అసలు ఏఏ జిల్లా నుంచి ఎంతమంది, ఎవరెవరు మంత్రులు?
posted on Apr 3, 2017 @ 3:07PM
ఆంధ్రప్రదేశ్‌లో ఫుల్ కేబినెట్ కొలువుదీరింది. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 26మందికి అవకాశం ఉండగా, తాజా విస్తరణతో ఫుల్ ప్లెజ్జెడ్‌గా కేబినెట్ రీలోడైంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా టీమ్‌ను ఎంపిక చేసుకున్న చంద్రబాబునాయుడు... కీలకమైన జిల్లాలకు పెద్దపీట వేశారు. ముఖ‌్యంగా పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి ముగ్గురేసి చొప్పున మంత్రి పదవులు కట్టబెట్టారు. కృష్ణాజిల్లా నుంచి దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ మంత్రులుగా ఉండగా, విస్తరణలో కొత్తగా ఎవరికి ఛాన్స్ దక్కలేదు. ఇక పశ్చిమగోదావరిలో ఇప్పటికే మాణిక్యాలరావు మంత్రిగా ఉండగా, కొత్తగా కేఎస్ జవహర్ పితాని సత్యనారాయణకి అవకాశం కల్పించారు.
ముఖ‌్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండగా, కొత్తగా నారా లోకేష్, అమర్‌నాథ్‌రెడ్డిలు కేబినెట్‌లో చేరారు, ఇక అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా నుంచి కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ, కడప జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి మంత్రులుగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పటికే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా, కొత్తగా కళా వెంకట్రావుకి... అలాగే విజయనగరం జిల్లా నుంచి సుజయకృష్ణ రంగారావుకి కేబినెట్‌లో చోటు దక్కింది. ఇక విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, తూర్పుగోదావరి నుంచి యనమల, చినరాజప్ప మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు..... నెల్లూరు జిల్లా నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... ప్రకాశం జిల్లా సిద్ధా రాఘవరావు... కేబినెట్‌లో ఉన్నారు.
మొత్తానికి 2019 ఎన్నికలే టార్గెట్‌గా ఏపీ కేబినెట్‌ను ఫుల్ ప్లెజ్జెడ్‌గా నింపేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాంతం, కులం, బలం... ఇలా అన్ని సమీకరణలను కౌంట్‌లోకి తీసుకున్న బాబు.... వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీమ్ ఎంచుకున్నారు.