే ఛాన్సెస్  వున్నాయి.అయితే, అలా చేస్తే ఏపీలో టీడీపీ లాభపడే సూచనలున్నాయని కూడా వారంటున్నారు! ఎందుకంటే, పవన్ ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జగన్ మరోసారి సీఎం కుర్చీకి దూరమైనా ఆశ్చర్యం లేదంటున్నారు! మరి అదే ఫార్ములా టీఎస్ లో ఎందుకు అప్లై కాదు? జనసేన ఫుల్ జోష్ తో బరిలోకి దూకితే... టీఆర్ఎస్ కు నష్టం కలిగించాల్సిన ప్రభుత్వ వ్యతిరేకత తగ్గదంటారా? టీకాంగ్ కు, టీబీజేపికి పడాల్సిన ఓట్లు పవన్ కారణంగా చీలిపోయి టీఆర్ఎస్ కు మేలు జరగదంటారా? ఇవీ ఇప్పుడు కొందరి ప్రశ్నలు!   పవన్ వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కు లాభమా? తాజాగా జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం చూశాక ఇండియన్ ఎలక్షన్స్ లో ఏమైనా జరగవచ్చనే విషయం తేలిపోయింది! సో... కాటమరాయుడు ఎఫెక్ట్ కూడా మనం ఇప్పుడే చెప్పలేం! ఆయన మీద ఏదో ఆశతోనే కేటీఆర్ సినిమా చూసి, ఫోటోకి ఫోజ్ ఇచ్చాడని కూడా చెప్పలేం. కాకపోతే, ఇంతకాలం పవన్ పేరు చెబితే చిరచిరలాడిన గులాబీ నేతలు ఇక మీద అంతగా ఇరిటేట్ కాకపోవచ్చని మాత్రం చెప్పవచ్చు!  

ప్రతిపక్షం బాధ్యత మరిచింది... అధికారపక్షం ఆవేశపడుతోంది... అసలు ఏపీ అసెంబ్లీకి ఏమైంది?

  శాసనసభ... ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే పవిత్రమైన ప్రదేశం. భవిష్యత్‌ తరాలకు దిశానిర్దేశం చేసే అత్యున్నత సభ.. వారి జీవితాలను కూడా ప్రభావితం చేయగల సభ అది. అయితే ప్రజాసమస్యలే ప్రధాన అజెండాగా సాగాల్సిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పక్కదారి పడుతోంది. ప్రతిపక్షం తన బాధ్యత మరిస్తే, అధికారపక్షం ఆవేశపడుతోంది. వ్యక్తిగత దూషణలు, సవాళ్లు-ప్రతి సవాళ్లు, ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. అరుపులు, కేకలతో అసెంబ్లీ పదేపదే వాయిదా పడుతోంది. గత రెండు వారాలుగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న సీన్ ఇదే.   ప్రశ్నించాల్సిన వారు ఆవేశపడతారు....అధికార పక్షాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నిస్తారు.. కానీ అప్పటికే అధికారపక్షం డిఫెన్స్ గేమ్ మొదలు పెట్టేస్తుంది.. అర్ధంలేని వాదనలు...వాదోపవాదాలు. దాంతో సమస్యలపై చర్చ దారి తప్పుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలవుతున్నా, కనీసం ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్యపై సమగ్రమైన చర్చ జరగలేదు. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం... ఇద్దరూ ఒకరినొకరు తప్పుపట్టుకోవడానికే సమయమంతా సరిపోతోంది. ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నట్లే, తప్పు జరిగితే హుందాగా ఒప్పుకునేందుకు అధికారపక్షం కూడా సిద్ధంగా ఉండాలి. కానీ ఏపీ అసెంబ్లీలో దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇస్తూ, వాటిపైనే సుదీర్ఘమైన చర్చలు జరుపుతూ, ప్రజాసమస్యల్ని గాలికొదిలేస్తున్నారు.   సహజంగా ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ లోపాలు వెదికి విమర్శించే ప్రతిపక్షం.... గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందంటూ ఆరోపణలు చేసింది. అలా మొదలైన రగడ, మీడియా పాయింట్‌ దగ్గర టీడీపీ-వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తోపులాటకు దిగడంతో తారాస్థాయికి చేరింది. ఈలోగా మహిళలేనా, మేం కూడా అంటూ మగ ఎమ్మెల్యేలూ పోటీ పడ్డారు. మీడియా పాయింట్‌ దగ్గర రచ్చ రచ్చ చేశారు. టీవీల్లో చూసేవాళ్లకి అసలు వీళ్లు ఎమ్మెల్యేలేనా అనే సందేహం కలిగించారు.   మహిళలపై అత్యాచారాలు, రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పవర్‌ ప్రాజెక్టుల్లో అవినీతి, అగ్రిగోల్డ్ ఇలా కొన్ని ఇష్యూలను ప్రతిపక్షం ప్రస్తావించినా, చర్చ మాత్రం జరగలేదు. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడం, వైసీపీ ఆందోళనలకు దిగడం పరిపాటిగా మారిపోయింది. ఒకట్రెండు అంశాలపై చర్చకు అనుమతించినా, అది చివరికి వ్యక్తిగత దూషణలకి దారి తీస్తోంది. పవర్‌ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని జగన్‌ అంటే, ఈడీ ఆస్తుల జప్తుపై ముందు వివరణ ఇవ్వాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఎదురుదాడికి దిగడంతో సభలో రచ్చరచ్చ జరిగింది.   అయితే కొంత సంయమనం పాటిస్తూ, ప్రజాసమస్యలపై చర్చ జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత అధికారపక్షంపై ఉన్నా, ప్రతిపక్షాన్ని మరింత రెచ్చగొడుతూ ఎదురుదాడికి దిగుతుండటంతో చర్చ పక్కదారిపడుతోంది.

కేసీఆర్ ముస్లిమ్ రిజర్వేషన్స్ గొడవ... టీబీజేపికి బూస్ట్ గా మారిందా?

సెక్యులరిజానికి, ఓటు బ్యాంకు రాజకీయానికి చాలా సన్నటి గీత మాత్రమే అడ్డుగా వుంటుంది. అందుకే, మన నేతలు తమది సెక్యులరిజమ్ అంటూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేస్తుంటారు. ఇది జనాలకి తెలియదా అంటే తెలిసినా కూడా ఎప్పటికప్పుడూ చూసీ చూడనట్టు ఊరుకుంటూ వుంటారు. కాని, ఇప్పుడు చాలా చోట్ల బీజేపీకి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలే కలిసొస్తున్నాయి. నిజంగా ముస్లిమ్ లు, క్రిస్టియన్ల బాగుకూ ఏమీ చేయని సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు మాటలు మాత్రం చెబుతాయి. వాటినే ఆసరాగా చేసుకుని కాషాయదళం విమర్శలు గుప్పిస్తూ బలం పుంజుకుంటూ వుంటుంది. కేరళ నుంచి ఆసోమ్ దాకా అంతటా ఇదే పరిస్థితి!   ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో వున్న బీజేపి తెలంగాణలో మాత్రం ప్రతిపక్షానికే పరిమితం అయింది. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికితే కూడా, పార్లమెంట్లో బేషరతుగా ఓటు వేస్తే కూడా... తెలంగాణలో కమలం లాభపడింది ఏమీ లేదు. క్రెడిట్ అంతా టీఆర్ఎస్ కి, తరువాత మిగిలిన శేషం కాంగ్రెస్ కి దక్కింది. కేవలం అయిదుగురు పంచ పాండవుల్లాంటి ఎమ్మెల్యేలకే పరిమితమైంది!   టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిన బీజేపికి తాజాగా కేసీఆర్ మంచి అస్త్రం అందిస్తున్నట్టు కనిపిస్తోంది! అదే... ముస్లిమ్ రిజర్వేషన్ల అంశం! 12శాతం రిజర్వేషన్ మత ప్రాతిపదికగా ఇవ్వటం మన దేశంలో వీలవుతుందా? కాదనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. కోర్టు తీర్పులు కూడా అదే చెబుతున్నాయి. అయినా కూడా ఎన్నికల ముందు కేసీఆర్ కమిట్ అయ్యారు. ఇప్పుడు ఎలాగైనా అమలు చేస్తాం అంటూ పదే పదే చెప్పుకొస్తున్నారు. దీనిపై ఎదురుతిరిగి పోరాడే సౌలభ్యం కేవలం హిందూత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపికే వుంది. మిగతా పార్టీలన్నీ ముస్లిమ్ ల ముందు తాము చెడు కావద్దని నిశ్శబ్దంగా వుండిపోతున్నాయి.   ముస్లిమ్ రిజర్వేషన్ల అంశంలో బీజేపి సభ్యులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో అయిదుగురు ఎమ్మేల్యేల్ని సస్పెండ్ చేసేశారు స్పీకర్. ఇద బీజేపికి మరింత ఉత్సాహానిచ్చే పరిణామం. ముందు ముందు కూడా కమలం నేతల్ని గులాబీ నేతల్ని ఈ విషయంపై కార్నర్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఒక్క అంశం పట్టుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపి అధికారంలోకి వచ్చేస్తుందని ఎవ్వరూ అనరు. కాని, బీజేపి ఎలాగైనా తెలంగాణలో అస్థిత్వం చాటాలని చూస్తోన్న తరుణంలో కేసీఆర్ తన మత రిజర్వేషన్ల హామీతో ఒక మంచి అవకాశం అయితే ఇచ్చినట్టే కనిపిస్తోంది. సెక్యులర్ నేతలుగా చెలామణి అయ్యే నాయకులు చట్టం ఒప్పుకోని మత రిజర్వేషన్ల లాంటి హామీలు ఇవ్వకపోతే మంచిది. లేదంటే, దీర్ఘ కాలంలో జనం ఇటు బీజేపి, అటు ఎంఐఎం లాంటి పార్టీల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా వుంది...

జనంలో జగన్ వున్నాడు! కాని, జగన్ లో పరిపక్వత ఏది?

  తండ్రి హఠాన్మరణంతో జగన్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాడు. అంతకుముందు ఎంపీగా వుంటూ వ్యాపారాలు చేసిన ఆయన వైఎస్ మరణంతో డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, జనంలో ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతే లభించింది యువనేతకి. ప్రత్యక్ష ఎన్నికల్లో పదే పదే గెలుపుని అందించారు. కాని, అంతటి నమ్మకాన్ని కూడా జగన్ ఎందుకని క్యాష్ చేసుకోలేకపోతున్నాడు? సీఎం అవ్వలేకపోవటానికి, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా సత్తా చాటటానికి ఎందుకు ఆయన సమర్థత చాలటం లేదు?   గత కొన్ని రోజులుగా సభలో జగన్ వ్యవహారం చూస్తే మనకు లోపం ఎక్కడుందో తెలిసిపోతుంది! ఆయన జన జీవనంలోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడి స్థాయికైతే వచ్చాడు కాని... దానికి తగ్గ పరిపక్వత మాత్రం సాధించలేకపోతున్నాడు. పంతానికి, పట్టుదలకి పోయే ఫ్యాక్షనిస్ట్ మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలా మసులుకోవటం లేదు. తాను చేసే పని రాజకీయంగా ఎలాంటి లాభ, నష్టాలు కలిగిస్తుందని కాక తనకి నచ్చిందే చేస్తూ పో్తున్నాడు. ఇక్కడే జనానికి, జగన్ కి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది!   ఈ సారి సమావేశాలు ప్రారంభం కాగానే భూమా నాగిరెడ్డికి సంతాపం తెలిపే సమయంలో జగన్ తప్పటడుగు వేశాడు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో శత్రు, మిత్ర భేదాలు మరిచి అంతా సంస్మరణ చేసుకుంటారు. కాని జగన్ సభలో కూర్చుని నాలుగు మాటలు మాట్లాడకుండా జనంలోకి తప్పుడు సంకేతాలు పంపాడు. కారణం అడిగితే... భూమా పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడాల్సి వస్తుందని సభకు రాలేదని చెప్పాడు. ఇది మెచ్యురిటీ వున్న నేతల లక్షణం అస్సలు కాదు.   ఇక తాజాగా అగ్రిగోల్డ్ వ్యవహారం కూడా జగన్ కు రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చింది! మొదట దూకుడుగా పోయిన వైసీపీ అగ్రిగోల్డ్ బాధితుల కోసం చర్చ చేపట్టాలని కోరింది. పనిలో పనిగా జగన్ ప్రత్తిపాటిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాన్ని అవకాశంగా దొరకపుచ్చుకున్న టీడీపీ ప్రతి దాడి చేసింది. శరణమా... మరణమా అంటూ దర్యాప్తుకు ఒప్పుకోమని కార్నర్ చేసింది. అంతదాకా వచ్చాక జగన్ ప్రత్తిపాటి పై తాను చేసిన ఆరోపణలకి కట్టుబడి వుంటే బావుండేది. కారణం ఏంటో కాని... జగన్ ఆ విషయంలో అధికార పక్షం ఎంతగా రెచ్చగొట్టినా తమాయించుకుని ఊరకుండిపోయాడు! అంటే, ప్రత్తిపాటిపై తాను చేసిన ఆరోపణలు, ఆ డాక్యుమెంట్లు అన్నీ ఉత్తివేనా? జనానికి చివరగా మిగిలిన అనుమానం ఇదే!   రాజకీయ శత్రుత్వం వున్నా కూడా కొన్ని విషయాల్లో పట్టువిడుపులు వుండటం ప్రజాస్వామ్యంలో హుందాతనం ఇస్తుంది. తనని దారుణంగా ఓడించిన యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి అఖిలేష్ , ములాయంతో కలిసి వచ్చాడు. కాని, ఇక్కడ జగన్ నూతన అసెంబ్లీ, సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాడు. సభలో సంతాప తీర్మానాలకి వుండడు, చివరకు, ఇవాళ్ల జరిగిన అమరావతి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి కూడా ఆయన డుమ్మా కొట్టాడు! అవకాశం వస్తే ప్రభుత్వం లోపాలు ఎత్తి చూపాలి తప్ప... ఇలా పలాయనం చిత్తగిస్తే జనం క్రమక్రమంగా నమ్మకాన్ని కోల్పోతారు. దీనిపై యువనేత సీరియస్ గా దృష్టి సారించాలి!

రాజు గారి చెవిలో రోజా ముల్లు...

  ఏపీ అసెంబ్లీలో  పంచ్ ప‌ర‌మేశ్వ‌ర్‌..విసుగెరుగ‌ని   బీజేపీ ఎమ్మెల్యే,శాస‌న‌స‌భ ప‌క్ష‌నేత   విష్ణుకుమార్ రాజుకు విసుగొచ్చేసింది. ప‌వ‌ర్ ఫుల్ ..టైమింగ్ సెటైర్ల‌తో స‌భ‌ను హుషారెత్తించే  విష్ణుకుమార్ చెవులు మూసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది(హెడ్ ఫోన్స్‌తో..). రాజుగారు అంత‌లా కాక‌పోయిన కొంత ఇరిటేటింగ‌య్యారు. అందుకు కార‌ణం రాజుగారి వెన‌కాల రాణిగారి ర‌న్నింగ్ కామెంట‌రీ.  ఆ రాణి  ఎవ‌రో కాదు ఏడాది త‌రువాత  అసెంబ్లీలో తాజా రోజాలా అడుగెట్టిన వైసీపీ ఎమ్మెల్యే  రోజాసెల్వ‌మ‌ణి. వైసీపీ గ్యాల‌రీలో కూర్చోవాల్సిన ఆవిడ‌.. రాజు గారి వెనుక వ‌రుస‌లో కూర్చున్నారు.అగ్రిగోల్డ్ అంశంపై వాడీవేడీగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు త‌న వాద‌న‌ను జోడించేందుకు విష్ణుకుమార్ రాజు లేచారు. అప్ప‌టికే అచ్చెన్న జ‌గ‌న్ సారీ చెప్పాలంటూ తెగ డిమాండ్ సేసేస్తున్నారు.  ఒట్టిసారీ కాదు జ‌గ‌న్  లెంప‌లేసుకోవాల్సిందేన‌ని రంకెలేసేసారు. ఎగ్జాట్లీ ఈ టైమ్‌లో మ‌ర్యాద రామ‌న్న‌లా నాలుగు ముక్క‌లు మాట్లాడేందుకు  పంచ్ ప‌ర‌మేశ్వ‌ర్ బెంచ్‌లో నుంచి లేచారు.    మంత్రి ప్ర‌త్తిపాటిపై చేసిన ఆరోప‌ణ‌ల‌నైనా నిరూపించాలి.. జ్యూడిషీయ‌ల్ ఎంక్వ‌రీకైనా ఒప్పుకోవాలంటే.. లేదంటే త‌ప్ప‌ని సెప్పి స‌బ్జెక్ట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని పెద్ద త‌ర‌హాలో చెప్తూ చెప్తూ  వెన‌క్కి తిరిగారు. ఉండ‌మ్మా.. అని గ్యాపిచ్చారు.. బొట్టు పెట్టేస్తారా ఏంటీ..అని  అంత  అటెన్ష‌న‌య్యారు. విష్ణుకుమార్ స్పీక‌రేపు సూసారు. త‌న ఎన‌క రోజా ర‌న్నింగ్ కామెంట్రీ సేస్తుంద‌ని ఫిర్యాదు చేశారాయ‌న‌. ఏడాది స‌స్పెండైనా ప‌రివ‌ర్త‌న రాక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఈ గ్యాప్‌లో మ‌రో రెండు  కామెంట్లు ప‌డ్డాయి.  బాగా మాట్లాడావ్ చాల్లే కూర్చో అని వాయిస్ అల్ల‌రిలో క‌లిసిపోయింది.రాజు గారు మ‌హా ఇదిగా ఫీల‌య్యారు. అస‌లు  ఆమె సీట్లో ఆమె కూసోక‌..ఈడకొచ్చి  చెవి కొరికేస్తుంద‌ని మ‌ళ్లీ  ఫీల‌య్యారు.  రాజుగారు అంత‌లా  ఇద‌యిపోతుంటే బ్యాక్‌సీట్‌లో రోజా  మ‌హా ఇదిగా ఫిదా అయిన‌ట్టు క‌న్పించడం కొస‌మెర‌పు. మొత్తానికి ఏడాది త‌రువాత  ఎంట్రీ ఇచ్చి రోజా.. రాజుగారి చెవిలో ఎట్టాంటి ముల్లు మాట‌లు విన్పించారో... ఆవిడ‌కు ఆయ‌న‌కే తెలియాలి. క‌ర్ణ‌భేరిని కాపాడ‌ాయ‌నే కృత‌జ్ఞ‌తో ఏమో కానీ రాజుగారు ప‌దే ప‌దే హెడ్‌ఫోన్స్ ప్రేమ‌గా నిమిరిన‌ట్టు క‌న్పించారు.

డోన్‌లో మాస్ అసెంబ్లీ

  ఆవు చేలో మేస్తే  దూడ గ‌ట్టున మేస్తుందా..!  అమ‌రావ‌తి అసెంబ్లీలో  నేత‌లు నువ్వా-నేనా  అంటూ స‌వాళ్ల‌తో స‌భా స‌మయాన్ని ఖూనీ చేస్తుంటే..  క‌ర్నూలు జిల్లా డోన్‌లో  మాస్ అసెంబ్లీతో చెల‌రేగిపోయారు కార్య‌క‌ర్త‌లు.  ఈ చానెల్ ఆ చానెల్ అనే తేడాలేకుండా అన్ని  టీవీల్లో..అంతెందుకు నేష‌న‌ల్ మీడియాలో కూడా  డోన్ దెబ్బ‌కు బ్రేకింగ్ న్యూస్‌లు బొబ్బ‌పెట్టాయి.  ఒక  కొట్టుడా.. ఒక తిట్టుడా..   అన్ని భాషాల్లోనే తిట్ల‌ను క‌ల‌గ‌లిపి ..రాంగోపాల్ వ‌ర్మ ర‌క్త‌చ‌రిత్ర సీను ర‌క్తిక‌ట్టించారు   టీడీవీ,  వైసీపీ వ‌ర్గీయులు. ప‌ర‌స్ప‌ర దాడుల‌తో పంబ‌రేపారు. పోలీసులున్నా స‌రే ప‌హిల్వాన్‌లా రెచ్చిపోయారు. ఖాకీల‌ను ఏమాత్రం ఖాత‌ర్ చేయ‌కుండా    ఈ వ‌ర్గం వాళ్లు ఆ వ‌ర్గంపై  ..ఆ వ‌ర్గం వాళ్లు ఈ వ‌ర్గంపై క‌ర్ర‌లు..రాడ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు.  త‌ల‌లు ప‌గిలాయి..చేతులు కాళ్లు విరిగాయి..నెత్తురు చిందింది..   అది మాములు కొట్టుకునుడు కాదు. సినిమాల్లోకూడా  ఈ త‌ర‌హా కుమ్ముడు ఉండ‌దు.రక్త‌చ‌రిత్ర తెర‌క‌ర్త  రాంగోపాల్‌వ‌ర్మ్  బ్రెయిన్ కూడా  అంద‌ని ఫైటింగ్ సీన్ల‌తో ఠారెత్తించారు.  అచ్చంగా  అమరావ‌తి  అసెంబ్లీ త‌ర‌హాలోనే  డోన్ మాస్ అసెంబ్లీలోనూ  అధికార ప‌క్షానిదే కూసింత పై చేయి అయింది. టీడీపీ వ‌ర్గీయుల క‌న్నా  వైసీపీ కార్య‌క‌ర్త‌లే ఎక్కువ గాయ‌ప‌డ్డారు. అక్క‌డ‌  అగ్రిమంట‌ల్లో వేలుపెట్టి  జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్‌లో ప‌డితే.. ఇక్క‌డ  రింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి గాయాల‌తో ఆసుప‌త్రి పాల‌య్యారు వైసీపీ నేత‌లు. డోన్‌లో   టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ వ‌ర్గీయులు దాడి రాంగోపాల్ వ‌ర్మ ర‌క్త‌చరిత్ర మించిన లైవ్లీ సీన్లు  మీడియాలో లైవ్‌క‌వ‌రేజ్‌లో దుమారం రేపాయి. డ్రోన్ కెమెరాల‌క్క‌ర్లేకుండానే డోన్‌లో  సీన్‌సితార్ చేశారు. స‌భ లోప‌లోనైనా..  స‌భ బ‌య‌టైనా  అధికార‌ప‌చ్చానిదే అప్ప‌ర్ హ్యాండా?  అదే ప‌వ‌ర్‌కున్న ప‌వ‌ర్‌.

మ‌ర‌క మంచికే..ప్ర‌త్తిపాటి బిందాస్‌...

  ఎమ్మెల్యేల‌కే కాదు మంత్రుల‌కు సైతం సీఎం చంద్ర‌బాబు గ్రేడింగ్‌..ర్యాంకింగ్ మొద‌లెట్టారు. ఎవ‌రెవ‌రు ఎట్టాగా ప‌నిచేస్తున్నార‌బ్బీ అని వాళ్ల వాళ్ల డేటాను   స‌ర్వే గ్రైండ‌ర్ల వేసి చ‌ట్నీ చేస్తున్నారు.  ఎక్కడైనా రాయి త‌గిలిందో..ర్యాంకింగ్ మ‌టాష్‌.. మ‌స్కాల‌కు హ‌స్క్‌ల‌కు అతివినయాల‌కు  తావులేదు.  స‌ర్వే రిపోర్ట్‌కు ఎదురులేదు. దీంతో  మాన్య‌మంత్రివ‌ర్యుల్లో  ఎప్పుడు ఎవ‌రు ఊస్ట‌వుతారోన‌నే  గుబులు మొద‌లైనా అంతా గుంభ‌నంగా ప‌నులు నెట్టుకొస్తున్నారు. ఎవ‌రి సంగ‌తి ఎలా వున్నా ప్ర‌స్తుతానికైతే  ప్ర‌త్తిపాటి  బెర్త్‌కు  ఢోకాలేదు. ఇప్పుడు ఆయ‌న పొజిష‌న్   మార్కెట్‌లో నెంబ‌ర్ వ‌న్ మార్క్ ప‌త్తిబేళ్లలా  స్ర్టాంగ‌యిపోనాది మ‌రి.  అనుకున్న‌దొక్క‌టి ..అయిందొక్క‌టి అన్న‌ట్టు జ‌గ‌న్ బ్యాచ్  బుల్ బుల్ పిట్ట‌లా బోల్తాప‌డిపోనారు క‌దా. అదే ప్ర‌త్తిపాటికి ఫెచ్చింగ‌యి కూర్చుంది.   ఏ ..బీకి అమ్మాడు..సీ ..బీ ద‌గ్గ‌ర కొన్నాడు.. క్ర‌య‌విక్ర‌యంబుల్ ఎట్టా జ‌రిగినాయో కానీ  అగ్రిగోల్డ్ ఇష్యూను జాయింట్ వీల్‌గా చేసుకోవాల‌నుకున్న.. జే .. ఈ వీల్‌లోనే ఇరుక్కుపోయారు. ముందుకు పోలేక‌.. వెన‌క్కి రాలేక  ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి..నోటుకు కోట్లు అంశాల‌ను తెర‌పైకి తెచ్చినా  ఔట్‌పుట్  డౌట్ లేకుండా ఫేడ‌వుట‌యింది. య‌న‌మ‌లంత‌టి రాజ‌కీయ దిగ్గజం ఇట్టాంటి ప్ర‌తిప‌క్ష నేత‌ను ఎన్న‌డూ సూడ‌లేద‌న్నాడంటే జ‌గ‌న్ ఏపాటి రాటు తేలాడో  ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. కానీ ఒంటేలు మార్క్‌తో కూసింత అప్ప‌ర్ హ్యాండ్ అన్పించుకున్న జ‌గ‌న్‌కు  ఆ సంతోషం ఎక్కువ సేపు నిల్వ‌కుండా పోయింది. అడుసుతొక్క‌నేలా..కాలు క‌డ‌గ‌నేలా..  అన్న‌ట్టు ఆగమాగంగా అగ్రిగోల్డ్ భూములు లాగేసుకున్నార‌ని  ఆఫ్‌కోర్స్ కొన్నార‌ని  మంత్రిప్ర‌త్తిపాటిపై ఆరోప‌ణ‌లు  చేశారు. హౌజ్‌క‌మిటీ కాదు జ్యూడిషియ‌ల్ క‌మీటీ  వేయాలన్నారు.    టైమింగ్ తో పావులు క‌దిపిన సీఎం చంద్ర‌బాబు..ఏ  క‌మిటీకైనా రెడీ అన‌డంతో జ‌గ‌న్ వ‌ర్గం గొంతులో వెల‌క్కాయ‌ప‌డిన‌ట్ట‌యింది,సీఎం అంత స్ట్రాంగ్‌గా ముందుకెళ్లారంటే ఏదో మ‌త‌ల‌బు ఉండ‌నే ఉంట‌ది. ప్ర‌త్తిపాటి మిస్ట‌ర్ క్లీన్ అని ముందే  రిపోర్ట్ అందిందా?  లేక ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు ఇటు జ‌గ‌న్‌ను ఇరుకున పెట్ట‌డంతో పాటు అటు ప్ర‌త్తిపాటికి మంత్రివ‌ర్గం నుంచి  ఉద్వాస‌న  ప‌లికే స్కెచ్చేశారా?  ఈడౌట్ ఎందుకంటే చెవిరెడ్డి భాస్క‌రెడ్డి  ఈ మాట‌ల‌తోనే మీడియా చెవులు కొరికారు.చెవిరెడ్డి ఆరోప‌ణ‌ల సంగ‌తి ఎలా వున్నా..అగ్రిల్యాండ్స్ ఇష్యూలో  జ‌గ‌న్ క‌న్నా  బాబు  ఎక్కువ స్ట‌డీ చేశార‌ని స్ప‌ష్ట‌మైంది.    అంత ప‌క్కాగా డేటా వుంది కాబ‌ట్టీ సీఎం  చంద్ర‌బాబు జ్యూడీషియ‌ల్ క‌మిటీ  అస్త్రం సంధించారా?లేదంటే జ్యూడీషియ‌ల్‌పై బాబుకు ఎంత ప‌ట్టుందో బాగా తెలిసిన వ్య‌క్తిగా జ‌గ‌న్ కావాల‌నే మెత్త‌బ‌డ్డారా? ఏది ఏమైతేనేం.. అగ్రిమంట‌ల్లో ప్ర‌త్తిపాటి  విధేయ‌త‌కు  మ‌రింత రాటు దేలింది. మ‌ర‌క మంచిదే  అన్న‌ట్టు  బాస్ ద‌గ్గ‌ర ఆయ‌నకు బాగానే మార్కులు ప‌డ్డాయి. రేసుగుర్రంలా ఎగిరిప‌డుతున్న  విప‌క్షానికి క‌ళ్లెం వేయ‌డానికి ప్ర‌త్తిపాటి విష‌యం బాగా క‌లిసొచ్చింది. మ‌ర‌క  ప్ర‌త్తిపాటికి అచ్చిపాటిగా మారింద‌నే  టాక్ విన్పిస్తోంది.

కాటమరాయుడి జిల్లాల్లో సినీ కాటమరాయుడి కాలినడక!

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు భలే పాప్యులారిటీ వస్తుంటుంది. అందుకు కారణం వాటి ప్రగతో, చారిత్రక నేపథ్యమో వగైరా వగైరానో కాదు! ఆ ప్రాంతాలకు కొందరు సెలబ్రిటీలతో వుండే లింకే! మరీ ముఖ్యంగా పాదయాత్రలు , చట్ట సభలకు పోటీ చేసే విషయంలో చాలా ప్రాంతాలు స్పెషల్ గా మారిపోతుంటాయి! ఇప్పుడు ఆ వంతు అనంతపురానికి వచ్చింది!   కాటమరాయుడు పవన్ కళ్యాణ్ కి అనంతపురం అంటే అనంతమైన అభిమానం. నిజానికి ఆయన తాజా చిత్రం కాటమరాయుడు పేరు కూడా ఆ జిల్లాల్లోని ప్రఖ్యాత కదిరి నరసింహ స్వామిదే! అయితే అనంతతో కేవలం సినిమాటిక్ లింక్ మాత్రమే పెట్టుకోవాలని పవర్ స్టార్ భావించటం లేదు. పొలిటికల్ గా కూడా అత్యంత వెనుకబడ్డ అనంతపురాన్నే తన ప్రస్థానానికి మూలంగా ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే అనంతపురం నుంచి తాను బరిలోకి దిగుతానని ప్రకటించేసిన కాటమరాయుడు వడివడిగా తన ప్రయత్నాలు మొదలెట్టినట్టు కనిపిస్తోంది. చాలా మంది రాజకీయ నాయకులు తలపెట్టినట్టుగానే పవన్ పాదయాత్రకి సిద్ధపడ్డాడు. అది తొలిసారిగా అనంతపురంలోనే మూడు రోజుల పాటూ నిర్వహించాలని అనుకుంటున్నాడు. ఇంకా తేదీలు ఖరారు కాలేదు గాని... రోడ్ మ్యూప్, రూట్ మ్యాప్ రెండూ సిద్ధమవుతున్నాయట!   కాటమరాయుడు విడుదలై కాస్త గ్యాప్ దొరికింది కాబట్టి ఇప్పుడే పవన్ అనంతపురంలో పర్యటించి తన పొలిటికల్ గేమ్ ప్రారంభించనున్నారు. మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా ఊపందుకుంటే కొన్నాళ్లు ఆయన రాజకీయాలకు దూరంగా వుండాల్సి వస్తుంది. అందుకే, ఒకప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు బాలయ్య కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం వున్న అనంతపురం నుంచే పవన్ తొలి అడుగులు వేస్తున్నాడు. టీడీపీకి కూడా ఎన్టీఆర్, బాలయ్య పోటీ చేయటంతో అనంతపురం సెలబ్రిటీ డిస్ట్రిక్ గా మారిపోయింది. ఇప్పుడు పవన్ స్పెషల్ ఫోకస్ తో జనసేన కార్యకర్తలు , ఆయన అభిమానులకి కూడా అనంతపురం హాట్ స్పాట్ గా మారిపోనుంది!   పాదయాత్రల వల్ల చంద్రబాబు, చిరంజీవి, వైఎస్ లాంటి నేతల ప్రత్యేక దృష్టి వల్ల ఫేమస్ అయిన మరి కొన్ని ప్రాంతాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వున్నాయి. ఉధాహరణకి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, తెలంగాణలోని చేవెళ్ల ఇదే కోవకు వస్తాయి! మరి పవన్ పాదయాత్రతో అన్నా అనంతపురం కళ్లలో ఆనందం తాండవిస్తుందా? కరువు కోతతో అల్లాడే జిల్లా వికసిస్తుందా? వేచి చూడాలి. లేదంటే, జనసేనాని వచ్చే ఎన్నికల్లో అక్కడ్నుంచే అసెంబ్లీకి వచ్చి అనంత కష్టాల్ని తీర్చే ప్రయత్నం చేయాలి! ప్రజలు కోరుకునేదైతే అదే!

బీజేపిని, కాంగ్రెస్ ను ఏకం చేసిన టీఆర్ఎస్!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవ్వరూ వుండరంటారు! కాని, అప్పుడప్పుడూ తాత్కాలిక మిత్రులు కూడా పుట్టుకొస్తుంటారు ! తెలంగాణ అసెంబ్లీలో అదే జరిగింది! బీజేపికి మద్దతుగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది! యెస్ ... కరెక్టే కమలానికి అండగా హస్తం స్నేహ హస్తం చాచింది! ఈ పరిణామానికి కారణం మరెవరో కాదు... టీ అసెంబ్లీలో అధికార పక్షమైన టీఆర్ఎస్!   ఈ మధ్య చట్ట సభల్లో సస్పెన్షన్ టెక్నిక్ గా బాగా వర్కవుట్ అవుతోంది! తెలంగాణ అయినా , ఆంధ్రా అయినా, లేక మహారాష్ట్రా అయినా కూడా రూలింగ్ పార్టీకి చిర్రెత్తుకొస్తే సభ బయటకి గెంటేస్తున్నారు. తమలో తామే హాయిగా చట్ట సభని నడిపేసుకుంటున్నారు! ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సెషన్స్ ప్రారంభంలోనే టీ టీడీపీ నేతలు రేవంత్, సండ్ర సస్పెన్షన్ కాటుకి గురయ్యారు. గవర్నర్ ప్రసంగం సమయంలో అడ్డుతగిలారని వారిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో స్పీకర్ వార్ని ఈ సెషన్స్ మొత్తం నిషేధించేశారు! ఇక తాజాగా బీజేపి ఎమ్మెల్యేలకు కూడా బహిష్కరణ రుచి ఎలా వుంటుందో కేసీఆర్ సర్కార్ రుచి చూపించింది. మతపరమైన రిజర్వేషన్ల గురించి కమలం ఎమ్మెల్యేలు గొడవ చేయటంతో వారికి సస్పెన్షన్ సన్మానం చేసింది.    బీజేపి ఎమ్మెల్యేలని బయటకి పంపించటంతో వారికి అనూహ్య కోణం నుంచీ మద్దతు లభించింది. ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్ పార్టీ వారు కమలం నేతల్ని బహిష్కరించటం తప్పని గట్టిగా వాదించారు. జానా రెడ్డి తాము ఇలా సస్నెన్షన్ చేయటాన్ని ఖండిస్తున్నామని తేల్చి చెప్పారు. అంతే కాదు, కేసీఆర్ ధర్నా చౌక్ తొలగించటంతోనే బీజేపి సభ్యులు సభలో గోల చేయాల్సి వచ్చిందని కూడా అన్నారు. చివరగా, సస్పెండ్ అయిన సభ్యులకి మద్దతుగా తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు!    తెలంగాణ అసెంబ్లీలో బద్ధ శత్రువులైన కాంగ్రెస్ , బీజేపిల్ని కూడా ఏకం చేశారు కేసీఆర్. అయితే, ఇదే తరహా సస్పెన్షన్ ఫార్ములా అమలవుతోంది ఆంధ్రా అసెంబ్లీలో కూడా! అక్కడ రోజా బహిష్కరణ తతంగం చాలా రోజులుగా నడుస్తూనే వుంది! అంతే కాదు, మహారాష్ట్రా అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని అక్కడి ఫడ్నవీస్ గవర్నమెంట్ స్పీకర్ సాయంతో రోజుల తరబడి సభ బయటకు నెట్టేసింది! ఇక ఆ మధ్య బల పరీక్ష సమయంలో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన దారుణమైతే అందరికీ తెలిసిందే! స్టాలిన్ తో సహా బోలెడు మంది బట్టలే చినిగిపోయాయి! అప్పుడు కూడా చివరకు తమకు అడ్డుగా వున్న ఎమ్మేల్యేలు అందర్నీ అవతలకి పంపి పని కానిచ్చేశారు!   ప్రతిపక్ష సభ్యుల్ని బయటకి తోసేసి సభలు నడిపించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అదే సమయంలో ప్రతిపక్షాల నేతలు కూడా బాధ్యతగల ప్రజా ప్రతినిధులుగా హుందాగా వ్యవహరిస్తే స్పీకర్లు చిన్నప్పటి స్కూల్ టీచర్ల మాదిరిగా మారకుండా వుంటారు! మార్పు ఇద్దరి వైపు నుంచీ రావాలి... ఎందుకంటే, అధికార పక్షం, ప్రతిపక్షం అన్న హోదాలు శాశ్వతం కాదు. ఇవాళ్ల సస్పెండ్ చేసిన పార్టీ అయిదేళ్ల తరవాత సస్పెండ్ అవ్వాల్సి రావొచ్చు!

ఆంధ్రప్రదేశ్ అవార్డ్ అందుకుంది!

అవార్డ్ వస్తే ఉల్లాసం, రివార్డ్ వస్తే ఉత్సాహం ఎవరికైనా సహజమే! ఒక కొత్త రాష్ట్రానికి కూడా ఒక ప్రతిష్ఠాత్మక అవార్డ్ వస్తే మంచి ప్రేరణా, ప్రొత్సాహం లభిస్తాయి. అదే జరిగింది మన నవ్యాంధ్రకి సీఎన్ బీసీ అవార్డుల వేదికపై! కనీసం రాజధాని కూడా లేకుండా 2014లో ఏర్పడ్డ నూతన ఆంధ్రప్రదేశ్ మూడేళ్లలో చాలా ముందుకే దూసుకొచ్చింది! అన్నీ అద్బుతాలే అని మనం చెప్పుకోలేకున్నా అవార్డ్ పొందగలిగే అంత వేగాన్నైతే పుంజుకుంది!   ఢిల్లీలో సీఎన్ బీసీ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకున్నారు మంత్రి అయ్యన్నపాత్రుడు! అదే వేదికపై నుంచీ సరికొత్త ఆంధ్రప్రదేశ్ వినూత్న అభివృద్ధి పంథాను చంద్రబాబు వివరించారు. అమరావతి లాంటి అపురూప రాజధాని నిర్మాణం చేసుకుంటూనే అన్ని రంగాల్లో ముందుకుపోతున్నామని చెప్పారు. దేశంలో రెండంకెల అభివృద్ధి కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే సాధించిందని సగర్వంగా చెప్పారు. అయితే, తమ సత్తా సీఎన్ బీసీ లాంటి గొప్ప సంస్థలు జాతీయ స్థాయి వేదికలపై గుర్తిస్తున్నా... ప్రతిపక్షం మాత్రం పసిగట్టలేకపోతోందంటూ చురకులు వేశారు!    చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతని టార్గెట్ చేయటం మాటెలా వున్నా ఏపీ ప్రతిష్ఠాత్మక స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకోటం నిజంగా సంతోషించాల్సిన విషయం. కాకపోతే, అవార్డ్ అందుకుంటూనే సీఎం చెప్పిన మాటలు ఎంతో సత్యం కూడా. అవార్డ్ అందించిన అరుణ్ జైట్లీని ఉద్దేశించి బాబు కేంద్ర సహకారం మరింత కావాలన్నారు. ప్రత్యేక హోదా రాకపోయినా కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కి మోదీ సర్కార్ మరింత సాయం చేయాలన్నది మాత్రం నిజం. అది జరిగితే ఇక మనకు తిరుగుండదు!   ఈ సారి సీఎన్ బీసీ అవార్డుల్లో మరో అవార్డ్ కూడా తెలుగు వారికే దక్కింది. అమర్ రాజా బ్యాటరీస్ మోస్ట్ ప్రామిసింగ్ అవార్డ్ గెలుచుకుంది! ఈ అవార్డ్ ని ఎంపీ గల్లా జయదేవ్ అందుకున్నారు! 

వేటకి కారణం మంత్రివారి కొడుకా? వెయిటింగ్ మోడ్ లో పోలీసులా?

మీకు సల్మాన్ ఖాన్ తెలుసా? మనోడు చాలా పెద్ద బాలీవుడ్ స్టార్. అయినా సరే సల్మాన్ ను ఓ కేసు ముప్పతిప్పలు పెడుతోంది. కోట్లాది మంది అభిమానులకు కావాల్సిన వాడైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడెప్పుడో కృష్ణ జింకల్ని వేటాడాడని సల్లూ మీద ఆరోపణలున్నాయి. ముందు ముందు ఖచ్చితంగా శిక్ష పడే సూచనలు కూడా వున్నాయి!    ఇప్పుడు ఒక సారి సీన్ కట్ చేస్తే... గత ఆదివారం అర్థరాత్రి అటవీ అధికారులకి సమాచారం అందింది. జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని అంబట్ పల్లి, సురారం సమీపంలో వన్యప్రాణుల వేట సాగుతోందని సారాంశం. వెంటనే బయలుదేరి వెళ్లిన వాళ్లకి దుండగలు ఎదురుపడనే పడ్డారు. పదిహేను మంది వరకూ హంటర్స్ , మరికొంత మంది స్థానికులు కూడా వుండటంతో అధికారుల మీద వేటగాళ్లదే పై చేయి అయింది. గన్నులతో బెదిరించి పారిపోయారు. అయితే, వాళ్లు అక్కడ వదిలిపోయిన ఇండికా కార్ లో చచ్చిపడి వున్న రెండు దుప్పులు హృదయ విదారకంగా కనిపించాయి. అంతే కాదు, ఇండికా కార్ లో వాహనం ఓనర్ ఆధార్ కార్డ్ కూడా దొరికింది. విమాన ప్రయాణానికి ఉద్దేశించిన ఫ్లైట్ టికెట్స్ కూడా లభించాయి!   చచ్చిన దుప్పులు, ఆధార్ కార్డ్, విమాన టికెట్లు.. ఇన్ని ఆధారాలు వుంటే కేసులో నిందుతుల్ని అరెస్ట్ చేయటం ఎంత సేపు? పోలీసులకి క్షణాల పని! కాని, అలా జరగలేదు. చిన్న చిన్న పిక్ పాకెట్ గాళ్లని సెల్ లో వేసి లాకప్ డెత్ కూడా చేసేసే మన వ్యవస్థలో అత్యంత తీవ్రమైన వన్యప్రాణుల వేట చేసిన వార్ని మాత్రం ఎవ్వరూ ఏమీ చేయటం లేదు. ఆదివారం నుంచీ ఇప్పటి వరకూ ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. ఎందుకు?   సల్మాన్ లాంటి సూపర్ స్టార్ కూడా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని మనం చెప్పుకున్న తీవ్రమైన వన్య ప్రాణుల వేట... రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ఒత్తిడి ముందు నిల్వలేకపోతోంది. మహదేవ్ పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన దారుణం వెనుక ఓ మంత్రి కొడుకు గారి హస్తం వుందట! ట్రిగ్గర్ లు నొక్కటానికీ, అమాయకమైన దుప్పులు చావటానికి ఆయనే కారణమట. పైగా తండ్రిగారైన మన మంత్రిగారు క్యాబినేట్లో కేసీఆర్ తరువాత అంతటి ప్రధానమైన వ్యక్తట! ఇక చెప్పేదేముంది?    నిజంగా మూగ ప్రాణుల వేటలో మంత్రిగారి కొడుకు హస్తం వుందా? వుంటే ఆ మంత్రెవరు? ఆ కొడుకు పేరేంటి? లేకపోతే, మరి చేసిన వారెవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోలీసులే. కాని, మన దేశంలో పోలీసు వ్యవస్థ, చట్టాలు కూడా వన్యప్రాణుల మాదిరిగానే చాలా సార్లు వేటకు గురవుతుంటాయి కదా... న్యాయాన్ని ఆశించటం అత్యాశే! 

హోదా ఇష్యూతో వైసీపీ రచ్చ.... ఎదురుదాడితో కౌంటరిచ్చిన ప్రభుత్వం

ప్రత్యేక హోదా అంశంపై మరోసారి ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. హోదా ఇష్యూతో అధికారపక్షాన్ని ఇరుకునపెట్టాలనుకున్న ప్రతిపక్షం రచ్చరచ్చ చేసింది. వాయిదా తీర్మానమిచ్చి చర్చకు పట్టుబట్టిన వైసీపీ.... వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించింది. ఇటు అధికారపక్షం కూడా ఎదురుదాడికి దిగడంతో అసెంబ్లీ అట్టుడుకిపోయింది. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చకు అనుమతిస్తామని స్పీకర్‌ చెప్పినా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దాంతో సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదాపడింది.   సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ ఆందోళన కొనసాగించింది. అయితే ప్రత్యేక హోదా ముగిసిన అంశమన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌‌రాజు.... దీనిపై ఇంకా చర్చ ఎందుకన్నారు.వైసీపీ సభ్యులకు ప్రత్యేక వ్యాధి ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎద్దేవా చేస్తే, రాష్ట్రంలో సమస్యలు లేనందునే ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని, సభను అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, గోరంట్ల విమర్శించారు. వైసీపీ ఆందోళనతో మూడు గంటలకు పైగా సభా సమయం వృథా అయ్యిందని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు... ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు.   అయితే కేసుల మాఫీ కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైసీపీ ఆరోపించింది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా తీర్మానం చేసిన చంద్రబాబు.... ఇప్పుడెందుకు తీర్మానం ప్రవేశపెట్టడానికి వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.