ఏపీలో కొత్త వివాదం... బయోమెట్రిక్‌పై ఉద్యోగుల గరంగరం

  ఇష్టమొచ్చినప్పుడు వస్తారు... బోర్‌ కొట్టినప్పుడు వెళ్లిపోతారు. అసలు ఎప్పుడు ఆఫీస్‌లో ఉంటారో... ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు. అసలు వాళ్లను అడిగే వాళ్లే ఉండరు. మధ్యాహ్నం అయినా… డ్యూటీకి రావాలన్న సంగతి మర్చిపోతారు. ఇలా టైమ్‌కు డ్యూటీకి రాని ఉద్యోగులపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఎంప్లాయిస్ టైమింగ్స్‌పై ఆరోపణలు రావడంతో సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం...  టైమ్‌ టూ టైమ్‌ పనిచేసేలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఉదయం 11 గంటలు దాటినా… ఉద్యోగులు డ్యూటీకి రాకపోవడంతో  ప్రభుత్వ సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం... ఉద్యోగుల అటెండెన్స్‌ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వారి కోసం నయా ప్లాన్ రెడీ  చేసింది సర్కారు.   ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని... బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చింది. వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలతో పాటు సచివాలయంలోనూ బయోమెట్రిక్ సిస్టమ్ అమల్లోకి తెచ్చింది. సచివాలయం ఉద్యోగులకు వారానికి ఐదురోజులే పని దినాలున్నా సోమవారం, శుక్రవారం సాయంత్రం త్వరగా వెళ్లడంతో పాటు  ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో బయో మెట్రిక్‌ను తప్పని సరి చేసింది ప్రభుత్వం.   ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసుకు వచ్చి పోదాం... అనుకునే ఉద్యోగులకు ఈ కొత్త సిస్టం చెక్ పెట్టనుంది. ఇది పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తేనే ఉద్యోగుల తీరులో మార్పు వస్తుందని  సర్కారు  భావిస్తుంది. అయితే బయోమెట్రిక్‌ సిస్టమ్‌ను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇది తమను వేధించడానికే అంటున్నారు. ఈ-ఆఫీస్‌‌తో ఎవరు ఎక్కడ నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఉందని, కొత్తగా బయోమెట్రిక్‌ సిస్టమ్‌ను అమలు చేయడం సరికాదంటున్నారు.

జగన్‌ కల నెరవేరుతుందా? ప్రశాంత్‌ పాచికలు పారతాయా?

  ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో జగన్‌ అలర్ట్‌ అయ్యారు. 2014లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన జగన్...ఈసారి ఎలాగైనా సీఎం పీఠం అధిష్టించాలని పావులు కదుపుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన ఆయుధంతో టీడీపీని చిత్తు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. వైసీపీ గెలుపు బాధ్యతల్ని ప్రశాంత్ కిషోర్ నెత్తిన పెట్టారు. ఇప్పటికే జగన్‌తో సమావేశమైన ప్రశాంత్‌ కిషోర్‌... ఏపీ రాజకీయాలపై చర్చించారు. జగన్‌తో పరిచయ కార్యక్రమం పూర్తికావడంతో... ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే ఏపీ‌లో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.   ప్రశాంత్ కిషోర్ 2014లో తన రాజకీయ వ్యూహాలతో మోడీని, తర్వాత బీహార్ లో నితీశ్ కుమార్ ని గద్దెనెక్కించి పేరు తెచ్చుకున్నారు. అప్పట్నుంచి పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ పేరు మార్మోగిపోయింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే యూపీలో ప్రశాంత్ పాచికలు పారకపోయినా...పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది.   అధికార పార్టీలో అసంతృప్తుల్ని త‌మ వైపు తిప్పుకునేందుకు సూచ‌న‌లతో పాటు గెలుపు కోసం ప్రశాంత్ కీలకమైన సలహాలిస్తారని జగన్ నమ్ముతున్నారు. గ‌తంలో అనేకమంది విజయానికి బాటలు వేసిన ప్రశాంత్ కిషోర్ తననూ అధికారంలోకి తెస్తుందని జగన్ భావిస్తున్నారు.

బాహుబలి కోసం టెన్షన్ గా వెయిట్ చేస్తోన్న జనం… ఈ టెన్ ఫ్యాక్ట్సే కారణం!

ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి! కారు చీకట్లు ముసురుకుంటున్నాయి! ఏ క్షణాన అయినా చినుకులు రాలవచ్చు! ఒక్కసారి వర్షం మొదలైందా… ఇక తుఫానే! ఇదంతా చెబుతోంది వాతావరణ సూచన కాదు! ఎర్రటి ఎండా కాలంలో బాహుబలి బాక్సాఫీస్ పైకి దండెత్తి వస్తున్నాడు. కాసుల వర్షం… కలెక్షన్ల తుఫాన్ సృష్టించబోతున్నాడు! ఇంతకీ బాహుబలి 2, అదేనండీ, బాహుబలి ది కన్ క్లూషన్ మ్యానియాకు కారణం ఏంటి? పది ముక్కల్లో చెప్పకుంటే… ఆ టెన్ టెంప్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బాహుబలి… ఇవే…   1.     బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ ఖర్చే మరో భారీ తెలుగు సినిమా బడ్జెట్ అంత! దాదాపు 30కోట్లు బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్ కోసం వెచ్చించారు. ఇది బాహుబలి ది బిగినింగ్ కన్నా రెట్టింపు!   2.    బాహుబలి అనగానే మనకు ఇప్పటికిప్పుడు గుర్తుకు వచ్చే ప్రధానమైన సీన్స్ ఏవీ? ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ కొండలపైనా, జలపాతలపైనా చేసిన విన్యాసాలు! మొదటి భాగం షూట్ చేస్తున్నప్పుడు జలపాతాల సీన్లు షూట్ చేయటానికి ముప్పాతిక సమయం సరిపోయిందట! అలాంటి కళ్లార్పనీయని దృశ్యాలు బాహుబలి 2లో ఇంకా వున్నాయట! అఫ్ కోర్స్, ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలతో పాటూ!   3.    బాహుబలి ది కన్ క్లూషన్ షూటింగ్ 2015 డిసెంబర్లో ప్రారంభమైంది. ఒకటిన్నర సంవత్సరంలో రాజమౌళి తన సిల్వర్ స్క్రిన్ వండర్ ని సిద్ధం చేశాడు!   4.    బాహుబలి 2 సినిమాకు సంబంధించి లీకైన కొన్ని ఫోటోలు పోయిన సంవత్సరం కలకలం సృష్టించాయి!   5.    బాహుబలి హిందీ డబ్బింగ్ వర్షన్ వంద కోట్లు వసూలు చేసింది! కాని, ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైన బాహుబలి 2 సాటిలైట్ రైట్సే 51కోట్లకు అమ్ముడుపోయాయి! సోనీ టీవీ ఈ భారీ మొత్తం ఖర్చు చేసి బాహుబలి 2 స్వంతం చేసుకుంది! ఒక డబ్బింగ్ సినిమా ఇంత ధర పలకటం హిందీలో ఇదే మొదటిసారి!   6.    బాహుబలి ది కన్ క్లూషన్ లో అందర్నీ ఆకర్షిస్తున్న అంశం… ప్రభాస్, రాణా, అనుష్కల మధ్య నడవబోయే ముక్కోణపు ప్రేమకథ! భల్లాలదేవుడు దేవసేనని కోరితే… దేవసేన అమరేంద్ర బాహుబలిని ప్రేమిస్తుంది! వీరి కథలో శివగామి పాత్ర ఏంటి? ఇదే పెద్ద ట్విస్ట్ గా వుండనుంది!   7.    బాహుబలి మొదటి భాగం చివర్లో అమరేంద్ర బాహుబలిని… సింహాసనాధీశుడ్ని చేసిన రాజమాత శివగామి… కట్టప్ప చేత అతడ్ని చంపిస్తుందా? వినటానికే విభ్రాంతికరంగా వున్న ఈ మలుపు బాహుబలి 2లో వుండబోతోందంటున్నారు! అదే నిజమైతే, శివగామి బాహుబలికి వ్యతిరేకంగా ఎందుకు మారింది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న!   8.    దేవసేనతో సహా మాహిష్మతీ రాజ్య సింహాసనం ఆశించిన బాహుబలి, భల్లాలదేవ… గంటలు, రోజుల తరబడి జిమ్ లో గడిపారు! 30కేజీల వరకూ బరువు పెరిగి భారీగా కనిపించిన ప్రభాస్ , రాణా ఇందుకోసం కఠోర శ్రమ చేయటమే కాక బోలెడు ఆహార నియమాలు కూడా పాటించారు! వియత్నాం నుంచీ వచ్చిన మార్షల్ ఆర్ట్స్ కోచ్ ట్యువాన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు!   9.     థియేటర్స్ కి వచ్చాక టికెట్ల అమ్మకం ద్వారా జరిగే బిజినెస్ కాకుండా ఇప్పటికే బాహుబలి 2 అయిదు వందల కోట్ల వ్యాపారం చేసింది! టెలివిజన్ రైట్స్ , థియేట్రికల్ రైట్స్ లాంటి ద్వారా ఈ అద్భుతం సాధించింది!   10.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్… బాహుబలి ది కన్ క్లూషన్… విడుదలకి ఒక్కో క్షణం దగ్గర పడుతున్నకొద్దీ అందరి మనస్సుల్లో ఒకే ప్రశ్న మెదులుతోంది! అదే… ‘’ కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు? ’’ దీనికి సమాధానం దొరకాలంటే బాహుబలి బిగ్ స్క్రీన్ పైకి రెండోసారి రావాల్సిందే! And the countdown has already began…

జగన్ నిజంగా అరాచకవాదేనా..?

ఒక పార్టీకి అధినేత..అందునా రాష్ట్రానికి ప్రతీపక్షనేత..అలాంటి వ్యక్తి నలుగురిలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి. కానీ జగన్‌లో నిఖార్సైన రాజకీయ నేత లక్షణాలు అణుమాత్రం కూడా కనిపించడం లేదు. ఒంటెత్తు పోకడలు, అనుభవ లేమి, బాధ్యతారాహిత్యం, ముందుచూపు లేకపోవడం వల్లే అధికారానికి దూరమయ్యామని..అయినా సరే తమ అధినేతలో కొంచెం కూడా మార్పు రాలేదని వైసీపీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఎన్నో. తాజాగా జగన్ అనుభవలేమి మరోసారి ఆయనను నవ్వుల పాలు చేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అక్కడి వరకు అది మంచి ఆలోచనే..దానిని అభినందించాల్సిందే. కానీ ఏదో బహిరంగసభకు వెళ్తున్నట్లు భారీ కాన్వాయ్‌, మంది మార్భలంతో వెళ్లేసరికి బాధితులు భయపడిపోయారు. ప్రతిపక్షనేత వారిని ఓదారుస్తుండగా ఆయన అనుచరులు నానా రచ్చ చేశారు.   జగనన్నా జిందాబాద్..అంటూ హోరెత్తించారు. దీంతో బాధిత కుటుంబాలకు చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడేమైనా పెళ్లి జరుగుతుందా ఇంతమంది వచ్చారు..ఆ జిందాబాద్‌లు ఏంటీ అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఇది చూసిన వారు అనుభవమున్న  రాజకీయనాయకుడికి..అనుభవలేమికి ఇదే తేడా అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జగన్‌ ఎప్పటికీ పోటీపడలేరని..చంద్రబాబు అయితే వేదికల మీద ఉన్నప్పుడు కానీ..ఇలాంటి సందర్భాల్లో కానీ అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు..ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తమ శ్రేణులకు సూచించేవారని. తన సామాజిక వర్గం నేతలను పక్కన ఉంచుకున్నా.. అంతే స్థాయిలో ఇతర సామాజిక వర్గాల నేతలను పక్కనబెట్టుకుని బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటారు. అలాంటి చిన్నచిన్న జాగ్రత్తలే ఒక నాయకుడిని జనంలో ఉన్నతంగా నిలబెడతాయి..   అయినా 14 మంది చనిపోయి ఆ కుటుంబాలు కొండంత దు:ఖంలో ఉంటే అలాంటి చోట జేజేలు కొట్టించుకోవడం ఏంటీ..తమ అభిమాన నాయకుడిని చూసిన ఆనందంలో అభిమానులు అలాగే ప్రవర్తిస్తారు అనుకుంటే వారిని జగన్ అనుచర గణమే  అక్కడికి వాహనాల్లో తరలించింది. అలాంటి వారు మరి జిందాబాద్‌లు కొట్టక ఏం చేస్తారు. వెళ్లేది ఓదార్పు యాత్రకు అని జగన్ మరచిపోయినట్లున్నారు..అందుకే వారు జిందాబాద్‌లు కొడుతుంటే పులకరించిపోయారు తప్పించి పట్టించుకోలేదు. అందుకే అంటారు ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని..ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా ఉన్నత స్థాయికి వెళతారని రాజకీయ విశ్లేషకుల టాక్.

అసలే పార్టీ పరిస్థితి బాగా లేదు... పైగా ఈ చెత్త రూల్స్‌ ఏంటి?

2019లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోన్న కాంగ్రెస్‌... ఒకవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడుతూనే.... మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా కమిటీలు, పెండింగ్‌ డీసీసీల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేయాలనుకుంటోంది. అయితే కీలకమైన డీసీసీ అధ‌్యక్ష పదవులు చేపట్టేందుకు సీనియర్లు ఎవరూ ముందుకురావడం లేదు. కనీసం మోస్తరు లీడర్ల కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే రాహుల్‌ తీసుకొచ్చిన కొత్త రూల్సే దానికి కారణం. డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమన్న అధిష్టాన నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.   అసలే పార్టీ పరిస్థితి బాగాలేదు... పైగా ఈ చెత్త రూల్స్‌ ఏంటంటూ దిగ్విజయ్ ముఖం మీదే చెప్పేశారు. ఇలాగైతే ఎవరూ సీనియర్లు ఎవరూ డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరని, దాంతో జిల్లాల్లో పార్టీ బలోపేతం కూడా సాధ్యంకాదన్నారు. సమర్ధులు, సీనియర్లకు డీసీసీ బాధ్యతలు అప్పగించాలని, అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని, లేదంటే అంతే సంగతులని దిగ్విజయ్‌కి తేల్చిచెప్పారు. అయితే సీనియర్ల అభిప్రాయాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్తానని దిగ్విజయ్‌... మండల కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ముఖ్యనేతలకు ఆదేశించారు.   మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడుతోందని గుర్తించిన అధిష్టానం... క్రమశిక్షణ ఉల్లంఘించే లీడర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తోందట. దిగ్విజయ్‌ ముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి కొట్టుకోవడాన్ని హైకమాండ్‌ సీరియస్‌గానే తీసుకుందంటున్నారు. మరోసారి ఇలాంటి సీన్‌ రిపీట్‌ అయితే ఉపేక్షించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. ఓవైపు చెత్త రూల్స్‌... మరోవైపు కుమ్ములాటలతో లీడర్ల మధ్య సమన్వయం లోపిస్తుంటే, పార్టీ బలోపేతం ఎలా సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందని దిగ్విజయ్‌తోపాటు టీకాంగ్రెస్‌ సీనియర్లు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.

ధ్యేయమే ధర్మం కాదు… ధర్మమే ధ్యేయం… బాహుబలితత్వం!

బాహుబలి… ఇప్పుడు ఇదొక పదం కాదు! ఓ సినిమా పేరు కూడా కాదు! బాహుబలి అనేది ఇప్పుడొక బ్రాండ్! ఇప్పుడొక మార్కెట్! ఇప్పుడొక చరిత్ర! ఇంతగా కలకలం రేపిన బాహుబలి… సినిమాలో ఎవరు? హీరో! యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్… బాహుబలిగా సరికొత్త ఇమేజ్ సంపాదించుకున్నాడు… జక్కన్న చేతుల్లో! ప్రభాస్ కెరీర్ ఇక పైన బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అనే మాట్లాడుకుంటారు! అయితే, ఇంత ప్రెస్టేజియస్ గా తీసిన బాహుబలిలో… హీరో పాత్రైన బాహుబలికి ఇన్ స్పిరేషన్ ఏంటి?   బాహుబలిలోని ఇతర పాత్రలన్నిటిలాగే కథానాయకుడి క్యారెక్టర్ కీ… పురాణ పురుషులే ప్రేరణ! ప్రధానంగా బాహుబలి వ్యక్తిత్వం చూస్తే మనకు శ్రీరాముడే గుర్తుకు వస్తాడు! ఆయనలాగే బాహుబలికి కూడా ఆజానుబాహుడు, అందగాడు, అందరికీ నచ్చిన వాడు! అయితే, రాముడికి సోదరులందరూ దాసానుదాసులే! కాని, బాహుబలి విషయంలో అసలు శత్రువు వరుసకు సోదరుడైన భల్లాలదేవుడు! ఇక్కడే మనకు మహాభారతం స్ఫురిస్తుంది! దుర్యోధనుడి లాంటి భల్లాలదేవుడు ధర్మరాజు లాంటి నీతిమంతుడు, నియమవంతుడు అయిన బాహుబలిని మోసం ద్వారా గెలవాలనుకుంటాడు. అయితే, భారతంలో ధర్మరాజుపై సుయోధనుడు చేసే కుట్రలు పని చేయవు. కాని, కట్టప్ప బాహుబలిని చంపేశాడు కాబట్టి… భల్లాలదేవుడి వ్యూహం ఫలించిందనే చెప్పుకోవాలి!   బాహుబలి వారసుడిగా, అంతే బలవంతుడిగా ది బిగినింగ్ లో అలరించిన శివుడు రెండో భాగంలో పగ తీర్చుకోబోతున్నాడు. అంటే ధర్మరాజు లాంటి బాహుబలికి జరిగిన అన్యాయానికి, దేవసేనకి జరిగిన అవమానానికి అర్జునుడిలా ప్రతీకారం తీర్చుకోనున్నాడన్నమాట! ఇక మొదటి పార్ట్ లో కొండలు ఎక్కుతూ, జలపాతాలు దాటుతూ, భారీ శివలింగాన్ని ఎత్తిన శివుడు… భీముడిలాగా కూడా ఒప్పించాడనే చెప్పాలి! ధర్మరాజు, భీముడు, అర్జునుడి పాత్రలే కాదు… రాజమౌళి తన హీరో క్యారెక్టర్ డిజైన్ చేయటంలో హనుమంతుడ్ని కూడా ప్రేరణగా తీసుకున్నాడు! లంకలా మారిపోయిన భల్లాలదేవుడి వశంలో వున్న మాహిష్మతిలోకి ఒంటరిగా చొరబడతాడు. రావణుడు సీతమ్మను బంధించినట్టు భల్లాలదేవుడు దేవసేనను బంధిస్తే… హనుమంతుడిలా కోటకి నిప్పు పెట్టి తల్లిని కాపాడుకుని తెచ్చుకుంటాడు శివుడు! ఇదంతా చూస్తుంటే మనకు సుందరకాండలోని ఆంజనేయుడే గుర్తుకు వస్తాడు!           అన్యాయం జరిగినప్పుడు , ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నప్పుడు ఒక యోధుడు న్యాయం వైపున, ధర్మం వైపున నిలవటమే బాహుబలి తత్వం అయితే… మన దేశంలో ఇప్పటికి ఎందరో బాహుబలులు అవతరిస్తూనే వచ్చారు! ఎప్పటికీ ధర్మానికి ప్రతి రూపంగా నిలిచిపోయే శ్రీరాముడు మొదలు శ్రీకృష్ణుడు, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్… ఇలా ఎందరెందరో! ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గమైనా అందరూ అధర్మాన్ని ఎదిరించేందుకే ఆయుధం పట్టారు! ఇక ఆయుధం పట్టకుండానే లోకాన్ని జయించిన ఆదిశంకరులు, వివేకానందుడు, గాంధీ … వీళ్లు కూడా బాహుబలులే!   ఇక మరోసారి మన వెండితెర బహు అద్భుత బాహుబలిని గుర్తు చేసుకుంటే… జక్కన్న చేత చెక్కబడిన ఈ బాహుబలి భల్లాలదేవుడ్ని, బాక్సాఫీస్ ని సమర్థంగా గెలవాలని మనమూ కోరుకుందాం!  ఆల్ ది బెస్ట్ టూ ఆల్ టైం బెస్ట్ తెలుగు మూవీ!

ఆవే అధికారానికి ఆధారం… అందుకే, ఆవుకో ఆధారం!

  భారతదేశంలో ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన పదం ఏదైనా వుందంటే… అది గోవే! గో అనే శబ్దం వినపడగానే అధికార పక్షం, ప్రతి పక్షం కత్తులు పైకెత్తి నిలుచుంటున్నారు! ఇందులో ఎవరి ఎజెండా వారిది. నిజంగా గో సంరక్షణ మీద ఎంత శ్రద్ధ ఎవరికుందో ఎవ్వరమూ చెప్పలేము! ఒకవైపు కాషాయ శక్తులు గోవులే ముఖ్యమంటుంటే… కాంగ్రెస్ , కమ్యూనిస్టు, ఇతర లౌకిక వర్గాలు మనుషుల కంటే ఆవులు ముఖ్యం కాదంటున్నాయి! ఇంత రచ్చకి కారణం ఇండియాలో ఆవు అన్ని జంతువుల్లాంటిది కాకపోవటమే. గోవు మనకు గోమాత. అందుకే, మతంతో ముడిపడిపోయి గో వధ నేరంగానే కాకుండా మహాపాతకంగా పరిగణించబడుతోంది. అది పాపమైనా ప్రతిపక్షాలు మోదీ సర్కార్ ని కార్నర్ చేసేందుకు గో వధని పదే పదే వాడుకుంటున్నాయి!   గోవుల విషయంలో తప్పెవరిదో చెప్పటం చాలా కష్టం. గోవుల అక్రమ రవాణ అడ్డుకోవటం కోసం బజరంగ్ దళ్, వీహెచ్ పీ, హిందూ వాహిని కార్యకర్తలు భౌతిక దాడులు చేయటం కొత్త కాదు. అది క్షమించరానిది కూడా. అయినా కూడా గో సంరక్షకుల చర్యలకి మరో కోణం వుంది. వాళ్లు రోడ్లపైకి వచ్చి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే దాకా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు పూర్తిగా నిర్లిప్తంగా వుంటూ వుంటాయి. భారతదేశంలోని మెజార్టీ మతస్థుల మనోభావాలకి సంబంధించిన గో వధ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఓటు బ్యాంక్ వేటలో గో వధ నిషేధ చట్టం అమలు గాలికి వదిలేస్తుంటారు. దాన్నే బీజేపి క్యాష్ చేసుకుంటూ వుంటుంది. మొన్నటికి మొన్న యోగి ఆదిత్యానాథ్ అక్రమ కబేళాలు మూసి వేయించారు. అదే పని అఖిలేష్ ఎందుకు చేయలేదు? చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన తీరులో లౌకిక పార్టీలు వ్యవహరించనప్పుడే కాషాయ పార్టీలు, సంస్థలు రణరంగం చేసే అవకాశం లభిస్తూ వుంటుంది!   సుప్రీమ్ లో గోవుల అక్రమ రవాణ మీద నడుస్తోన్న ఒక కేసులో కేంద్రం ఆసక్తికర సమాచారం కోర్టుకు అందించింది. త్వరలో గోవులకి కూడా ఆధార్ లాంటి నెంబర్ ఇవ్వటం జరుగుతుందని చెప్పింది. ఇలాంటి ప్రయోగం ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్రంలో విజయవంతంగా చేసి చూశారు కూడా. ఈ గో ఆధార్ నెంబర్ ఇవ్వటానికి గోవు వయస్సు, రంగు, కొమ్ముల తీరు, ప్రత్యేకమైన గుర్తింపు మచ్చలు వంటీ వాట్నీ పరిగణలోకి తీసుకుంటారు! అలాగే, గో అక్రమ రవాణ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలని కేంద్రం సూచించింది. ఎవ్వరూ పట్టించుకోని గోవుల, పశువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి , నిధులు కేటాయించాలని అంటోంది!   గోవులకి ఆధార్ అనగానే గో వధని సమర్థించే ఆదర్శవాదులు జోక్ చేసే అవకాశాలే ఎక్కువ! కాని, ఇలాంటి ప్రత్యేక ఐడెంటిటి నెంబర్ జంతువులకి కేటాయించటం అనేది అమెరికా నుంచీ ఆస్ట్రేలియా దాకా చాలా దేశాల్లో వుంది. అది కేవలం పశువు అక్రమంగా తరలించకుండా వుంచేందుకు ఉపయోగపడే రిజిస్ట్రేషన్ నెంబర్ లాంటిదే! ప్రాణం లేని వాహనాలకే నెంబర్ వున్నప్పుడు కోట్లాది మంది దేవతగా భావించే గోవుకి వుంటే తప్పేం కాదు. అంతేకాక, గో ఆధార్ కారణంగా గో సంరక్షకుల దాడులు తగ్గుముఖం పడితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. ఎక్కడా ఏ ఒక్క గోవు కిరాతకంగా చనిపోకూడదు. అంతకన్నా ప్రధానంగా గో సంరక్షణ జరిగే క్రమంలో ఏ ఒక్క మనిషీ హత్యకి గురికాకూడదు. గో ఆధార్ కారణంగా ఇది జరిగితే… కేంద్రం ఆలోచనని స్వాగతించాల్సిందే!

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టి పాతిక లక్షలు కొట్టేసింది

కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు, కానీ మోసాలకు కోటి ఉపాయాలు అంటున్నారు చీటర్లు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ కొత్తకొత్త ఐడియాలతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ, క్యాష్‌ కొల్లగొడుతున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. జల్సాలకు అలవాటుపడ్డ ఓ యువతి.... ఈ సూత్రాన్నే నమ్ముకుని జనం నుంచి లక్షలు కొట్టేసింది.   హైదరాబాద్‌కి చెందిన యువతి సమియ తండ్రి అబ్దుల్ హఫీజ్‌ గొంతు కేన్సర్‌తో బాధపడుతూ.... ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తండ్రికున్న కేన్సర్‌‌‌ను సమియ క్యాష్ చేసుకోవాలనుకుంది. తండ్రికున్న కేన్సర్‌ను తనకున్నట్లు అన్వయించుకుంది. ఫండ్స్‌ కలెక్ట్ చేసేందుకు....తండ్రి పేరుకు బదులు తన పేరుతో సర్టిఫికెట్లను మార్చేసింది. తర్వాత గో ఫండ్ సమియా పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసింది. బ్రెయిన్, బ్రీస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు ఫేస్‌ బుక్‌లో సర్టిఫికెట్లతో పాటు స్కానిగ్‌ రిపోర్టులు పెట్టింది. ఫండ్స్‌ పంపించే వారి కోసం గన్‌ ఫౌండ్రీలో అకౌంట్‌ను ఓపెన్ చేసింది. తర్వాత క్యాన్సర్‌ సర్టిఫికెట్లతో పాటు తన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు....కేన్సర్‌కు చికిత్స పొందుతున్నట్లు వీడియోలను పెట్టింది. ఇదంతా నిజమేనేమోనని...ఫేస్‌బుక్‌ యూజర్లు చలించిపోయారు. ఉన్నత చదువులు చదివిన తనను బతికించాలని వేడుకుంది. అందమైన యువతి...అందులో బంగారు భవిష్యత్ ఉండటంతో అనేక మంది దాతలు ముందుకొచ్చారు. ఇండియాతో పాటు ఇతర దేశాల నుంచి గో ఫండ్‌ సమ్యా అకౌంట్లో 22 లక్షల రూపాయలు వేశారు.   మనీ వసూలు చేసే విషయంలో సమియా జాగ్రతలు తీసుకుంది. ఎలాంటి ఫోన్ వాడకుండా... కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే దాతలతో టచ్‌లోకి వచ్చింది. సమియా ఆరోగ్యం ఎలా ఉందోనంటూ....తెలుసుకునేందుకు పలువురు దాతలు ఆస్పత్రికి వెళ్లారు. సమియా కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ గురించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. సమియా పేరుతో ఉన్న వారికి తాము ట్రీట్‌మెంట్‌ చేయలేదని చెప్పడంతో....దాతలు అవాక్కయ్యారు. అదే సమయంలో ఆస్పతక్రి యాజమాన్యం....మోసం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సమియా చేతిలో మోసపోయిన దాతలు....గో ఫండ్‌ సమ్యాకు నిధులు ఇవ్వొద్దంటూ ఏకంగా ఓ బ్లాగ్‌నే క్రియేట్‌ చేయాల్సి వచ్చింది. అయితే దాతలు ఇచ్చిన డబ్బుతో సమియా హరా, రియాద్‌లో తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

రాజకీయాల్లోకి భారతి? కీడెంచి మేలెంచుతున్న జగన్‌..!

  ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి మరో ఛరిష్మాటిక్‌ లేడీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి భార్య వైఎస్‌ భారతి... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. భారతికి పెద్దగా ఆసక్తి లేకపోయినా, పార్టీ అవసరాల దృష్ట్యా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైఎస్‌ ఫ్యామిలీ నుంచి జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలలు... 2014 ఎన్నికల ప్రచారంలో కీ రోల్‌ పోషించడమే కాకుండా, విజయమ్మ స్వయంగా వైజాగ్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. దాంతో విజయమ్మ ఇంటికే పరిమితమైపోయారు, ఇక షర్మిల అయితే మీడియాకి కనిపించడమే మానేశారు. అయితే ఇప్పుడు సడన్‌గా భారతి పేరు తెర మీదకి రావడానికి చాలా కథే ఉందంటున్నారు.   వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లే ఛాన్సుందని వైసీపీ అధిష్టానం భావిస్తోందట, జగన్‌‌ను ఎలాగైనా జైలు పంపించాలని తెలుగుదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కేంద్రంపైనా ఒత్తిడి తీసుకొస్తుందని వైసీపీ అనుమానిస్తోంది. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే పార్టీని ఎవరు లీడ్‌ చేయాలన్న చర్చ జరిగిందట, అయితే విజయమ్మ, షర్మిల సమర్ధత మీద పెద్దగా నమ్మకం లేని జగన్‌... భారతిని రంగంలోకి దించాలని డిసైడ్‌ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది. ముందుజాగ్రత్తగా భారతిని రంగంలోకి దించడమే కాకుండా ఇప్పట్నుంచే పొలిటికల్‌గా ట్రైనప్‌ చేయాలని  భావిస్తున్నారట.   ఇప్పటికే సాక్షి పత్రికను, సాక్షి టీవీని సమర్ధవంతంగా నడిస్తున్న భారతి... పార్టీని కూడా అంతే సమర్ధంగా నడిపించగలదని జగన్‌ నమ్ముతున్నట్లు పార్టీ సీనియర్ల టాక్‌. ఆ నమ్మకంతోనే జగన్‌... భారతిని రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఒకవేళ పరిస్థితులు తారుమారై.... మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే భారతి ప్రచార బాధ్యతలు తీసుకుంటుందని,  పార్టీని ముందుండి నడిపిస్తుందని తన సన్నిహితులను జగన్‌ చెప్పారట. షర్మిలను భారతికి తోడుగా మాత్రమే ఉపయోగించుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉచితం దుర్వినియోగం... చెలరేగిపోతున్న మాఫియా...

  ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగమవుతోంది. ప్రజలకు ఉచితంగా లభించాల్సిన ఇసుక.... అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే..... దాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న ఇసుక మాఫియా..... అక్రమంగా ఇసుకను తోడేస్తూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 406 ఇసుక రీచ్‌లతోపాటు, నదుల్లోని ఇసుక మేటలు మాఫియాకి వరంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లా హంద్రీ నదిలో ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డు వేసి మరీ, హైదరాబాద్‌, బెంగళూరులకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో పెన్నానది.... గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కృష్ణానది... శ్రీకాకుళం జిల్లాలో  నాగావళి, చిత్రావతి.... చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదుల్లో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది.   ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిపోతుంటే అడ్డుకోవాల్సిన నోడల్‌ ఆఫీసర్లు, ఇతర యంత్రాంగం.... పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించకపోవడం వల్లే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా ఏర్పేడులో ధర్నా చేస్తోన్న రైతులు, రైతు కూలీలపై ఇసుక లారీ దూసుకురావడం, 17మంది చనిపోవడం, ఈ ప్రమాదంలో కుట్ర ఉందంటూ స్వయంగా మాజీ మంత్రి బొజ్జలతోపాటు పలువురు అధికార పార్టీ నేతలు సైతం వ్యాఖ్యానించారంటే, ఇసుక మాఫియా ఎంతకు తెగించిందో తెలుసుకోవచ్చు.   ఏర్పేడు ఘటనతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇసుక మాఫియాపై దృష్టిపెట్టారు. ఏర్పేడు ఘటనపై విచారణకు ఆదేశిస్తూనే, ఇసుక ఇసుక మాఫియా నడిపిస్తున్నారంటూ రైతులు, రైతు కూలీలు ఆరోపిస్తున్న టీడీపీ లీడర్లు ధనుంజయనాయుడు, చిరంజీవినాయుడులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అంతేకాదు ఇసుకను అత్యవసర వస్తువుల చట్టం కిందకి తీసుకొస్తామన్న చంద్రబాబు.... ఇసుకను అక్రమంగా నిల్వచేసేవారిపై పీడీ యాక్ట్‌ కింద కేసు పెడతామని హెచ్చరించారు.

బ్రాహ్మణి వర్సెస్‌ భారతి? విజయవాడ ఇన్‌ఛార్జ్‌గా లోకేష్‌ అందుకేనా?

  తెలుగుదేశానికి చంద్రబాబే మెయిన్‌... ఆయనే స్పెషల్‌ అట్రాక్షన్‌... జనాలు ఓట్లేసేది చంద్రబాబును చూసే... వారసుడిగా నారా లోకేష్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చినా, మంత్రిగా ఉన్నా... ప్రజలు మాత్రం చంద్రబాబును దృష్టిలో పెట్టుకునే టీడీపీకి ఓట్లేస్తారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కోడలు, లోకేష్‌ వైఫ్‌... నారా బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి రానుందనే ప్రచారం జరుగుతోంది, అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీకి దిగుబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే విజయవాడ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా మంత్రి లోకేష్‌ని చంద్రబాబు అపాయింట్‌ చేశారని అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ సీటును బ్రాహ్మణికి కేటాయిస్తారన్న సంకేతాలతోనే ప్రస్తుత ఎంపీ కేశినేని నాని అలకబూనారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.   అయితే బ్రాహ్మణి నిజంగా పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారో లేదో తెలియదు కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం బ్రాహ్మణి వర్సెస్‌ భారతి అనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ జైలుకెళ్లడం ఖాయమని, అందుకే భారతిని రంగంలోకి దించుతున్నారనే టాక్‌ నడుస్తోంది. టీడీపీకి మెయిన్‌ ఛరిష్మా లీడర్‌ చంద్రబాబే అయినా... ఆ కుటుంబం నుంచి లేడీ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తే... తెలుగుదేశానికి తురుపుముక్కగా మారే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఆ లెక్కన భారతి వర్సెస్‌ బ్రాహ్మణిగా ఏపీ రాజకీయాలు సాగినా ఆశ్చర్చపోనవసరం లేదు.   బ్రాహ్మణికి కావాల్సినన్ని లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ ఉన్నాయి. ఇప్పటికే హెరిటేజ్‌ కంపెనీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణి... పార్టీ నిర్వహిస్తోన్న ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌, స్కాలర్‌‌షిప్‌, జాబ్‌మేళా వంటి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాదు  బ్రాహ్మణి సైలెంట్‌గా పని చేసుకుపోతారని, చాప కింద నీరులా చొచ్చుకెళ్తారన్న పేరు ఉంది. పైగా క్లీన్‌ ఇమేజ్‌, నారా, నందమూరి కుటుంబాల నుంచి రావడంతో బ్రాహ్మణికి ప్రజలు బ్రహ్మరథం పడతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటు వైఎస్‌ భారతి కూడా సాక్షి పత్రికను, సాక్షి టీవీని సమర్ధంగా నిర్వహిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు. దాంతో ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తే... బ్రాహ్మణి వర్సెస్‌ భారతిగా ఏపీ రాజకీయాలు సాగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

యోధులే అయినా… హీరోలుగా గుర్తింపబడని కట్టప్పలెందరో!

బాహుబలి సినిమాలో హీరో ఎవరు? ఇంకెవరు… బాహుబలిగా కనిపించిన ప్రభాస్! కాని, బాహుబలితో సమానంగా క్రేజ్ సంపాదించిన మరో క్యారెక్టర్ కట్టప్ప! కట్టప్ప రాజమౌళి తాలూకూ కట్టలు తెంచుకున్న క్రియేటివిటికి వెండితెర సాక్ష్యం! ఆ ఒక్క పాత్రతో జక్కన్న తనలోని కమర్షియల్ ఎంటర్టైనర్ ని నూటికి నూరు శాతం బయటపెట్టుకున్నాడు! బాహుబలి ది బిగినింగ్ చివర్లో కట్టప్ప చేత బాహుబలినే చంపించి… దేశం మొత్తాన్నీ విభ్రాంతికి గురి చేశాడు! ఇప్పుడు బాహుబలి ది కన్ క్లూజన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఒకే ఒక్క ప్రశ్నతో సతమతం అవుతున్నారు… ‘’కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’’ !   కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న కొశన్ ఎంత తీవ్రంగా చర్చలోకి వచ్చిందంటే… ప్రధాని నరేంద్ర మోదీ కూడా కట్టప్పని కాదనలేకపోయారు! యూపీ ఎన్నికల్లో తానే కట్టప్పనని చెప్పుకున్న ఆయన ఉత్తరప్రదేశ్ మాహిష్మతీ రాజ్యం కైవసం చేసుకుని సంరక్షకుడిగా యోది ఆదిత్యనాథ్ ను నియమించారు కూడా! ఇలా మొత్తానికి కట్టప్ప… బాహుబలి సినిమాలో మిగతా అందరి కన్నా ఫేమస్ అయిపోయాడు!   ఒక్కసారి మనం కట్టప్ప వెనుక వున్న పురాణ ప్రేరణ చూస్తే…  ఆ పాత్రకి సరిగ్గా సరిపోయేది మహా భారతంలోని భీష్ముడే! ధర్మరాజు, దుర్యోధనుడి లాంటి బాహుబలి, భళ్లాలదేవా… ఇద్దరి మధ్యా కట్టప్ప భీష్ముడిలాగే మిగిలిపోతాడు! చివరకి భీష్ముడిలాగే దుర్యోధనుడి లాంటి చెడ్డవాడైన భళ్లాలదేవుడి వైపు నిలబడి బాహుబలిని బలి తీసుకుంటాడు! అయితే, కట్టప్పలో కర్ణుడి పాత్రని కూడా చొప్పించారు రాజమౌళి, విజయేంద్రప్రసాద్! కర్ణుడిలాగే కట్టప్ప నిజమైన యోధుడు. దుర్యోధనుడి లాంటి భళ్లాలదేవుడికి అసలైన బలం. కరుక్షేత్రంలో భీష్మ, కర్ణులు వున్నంత వరకే దుర్యోధనుడి ఆటలు నడుస్తాయి. తరువాత అర్జునుడిదే పై చేయి అవుతుంది. బాహుబలి పార్ట్ 2లో కట్టప్ప ఏం చేస్తాడనే దానిపైనే శివుడి అంతిమ విజయం ఆధారపడి వుంటుంది!   ఇప్పటి మన రాజకీయాల్లోనూ చాలా మంది కట్టప్పలే కనిపిస్తుంటారు! అయితే, పూర్తిగా కట్టప్ప అంత అంకితభావం, స్వామిభక్తి, వీరత్వం… అన్నీ ఆశించలేం. కాని, చాలా పార్టీల్లో కట్టప్ప పాత్ర పోషించిన… పదవులు పొందలేని యోధులు మాత్రం వున్నారు! దేశ ప్రధాని కావాలని బలంగా కోరుకున్న అద్వానీ ఒక రకంగా బీజేపీలో భీష్మ పితామహుడే! అంటే కట్టప్పే! కారణాలు ఏమైనా… దిల్లీలో బీజేపీ జెండా రెపరెపలాడించిన ఆయన ఆ దిల్లీని మాత్రం ఏలలేకపోయారు! ములాయం సింగ్ యాదవ్ పార్టీలో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్ ది కూడా కట్టప్ప రోలే! పార్టీ కోసం ఎంతో చేసిన ఆయన అవమానాలకు గురై బయటకొచ్చేయాల్సి వచ్చింది! శివసేనలోని రాజ్ థాక్రే కూడా కట్టప్పలా తెగించి పోరాడాడు పార్టీ కోసం. చివరకు, అన్నీ వదులుకుని బయటకు రావాల్సి వచ్చింది. కట్టప్ప లాంటి రాజ్ థాక్రే, రాజ్ థాక్రే లాంటి ఒక మాస్ నాయకుడు… మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక పార్టీలో వున్నాడని పొలిటికల్ పండితులు అంటుంటారు! ముందు ముందు ఆయన భవిష్యత్ ఎలా వుండబోతోందో?

వర్కింగ్ ప్రెసిడెంట్‌ ప్రకటనను అడ్డుకున్నదెవరు?

  గులాబీ దళపతిగా ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కేసీఆర్. అయితే ప్లీనరీ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కూడా ప్రకటిస్తారని అంతా ఊహించారు. టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్షాల్లో కూడా దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా ప్లీనరీ ముగిసింది. దాంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ప్రకటించకపోవడానికి కారణమేంటనే చర్చ.... గులాబీ శ్రేణుల్లో మొదలైంది.   పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్‌తోపాటు హరీష్‌రావు, కేటీఆర్‌... ఇద్దరూ సమానంగా శ్రమిస్తున్నారు. అయితే ఇటీవల కేసీఆర్‌ ప్రోత్సాహంతో హరీష్‌ కంటే కేటీఆర్‌ కొంచెం ముందున్నారనే చెప్పాలి. గ్రేటర్‌ ఎన్నికల నుంచి జనహిత సభలు, ప్లీనరీ నిర్వహణ అన్నింటిలోనే కేటీఆర్‌ దూసుకెళ్తున్నారు. ఆ క్రమంలోనే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ రాబోతుందని అంతా ఉహించారు. అయితే కేసీఆర్ మాత్రం... కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించే సాహసం చేయలేకపోయారని అంటున్నారు.   కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయని కేసీఆర్ భావించారని పార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు. హరీష్, కేటీఆర్‌లలో ఎవరు నెంబర్ 2 అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. హరీష్ నిరాశపరచడం ఎందుకని గులాబీ అధినేత వెనక్కితగ్గారట. అంతేకాదు కొడుకుకి పదవి కట్టబెట్టడం ద్వారా.. అల్లుడిని అవమానించారనే అవకాశం ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పైగా పార్టీలో అనవసరమైన పోటీ ఎందుకని కేసీఆర్‌ భావించారంటున్నారు. అన్నింటికి మించి కేసీఆర్ యాక్టివ్ గా ఉన్న ప్రస్తుత తరుణంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్ ఎందుకన్న భావనలో కూడా టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఒకవేళ అయితే గియితే.... 2019 ఎన్నికల తర్వాతనే కేటీఆర్‌‌ను  వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటంచే అవకాశముందంటున్నారు.

మన భారతదేశంపైకి కాలకేయులు ఎన్నిమార్లు దండెత్తారో తెలుసా?

బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ లో అత్యంత ఉద్విగ్నంగా నడిచే ఎపిసోడ్ ఏది? సినిమా చివరికొస్తుంటే కనిపించే కాలకేయులతో యుద్ధం! ఎక్కడ్నుంచో వచ్చిపడతారు కాలకేయులు! వారి రూపం, హావభావం, సంస్కృతి, పద్ధతి… అన్నీ పరమ దుర్మార్గంగా వుంటాయి! ఇంకా చెప్పాలంటే… జుగుప్సాకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా వుంటాయి! అలాంటి వారు నాగరికులైన మాహిష్మతి ప్రజలపైన పడతారు. నీతీ, నియమం, సంస్కారం ఏమీ వుండవు. వారితో రణం అంటేనే ఓడిపోయినట్టుగా డీలా పడిపోతారు జనం! కాని, చివరకు బాహుబలి అందర్నీ ప్రేరేపించి కాలకేయుల అంతం చూస్తాడు. వారి రాజు తలతెగి పడేలా విజృంభిస్తాడు…   ఇంతకీ… ఈ కాలకేయుల లాంటి వారు ఎవరైనా మన పురాణాల్లో వున్నారా? రాజమౌళి వారి ప్రేరణ ఏమైనా పొందాడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకోవాలి! భాగవతంలో మనకు కాలకేయుల్లాగే కాలయవనులు కనిపిస్తారు. వీరు బహుశా హిమాలయలకు ఆవల వున్న గ్రీకు, ఇరాన్, పర్సియా లాంటి దేశాల నుంచి దండెత్తి వచ్చి వుంటారు. వారిని సమర్థంగా ఎదుర్కొన్న శ్రీకృష్ణుడు లక్షల మందిని హతమార్చి ద్వారకను రక్షిస్తాడు! బాహుబలిలో కూడా కాలకేయులు వేరే దేశం, ప్రాంతం నుంచి వచ్చిన వారే. అందుకే, వారు అనాగరికంగా ప్రవరిస్తారు.   భాగవత కాలంలోనో… బాహుబలి సినిమాలోనో కాదు… భారతదేశంపై యుగయుగాలుగా కాలకేయుల వంటి అనాగరిక జాతులు దండెత్తి వస్తూనే వున్నాయి. రామాయణ, భారత కాలాల్లో అలాంటి విదేశీ జాతుల్ని యవనులు అంటే… తరువాతి కాలంలో అలెగ్జాండర్ సేనలు అన్నారు. అలెగ్జాండర్ తరువాత కూడా డెమిత్రియస్ లాంటి యవన రాజుల్ని గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారతీయ రాజులు తరమికొట్టారు. ఇంకా తరువాతి కాలంలో దండెత్తి వచ్చిన కాలకేయులు… ప్రధానంగా… మధ్య ప్రాచ్యం నుంచి వచ్చిన ముస్లిమ్ రాజులు. మహ్మద్ గజినీ, మహ్మద్ ఘోరీ, బాబార్ లాంటి వారంతా ఈ కోవకే చెందుతారు. చివరగా మన దేశం మీదకొచ్చిన వేదేశీయులు … పోర్చుగీస్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల వ్యాపారస్తులు. 1947 ఆగస్ట్ 15తో వీరి నుంచీ కూడా మనం బయటపడ్డాం. అంటే… దాదాపు వేయి సంవత్సరాలకు పైనే వివిధ రకాల కాలకేయుల దండయాత్రల్ని ఎదురొడ్డి నిలిచి … గెలిచింది భారతదేశమన్నమాట!   బాహుబలి సినిమా తెరపై మాహ్మిష్మతి అయినా… ప్రపంచ పటంపై అఖండ భారతావని అయినా… కాలకేయుల కర్కోటకత్వానికి ఎందుకు బలవ్వాల్సి వచ్చింది? సంస్కృతితో, సంస్కారంతో, సంపదతో సమృద్ధిగా వుండటం వల్లే! ఈ రోజు దేశదేశాల్లో ధగధగలాడుతోన్న ఎన్నో వజ్రాలు, విజ్ఞానాలు మన దేశం నుంచి తరలిపోయినవే! కోహినూర్ వాటిల్లో ఒకానొకటి మాత్రమే!

రాజకీయాలకు గాలి గుడ్‌బై

గాలి జనార్థన్ రెడ్డి..దేశంలో ఈ పేరుకు ఉన్న పాపులారిటీనే వేరు. అక్రమ మైనింగ్ కోసం రాష్ట్రాల హద్దులు మార్చినా..అపర శ్రీకృష్ణదేవరాయులిగా ఫీలై ఇల్లంతా బంగారు మాయం చేసినా..కోట్ల రూపాయలతో వెంకన్నకి కిరీటాలు చేయించినా..కనుసైగతో ప్రభుత్వాన్ని శాసించినా..500 కోట్లతో కూతురి పెళ్లి చేయించినా అన్ని ఆయనకే చెల్లింది. మంచో, చెడో ఇలాంటి పనుల ద్వారా తనకంటూ దేశవ్యాప్తంగా కొంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి గాలి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు..ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అనుచరులతో అన్నట్లు సమాచారం.   కర్ణాటకలో బీజేపీ మంత్రిగా పనిచేసిన ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బింధువుగా వ్యవహరించారు. అక్రమ గనుల కేసులో జైలుపాలై ఏడాదిక్రితం బయటికి వచ్చారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో జనార్దన రెడ్డి మరోసారి పోటీ చేస్తారని.. బీజేపీలో మరోసారి కీలకంగా వ్యవహరిస్తారని బళ్ళారి, రాయచూరు జిల్లాల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తారని అనుచరులు, కార్యకర్తలు గంపెడు ఆశతో ఉన్నారు. బళ్ళారి లేదా సింధనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా గాలి రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారని, ఆయన సన్నిహితుల వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను పొలిటిక్స్ నుంచి తప్పుకున్నా పవర్ మాత్రం తన కుటుంబం చేతుల్లో ఉండేలా గాలి స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం.   సోదరులు కరుణాకర రెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, శ్రీరాములు తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడనని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అనేక కేసులు మెడ చుట్టూ బిగుసుకుపోవడంతో..మళ్లీ రాజకీయాల్లో ఉంటే మరిన్ని కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందనని భయపడటం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసిన కుమార్తె పెళ్లి విషయంలోనూ కేసులు ఎదురయ్యాయని, ఇప్పటికే ఈ కేసులతో సతమతమవుతున్నానని, ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని సమస్యల్ని తెచ్చుకోదలచుకోలేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో కొనసాగి మంత్రి లేదా ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని పదేళ్ల క్రితమే అటువంటివన్నీ చూశానని..అలాంటప్పుడు ఇక తనకు పొలిటిక్స్ అవసరం లేదు అన్నారట. గాలి పొలిటిక్స్‌‌లకి గుడ్‌బై చెబుతారా..? లేకుంటే అభిమానుల కోరిక మేరకు మనసు మార్చుకుంటారా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

జగన్ ఒక వెధవ ..ఐయామ్ సారీ అది కూడా తక్కువే..

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. విషయం ఏదైనా కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు అలవాటు. మొదట్లో నోరు జారడం, ఆ తర్వాత సారీ చెప్పడం ఆయనకు ఆది నుంచి అలవాటే. తాజాగా అనంతపురంలో జరిగిన నీరు-మీరు సభలో జేసీ మాట్లాడారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగుడుతూనే మరోవైపు జగన్‌ని దుమ్మెత్తిపోశారు. జగన్ రాజకీయాలకు పనికిరాడని, అసమర్థుడని..ఆయన వల్ల ఏమీ కాదని..అందుకనే మొదట్లో వైసీపీలోకి వెళదామనిపించి బాగా ఆలోచించానని కానీ జగన్ గురించి బాగా అర్థమై టీడీపీలో చేరానన్నారు.   చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసునని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమన్నారు..నాకూ కొంచెం కులం పిచ్చి ఉంది..అందుకే జగన్మోహన రెడ్డితో నడవాలని అనుకున్నా. ఎంత కుల పిచ్చి ఉన్నా ఇతర కులాల వారిని ద్వేషించేవాడిని మాత్రం కాదు. కానీ ఏం చేస్తాడు జగన్..ఏం చేయలేడు..వాడు వెధవ..ఐయామ్ సారీ, వెధవ అనే మాట కూడా తప్పేమో..ఆ మాటను ఉపసంహరించుకుంటున్నా.   చంద్రబాబు ఎక్కువగా కలలు కంటారు. సీఎంగారు ఎలాగూ 2019లో పోలవారాన్ని పూర్తి చేస్తారు. నిన్న మీరు కల కన్నారా... మొన్న ఒక మిషన్ రూ. 80 కోట్లు ఖర్చుపెడితే నాశనం అయింది. దాన్ని తెప్పించాలంటే మీకు మూడు, నాలుగు మాసాలు పడుతుందన్నారు. నేను ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు ఒక్కటే చెప్పదలచుకున్నా.. చంద్రబాబు చాలా కలలు కంటున్నారు. ఆయన కలలు నెరవేరాలంటే మనమందరమూ మన బాగుకోసం, మన పిల్లల కోసం ఆయనను సీఎంగా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జగన్ పార్టీ నేతలు జేసీపై గుర్రుగా ఉన్నారు.

అర్థంకాని కేసీఆర్‌ ఆంతర్యం... మంత్రులకు ప్రాధాన్యత తగ్గించడంపై వదంతులు

టీఆర్‌ఎస్ ప్లీనరీతో కొంపల్లి పరిసరాలన్నీ గులాబీమయమైయ్యాయి. ఎటువైపు చూసినా గులాబీ జెండాలు, తోరణాలు, హోర్డింగులే కనిపిస్తున్నాయి. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ప్లీనరీ.... సాయంత్రం 5గంటల వరకు సాగనుంది. కేసీఆర్‌... పార్టీ జెండా ఆవిష్కరించి.... తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడంతో ప్రారంభమై... కేసీఆర్‌ చివరి ప్రసంగంతో ప్లీనరీ ముగియనుంది. ఇక ప్లీనరీకి విచ్చేసే ప్రతినిధులకు పసందైన విందు ఏర్పాటుచేశారు. తెలంగాణ వంటకాలన్నీ మెనూలో చేర్చారు.   అయితే గత ప్లీనరీలతో పోల్చితే ఈసారి భిన్నంగా జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంత్రులకు ప్రాధాన్యత తగ్గించి... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రయార్టీ పెంచారు. అలాగే కేటీఆర్‌కి గానీ, హరీష్‌రావుకి గానీ, కవితకు గానీ తీర్మానాల బాధ్యత అప్పగించలేదు. మొత్తం ఏడు తీర్మానాలు... ఏడుగురు ప్రవేశపెడితే..మరో ఏడుగురు వాటిని బలపరుస్తూ ప్రసంగిస్తారు.    వ్యవసాయంపై ప్లానింగ్ బోర్డు ఛైర్మన్ నిరంజన్ రెడ్డి, కుల వృత్తుల గురించి ఎమ్మెల్యే కొండా సురేఖ, మిషన్ భగీరథపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, విద్యుత్ రంగంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పథకాల గురించి ఎంపీ వినోద్, సంక్షేమంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పేకాట, మద్యనియంత్రణ, అనవసర ఆపరేషన్ల కట్టడి తీర్మానాలపై ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ మాట్లాడనున్నారు. తీర్మానాల జాబితాలో ఎక్కడా మంత్రుల పేర్లు లేకపోవడం కేసీఆర్ ఆంతర్యం అర్థంకాక నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.    అయితే క్షేత్రస్థాయి పరిస్థితి మంత్రులకంటే నేతలకే ఎక్కువ తెలుసని, అందుకే తీర్మానాలపై మాట్లాడే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించారని తలసాని చెప్పుకొచ్చారు. మొత్తానికి సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం పార్టీలో పెద్ద చర్చకే తెరలేపింది.

జగన్‌ ఆపరేషన్‌ రివర్స్‌... టీడీపీలో మెయిన్‌ లీడర్లే టార్గెట్‌

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌‌కు విరుగుడుగా వైసీపీ రివర్స్‌ ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించింది. ఎక్కడ పోగొట్టుకున్నామో... అక్కడే రాబట్టుకోవాలనుకుంటోన్న వైసీపీ... తెలుగుదేశంలో అసంతృప్తులను గుర్తించి.... పార్టీలోకి రప్పించేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై జగన్‌ ఫోకస్‌ పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల చేరికతో ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తితో రగిలిపోతున్న తెలుగుదేశం లీడర్లను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.    ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు చె‌క్‌ పెట్టేందుకు గంగుల ప్రభాకర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన జగన్‌.... తాజాగా నంద్యాలపై ఫోకస్‌ పెట్టారు. నంద్యాల టీడీపీ టికెట్‌ కోసం పట్టుబడుతూ, చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్న శిల్పామోహన్‌రెడ్డిని వైసీపీలోకి రప్పించి, ఉపఎన్నికల బరిలోకి దింపాలని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు శిల్పామోహన్‌రెడ్డితో జగనే నేరుగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఒకవేళ శిల్పాకి నంద్యాల టీడీపీ టికె‌ట్‌ ఇవ్వకపోతే.... వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ఇక జగన్ సొంత జిల్లా కడపలోనూ అసంతృప్తితో రగిలిపోతున్న తెలుగుదేశం నేతలకు గాలమేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జమ్మలమడుగు రామసుబ్బారెడ్డితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ప్రజాదరణ ఉండి.... తెలుగుదేశంలో ప్రాధాన్యత లభించక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలపై వైసీపీ ఫోకస్‌ పెట్టింది. ఇక టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది తెలుగుదేశంలో ఇమడలేక.... మరికొందరు హామీలు, మంత్రి పదవులు దక్కక... తిరిగి జగన్‌ వైపు చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇలా తిరిగి వైసీపీ వైపు చూస్తోన్న ఎమ్మెల్యేలపైనా జగన్‌ దృష్టిపెట్టారు. మరి వైసీపీ రివర్స్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి

శివాలెత్తి విజయం సాధించిన ప్రతీ బాహుబలి వెనుకా… ఒక శివగామి!

  బాహుబలి సినిమాలోని పాత్రలు భారత, రామాయణాలు, పురాణల్లోంచి ప్రేరణతో రూపొందించారని మనకు తెలిసిందే! ఖచ్చితంగా పురాణకథని ఫాలో అయిపోకున్నా… జక్కన్న తనదైన స్టైల్లో మైథాలజీని, ఫిక్షన్ తో మిక్స్ చేశాడు. అలా పుట్టిందే రాజమాత శివగామి పాత్ర! ఆమె… బాహుబలి తల్లి కాదు. బాహుబలి పెంపుడు తల్లి! విలన్ భల్లాలదేవుడికి స్వంత తల్లి! కాని, అటు బాహుబలి , ఇటు ప్రేక్షకులు ఎక్కడా శివగామిని అలా భావించరు! మనవడు శివుడ్ని చేతుల్లో పట్టుకుని నీటిలో మునిగిపోయిన శివగామి బాహుబలి 2లో ఏం చేస్తుందో కాని… బాహుబలి ది బిగినింగ్ లో మాత్రం మెస్మరైజ్ చేసేసింది!   శివగామి ధృతరాష్ట్రుడి లాంటి అవిటి బిజ్జలదేవుడకి భార్య. కాని, ఆమె గాంధారిలా కళ్లకు బట్టలు కట్టుకుని అన్యాయాన్ని చూడకుండా కూర్చోదు. అమరేంద్ర బాహుబలిని అతడి తల్లి పురిట్లో అప్పజెప్పి మరణిస్తే… మాద్రి అప్పజెప్పిన నకుల, సహదేవుల్ని పెంచి పెద్ద చేసిన కుంతిలా బాహుబలిని పెద్దవాడ్ని, ప్రయోజకుడ్ని చేస్తుంది! బాహుబలి విజయాల్లో, వ్యక్తిత్వంలో శివగామి ప్రభావం బోలెడు. ఇలా తల్లి చేత ప్రేరేపింపబడ్డ చారిత్రక ధీరులు ఎందరో! అమ్మ తలుచుకుంటే అమ్ముల పొదిలోంచి వదిలిన రామ బాణంలా తయారు చేయగలదు తనయుడ్ని!   తన పుత్రుడ్ని హైందవ సామ్రాజ్య బాహుబలిగా తీర్చిదిద్దని మహా మాత… జిజియా భాయి! ఆమె ఛత్రపతి శివాజీని కని వుండకపోతే… ఇవాళ్ల మన భారతదేశం ఈ రూపంలో వుండేదే కాదు! ఇక మరో చారిత్రక పురుషుడు, యుగపురుషుడు… శాతకర్ణి గురించి చెప్పేదేముంది? ఆయనపై తల్లి గౌతమీ బాలాశ్రీ ప్రభావం ఎంతంటే… తన పేరునే… గౌతమీపుత్ర శాతకర్ణిగా మార్చేసుకున్నాడు! భరతమాత గమనం మీద ఆయన ప్రభావం ఎంతటిదో… ఆయన మీద ఆయన మాతృశ్రీ ప్రభావం అంతటిదే!   రాజులే కాదు… వివేకానందుడైన నరేంద్రుడి మీదా ఆయన తల్లి భువనేశ్వరీ దేవీ ప్రభావం అమోఘం! ఇప్పుడు నమోన్నమః అనిపించుకుంటోన్న నరేంద్రుడి మీద కూడా ఇంటింటా పనులు చేసి పెంచిన… ఆయన తల్లి హీరాబేన్ ప్రభావం అద్వితీయం! మనకు తెలిసిన ఇలాంటి తనయులు కొందరే… తెలియని బాహుబలులు ఎందరో! ప్రతీ బాహుబలి వెనుక ఒక శివగామి ఖచ్చితంగా వుంటుంది! ఆ శివగామే.. పుత్రుడి గమనాన్ని శాసిస్తుంది!