మరో వివాదంలో బోండా... బాబు వార్నింగ్‌తో తోకముడిచిన ఉమా..!
posted on Apr 3, 2017 @ 4:41PM
కేబినెట్‌లో స్థానం దక్కకపోవడంతో, కాపుల గొంతు కోశారంటూ పార్టీ అధినేతనే బ్లాక్ చేయడానికి ప్రయత్నించి, చంద్రబాబు వార్నింగ్‌తో తోక ముడిచిన బోండా ఉమా... మరో వివాదంలో తలదూర్చినట్లు తెలుస్తోంది. నోటి దురుసు, అధికారులపై దాడి, గూండాయిజం, భూకబ్జాలతో బోండా ఉమా చెలరేగిపోతుంటే, మరోవైపు బోండా కొడుకులు, బంధువర్గం, అనుచరులు కూడా భూకబ్జాలు, రౌడీయిజానికి పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే విజయవాడలో విలువైన భూములపై కన్నేసిన బోండా ఉమా.... ఇప్పుడు తాజాగా సింగ్‌నగర్, ఇందిరానాయక్ నగర్లో బొండా ఉమా సోదరుడు, అనుచరులు ఓ భూమి కబ్జాకి ప్రయత్నిస్తున్నారట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఇందిరానాయక్ నగర్ లో 16 ఏళ్ల క్రితం కొనుగోలు చేసుకున్న తమ స్థలాలను, బోండా బంధువులు, అనుచరులు కబ్జా చేసేందుకు బెదిరింపు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ బాధితులు... బెజవాడ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ప్రహరీ గోడలను, ఇళ్లను కూల్చేస్తున్నారని, ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
బోండా చుట్టూ వివాదాలు చేరటం కాదు, వివాదాలున్న చోటే బోండా వాలిపోతారనే టాక్ ఉంది. గతంలోనూ విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ కళ్యాణ మంటపం విషయంలో బొండా ఉమా జోక్యం చేసుకోవడంతో వివాదం చెలరేగింది. అలాగే అజిత్ సింగ్‌నగర్‌లో కార్పొరేషన్ భూములను అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడంతో రచ్చ జరిగింది. అలాగే బోండా పెద్దకొడుకు సిద్ధూ కారు రేసింగులతో ఒకరు చనిపోతే, ఆ కేసును కూడా తారుమారుచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు విజయవాడ నడిబొడ్డున బైక్ ర్యాలీతో బోండా కొడుకులు అరాచకం సృష్టిస్తున్నారనే, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదులు కూడా అందాయి.
మంత్రి పదవి ఇవ్వలేదని, నోటికొచ్చినట్లు మాట్లాడిన బోండా ఉమాను.... ఇవే అంశాలను ప్రస్తావించి చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. నీ చిట్టా నా దగ్గర ఉంది... నకరాలు చేస్తే తాటా తీస్తా బిడ్డా అని అధినేత హెచ్చరించడంతోనే బోండా తోకముడిచినట్లు చెబుతున్నారు. బోండా అవినీతి కార్యకలాపాల ఫైల్‌ను అతని ముందుపెట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బోండా చేసిన పలు భూకబ్జాలను కూడా చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. తన అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టడంతోనే బోండా తోకముడిచి సైలెంటైపోయాడని, అందుకే బాబుతో భేటీ తర్వాత అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని, ఆయన మాటనే శాసనంగా పాటిస్తానని బోండా చెప్పాడని గుసగుసలాడుకుంటున్నారు.